ఖైరతాబాద్, నవంబర్ 4: రాయల తెలంగాణ ప్రతిపాదన అర్ధరహితమని విద్యావేత్త చుక్కారామయ్య అన్నారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ ప్రజాఫ్రంట్ అధ్యక్షుడు ఆకుల భూమయ్య అధ్యక్షతన జరిగిన విలేఖరుల సమావేశంలో ప్రొఫెసర్ హరగోపాల్, వరవరరావు, సీనియర్ పాత్రికేయుడు పొత్తూరు వెంకటేశ్వరరావు, అల్లం నారాయణ మాట్లాడుతూ సిడబ్ల్యుసి తీర్మానం మేరకే హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాల తెలంగాణ మాత్రమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాయల తెలంగాణ అంటూ రాయలసీమ రెండు జిల్లాలను తెలంగాణలో కలపడం వల్ల రాయలసీమ ప్రజలు అవమానపరిచినట్టేనని అన్నారు. ఆరవై సంవత్సరాల తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో ఏనాడూ ఉద్యమాల ఊసెత్తని అక్కడి ప్రజలను ఇష్టంలేకుండా తెలంగాణ ప్రాంతంలో కలపడం సరికాదని అన్నారు. రాష్ట్ర విభజనను రాజకీయ లబ్ధిపరంగా కాకుండా ఆ ప్రాంతాల ప్రజల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకొని చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంటుందని అన్నారు. ఎలాంటి ఆంక్షలు లేని తెలంగాణను మాత్రమే ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. మొదట రాయలసీమలో ఫాక్షనిస్టులకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం రావాలని, రాయలసీమలో ఇప్పటికీ ఫ్యాక్షనిస్టుల వల్ల సాధారణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అలాంటి ఫ్యాక్షన్ భావాలు కల్గిన వారితో కలవడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరని స్పష్టం చేశారు. రాయల తెలంగాణ ప్రతిపాదనకు వ్యతిరేకంగా కేసిఆర్ ఇచ్చిన బంద్ పిలుపుకు తాము పూర్తి మద్దతు ఇస్తున్నట్లు వారు తెలిపారు. రాష్ట్రం ఏర్పడే సమయంలో విభేదాలు వీడి అందరూ నేటి బంద్‌ను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
కాగా, నేటి బంద్‌ను విజయవంతం చేసి, తెలంగాణ ఆకాంక్షను మరో మారు ఢిల్లీకి వినిపిద్దామని 1969 ఉద్యమకారుల సమాఖ్య తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చింది. బుధవారం లక్డీకపూల్‌లోని సమాఖ్య కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సమాఖ్య కన్వీనర్ ఆరీఫుద్దీన్, కో-కన్వీనర్ కొల్లూరి చిరంజీవీ మాట్లాడుతూ జిఓఎంలోని మంత్రులు జోకర్లలా వ్యవహరిస్తున్నారని అన్నారు. 60 సంవత్సరాలుగా ఇక్కడి ప్రజలు ప్రత్యేక తెలంగాణ కావాలంటూ ఉద్యమిస్తే అడగని రాయలసీమ జిల్లాలను ఇందులో కలుపుతామంటూ కొత్త ప్రతిపాదనను తీసుకురావడం వారి అజ్ఞానానికి నిదర్శనమని అన్నారు. నేటి బంద్‌లో పాల్గొనడమే కాకుండా ప్రజలు మంత్రుల బృందానికి ఈ-మెయిల్ ద్వారా తమ ఆకాంక్షను పంపాలని సూచించారు.
రాయల తెలంగాణ ప్రతిపాదన అర్ధరహితమని
english title:
r
Date:
Thursday, December 5, 2013