సరూర్‌నగర్, డిసెంబర్ 4: బాలికకు పెళ్లి జరుపుతున్నారని సమాచారం తెలుసుకున్న పోలీసులు, అధికారులు వివాహం జరగకుండా అడ్డుకున్నారు. ఈ సంఘటన ఎల్‌బినగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎల్‌బినగర్ పోలీసులు, ఐసిడిఎస్ అధికారిణి లలితాకుమారి తెలిపిన వివరాల ప్రకారం- భరత్‌నగర్‌కు చెందిన కె.శ్రీనివాస్, లక్ష్మీ (15)ల కుమార్తె ప్రభుత్వ పాఠశాలలో పదవతరగతి చదువుతోంది. నాచారంకు చెందిన నందం కొడుకు మహేశ్‌తో వివాహం జరిపించాలని ఇరు కుటుంబాలు నిర్ణయించారు. బుధవారం ఉదయం పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లలో కుటుంబ సభ్యులు ఉన్నారు. ఇదిలా ఉండగా పెళ్లి కూతురు చదివే పాఠశాల తోటి విద్యార్థులు పెళ్లి చూడాలనే కోరికతో బుధవారం సెలవు కావాలని ముకుమ్ముడిగా ప్రధానోపాద్యాయుడికి విజ్ఞప్తి చేశారు. ఒకేసారి విద్యార్దులు అందరు ఎందుకు సెలవు పెడుతున్నారని హెడ్మాస్టర్ ఆరా తీసారు. పదవ తరగతి చదువుతున్న తోటి విద్యార్థిని పెళ్లి జరుగుతున్న విషయం ఆయనకు తెలిసింది. చివరకు పెళ్లి జరుగుతున్న బాలిక ఇంటికి తోటి విద్యార్థులు అందరూ చేరుకున్నారు. అయితే బాలిక పెళ్లి విషయం స్థానిక పోలీసులకు, ఐసిడిఎస్ అధికారులకు తెలిసింది. వెంటనే బాలికను, పెళ్లికొడుకును, ఇరు కుటుంబాల సభ్యులను స్టేషన్‌కు పిలిపించి బాల్య వివాహాలతో ఇబ్బందులను అధికారులు వివరించారు. మైనారిటీ తీరే వరకు పెళ్లి జరిపించమని ఇరు కుటుంబాలు రాత పూర్వకంగా హామీ ఇవ్వడంతో పెళ్లి ఆగిపోయంది.
9, 10న శిల్పాకళావేదికలో ‘ద మదర్’ మెగా నాటక ప్రదర్శన
బేగంపేట, డిసెంబర్ 4: ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న మెగా నాటకం ‘ద మదర్’ నాటకం డిసెంబర్ 9, 10 తేదీల్లో హైదరాబాద్ హైటెక్ సిటీలోని శిల్ప కళావేదికలో ప్రదర్శించనున్నట్లు ‘మదర్’ నాటక నిర్మాత ఫాదర్ ఉడుముల బాలశౌరి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. బుధవారం సికిందరాబాద్ అమృతవాణి కాన్ఫరెన్స్ హాలులో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి ఎల్లా కోదండరామ్, డిజిపి ప్రసాదరావు, క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్, హైదరాబాద్ ఆర్చ్ బిషప్ తుమ్మల బాల తదితరులు ప్రదర్శనకు హాజరుకానున్నారని ఆయన తెలిపారు. అపూర్వమైన ఈ మెగా సంచలన నాటకానికి టీమ్ సభ్యులు అవిశ్రాంతంగా కృషిచేస్తున్నట్లు తెలిపారు. ఇందులో ప్రత్యేకంగా రూపొందించిన భారీ సెట్టింగులు, కాస్ట్యూమ్స్ సిద్ధం చేసుకున్నామన్నారు. కేరళ తిరుచునూర్‌కు చెందిన ప్రఖ్యాత కళాదర్శకుడు తీజా శ్రీ్ధరన్ అనేక జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ చిత్రాలకు కళాదర్శకులుగా పనిచేశారు. బెంగుళూరుకు చెందిన సెంటర్ ఫర్ మూవ్‌మెంట్ ఈ ప్రదర్శనకు లైటింగ్ ఏర్పాటు చేయనున్నారు. ఇదే ప్రథమ ప్రదర్శన అని ‘మదర్’ నాటక దర్శక, నిర్మాత ఫాదర్ ఉడుముల బాలశౌరి తెలిపారు.
ప్రధాన భూమిక మదర్ పాత్రను పోషిస్తున్న ప్రముఖ నటి శ్రీజ సాదినేని కాస్ట్యూమ్స్‌తోసహా ఈ నాటకలోని అన్ని పాత్రలకు కాస్ట్యూమ్స్‌ను ‘స్వామి రారా..’ సినిమా కాస్ట్యూమ్స్ డిజైనర్ శ్రీకళ్యాణి ప్రత్యేకంగా రూపొందించారు. సినీ, టీవీ కళాకారులు ఇందులో పాల్గొననున్నారు. అక్టోబర్ 31న ‘మదర్’ ఆడియో సీడిని క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్, స్థానిక ఎమ్మెల్యే జయసుధ విడుదల చేశారు. అబ్దుల్ కలామ్ ఈ నాటక గురించి అమృతవాణి డైరెక్టర్ బాలశౌరికి అభినందనలు తెలుపుతూ లేఖ రాశారు. 13 నంది అవార్డులు అందుకున్న సుద్దాల అశోక్ తేజ, బిఎం రెడ్డి, సాధనా సరగమ్ తదితరులు ఈ నాటకానికి పనిచేస్తున్నారు. అమృతవాణి డైరెక్టర్ బాలశౌరి ఒక ప్రత్యేక దృశ్యకావ్యంగా దీనిని తీర్చిదిద్దనున్నట్లు వారు తెలిపారు. మథర్ థెరిస్సా నిజజీవితం ఆధారంగా ‘మదర్’ మేగా నాటకానికి ప్రతి ఒక్కరూ చూడదగ్గరని అమృతవాణి డైరెక్టర్ ఫాదర్ బాలశౌలి విలేఖరులకు తెలిపారు. వివరాలకు 040-27705994, 9550046566 సంప్రదించాలి.