కడప , మార్చి 6 : రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి సి. రామచంద్రయ్య, కమలాపురం శాసనసభ్యుడు జి. వీరశివారెడ్డి మధ్య సయోధ్యను కుదిర్చేందుకు కాంగ్రెస్ పార్టీలోని ఒక వర్గం చురుగ్గా ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఇరువురూ విభేదాలకు దిగితే నష్టపోయేది మీరేనని హెచ్చరిస్తూ ఇరువురికీ నచ్చచెప్పి రాజీ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందువల్లే సిఆర్‌సి మంత్రి అయ్యాక వీరశివారెడ్డి కొంత దూకుడును తగ్గించినట్లు సమాచారం. వీరివురి విభేదాలు తెలుగుదేశం పార్టీలో ఉన్నట్లే బయటపడ్డాయి. దీంతో వీరశివారెడ్డి కాంగ్రెస్ పార్టీలో సిఆర్‌సి ప్రజారాజ్యంలో చేరారు. అయినప్పటికీ వీరి మధ్య విబేధాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల పిఆర్‌పి, కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడం, దాని ద్వారా సిఆర్‌సికి మంత్రి పదవి రాకుండా వీరశివా అడ్డుపడేందుకు ప్రయత్నించారు. ఇందుకోసం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డిఎల్. రవీంద్రారెడ్డి, మైనార్టీ శాఖ మంత్రి అహ్మదుల్లా, ఎమ్మెల్సీ బత్తాల చెంగల్రాయుడు తదితరులను కలుపుకుని తీవ్ర స్థాయిలో అడ్డుపడ్డారు. అవసరమయితే రాజీనామాకు సైతం వీరశివారెడ్డి సిద్ధపడ్డారు. దీంతో వీరి మధ్య విభేదాలు ముదిరి తారాస్థాయికి చేరాయి. అయినప్పటికీ చిరంజీవి పలుకుబడితో కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానంపై వత్తిడి తెచ్చి సిఆర్‌సి మంత్రి పదవిని దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు అటు రామచంద్రయ్య వర్గాన్ని, ఇటు వీరశివాను కలవరపాటుకు గురి చేసే పరిస్థితి ఏర్పడింది. సీనియర్ నేతగా ఉన్న తనకు మంత్రి పదవి వస్తుందని వీరశివారెడ్డి
ఎంతో ఆశతో చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మరోవైపు అత్యంత సన్నిహితుడిగా ఉన్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డీఎల్. రవీంద్రారెడ్డి శాఖను కుదించడంతో జిల్లా రాజకీయాల్లో కొత్త వరవడికి అవకాశాలు ఏర్పడ్డాయి. తన శాఖను కుదించడంపై మంత్రి డీఎల్. రవీంద్రారెడ్డి ముఖ్యమంత్రిపై తిరుగుబాటుకు పూనుకున్నప్పటికీ జిల్లా నుండి ఆయనకు అండగా నిలిచే నేతలు ఎవరు ముందుకు రాలేదు. ఈ పరిణామం చూసి అటు రామచంద్రయ్య, ఇటు వీరశివారెడ్డి మధ్య విభేదాలు తగ్గుముఖం పట్టాయనే చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే వారితోపాటు, కాంగ్రెస్ కూడా నష్టపోతుందని భావించిన కొంత మంది నేతలు ఇరువురి నేతల మధ్య సయోధ్య చేసేందుకు తెర వెనుక ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. అంతేగాకుండా త్వరలో జిల్లాలో ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇరువురి నేతలు కలసికట్టుగా పని చేసేందుకు వీలుగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇందువల్లే రేపో మాపో ఇరువురు నేతలు చేతులు కలిపే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
====
విద్యార్థుల ప్రతిభ గుర్తించడానికే
టిఎల్‌ఎమ్ మేళా
మైలవరం, మార్చి 6: విద్యార్థుల ప్రతిభను గుర్తించడానికే టిఎల్‌ఎమ్ మేళాను నిర్వహించామని ఎంఇఓ చిన్నయ్య పేర్కొన్నారు. మైలవరం ఎంఇఓ కార్యాలయ ఆవరణలో బోధదనోపకరణముల మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ విద్యార్థులు చూపిన ప్రతిభ చాలా గొప్పదన్నారు. ఈ ప్రతిభను విద్యార్థులు ఇలాగే కొనసాగించుకొని ఉజ్వల భవిష్యత్‌కు దారులు వేసుకోవాలన్నారు. ఎం కంబాలదినె్న విద్యార్థులు చేసిన బోధనోపకరణాలను పదాలను గుర్తించడానికి సులవైన పద్ధతిలో కనుగొన్నారన్నారు. అలాగే చిన్నకొమ్మెర్ల పాఠశాలకు చెందిన విద్యార్థులు ఎల్‌పిజిగ్యాస్‌ను తయారు చేయు విధానాన్ని వారు కనుగొన్నారు. అదేవిధంగా శాంతినికేతన్ పాఠశాలలో విద్యార్థులు కనపర్చిన ప్రతిభ అభినందనీయమన్నారు. రాబోవు కాలంలో కూడా విద్యార్థులు ఇలాంటివి కాకుండా మంచి పరికరాలతో మంచి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని విద్యార్థుల ప్రోత్సాహాన్ని, ఉపాధ్యాయులు చేసే కృషిని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు జగన్‌మోహన్, సుబ్బారెడ్డి, స్వర్ణలత, మస్తాన్‌రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయునిలు, విద్యార్థులు, ఎమ్మార్పీలు, సిఆర్‌పిలు పాల్గొన్నారు.
