![](http://www.andhrabhoomi.net/sites/default/files/styles/large/public/field/image/mass%20action%20chitrala%20vipu.jpg)
భారతదేశంలో ఉన్న అనేక సినీ పరిశ్రమల్లో ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క విధమైన సినిమాలు వస్తుంటాయి. అయితే ఓ పరిశ్రమకు నచ్చిన కథా కథనాలు మరో పరిశ్రమకు నచ్చకపోవచ్చు. కానీ, అన్ని భాషలకు సంబంధించిన సినీ రంగాలలో మాత్రం కొన్ని రకాల కథలు నిరంతరం అటూ ఇటూ ప్రవహిస్తూనే ఉంటాయి. ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ ఇటీవల కోలీవుడ్, టాలీవుడ్‌లలో కొన్ని ఉదాహరణలు బయటపడ్డాయి. ఇటీవలిదాకా టాలీవుడ్‌లో పక్కా మాస్ యాక్షన్ చిత్రాలల్లో నటించడానికి హీరోలు ఇష్టపడేవారు. ప్రేక్షకులు కూడా బ్రహ్మరథం పట్టడంతో నిర్మాతలు అటువంటి చిత్రాలను నిర్మించడానికి ముందుకొచ్చారు. అదేసమయంలో కోలీవుడ్‌లో హీరోలందరూ కమలహాసన్‌ను ఆదర్శంగా తీసుకుని సరికొత్త క్లాసికల్ సినిమాలను నిర్మించడానికి ఇష్టపడ్డారు. తమిళ సినిమాలు ఇంతేలే అనే పెదవి విరిచిన తెలుగు ప్రేక్షకులు మాస్ చిత్రాలకే బ్రహ్మరథంపట్టారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. తెలుగు ప్రేక్షకులలో మార్పు వచ్చి సరికొత్త చిత్రాలను ఇష్టపడుతున్నారు. అందుకే హీరోలు కూడా అటువంటి కథలకోసం ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో కోలీవుడ్‌లో హీరోలందరూ మాస్ యాక్షన్ చిత్రాలవైపు మళ్లుతున్నారు. తమిళ హీరో అజిత్ ‘వీరమ్’ చిత్రంలో నటిస్తున్నాడు. విజయ్ ‘జిల్లా’ చిత్రంలో నటిస్తుండగా సూర్య లింగుస్వామి దర్శకత్వంలో ఓ మాస్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాలన్నీ గతంలో రజనీకాంత్ చేసిన పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ భాషా చిత్రానికి దగ్గరలో ఉండబోతున్నాయని కోలీవుడ్ సమాచారం. ఒకప్పుడు తెలుగులో డబ్బింగైన ‘్భష’ చిత్రాన్ని అనుసరించి ఎన్నో ఫ్యాక్షన్, యాక్షన్ సినిమాలు వచ్చాయి. ప్రస్తుతం ఈ సినిమాలన్నీ షూటింగ్‌తో బిజీగా ఉన్నాయి. మళ్లీ కొన్నాళ్లకు ఈ హీరోలందరు క్లాసికల్ చిత్రాలవైపు మొగ్గుచూపి భూమి గుండ్రంగా ఉంది అన్న సూక్తిని నిజం చేయకమానరు!