జమ్మలమడుగు, మార్చి 6: కోర్టు జోక్యంతో అందరినీ శాసించే స్థాయికి ఎదిగిన ఇసుక మాఫియా గుండెల్లో గుబులు రేగింది. ఉదాశీనంగా అధికార గణం, చేతి వాటం ప్రదర్శించిన కొంత మంది సిబ్బంది తమ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రజల్లో చైతన్యం వస్తే తప్ప ఇసుక తరలింపు ఆగదని బాహాటంగా చెప్పుకొన్న కొందరి అధికారులకు దాఖలైన ప్రజా ప్రయోజన వాజ్యం గొంతులో పచ్చివెలక్కాపడిన చందంగా తయారైంది. వివరాలలోనికి వెళితే....
పెన్నానది నుండి యథేచ్చగా ఇసుకను రోజూ వెయ్యి ట్రిప్పుల మేర సరిహద్దులు దాటి పోయింది. గత కొనే్నళ్లుగా జరుగుతున్న అక్రమ రవాణాతో పెన్నానది సుమారు 15 అడుగులకు పైగా తరిగిపోయింది. ఒకప్పుడు అడుగుల లోతుల్లోనే చెలిమెలు తీసి తాగునీటిని పెన్నానది పరీవాహక ప్రజలు తీసుకెళ్లేవారు. ఇసుక తరలింపు వల్ల వందల అడుగుల్లోకి బోర్లు వేసినా పెన్నానదిలో బోర్లు విఫలం అయ్యాయి. పెన్నానదిలో భూగర్భజలాలు అడుగంటిపోయి పరిస్థితి ఆందోళన కరంగా మారింది. ఇసుక తరలింపుకు అనుమతులు లేకున్నా అధికారులు వేస్తున్న జరిమానాలు వచ్చే ఆదాయం ముందు చిన్నదిగా వుండడంతో అక్రమ రవాణా మాత్రం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. అనుమతి లేని ఇసుక తరలింపు దొంగతనమైనా అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకున్న సందర్భాలు లేవు. పైగా ప్రజల్లో చైతన్యం వస్తే తప్ప ఇసుక అక్రమ రవాణా ఆగదని కొందరు బాహాటంగా చెప్పారు.
ప్రజాచైతన్యంతో కోర్టుకు అధికారులు
ఇసుక అక్రమ రవాణాను నిరోధించడానికి రెవెన్యూ, ఎంపిడివోలకు విచక్షణాధికారాలు వుండి చర్యలు లేవన్న ఓ ఆదేశాల ఉత్తరంతో ప్రజాజీవితంలోని ఓ సమాన్యుడు న్యాయస్థానం గడపను ఆశ్రయించాడు. ఇసుక అక్రమ రవాణా వల్ల జరుగుతున్న అనర్థాలను, అధికారుల నిర్లక్ష్యంపై ప్రజాప్రయోజన వాజ్యం(పిల్)ను వేశాడు. ఫలితంగా జడ్జి ముందు ఏకంగా 14 మంది అధికారులు గత శనివారం హాజరయ్యారు. ఇసుక అక్రమ రవాణాపై సుమారు రెండు గంటలకు పైగా సుదీర్ఘంగా చర్యలు జరిగాయి.
చర్యలపై అధికారుల్లో గుబులు
పెన్నానది నుండి ఇసుక తరలింపుపై అందరు అధికారులకు తెలిసినా చర్యలు మాత్రం అంతంత మాత్రమే. ఇసుక తరలింపుపై ఇంత వరకు కొందరు చేతివాటం ప్రదర్శించిన సిబ్బందిలో, నిర్లక్ష్యంగా వుండిన అధికారుల్లో ఒక్కసారిగా ఇసుక తరలింపుపై చర్యలు తీసుకోవడానికి గుబులు పుడుతోంది. దీనికి తోడు మార్చి 17వ తేదీ నాటికి ఇసుక అక్రమ రవాణాపై ఇంత వరకు తీసుకున్న చర్యల నివేదికలను కోర్టు సమర్పించాలని జడ్జి వెంకటేశ్వర్లు నాయక్ ఆదేశించారు. దీంతో ముందుకు పోతే గొయ్యి వెనుకకు పోతే నుయ్యి అన్న చందంగా మారింది అధికారుల పరిస్థితి.
అక్రమంగా ఇసుక తరలిస్తే వాహనాల సీజే
కోర్టు మార్గదర్శకాల మేరకు ఇకపై ఇసుకను అక్రమంగా తరలిస్తే వాహనదారులపై దొంగతనం కేసులు నమోదుతో పాటు, వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని డియస్పీ ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఇటు ఇసుక తరలింపు దారుల్లో కోర్టు జోక్యంగా అధికారుల హెచ్చరింపులతో వణుకుపుడుతోంది. దీంతో పెన్నానది నుండి ఇసుక అక్రమ రవాణాకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లయింది. ఇసుక అక్రమ రవాణాపై కోర్టు జోక్యంపై, పిల్ దారుడు తిరుపంరెడ్డిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఇదే విధంగా జిల్లాలో ప్రజల్లో చైతన్యం వస్తే ఖనిజ అక్రమ రవాణా ఆగిపోతుందన్న ఆశాభావం వ్యక్తంను పలువురు వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికారులు అక్రమ రవాణాపై ఎంతకాలం కఠినంగా వ్యవహరిస్తారో వేచి చూడాల్సిందే.
కోర్టు జోక్యంతో అందరినీ శాసించే స్థాయికి ఎదిగిన ఇసుక మాఫియా గుండెల్లో గుబులు రేగింది.
english title:
sand mafia
Date:
Wednesday, March 7, 2012