* అర్జున్ ఐ.పి.ఎస్. (బాగోలేదు)
తారాగణం:
అర్జున్, అర్చనాగుప్త
హేమ, ప్రదీప్‌రావత్, పొన్నాంబళం
కోట శ్రీనివాసరావు, కొండవలస
ఎం.ఎస్.నారాయణ,
‘తెలంగాణా’శకుంతల
రామరాజ్, సత్యరాజ్, సంతాన భారతి, మైలాస్వామి
సంగీతం: దిన
నిర్మాత: తమటం కుమార్‌రెడ్డి
దర్శకత్వం: జి.కిచ్చ
టీవి సీరియల్స్‌కి ‘అత్తాకోడళ్ళ’ కథాంశం ఎంతటి ‘హాట్’ టాపిక్కో, సినిమాలకి ‘పోలీస్’ పాయింట్ అంతటి ఆకర్షణీయ ముడి సరుకు. ఈ శాతం తెలుగు సినిమాల విషయంలో అయితే మరింత ఎక్కువ. ఇలా సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకు కీలకపాత్ర వహిస్తున్న రక్షక భట ఇతివృత్తాలపై ఫోకస్ చేయడం అభినందనీయమైనా, అలా చేస్తున్న అంశంపై కాస్తంత అధ్యయనం చేస్తే బావుండేది. అది కొరవడినందువల్లే ‘అర్జున్ ఐ.పి.ఎస్.’ అనాకర్షణీయంగా తయారైంది. నగరంపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్న నాగ (ప్రదీప్‌రావత్), రాయుడు (పొన్నాంబళం) ముఠాల మధ్య జరిగే అంతర్యుద్ధంలో పోలీస్ అధికారి మహేష్ (అర్జున్) భార్య హతమైపోతుంది. అలా తన భార్యని పొట్టనబెట్టుకు న్న ముఠాలను తుదముట్టించాలని పంతం పట్టిన మహేష్ ఎదుర్కొన్న పరిస్థితులూ, చివరకు ఏమైందన్నది మిగతా కథ. అసలు దుష్టులను అంతం చేయడం తదితరాలు ఇలా వ్యక్తిగత లక్ష్యాల నేపథ్యంలో సాగితే అంతగా రాణించవు. అదే విస్తృతంగా సమాజం మొత్తానికి (అయితే ఇందులో ఆయా పనులుచేస్తున్న రౌడీలూ అందరికీ చెరుపు చేస్తున్నారు) నష్టం చేస్తున్నారు కనుక.. అంటూ కథా కేంద్రం సృష్టించి వుంటే విలువ ఉండేది. కానీ ఇందులో ‘తనకు జరిగిన అన్యా యం’అంటూ... మహేష్ ముందుకెళ్ళడంతో లక్ష్యానికి ఉన్నత స్థానం దక్కలేదు. ఇక మహేష్ ఇందులో చేసినట్లు ‘ఎదురుదాడులు’ (ఎన్‌కౌంటర్) చేసినట్లయతే... పరిస్థితులు పెనుపోకడలు పోతాయి. ఎందుకంటే పోలీసు పరిధిలో ఎన్‌కౌంటర్ అన్నది ఆఖరి అస్త్రం. అది అయిన తరువాత కూడా అది జరపక తప్పలేదు అనడానికి వలసినంత సాక్ష్యాలు సమకూర్చవలసి వుంటుంది. అలా చేయలేని నాడు అది సంబంధితుల నిర్లక్ష్యం కిందకే వస్తుంది. ఎలా చేసైనాసరే చట్టానికి పట్టిచ్చి ఆ ద్వారానే న్యాయం జరపాలన్నది బాధ్యతాయుత న్యాయవ్యవస్థ నిర్దేశం. ఇందులో నేరస్థుల్ని పట్టివ్వడానికి సావకాశాలు ఉన్నా ఎన్‌కౌంటర్‌కే మొగ్గుచూపారు. ఇది కేవలం సినిమాటిక్‌గా వుంది. చిత్రానికి మరో పెద్ద