తెలుగు వారు గర్వించదగిన విధంగా భక్తపోతన, త్యాగయ్య చిత్రాలలో భక్తిరస పాత్రలు పోషించి ఖ్యాతినార్జించిన నటులు శ్రీ చిత్తూరు నాగయ్య. ఆ కోవలోనిదే వాహిని పిక్చర్స్ పతాకంపై 1947లో నిర్మించిన చిత్రం ‘యోగి వేమన’
యోగి వేమన చిత్రానికి రచన శ్రీ సముద్రాల. సంగీతం: నాగయ్య, ఓగిరాల రామచంద్రరావు. కెమెరా: మార్కస్ బార్‌ట్లే. అసోసియేట్ దర్శకులు: శ్రీ కె.కామేశ్వరరావు. దర్శకులు : శ్రీ కె.వి.రెడ్డి
రెడ్డిరాజుల వంశానికి చెందిన అనవేమారెడ్డి ఒక పరగణాకు ప్రభువు. అతని తమ్ముడు వేమారెడ్డి (నాగయ్య) వదినె నరసమాంబ (పార్వతీబాయి), అన్నకుమార్తె జ్యోతి (బేబీ కృష్ణవేణి) అన్న కుమార్తె జ్యోతి అంటే వల్లమాలిన అభిమానం, ఆపేక్ష వేమనకు. అతని స్నేహితుడు కంసాలి అభిరామ్ (లింగమూర్తి). అతని సాయంతో బంగారం తయారుచేయాలని ప్రయత్నిస్తుంటాడు వేమన. ఆ ఊరిలో గల వేశ్య మోహనాంగి (ఎం.వి.రాజమ్మ) మోహంలో చిక్కుకున్న వేమన ఆమె మెప్పుకోసం వదినెగారి నాగహారాన్ని తెచ్చి ఆమెకు సమర్పిస్తాడు. అంతేకాక అన్నగారు కప్పం చెల్లించాలని వుంచిన ధనం తెచ్చి ఆమెకు కనకాభిషేకం చేస్తాడు. అన్నగారు కప్పం చెల్లించనందున చక్రవర్తులు అతన్ని కారాగారంలో బంధిస్తారు. వేమన డబ్బుకోసం మోహనాంగి వద్దకు వెళ్లి భంగపడి ఆమె నైజం తెలుసుకుని దూరమవుతాడు. పంతంతో బంగారం తయారుచేస్తాడు. బంగారం సిద్ధిస్తుంది కాని అన్న కుమార్తె జ్యోతి అనారోగ్యంతో, బాబాయిపట్ల బెంగతో మరణించడంతో వైరాగ్యం చెంది యోగిగా మారతాడు. అభిరాముడు బంగారాన్ని సంస్థానంలో అప్పగించి వేమన శిష్యుడుగా అతన్ని అనుసరిస్తాడు. దైవానుగ్రహంతో అభిరామ మకుటంతో శతక పద్యాలు రచించి భక్తులకు జీవిత సత్యాలు బోధించి వేమన చివరకు సమాధిలోకి వెడతాడు.
చిత్రంలో నాగయ్య వేమనగా తొలుత వేశ్య మోహనాంగి పట్ల అనురక్తునిగా విలాసాన్ని, చక్కని చిరునవ్వుతో కూడిన అభినయాన్ని, అన్నకుమార్తె పట్ల లాలనను, ఆప్యాయతను, చివర స్మశానంలోని సన్నివేశంలో, భక్తులకు జీవన సత్యాలు బోధించడంలో అతి సాత్వికమైన నిగ్రహంతో కూడిన నటన కనపరిచారు.
