హైదరాబాద్, డిసెంబర్ 1: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తున్న వార్షిక స్పోర్ట్స్‌మీట్‌లో కబడ్డీ ఆడుతూ సర్కిల్ 4కు చెందిన నాలుగో తరగతి ఉద్యోగి యాదగిరి గుండెపోటుతో మరణించాడు. ఇందుకు సంతాపంగా మేయర్ మాజీద్ హుస్సేన్ స్పోర్ట్స్ మీట్‌ను వాయిదా వేశారు. ప్రతి ఏటా నిర్వహించే మాదిరిగానే కొద్ది రోజులుగా బల్దియా అధికారులు కార్పొరేటర్లు, అధికారులు, ఉద్యోగులకు వివిధ క్రీడాంశాల్లో పోటీలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం నిర్వహించిన కబడ్డీ పోటీల్లో భాగంగా భోజన విరామం తర్వాత ప్రారంభమైన మ్యాచ్‌లో కబడ్డీ ఆడుతూ యాదగిరి అక్కడికక్కడే కుప్పకూలాడు. దీంతో అధికారులు, సిబ్బంది అతడ్ని నాంపల్లి కేర్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ యాదగిరి మృతి చెందాడు. యాదగిరికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. యాదగిరికి గతంలో రెండుసార్లు యాంజియోగ్రామ్ జరిగినట్లు ఉద్యోగులు తెలిపారు. ఉప్పుగూడలోని ఆయన నివాసానికి చేరుకున్న మేయర్, కమిషనర్ సోమేశ్‌కుమార్ ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. యాదగిరి కుటుంబానికి రావల్సిన ప్రయోజనాలను సకాలంలో అందించటంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని మేయర్, కమిషనర్ హామీ ఇచ్చారు.
.....................
బాలికపై అత్యాచారం
కేసులో ఇద్దరి అరెస్టు
గంగవరం, డిసెంబర్ 1: చిత్తూరు జిల్లా గంగవరం మండల పరిధిలోని జీడిమాకులపల్లె సమీపంలో గల చెక్‌డ్యామ్ వద్ద పదేళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు శనివారం అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక రోదిస్తూ ఇంటికి రావడంతో విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆదివారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్యాచారానికి పాల్పడిన సురేంద్రబాబు (22), గురుప్రసాద్ (19)పై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్టు ఎఎస్సై సదాశివరెడ్డి తెలిపారు.
కుటుంబానికి మేయర్, కమిషనర్ల పరామర్శ ఒకరికి ఉద్యోగమిచ్చి ఆదుకుంటామని హామీ
english title:
sports meet
Date:
Monday, December 2, 2013