** బుల్లెట్ రాజా (పర్వాలేదు)
తారాగణం:
సైఫ్ అలీఖాన్, సోనాక్షి సిన్హా
జిమీ షేర్‌గిల్, రాజ్‌బబ్బర్
రవి కిషన్, విద్యుత్ జమ్‌వాల్ తదితరులు
సంగీతం: సాజిద్-వాజిద్
దర్శకత్వం: తిగ్మాంషు ధూలియా
ఫార్ములా సినిమా అంటేనే - కేరాఫ్ తిగ్మాంషు ధూలియా. పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్.. మాస్ మసాళా - తుపాకుల హోరు.. ఐటెం సాంగ్‌ల జోరు - ఒక విధమైన హింసాత్మక వాతావరణాన్ని సృష్టించటంలో ధూలియా దుంప తెంపేస్తాడు. అతడి గత చిత్రాలు ప్రేక్షకులకు అనుభవైకవేద్యమే. ‘సాహెబ్ బీవీ ఔర్ గ్యాంగ్‌స్టర్’ తీసుకోండి.. లేకుంటే- ‘పాన్ సింఘ్ తోమర్’ ‘సాహెబ్ బీవీ ఔర్ గ్యాంగ్‌స్టర్ రిటర్న్స్’ ఇలా మాఫియా కథా కమామీషులే. ఫార్ములా కథల్ని జీర్ణించుకున్న తర్వాత ఆ హద్దుల్ని ఏ మాత్రం చెరపడన్న ఘన కీర్తి ఉంది తిగ్మాంషుకి. ఐతే -ఈసారి ఉత్తరప్రదేశ్ రాజకీయాల్ని ‘టచ్’ చేసి - అక్కడ్నుంచీ రొటీన్‌గా మాఫియా వైపు పరుగు పెట్టాడు. ఇక కథా కమామీషు ఎలా ఉందో చూద్దాం.
ఒకానొక వీధిలో ఓ కుర్రాడు రాజా మిశ్రా (సైఫ్ అలీఖాన్). ఉద్యోగం సద్యోగం లేదు. అతడి ఫ్రెండ్ రుద్ర ప్రతాప్ (జిమీ షేర్‌గిల్). ఇద్దరూ వొడిదుడుకుల జీవితాన్ని గడిపేస్తూంటారు. ఆఖరికి ఒక హోటల్‌లో ఉద్యోగం సంపాదిస్తాడు రాజా - అదీ హోటల్ మేనేజ్‌మెంట్ డిగ్రీ ఉందని అబద్ధం చెప్పి. సాదాసీదాగా బతుకు బండి నడిపిస్తూంటే.. ఉన్నట్టుండి రాజా గ్యాంగ్ వార్‌లోకి వెళ్లాల్సి వస్తుంది. అక్కడ రాజకీయవేత్త రాంబాబు శుక్లా (రాజ్‌బబ్బర్)తో పరిచయం ఏర్పడుతుంది. చట్టాన్ని చుట్టంగా చేసుకొని - యుపి రాజకీయాల్నీ.. ఇటు గ్యాంగ్‌స్టర్స్‌నీ తన చేతల్లో ఉంచుకుంటాడు శుక్లా. ఒకవైపు రాజకీయం - మరోవైపు వ్యాపారవేత్తలూ.. ఇంకోవైపు గ్యాంగ్‌స్టర్స్. ఇదొక వలయం. చిక్కుకొన్న వాడు బయటికి రావటం ఉండదు. శాశ్వతంగా ఆ వెబ్‌లో ఉండిపోవాల్సిందే. ఈ పరిస్థితుల్లో రాజా జీవితం ఎటువైపు మొగ్గింది? శుక్లా పన్నాగం నుంచీ బయట పడ్డాడా? రాజా తన 156వ గర్ల్‌ఫ్రెండ్ సోనాక్షి సిన్హా ప్రేమని గెలుచుకున్నాడా? అన్నవి క్లైమాక్స్ ప్రశ్నలు. కథంతా ఒక ఫార్మేట్ ప్రకారం జరిగిపోతూంటుంది. అన్ని మసాలా సినిమాల్లోలాగానే ఈ సినిమాలోనూ ఒక అంగుళం అటు గానీ ఇటుగానీ కదలదు పైన చెప్పుకున్నట్టుగా.
కథ ఉత్తరప్రదేశ్ నుంచీ ముంబై అక్కడ్నుంచీ కోల్‌కతా -ఇలా ప్రయాణం చేస్తూంటుంది. ‘మాస్’ మసాలా అంటే ఆసక్తి ఉన్నవారికి ఈ సినిమా నచ్చవచ్చునేమో గానీ.. క్లాస్‌కి ఏ మాత్రం పట్టని సినిమా ఇది.
ఈ సినిమాని బతికించే అంశాలు కొన్ని. పవర్‌ఫుల్ డైలాగ్స్. ‘మా నే కహా తా బేటా కీసీ కా దిల్ న తోడ్‌నా. తో హమ్‌నే దిల్ కో చోడ్‌నా సబ్ కుచ్ తోడా’ లాంటి మాటల గారడీలు.. ఒక పెళ్లి వేడుకలో సోనాక్షిని కలిసిన సందర్భంలో ‘హల్కా పానీ (షర్బత్) పీయేంగే యా కుచ్ బడ్‌కిలా (మందు) పసంద్ కరేంగే’ అనటం.. ‘బ్రాహ్మణ్ భూకా తో సుధామ, రోతా తో రావణ్’ ఇలాంటి పంచ్‌లు చాలానే పడ్డాయి. మార్కెట్‌లో తీసిన సన్నివేశాలు.. ఘాట్.. ర్యాలీ - సన్నివేశాలు దర్శకుడి పనితనాన్ని బయటపెడతాయి.
గ్యాంగ్‌స్టర్ కథలు తీస్తే నేనే తీయాలి అన్నట్టు ఉంది తిగ్మాంషు తీరు. వీటికి తోడు కెమెరా పనితనం బాగుంది. సినిమాకి ప్లస్ పాయింట్ సైఫ్. పాత్రకి న్యాయం చేశాడు తనదైన స్టైల్‌లో. బెంగాలీ అమ్మాయిగా సోనాక్షి ఓకే. ఎన్నో కలల్ని మదిలో దాచుకొన్న భావాలను చక్కగా పలికించింది. చీఫ్ డెకాయిట్‌గా నటించిన విద్యుత్ జామ్‌వాల్ కొత్త నటుడు అంటే ఎవరూ నమ్మరు. కొన్నికొన్ని సన్నివేశాల్లో డామినేట్ చేశాడు కూడా. గుల్షన్ గ్రోవర్, రవి కిషన్ తమ పరిధిలో నటించారు. వారి పాత్రల నిడివి కొద్దిగానే. రాజకీయ నాయకుడిగా రాజ్‌బబ్బర్ ఫర్వాలేదనిపించాడు. బుల్లెట్ రాజా స్లోగన్‌కి తగ్గట్టుగా ‘ఆయేగే తో గర్మీ బడాయేంగే’లో కొద్దిగా జోష్ తగ్గిందేమో అనిపిస్తుంది. స్నేహితుల తీరు చూస్తూంటే- రమేష్ సిప్పీ ‘షోలే’ గుర్తుకొస్తుంది.