హైదరాబాద్, డిసెంబర్ 2: కళ , సంస్కృతులు సమాజంలో సామరస్యాన్ని పెంపొందించి మనుష్యుల మధ్య పరస్పర గౌరవాన్ని పెంచుతాయని సహనాన్ని నేర్పిస్తాయని శాసనమండలి అధ్యక్షుడు డాక్టర్ ఎ చక్రపాణి అన్నారు. సోమవారం నాడు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 28వ వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ చక్రపాణి ప్రముఖ సాహితీవేత్త ఆచార్య కొలకలూరి ఇనాక్‌కు విశిష్టపురస్కారాన్ని అందించారు. లక్ష రూపాయిల నగదు, ప్రత్యేక జ్ఞాపికను అందజేసి, శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా చక్రపాణి మాట్లాడుతూ జీవితంలో ఎంతో కష్టపడి పైకి వచ్చిన కొలకలూరి ఇనాక్‌కు విశిష్టపురస్కారాన్ని ఇవ్వడం ముదావహమని అన్నారు. తగిన ఆర్ధిక వనరులుంటే విశ్వవ్యాప్తంగా తెలుగు భాషా సంస్కృతులను వెలిగించగల శక్తి తెలుగు వర్శిటీకి ఉందని అన్నారు. మారిషస్, మలేషియా, అమెరికా, యుకె తదితర దేశాలను సందర్శించినపుడు అక్కడి తెలుగువారు తమ మాతృభాషా సంస్కృతులను కాపాడుకునేందుకు ఎంతో తపన పడుతున్నారని గమనించామని, వారికి పూర్తి సహకారాన్ని అందించాల్సి ఉందని అన్నారు. సభకు ఉపాధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షత వహించారు. 28 ఏళ్లలో సాధించిన ప్రగతిని దృష్టిలో ఉంచుకుని మున్ముందు మరింత ప్రగతి సాధించేందుకు తాము కృషి చేస్తామని అన్నారు. నిధులు తగినట్టు ఉంటే ప్రజల ఆకాంక్షను తాము నెరవేర్చగలమని చెప్పారు. దక్షిణ భారతంలో తెలుగు విశ్వవిద్యాలయం అగ్రస్థానానికి చేరుకుంటుందని చెప్పారు. రిజిస్ట్రార్ కె ఆశీర్వాదం, విస్తరణ విభాగం ఇన్‌ఛార్జి డాక్టర్ జె. చెన్నయ్య తదితరులు మాట్లాడారు.
శాసన మండలి చైర్మన్ డాక్టర్ చక్రపాణి
english title:
chakrapani
Date:
Tuesday, December 3, 2013