కడప, మార్చి 6: జిల్లాకు రాష్ట్ర మంత్రులు డా.డియల్.రవీంద్రారెడ్డి, అహ్మదుల్లాలు బుధవారం జిల్లాకు చేరనున్నారు. ఈ మేరకు జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం అందింది. జిల్లాలో జరుగనున్న ఉప ఎన్నికల్లో జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు కీలక భూమిక పోషించనున్నారు. అయితే ఆరోగ్య శాఖ మంత్రి డియల్.రవీంద్రా రెడ్డి ముఖ్యమంత్రి యన్.కిరణ్‌కుమార్‌రెడ్డిల మధ్య నెలకొన్న విబేధాలు జరుగనున్న ఉప ఎన్నికలపై స్పష్టంగా కనిపిస్తున్నాయి. తొలి నుండి డియల్ వర్గాలకు దూరంగా వుంటూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకునిగా పనిచేస్తూ వస్తున్నారు. ఆయన దివంగత నేత డా.వైయస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి యన్.కిరణ్‌కుమార్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలపై కుండ బద్దలు కొట్టినట్లుగా ప్రజా ఉపయోగార్థం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు కొనసాగుతాయి తప్ప తాత్కాలిక నిర్ణయాలు పనికిరావని ప్రత్యక్షంగానే పలుమార్లు ప్రకటనలు చేశారు. గతంలో వైయస్ ప్రవేశపెట్టిన జలయజ్ఞం తదితర పథకాలపై కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ నిబద్దత శాస్ర్తియ పద్దతుల్లో ఏ పథకాలైనా అమలు చేయవచ్చని భావితరాలను
భవిష్యత్తులో పెట్టుకొని ప్రకటనలు చేయాలి తప్ప ఇబ్బడిముబ్బడిగా ప్రకటించరాదని పలుమార్లు సలహాలు ఇచ్చారు. అయితే నాడు వైయస్ హయాంలో ఇబ్బడిముబ్బడిగా పథకాలు అమలు జరిగినప్పటికజిల్లాలో సత్ఫలితాలు ఇవ్వలేదు. ప్రస్తుతం ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన పథకాలపై కూడా ఆక్షేపించారు. అదే ప్రభుత్వంలో ఆరంభశూరత్వం తప్ప పలు పథకాలన్నీ నీరుగారుతున్నాయి. ఈ నేపథ్యంలో కడప జిల్లాలో జగన్ వర్గానికి చెందిన రాయచోటి, రైల్వేకోడూరు, రాజంపేటలకు చెందిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడడంతో ఉప ఎన్నికలు అనివార్యం అయ్యాయి. అయితే ఈ ఉప ఎన్నికల విషయంలో డియల్ రవీంద్రారెడ్డి ఆచితూచి అడుగులు వేస్తూ పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అభ్యర్థుల ఎంపికపై కూడా తన సొంత ఇంటిలెన్సీ ద్వారా రిపోర్టులు తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఆయన తాను తీసుకోనున్న నిర్ణయాలు ఉప ఎన్నికల బాధ్యతలు హైకమాండ్‌తో సంప్రదించిన తరువాతనే ఓ కొలిక్కి రానున్నాయి. గతంలో ఆయన కడప పార్లమెంటు ఉప ఎన్నికల్లో జగన్‌తో తలపడి హైకమాండ్ చేజేతులరా డియల్ వ్యూహాన్ని అమలు చేయని కారణంగానే డియల్ ఓటమికి గురయ్యారు. ఈ ఉప ఎన్నికల్లో డియల్‌కు హైకమాండ్ సంపూర్ణ మద్దత్తు ఇస్తే ఎన్నికల బాధ్యత తీసుకోనున్నట్లు తెలిసింది. ఇదిలా వుండగా ఇక మైనార్టీ సంక్షేమ మంత్రి అహ్మదుల్లా మాత్రం మైనార్టీ ఓట్లు అధికంగా వుండే రాయచోటి, రాజంపేటలకు వెళ్లి ప్రచారం చేస్తానే తప్ప తనకు బాధ్యతలు వద్దని తెగేసి చెబుతున్నారు. ఇటీవలే పిఆర్పీ నుండి మంత్రి చేజిక్కించుకున్న ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య తాను ఉప ఎన్నికలు జరిగే మూడు నియోజకవర్గాల్లో పర్యటిస్తానని హైకమాండ్‌కు చెబుతున్నారు. అయితే జిల్లా కాంగ్రెస్ కమిటి, సీనియర్ కాంగ్రెస్ నేతలు మరో ఇరువురు మంత్రుల వర్గీయులు రామచంద్రయ్య ప్రకటనను తోసిపుచ్చుతున్నారు. ఏది ఏమైనా కడప జిల్లాలోని ఉప ఎన్నికల బాధ్యతలను డియల్ భుజస్కందాలపై వేస్తే తప్ప పార్టీ భవితవ్యంనకు మనుగడ వుండదనేది జగమెరిగిన సత్యం. ఏదేమైనా ఈ ఉప ఎన్నికల ఫలితం పార్టీ భవితపై ఆదారపడి వుంటుందని చెప్పవచ్చును.
జిల్లాకు రాష్ట్ర మంత్రులు డా.డియల్.రవీంద్రారెడ్డి, అహ్మదుల్లాలు
english title:
manthrula raaka
Date:
Wednesday, March 7, 2012