===
భూ సమస్యలకు సత్వర పరిష్కారం
కలసపాడు, మార్చి 6: రైతులకు సంబంధించిన భూ సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు రెవెన్యూశాఖ సిద్దంగా ఉందని రాజంపేట ఆర్డీ ఓ శ్రీనివాసులరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం కలసపాడు మండలంలోని చెన్నారెడ్డిపల్లెలో జరిగిన రెవెన్యూ సదస్సుకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ రాజంపేట డివిజన్‌లో 14,873 వినతి పత్రాలు ఇంత వరకు రెవెన్యూ సదస్సుల్లో అందాయన్నారు. వీటిలో 2036 విజ్ఞప్తులను పరిష్కరించామని, మిగతా వాటిని త్వరలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. డివిజన్ పరిధిలో ఇప్పటికి 1704 రెవెన్యూ సదస్సులు నిర్వహించాల్సి ఉండగా 1244 సదస్సులు జరిగాయని ఆయన అన్నారు. మిగతా సదస్సులు కూడా ఆయా గ్రామాల్లో ముందు పేర్కొన్న ఆయా తేదీల్లో నిర్వహిస్తామని తెలిపారు. సదస్సుల్లో వచ్చిన వినతి పత్రాలన్నింటిని కూడా నిర్లక్ష్యం చేయకుండా పరిష్కారానికి అత్యంత ప్రాముఖ్యత ఇస్తామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ముఖ్యంగా రైతుల సమస్యలను పరిష్కరించేందుకు రెవెన్యూ అధికారులకు తగు సూచనలు, సలహాలు కూడా ఇచ్చారు. ఈ రెవెన్యూ సదస్సులో తహశీల్దార్ వెంకటప్ప, రెవెన్యూ అధికారి మహబూబ్‌బాష, విఆర్‌ఓలు శివప్రసాద్, సర్వేయర్ శ్రీలత తదితరులు పాల్గొన్నారు.
=======
మైదుకూరు ఎమ్మార్సీలో జెల్ మేళా
మైదుకూరు, మార్చి 6: బాలికల విద్యతోపాటు చేతివృత్తుల్లోనూ విద్యార్థినులను ప్రోత్సహించేలా ఉద్ధేశించిన జెల్ పథకంలో శిక్షణ పొందిన విద్యార్థినులు మంగళవారం మైదుకూరులోని ఎమ్మార్సీ భవనంలో చేతివృత్తులను ప్రదర్శించారు. ప్లాస్టిక్ బుట్టలు, పనికిరాని వస్తువులతో అందమైన వస్తువులను తయారు చేయడం, చీరలపై వివిధ రకాల డిజైన్లు వేసి ప్రదర్శనలో ఉంచారు. పుల్లల సహాయంతో సాయినాథపురం పాఠశాల విద్యార్థినులు ఈఫిల్‌టవర్‌ను తయారు చేసి ప్రదర్శనలో ఉంచారు. పలువురిని ఆకట్టుకుంది. శెట్టివారిపల్లె విద్యార్థినులు ఐస్ పుల్లలతో తయారు చేసిన బుట్టలు, అల్లికలు ఆకర్షించాయి. విద్యార్థినులు మధ్య పోటీ నెలకొల్పేలా మేళా సాగింది. మండలంలోని లెక్కలవారిపల్లె ఉన్నత పాఠశాల విద్యార్థినులకు ఆపాఠశాల ప్రధానోపాధ్యాయుడు జయరంగారెడ్డి చెక్క్భజన నేర్పించారు. మేళా సందర్భంగా విద్యార్థినులు చెక్క్భజన ప్రదర్శించి మేళా సందర్శకులను ఆకట్టుకున్నారు. ఎం ఈవో సుకవనం, ఎమ్మార్పీలు శ్రీనివాసులు, చంద్రశేఖర్‌యాదవ్, మైదుకూరు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆర్.పుల్లయ్య, వనిపెంట, శెట్టివారిపల్లె ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయురాళ్లు అన్నపూర్ణమ్మ, దైవాభిషేమ్మలు పాల్గొన్నారు. మేళాలో విద్యార్థినుల చేతివృత్తులను చూసి అబ్బురపడ్డారు.