* ఇష్టసఖి (బాగోలేదు)
తారాగణం:
అజయ్, వరుణ్, భాస్కర్
శ్రీరామ్, అనుస్మృతి
తిరుమలరావు
కె.గోపాల్ తదితరులు
నిర్మాత, దర్శకత్వం:
భరత్ పారేపల్లి
వెనకటికి ఓ జానపద కథ. ముగ్గురు స్నేహితులు అడవిలో వెళ్తూంటారు. వారికి ఒక ఎముకల పోగు కనిపిస్తుంది. మొదటివాడు తన సృజనాత్మక దృష్టితో- శిల్ప కళా నైపుణ్యంతో వాటికి అందమైన స్ర్తి రూపం కల్పిస్తాడు. రెండోవాడు చక్కటి దుస్తులు అమరుస్తాడు. ఆఖరి వాడు ఆ శిల్పానికి జీవం పోస్తాడు- ఇదీ కథ. ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరికి చెందుతుంది? భేతాళ ప్రశ్న. అప్పుడంటే ఏ మర్యాద రామన్నగారో వచ్చి తీర్పు తీర్చబట్టిగానీ.. తాజాగా అంత సీన్ ఉంటుందా? అసలు శిల్ప సృష్టి జరుగుతుందా? ఎందుకు జరగదు? భరత్ పారేపల్లి తలచుకుంటే ఆ కథ ‘్భరతం’ పట్టరా మరి.
ఆ అడవి స్నేహితులే - వరుణ్, భాస్కర్, శ్రీరామ్. ఒకడు పాటల రచయిత. మరొకడికి సంగీతం అంటే ప్రాణం. ఇంకొకడికి పెయింటింగ్. ఇలా ఎవరి అభీష్టాలూ ఇష్టాయిష్టాలూ వారివి. చదివేది ఇంజనీరింగ్. లిల్లీ అంటే వరుణ్ లలీ అంటాడు. ఆ అమ్మాయికి వరుణ్ అంటే ఎలర్జీ. దాంతో వరుణ్ పచ్చి తాగుబోతయి చిత్తుగా తాగి పడిపోతే.. వాణ్ణి ఓదార్చడానికి పాటల రచయిత భాస్కర్ భావోద్వేగ పూరిత పాట రాసేస్తాడు. ఆ పాటకి శ్రీరామ్ రాగం అల్లుతాడు. ఆ రాగాన్ని వరుణ్ కాన్వాస్‌పై అందమైన అమ్మాయిగా చిత్రీకరిస్తాడు. ఆ అందమైన బొమ్మ ‘ఇష్టసఖి’. ఇక్కడో కండిషన్. కాన్వాస్‌పైని ‘ఇష్ట సఖి’ నిజ జీవితంలో ఎవరికి ముందు కనిపిస్తే.. వారు ఇష్టమొచ్చినట్టుగా ప్రేమించేసుకోవచ్చు. పెళ్లి కూడా చేసుకోవచ్చు. మధ్యలో ఎవరూ అడ్డు రాకూడదు. ఇక్కడ మళ్లీ కండిషన్స్ అప్లై. ఎందుకంటే- నిఝంగానే ఆ అమ్మాయి (అనుస్మృతి) వేర్వేరు సందర్భాల్లో వేర్వేరు లొకేషన్లలో ముగ్గురు స్నేహితులకూ ప్రత్యక్షమవుతుంది. ముగ్గురూ ప్రేమలో పడతారు. ఐతే- అను వీరి ప్రేమని రిజెక్ట్ చేస్తుంది. ఎందుకంటే అనుకి అజయ్‌తో పెళ్లై పోయింది కాబట్టి. ఇదిలా ఉంటే ‘అను’ని చంపటానికి ఒక రౌడీ ప్లాన్ వేస్తూంటాడు. అసలు ‘అను’ ఎవరు? అజయ్‌కీ ఆమెకీ సంబంధం ఏమిటి? అతడు ఏమయ్యాడు? గూండా ఎవడు? అను సంగతి తెలిసిన మిత్రత్రయం ఎలా స్పందించింది? ఇత్యాది ప్రశ్నలన్నింటికీ ఒక్కటే జవాబు ‘ఇష్టసఖి’ చూట్టం.
కథ చదివితే - ఎక్కడో ఏదో మూల ఈ కథ చూసినట్టుందే అనిపించటం లేదూ?! విశాఖ తీరంలో జంధ్యాల రచించిన ‘రెండుజెళ్ల సీతే’ ఈ ‘ఇష్టసఖి’. కాస్తంత క్రైమ్‌నీ.. హింసనీ సృష్టించి ఈ కథకి కలరింగ్ ఇచ్చారు. అంతే.