వేశ్య మోహనాంగిగా ఎం.వి.రాజమ్మ కనువిందుగా, జావళిలను తన నృత్య, గానాదులతో అలరించారు (‘తడవాయేనిక లేవరా’-నాగయ్య, ఎం.వి.రాజమ్మ) శివాలయంలో (ఆపరాని తాపమాయెరా బాలేందువౌళి, ప్రోపుకోరి చేరితిరా’-ఘంటసాల, ఎం.వి.రాజమ్మ). ఘంటసాల ఈ పాటలో నట్టువాంగం వాయిస్తూ కన్పించడం విశేషం. ఇంకొక జావళి ‘వదల జాలరా, నా వలపు దీర్చరా, కళల నెరుగుదొర ఔరా నిను కలయ మనసాయెరా’-(నాగయ్య, ఎం.వి. రాజమ్మ) -సంగీతం సాహిత్యం పోటీపడి అలరిస్తాయి. అన్న కుమార్తె జ్యోతిని నిద్రపుచ్చుతూ వేమన ‘అందాలు చిందేటి నా జ్యోతి, ఆనంద మొలికేటి నా జ్యోతి, ఆ కంటిలో జ్యోతి, ఈ కంటిలో జ్యోతి రెండు కన్నులలో నిండి యున్నది జ్యోతి’ (నాగయ్య) స్మశానంలో ‘ఇదేనా, ఇంతేనా’ దేవాలయంలో ‘కనుపించుము మహదేవా’, ‘జీవహింస మానండి జీవుల మీవలె ప్రేమించండి’, ‘చదివియు వ్రాసియు తెలియగలరు చావు తెలియలేరు’, ‘తరుహీన, జలహీన, నిర్జీవ, నిర్వేద మరుభూమి (నాగయ్య), బొమ్మల కొలువులో పాట ‘వెలదులార, ముదరలు మీరనలుగిడరారే’, రెండవ పాట సేవక జన శంభుకారి భువదాశ చంద్రమకుట ధారి (పార్వతీబాయి, బృందం) బిచ్చగత్తె పాట ‘మనసా మాయను పడకే కాయము, కలిమి సతమని నమ్మి’, వేదాతీతుడువేమన సుండి వేమన బోధలు వినరండి (లింగమూర్తి).
చిత్రంలో దొరస్వామి, సీత, కాంతమ్మ, రామిరెడ్డి ఇతర పాత్రలు పోషించారు.
యోగివేమన చిత్రంలో చెప్పుకోదగ్గది వేమన మహాభినిష్క్రమణం సన్నివేశంలో కెమెరామెన్ బారెట్లే పనితనం. బ్లాక్ అండ్ వైట్ ఛాయల్లో ఎంతో గొప్పగా చిత్రీకరించారు. అంతేకాక చాలా సన్నివేశాలు ఎంతో సహజంగా చిత్రీకరించి వైవిధ్యత చూపారు. పాటలే కాక ఈ చిత్రానికి పదునైన మాటలతో సముద్రాల వారు మరింత వనె్న తెచ్చారు.‘ఏ మతమోయి మనది బ్రతికున్న పాముల్ని చంపి రాతి బొమ్మలకు పాలుపోయటం’, ‘రాళ్లే దేవుళ్లయితే రాసులు మింగవా’ కొన్ని ఉదాహరణలు మాత్రమే.
ఇక ఈ చిత్ర దర్శకుల శైలికి అద్దం పడుతూ సాగిన సన్నివేశాలలో ముఖ్యమైనది, వేమన స్మశానంలో ఒక పుర్రెను చూస్తూ ఇదేనా ఇంతేనా అన్నపాట చిత్రీకరణలో ఆ పుర్రెపై ఒక బాలిక పుట్టిన దగ్గరనుంచి మనవలతో కూడి యుండే దాకా జీవితంలోని వివిధ దశలు చూపుతూ సూపర్ ఇంపోజ్ చేయడం ఎంతో విశేషం. వేమన సమాధిలోకి వెడుతున్న దృశ్యం చిత్రీకరిస్తూ, ఆ తాదాత్మతలో కె.వి.రెడ్డిగారు కట్ చెప్పడం కూడా మరిచిపోయారట. గుహలోపలి నుండి నటులు నాగయ్య ఊపిరి ఆడటం లేదని అరచే వరకూ ఆ విషయం గుర్తుకు రావపోవడం, వారి దర్శకత్వపు విశేషంగా చెప్పుకోవాలి. చిత్రప్రారంభంలో చలితో వణుకుతున్న ముసలామెను దేవాలయంలోకి తీసుకు వచ్చి, అమ్మవారి దేవతా వస్త్రాన్ని వేమన ఆమెకు కప్పటం వేమనలోని సంస్కారాన్ని, త్యాగ గుణాన్ని వెల్లడయ్యేలా చిత్రీకరణ ఇలా ఎన్నో సన్నివేశాలు దర్శకుని ప్రతిభకు నిదర్శనాలు
‘యోగి వేమన’ చిత్రం అఖండ విజయం సాధించింది. ఆ తర్వాత నటులు, నిర్మాత శ్రీ విజయచందర్, తాను వేమనగా, అర్చన మోహనాంగిగా, కె.ఆర్.విజయ కన్నడ నటులు కల్యాణ్‌కుమార్‌లతో భారీగా నిర్మించిన ‘శ్రీ వేమన చరిత్ర‘ విజయం సాధించలేదు.
తెలుగు వారు గర్వించదగిన విధంగా భక్తపోతన
english title:
flashback @ 50
Date:
Friday, December 6, 2013