కలసిరాని అంశం. సినిమా నిర్మాణానికీ, విడుదలకీ జరిగిన తీవ్ర జాప్యం. ఈ అనువాద చిత్రానికి మూలమైన తమిళ చిత్రం ‘మాసీ’ 2009లో ఆరంభమై 2012 మార్చిలో విడుదలైంది. అది తీరిగ్గా ఇప్పుడు 2013 నవంబరు చివర్లో వచ్చింది. అంటే తమిళ చిత్రం ఆరంభమైన నాలుగేళ్లకు తెలుగువాళ్ల ముందుకొచ్చింది. ఈలోగా పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నేరస్థుల్ని పట్టుకోడంలో అనేకానేక మెళకువలూ వచ్చేశాయి. దాంతో పోలిస్తే అప్పటి (2009) పరిస్థితికీ, ఇప్పుడు చూపిన దానికీ సమన్వయం శూన్యం. అప్రస్తుతంగా మిగిలిపోయి సన్నివేశాలు వెలవెలపోయాయి. ఇంకో విపరీతమైన అంశం. కథానాయకుని కిచ్చిన సినిమాలో పేరు మహేష్. కానీ ‘అర్జున్...’అని ఎందుకు పెట్టినట్లో! సినిమా హీరో పాత్రధారి నిజ జీవితపు నామం ‘అర్జున్’కనుక ‘అర్జున్...’అని పెట్టినట్లు మనం సరిపెట్టుకోవాలి. మహేష్‌గా అర్జున్‌కి ఇలాంటి పోలీసు పాత్రలు నల్లేరుపై బండి నడక.. ఆ నడక అలాగే సాగింది. అయితే వయసు బాపతు వార్ధక్యపు జాడలు అర్జున్ ముఖంపై స్పష్టంగా కనపడుతున్నాయి. అది యుగళ గీతాల్లో మరింత బాధపెట్టింది. ఇందులో ఇంకో విశేషమేమిటంటే చిత్రానికి మూలమైన తమిళంలోకూడా కోట శ్రీనివాసరావు, తెలంగాణా శకుంతలా నటించడం. కానీ తెలుగులో చిర పరిచితమైన కోట శ్రీనివాసరావు గొంతుకకు మరో గొంతు (బహుశా అది కోట శ్రీనివాసరావు సోదరుడు కోట శంకరరావుది కావచ్చు) వాడడంతో రాణించలేదు. ఒకదాన్ని మించి ఒక ఎత్తువేసే నాగా లాంటి వ్యక్తి తనకి బద్ధవైరి అయిన పోలీస్ అధికారి చెయ్యి కలుపుతానంటే నమ్మడం విచిత్రం. మిగతా పాత్రల స్కోప్ చాలా తక్కువ. దినా స్వరాల్లో ప్రత్యేకతేం కనపడలేదు. చిత్రంలో అప్పుడప్పుడు ధీమ్ సాంగ్‌గా వచ్చిన ‘శిఖరాంతం... కాస్త బావుందనుకుంటే అందులో మాటలు కుదురుగా వినబడకుండా పోయాయి.
‘యముని వద్దే దున్నపోతుని దొంగిలిద్దామనుకున్నావా?’ అన్న డైలాగు దగ్గరే ఘంటశాల రత్నకుమార్ (సంభాషణా రచయిత) చమక్కు కొద్దిగా కనపడింది. గతంలో కొన్ని పోలీసు కథాంశాలతో సినిమాల్ని అందించిన దర్శకుడు ‘కిచ్చా’ ‘అర్జున్’.. విషయంలో సరైన అధ్యయనం చేసి తెరకెక్కించి వుంటే ‘క్లీన్’గా వుండేది. సినిమాలో ఏదైనా ఓమాదిరిగా బాగుందనుకుంటే అది అనల్ అరసు (స్టంట్స్ సృష్టికర్త) కష్ట ఫలమే! ముఖ్యంగా కారు షెడ్డులో డిజైన్ చేసిన ఫైటింగ్ ఎన్నదగినది.