ఖైరతాబాద్, డిసెంబర్ 4: నిమ్స్ ఆసుపత్రి కార్డియాలజీ వైద్యుడు శేషగిరిరావు భార్య విజయలక్ష్మి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సంచలనం సృష్టించిన ఈ సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే నిమ్స్ ఆసుపత్రిలో కార్డియాలజీ విభాగంలో విధులు నిర్వహించే డాక్టర్ శేషగిరిరావు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 51లోని సైలెంట్ వ్యాలీలో నివాసం ఉంటున్నారు. గత నెల 28న విజయలక్ష్మి శేషగిరిరావుకు ఫోన్ చేసి తాను సమాజానికి సేవచేసేది చాలా ఉందని, తాను తీర్ధయాత్రలకు వెళుతున్నానని చెప్పి ఫోన్ పెట్టేసింది. దీంతో హుటాహుటిన ఇంటికి చేరుకున్న శేషగిరిరావు తిరిగి ఆమె ఫోన్ చేయగా ఆ ఫోన్ ఇంట్లోనే ఉంది. దీంతో నగరంలోని తమ బంధువుల వద్ద, ఇతర ప్రదేశాల్లో ఆరా తీసినా ఆమె ఆచూకీ తెలియకపోవడంతో శేషగిరిరావు కూతురు వాసవి గత నెల 30న జూబ్లీహిల్స్ పోలీసులకు తల్లి కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేయగా, పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా బుధవారం మధ్యాహ్నం ఇంట్లోని స్టోర్ రూం నుండి దుర్వాసన వస్తుండటంతో విజయలక్ష్మి కూతురు దాన్ని తెరిచేందుకు ప్రయత్నించగా అది తెరుచుకోలేదు. ఈ విషయాన్ని తండ్రికి తెలియజేయడంతో ఇంటికి చేరుకున్న శేషగిరిరావు అది తెరిచేందుకు చూసినా రాకపోవడంతో వెంటనే విషయాన్ని పోలీసులకు తెలిపాడు. సాయంత్రం ఇంటికి చేరుకున్న పోలీసులు గది తలుపులు తెరిచి చూడగా తీవ్ర దుర్గంధంలో పడి ఉన్న విజయలక్ష్మి మృతదేహం కనిపించింది.
మృతదేహం పక్కనే ఓ సూసైడ్‌నోట్ ఉండాన్ని గమనించిన పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. గత సంవత్సరం తండ్రి చనిపోయినప్పటి నుండి విజయలక్ష్మి మానసికంగా తీవ్ర వేదనకు గురికావడంతోపాటు ఇష్టానుసారంగా వ్యవరిస్తూ తనలో తానే మాట్లాడుకునేదని కుటుంబ సభ్యుల ద్వారా పోలీసులు తెలుసుకున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న సూసైడ్ నోట్లో కూడా నాన్న నువ్వులేని లోకంలో నేను ఉండలేను అంటూ రాసినట్లు సమాచారం. కాగా ఆరు రోజులుగా భార్య కనిపించకుండా పోయినా శేషగిరిరావు యధావిధిగా విధులకు హాజరుకావడం, ఇంట్లోకి అన్ని నిద్ర మాత్రలు ఎలా వచ్చాయి అనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నట్టు తెలిసింది.
నిమ్స్ ఆసుపత్రి కార్డియాలజీ వైద్యుడు శేషగిరిరావు భార్య విజయలక్ష్మి
english title:
n
Date:
Thursday, December 5, 2013