** వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ (పర్వాలేదు)
తారాగణం:
సందీప్ కిషన్, రకుల్ ప్రీత్‌సింగ్
నాగినీడు, బ్రహ్మాజీ, తా.రమేష్
సప్తగిరి, ఎం.ఎస్.నారాయణ
జయప్రకాష్ రెడ్డి తదితరులు
సంగీతం: రమణ గోగుల
నిర్మాత: జెమిని కిరణ్
దర్శకత్వం: మేర్లపాక గాంధీ
కథకి ఓ టార్గెట్ ఉంటే - గురిచూసి కొట్టేయ్యొచ్చు. ఒక్క షార్ట్ ఫిల్మ్ (కర్మరా దేవుడా!)తో వేలకొద్దీ ‘లైక్స్’ని తన ఖాతాలో ‘షేర్’ చేసుకొన్న మేర్లపాక గాంధీ (రచయిత మేర్లపాక మురళి పుత్రరత్నం) తన టార్గెట్‌ని రీచ్ కావటానికి ‘కామెడీ’ అస్త్రాన్ని ప్రయోగించటంలో సక్సెస్ సాధించాడు. కథ సెట్ అయితే మిగతా అన్ని శాఖలు వాటంతట అవే సర్దుకుంటాయి అనటానికి ఇదొక ఉదాహరణ. కాచిగూడ టు తిరుపతి జర్నీ. అనుకున్నది ఇదొక్కటే. కానీ ఎక్కడా సాగతీతలు లేకుండా - ఆ సింగిల్ థ్రెడ్‌ని పుచ్చుకొని.. హై స్పీడ్‌లో దూసుకెళ్లిందీ వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్.
ఎక్స్‌ప్రెస్ కథ... ‘అల్లరి నరేష్’ పాత్రల్ని పరిచయం చేయటంతో కథ మొదలు. రామ్మూర్తి (నాగినీడు) రిటైర్డ్ హెడ్మాస్టర్. ఇంటికి సంబంధించి ఆయనొక రాజ్యాంగాన్ని రచించాడు. ఆ చట్టాన్ని ఎవ్వరూ దాటకూడదు. మీరకూడదు. శిశుపాలుణ్ణి వధించటానికి శ్రీకృష్ణుడు ‘వంద’ తప్పుల వరకూ కాస్తానన్నట్టు. ఇక్కడ ఆపైన నూరూ నిండితే...రిటైర్డ్ హెడ్మాస్టర్‌గారు ఇంటి నుంచీ తరిమేస్తాడు. భర్త రూల్స్‌తో ఆస్తమా తెచ్చుకొన్న భార్య.. మామ మాట జవదాటని అల్లుడు... అతి శుభ్రతతో విసిగించే కూతురు... తను చేసిన, చేసే తప్పుల్ని ఎదుటి వాళ్ల మీద వేయటంలో ఘనుడైన మనవడు.. చిన్నప్పట్నుంచీ పెళ్లికోసం కలలుగనే రెండో కొడుకు బ్రహ్మాజీ. ఇలా మనిషికో చరిత్ర. ఒక్కొక్కరి ఖాతాలో కొన్నికొన్ని తప్పులు. ఆ చరిత్ర ఆఖరి పుటలోని వాడు సందీప్. ఇతగాడు తండ్రి రూల్స్‌కి అతీతుడు. ఆపదలో ఎవరున్నా సాయం చేయందే ఉండలేడు. అదే అతణ్ణి 99 తప్పుల వరకూ తీసుకొస్తుంది. ఇక నేడో రేపో 100వ తప్పు చేయటానికి సిద్ధంగా ఉంటాడు.
ఎట్టకేలకు అన్నయ్య పెళ్లి కుదురుతుంది. తిరుపతిలో పెళ్లి. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణం. చివరి నిమిషంలో తాళిబొట్టు మర్చిపోవటంతో.. ఇంటికి తిరిగి వచ్చే నేపథ్యంలో ప్రార్థన (రకుల్ ప్రీత్‌సింగ్)తో పరిచయం. ఇంతలో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ వెళ్లిపోతుంది. ఆ ట్రైన్‌ని ఎక్కడ పట్టుకోవాలన్న తాపత్రయం కొద్దీ రోడ్డుపై ప్రయాణం. అదే క్లైమాక్స్ వరకూ తీసుకెళుతుంది.
అచ్చంగా- ట్రైన్ మిస్ అయితే ఎలా ఉంటుందో? ఆ ఎంగ్జయిటీని చక్కగా క్యాచ్ చేయగలిగాడు మేర్లపాక. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌తోపాటు అదే స్పీడ్‌లో ప్రేక్షకుడూ వెళుతూంటాడు. కానీ రోడ్డు మీద. అలర్ట్‌గా ఉండకపోతే మళ్లీ ట్రైన్ మిస్సవుతామేమో అని కూడా అనిపించగలిగాడంటే.. కథలో ఎంతగా ఇన్‌వాల్వ్ అయేట్టు చేశాడో అర్థం చేసుకోవచ్చు. కథని ఎక్కడికక్కడ తెగ్గొడుతూ వచ్చి... ఒక్కో పాత్రకి ఆ పరిధిని నిర్ధారించటం.. కథని ఫ్లాష్‌బ్యాక్ పద్ధతిలో చెప్పటంతో సహజంగానే ఆసక్తి నెలకొంటుంది.
వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ అంటే ట్రైన్‌లో ప్రయాణమని ఉబలాట పడతాంగానీ.. ఎక్స్‌ప్రెస్‌ని అందుకోటానికి చేసే రోడ్డు ప్రయాణం. ఈ ప్రయాణంలో పాత్రలు బలంగా లేకపోతే.. అంత ఇంట్రెస్ట్‌గా అనిపించదు. ఐతే- ట్రైన్‌లో సప్తగిరి.. రోడ్డుపై తాగుబోతు రమేష్ సృష్టించిన హాస్యపు హంగామా అంతా ఇంతా కాదు. థియేటర్లలో నవ్వుల వర్షం కురియటానికి వీరిద్దరే కారణం. మధ్యమధ్య వచ్చిపోయే ‘లవ్’ సీక్వెన్స్‌లు అనలేంగానీ.. సున్నితమైన ప్రేమని చూపటానికి ‘గాంధీ’ ప్రయత్నించాడు. అసలు కథ, ఫ్లాష్‌బ్యాక్.. మధ్యలో ప్రేమ. వీటి మధ్య పాటల్ని కూడా అనవసరంగా ఇరికించకుండా ఒక్కటంటే ఒకటీ అరాతో సరిపెట్టాడు దర్శకుడు. పాటలు వినూత్న పంథాలో ఉన్నాయి.
చివరికి కథలోని అన్ని పాత్రలూ తిరుపతి చేరటానికి అవసరమైన సన్నివేశాల్ని చక్కగా గుదిగుచ్చాడు. కాకపోతే అక్కడక్కడ ప్రయాణం బోర్ కొడుతోందా అని క్షణకాలంపాటు తొట్రుపడుతుంది. మళ్లీ మామూలే. ఏది ఏమైనా.. మేర్లపాక ‘మేను’ మరచిపోయేట్టు చేయగలిగాడు. ఇన్నాళ్లకు కాస్తంత మంచి సినిమా చూశాం అనేట్టు చేశాడు.
మొదటిగా - ప్రార్థన కేరెక్టర్ ఏమిటీ? ఇలా చప్పగా ఉంది అనిపించినప్పటికీ.. పోనుపోను ఇదేదో బాగానే ఉంది అనిపించింది. మోడల్‌గా కెరీర్‌ని ఆరంభించి.. ‘కెరటం’ సినిమాతో తెరంగేట్రం చేసిన రకుల్ ప్రీత్‌సింగ్ కొన్ని సన్నివేశాల్లో చక్కగా నటించింది. ఇన్నాళ్లుగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న సందీప్ కిషన్‌కి ఇది టర్నింగ్ పాయింట్. కేరెక్టర్‌ని అర్థం చేసుకొని.. సహజంగా నటించటం.. ఆ పాత్రకి సైదోడుగా సప్తగిరి.. రమేష్ తోడవటం.. కథని సరైన ‘ట్రాక్’పై నడిపించింది. కొన్నాళ్లుగా తెర వెనక ఉండిపోయిన రమణ గోగుల ఈ చిత్రంలో అందించిన రెండు పాటలూ ఫర్వాలేదనిపించాయి. చోటా కె.నాయుడు సినిమాటోగ్రఫీ ఈ సినిమా ‘రిచ్’గా కనిపించేట్టు చేసింది.
కథ అన్న తర్వాత హెచ్చుతగ్గులూ.. ఉంటాయి. ఈ సినిమాలోనూ అదే జరిగింది. జయప్రకాష్‌రెడ్డితో టీవీ యాంకర్ జరిపే హాస్య సన్నివేశం లేకున్నా.. కథకి వచ్చిన నష్టమేమీ లేదు. ఎం.ఎస్.నారాయణ పాత్ర కూడా అలాంటిదే. నిడివి తక్కువ. ఒనగూడిన ప్రయోజనం కూడా అంతగా లేదు. క్లైమాక్స్‌లో కొన్ని ఎమోషనల్ సీన్స్... బొమ్మరిల్లు.. పరుగు చిత్రాల్ని గుర్తు చేశాయి. రిటైర్డ్ హెడ్మాస్టర్‌గా నాగినీడు హుందాగా కనిపించాడు. పెళ్లికాని ప్రసాద్‌గా బ్రహ్మాజీ ఓకే. మిగతా పాత్రలన్నీ వారివారి పరిధిలో చక్కగా అమరారు. దర్శకత్వం గురించి వేరే చెప్పనక్కర్లేదు. ఈ ఎక్స్‌ప్రెస్ దూకుడు చూస్తే అర్థమవుతుంది. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సరైన సమయానికే వచ్చింది. డీసెంట్ ఎంటర్‌టైనర్‌గా మరింత పబ్లిసిటీ ఇస్తే.. తప్పకుండా ప్రేక్షకులకు రీచ్ కావటం ఖాయం.