హైదరాబాద్, డిసెంబర్ 4: రాష్ట్ర విభజనకు కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్లీ రాయల తెలంగాణవైపు మొగ్గు చూపటాన్ని నిరసిస్తూ గురువారం తెలంగాణవాదులు బంద్‌కు పిలుపునివ్వడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇదే క్రమంలో శుక్రవారం బాబ్రీ మసీదు కూల్చివేత రోజు కావడంతో పలు మత సంస్థలు, రాజకీయపార్టీలు బ్లాక్ డేకు పిలుపునివ్వటంతో ఈ రెండు రోజులను దృష్టిలో పెట్టుకుని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు నగరంలో భారీ బందోబస్తును చేపట్టారు. ప్రధానంగా అసెంబ్లీ ఆవరణలో గతంలో ఎన్నడూ లేనివిధంగా కనీవినీ ఎరగని రీతిలో భద్రతను రెట్టింపు చేశారు. ఈ క్రమంలో నగరంలోని పలు ముఖ్యమైన ప్రాంతాల్లో, అలాగే సీమాంధ్ర నేతలు, పారిశ్రామిక వేత్తలకు చెందిన ఆస్తులకు ప్రత్యేక భద్రతను కల్పించేందుకు పోలీసులు బందోబస్తు వ్యూహాన్ని రచించారు. అంతేగాక, తెలంగాణ ఉద్యమానికి కేంద్ర బిందువైన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కూడా అదనపు బలగాలు మోహరించారు. దీంతో పాటు గతంలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడిన నిజాంకాలేజీ, హాస్టల్, సైఫాబాద్ పిజి కాలేజీ, ప్యారడైజ్ పిజి కాలేజీ, అలాగే పాతబస్తీలోని సిటీ కాలేజీలపై కూడా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. అంతేగాక, బ్లాక్ డే సందర్భంగా గతంలో ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించిన పలు మత సంస్థలు, పార్టీల కదలికలను పోలీసులు గమనిస్తున్నారు. ఇప్పటివరకు వివిధ రకాలుగా నిరసనలు, ఆందోళనలు, బంద్‌లకు పిలుపునిచ్చినపుడల్లా తెలంగాణవాదులు అమర వీరులకు నివాళులర్పించేందుకు వచ్చే గన్‌పార్కు వద్ద కూడా పోలీసులు ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు. ఇదే తరహాలో గతంలో తెలంగాణవాదులు చేపట్టిన పలు నిరసన కార్యక్రమాలు, బంద్‌లు, ఊరేగింపుల్లో భాగంగా ఆవాంఛనీయ సంఘటనలు జరిగిన ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక పికెటింగ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. బాబ్రీ మసీదు కూల్చివేత రోజును బ్లాక్ డేగా పాటిస్తూ గతంలో పాతబస్తీలో పలు సంఘటనలు జరిగిన ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు అదనపు బలగాలతో బందోబస్తును ఏర్పాటు చేశారు. బ్లాక్ సందర్భంగా గతంలో పలు అల్లర్లకు పాల్పడిన వారి కదలికలను ఎప్పటికపుడు గమనిస్తూ ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందుజాగ్రత్త చర్యగా వ్యవహరిస్తున్నారు. ఇరువర్గాలకు చెందిన ప్రార్థనా మందిరాల వద్ద ప్రత్యేక పికెటింగ్‌లను ఏర్పాటు చేసి ఉన్నతాధికారులు శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారు.
మహానగర ప్రజలకు ముఖ్యమైన, అత్యవసర సేవలందించే మహానగర పాలక సంస్థలో గుర్తింపు యూనియన్ తెలంగాణ రాష్టస్రమితి పార్టీకి అనుబంధ సంస్థ కావటంతో బల్దియాలో గురువారం పూర్తి స్థాయిలో కార్యకలాపాలు నిలిచిపోయే అవకాశాలున్నాయి. అలాగే జంటనగరవాసులకు తాగునీటిని సరఫరా చేస్తున్న జలమండలిలో కూడా అధికార యూనియన్ తెరాసకు చెందినదే కావటంతో ఆఫీసు పరంగా కార్యకలాపాలు స్తంభించేలా ఉన్నాయి.
అలాగే విద్యుత్ సరఫరా చేసే సిపిడిసిఎల్‌లో కూడా తెలంగాణ ఉద్యోగులు యూనియన్‌కు మంచి పట్టు ఉండటంతో విద్యుత్ సౌధలో కార్యకలాపాలు కూడా అంతంతమాత్రంగానే కొనసాగనున్నాయి.
నేడు తెలంగాణ బంద్, రేపు బ్లాక్ డే * మోహరించిన బలగాలు
english title:
a
Date:
Thursday, December 5, 2013