‘మైసమ్మ ఐపిఎస్’ ‘నీలవేణి’ లాంటి కమర్షియల్ చిత్రాలతో ప్రేక్షకులకు ఎటాచ్‌మెంట్ ఉన్న భరత్ పారేపల్లి ఈసారి పక్బందీగానే ఎటాక్ చేశాడు. కొట్టిన దెబ్బ కొట్టకుండా కొట్టిన చోట కొట్టకుండా.. ఎందుకు కొట్టేది చెప్పకుండా ప్రతి సన్నివేశంలోనూ ప్రేక్షకుల్ని బాది పారేశాడు. ఇండస్ట్రీలో అంతో ఇంతో అనుభవం ఉన్న భరత్ గురించి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవటం వృధా అని ఈ చిత్రంతో ఖరారైంది. పాపం! అతణ్ణి నిందించి లాభం లేదు. ఎవరి కృషి వారిది. స్వర్గీయ ఎ.వి.ఎస్‌ని ఈ తరహా పాత్రలో చూడాల్సి వస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. ఇకపోతే- మరో వర్గం ఉంది. అస్సలు నటన అంటే ఏమిటో తెలీని వర్గం. సినిమా అంటే వీరికున్న అంకిత భావం ఎటువంటిదో ప్రతి సన్నివేశంలోనూ కొట్టొచ్చినట్టు తిట్టొచ్చినట్టు కనిపించి విసుగు తెప్పించింది. ఎక్స్‌ప్రెషన్ అంటే ఏమిటి? టైమింగ్ అంటే ఏమిటి? లాంటి ఎదురుప్రశ్నలు వేసినా వేయొచ్చు. ఆ తర్వాత మీ ఇష్టం.
కథ విన్న తర్వాత.. ఎవరికైనా ఈ కథలో విషయం ఉందా? అని సందేహం రావచ్చు. అదే సందేహం దర్శకుడికి రాకపోవటమే ప్రశ్న. దీనికి తోడు కథనం కూడా ఏడిపించింది. కానీ ఒక్క సంగతి మాట్లాడుకోవాలి - అదే మాటల రచయిత గురించి. తనకున్న ప్రజ్ఞా పాటవాల్నీ.. భావోద్వేగాన్నీ.. ఎంతో భావాత్మకంగా చెప్పటానికి పేజీల కొద్దీ అక్షరాల్ని నింపేశాడు. కానీ - అవి స్పష్టంగా పలికి తెర మీదికెక్కినప్పుడు కదా వొనగూడే ప్రయోజనం. అంతా కొత్తవాళ్లు. పేజీల కొద్దీ డైలాగ్‌లు ఎలా చెప్తారని ఈ సాహసం చేశారో అర్థంకాదు.
పాటలు వినటానికి బాగున్నప్పటికీ.. సంగీత పరంగా చతికిల పడ్డాయి.
స్టేజ్ నాటకాలు చూసిన జ్ఞాపకం ఉందా? ఉన్నట్టయితే - ఇటువంటి సీన్లు అనుభవంలోకి వచ్చి ఉంటాయి. ఏ జాతరకో.. పండుగలకో పబ్బాలకో వేసే నాటకాల్లో ఊరి కుర్రాళ్లు నెలల కొద్దీ డైలాగ్స్ బట్టీపట్టి.. ఆఖరికి స్టేజీ మీదికి వచ్చేసరికి ‘ప్రామ్టింగ్’ అవసరమైనట్టు ఉందీ పరిస్థితి. ప్రతి ఒక్కరూ అంతే. నా డైలాగ్ ఎప్పుడూ వస్తుందా? అని ఎదురుచూట్టం. ఆనక చెప్పేసి.. డైలాగ్ చెప్పేశాన్రోయ్ అని రిలీఫ్ ఫీలవటం. ఇక సీనేం పండుతుంది. మొహంలో ఎక్స్‌ప్రెషన్ ఏం పలుకుతుంది? చెప్పిన డైలాగ్‌కి అర్థం ఏం ఉంటుంది? ఇదీగాక తమకున్న ‘బోలెడన్ని సినిమాలు చూసిన అనుభవాన్ని’ కళ్ల ముందు గుర్తు చేసుకుంటూ - వీర విహారం చేసేద్దామన్న తాపత్రయం ప్రతి ఒక్కరిలోనూ కనిపించింది. కెమెరా వంక చూడకూడదన్న మొదటి పాఠం కూడా తెలీదంటే ఈ ‘నట శిక్ష’ని భరించటం ఎవరి తరం?
అజయ్ ఒక్కడే ఇది సినిమా అని చెప్పటానికి మిగిలాడు. కానీ అతడున్నదీ కొద్ది నిమిషాలే.