తార్నాక, డిసెంబర్ 4: రాష్ట్రంలో ఆలీబాబా నలభైదొంగల్లా ముఖ్యమంత్రితోపాటు ఆయన సహచర మంత్రులు అందినంత దోచుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యుడు, నగర అధ్యక్షులు తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు. బుధవారం తెలుగుదేశం పార్టీ నగర సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ మరో మూడు నెలల్లో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అవుతుందన్న వాస్తవం అందరికన్నా ముందు కాంగ్రెస్ వారికే తెలుసునని అందుకే సెక్రటేరియట్‌కు వెళ్లకుండా ఇంటికే పైళ్లను తెప్పించుకుని సంతకాలు చేస్తూ అందినంత దండుకుంటున్నారని ఆరోపించారు. బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పుతో రాష్ట్రం ఎడారిగా మారుతుందని ఈ విషయంలో మిగతా విషయాలు ఎలా ఉన్నా ముందుగా ప్రజలు ఈ విషయంలో ఐక్యంగా ఉద్యమించి సాధించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సింది పోయి నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తుందని తెలుగువారిని నిర్లక్ష్యంగా చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాలు తగిన విధంగా మూల్యం చెల్లించుకోక తప్పదని తాజాగా ఈ తీర్పుతో నగరంలో ప్రజలు నీటి కష్టాలు ఎదుర్కోక తప్పని పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. అదే సమయంలో ఓటరు నమోదు కార్యక్రమం లోపభూయిష్టంగా మారిపోయిందని సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా అనేక అవకతవకలు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాలను తాము ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకువెళ్లడానికి ఆధారాలతో సహా వెళుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కె.విజయరామారావు మాట్లాడుతూ నీళ్లులేకున్నా వైఎస్‌ఆర్ జలయజ్ఞం పేరుతో వేలకోట్ల రూపాయలను వృధా చేశారని అన్నారు. ట్రిబ్యునల్ ముందు ప్రభుత్వం నియమించిన న్యాయవాది పసలేని వాదనలు వినిపించిన దరిమిలా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, అలాకాకుండా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిపుణులైన వారిని నియమిస్తే సమస్య ఇంతవరకు వచ్చేది కాదని అన్నారు. ఇక కేవలం ప్రజల నిరసనల ద్వారానే హక్కులను సాధించుకునే అవకాశం ఉందని అందుకే ప్రజలు స్వచ్ఛందంగా ఇందిరాపార్కు వద్ద నిర్వహించే ధర్నాకు పెద్దయెత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే సాయన్న మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అసమర్థ అవినీతి పాలనను ఎండగట్టడానికి పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. క్రిష్ణయాదవ్ మాట్లాడుతూ అవినీతి అసమర్థ కాంగ్రెస్ పాలనతో ప్రజల జీవితాలు దుర్భరంగా మారిపోయాయని, నానాటికీ పెరిగిన ధరలతోపాటు డీజిల్ పెట్రోల్, విద్యుత్ చార్జీలు పెంపుతో ప్రజలు సతమతమవుతున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పారదోలడానికి పార్టీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్ర నాయకులు పి.సాయిబాబ, రాష్ట్ర కార్యదర్శి కోటేశ్వర్‌రావు, ముఠాగోపాల్, పి.ఎల్.శ్రీనివాస్, నగర ప్రధాన కార్యదర్శులు ఎం.ఎన్.శ్రీనివాస్, వనం రమేశ్‌లు, మాగంటిగోఫీనాద్, నగర ఉపాధ్యక్షులు బి.ఎన్.రెడ్డి,ప్రకాశ్‌ముదిరాజ్, అధికార ప్రతినిధి బద్రీనాధ్‌యాదవ్, మనోహర్, కిశోర్‌లు కార్పోరేటర్‌లు వెంకటరమణ, శేషుకుమారి, సావిత్రి, చంద్రవౌళిలు, ప్రచార కార్యదర్శి ప్రేమ్‌కుమార్‌ధూత్, అహమ్మద్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
ఓటరు నమోదులో అవకతవకలు నివారించండి: తలసాని
తార్నాక, డిసెంబర్ 4: ఓటరు నమోదులో అనేక అవతకవలు చోటు చేసుకుంటున్నాయని అర్హులైనవారి ఓట్లు గల్లంతవుతున్నాయని వాటిని సరిచేయాలని కోరుతూ టిడిపి నగర అధ్యక్షుడు తలసాని ఆధ్వర్యంలో సిఇఓ భన్వర్‌లాల్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ ఒక బూత్ ఎరియాలో ఉన్న వారిని ఎక్కడో దూరంగా ఉన్న పోలింగ్‌బూత్‌ల లిస్టులు వేయడంతోపాటు చాలామంది పేర్లు కొత్తగా వచ్చిన లిస్టులో లేకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురవతున్నారని అన్నారు. ముఖ్యంగా సెటిలర్లు ఓటు హక్కుకోసం దరఖాస్తులు చేసుకున్నప్పటికి వారి పేర్లను లిస్టులో పొందుపర్చకపోవడం వారి సొంత ప్రాంతాల్లో సైతం ఓటు హక్కు లేకపోవడంతో వారు తీవ్ర ఆవేదనకు గురువుతున్నారని అన్నారు. ముఖ్యంగా ఆయా బూత్‌లలో ఎన్‌రోల్ చేసుకుంటున్న సిబ్బంది కొరతతోపాటు అవగాహన లోపం నిర్లక్ష్యం కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. అదే సమయంలో ఎన్‌రోల్‌మెంట్ విషయంలో సరైన ప్రచారం లేకపోవడంతో ప్రజల్లో అవగాహన లేకుండాపోయిందని అందుకే గడువును ఈ డిసెంబర్ నెలాఖరుకు పొడిగించి, సిబ్బందిని నియమించి అర్హులైన వారికి ఓటు హక్కును కల్పించడంతోపాటు ఎలాంటి అవకతవకలు లేకుండా చూడాలని ఎన్నికల అధికార భన్వర్‌లాల్‌ను కోరినట్లు తెలిపారు. కార్యక్రమంలో గ్రేటర్ ఫ్లోర్‌లీడర్ సింగిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మాగంటిగోఫినాధ్, నగర ప్రధాన కార్యదర్శులు ఎం.ఎన్. శ్రీనివాస్, రమేశ్‌లు, పి.ఎల్.శ్రీనివాస్ పాల్గొన్నారు.