అడిలైడ్, డిసెంబర్ 3: ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్‌లో ఆధిపత్యాన్ని కనబరచాలని ఇంగ్లాండ్ పట్టుదలతో ఉంది. గురువారం నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టులో ఎదురుదాడికి ఈ జట్టు సన్నాహాలు చేస్తున్నది. మిచెల్ జాన్సన్ చెలరేగి బౌలింగ్ చేయగా, మిగతా ఆస్ట్రేలియా బౌలర్లు కూడా అతని స్ఫూర్తితో రాణించడంతో ఇంగ్లాండ్ మొదటి టెస్టులో ఏకంగా 381 పరుగుల తేడాతో చిత్తయిన విషయం తెలిసిందే. గత ఏడాది భారత్ చేతిలో ఓడిన తర్వాత 14 టెస్టుల్లో అలిస్టర్ కుక్ నేతృత్వంలోని ఇంగ్లాండ్ జట్టుకు అదే తొలి పరాజయం. యాషెస్ సిరీస్‌లో రెండో టెస్టును కూడా చేజార్చుకుంటే ఆతర్వాత మళ్లీ నిలదొక్కుకోవడం కష్టమన్న విషయం ఇంగ్లాండ్‌కు తెలుసు. రెండు వరుస పరాజయాల తర్వాత కనీసం సిరీస్‌ను డ్రా చేసుకునే అవకాశం కూడా సంక్లిష్టమవుతుందని కుక్ సేన అభిప్రాయం. అందుకే, రెండో టెస్టును అత్యంత కీలకంగా భావిస్తూ, తొలి టెస్టు పరాజయాన్ని పక్కకుపెట్టి, కొత్త ఉత్సాహంతో ఈ పోరుకు అస్తశ్రస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నది. మొదటి టెస్టులో ఇంగ్లాండ్ పరాజయం ఎదుర్కోవడం వెనుక ఆస్ట్రేలియా కెప్టెన్ మైఖేల్ క్లార్క్ సహా ఆటగాళ్లంతా మూకుమ్మడిగా స్లెడ్జింగ్‌కు పాల్పడడం కూడా కారణమని గ్రాహం గూచ్ వంటి పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. మొదటి టెస్టులో టెయిలెండర్ జేమ్స్ ఆండర్సన్‌ను ఉద్దేశించి ‘్భజం విరగొట్టుకోవడానికి సిద్ధంగా ఉండు’ అంటూ క్లార్క్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. క్రీడా స్ఫూర్తికి విఘాతం కలిగించే ఇలాంటి సంఘటనలు దురదృష్టకరమని బ్రిటిష్ మీడియా వ్యాఖ్యానించింది. బ్రిస్బేన్ టెస్టులో ఆస్ట్రేలియా తన నిజస్వరూపాన్ని బయట పెట్టుకుందని విమర్శించింది. క్రికెట్ ప్రపంచం కూడా ఆసీస్ తీరును తప్పుపట్టింది. ఈ నేపథ్యంలో రెండో టెస్టులో ఆస్ట్రేలియా తగిన జాగ్రత్తలు తీసుకుంటుందా లేక స్లెడ్జింగ్‌ను కొనసాగిస్తుందా అన్నది ఉత్కంఠ సృష్టిస్తోంది. స్వదేశంలో మ్యాచ్ ఆడడం, మొదటి టెస్టులో ఘన విజయం సాధించడం ఆసీస్‌కు రెండో టెస్టులో కలిసొచ్చే అంశాలు. ఒకవైపు స్లెడ్జింగ్ సమస్యను ఎదుర్కొంటూ, మరోవైపు ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకొని ఎదురుదాడికి దిగడం ఇంగ్లాండ్‌కు అనుకున్నంత సులభం కాదు. ఈ టెస్టులో ఆసీస్ ఫేవరిట్‌గా బరిలోకి దిగుతున్నది. అయితే, ఆసీస్ దూకుడుకు కళ్లెం వేయడానికి ఇంగ్లాండ్ అన్ని విధాలా ప్రయత్నించనుంది. ఈ ప్రయత్నంలో ఎంత వరకు సఫలమవతుందో అన్నది అనుమానంగానే కనిపిస్తున్నది.
నేను సిద్ధం: బ్రెస్నెన్
గాయం కారణంగా కొంతకాలం క్రికెట్‌కు దూరమైన ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ టిమ్ బ్రెస్నెన్ ఆసీస్‌తో గురువారం నుంచి జరిగే రెండో టెస్టులో ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించాడు. గాయాల సమస్య ఇప్పుడు లేదని, తాను పూర్తి ఫిట్నెస్‌తో ఉన్నానని పేర్కొన్నాడు. కెరీర్‌లో 21 టెస్టులు ఆడి, 67 వికెట్లు పడగొట్టిన బ్రెస్నెన్ ఫిట్నెస్‌ను ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు కూడా ధ్రువీకరించింది.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల ప్రతిష్ఠాత్మక యాషెస్
english title:
ashes
Date:
Wednesday, December 4, 2013