Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

గెలిపించిన గెరిల్లా

$
0
0

రివ్యూ - హాలీవుడ్

** మిస్టర్ గో (పర్వాలేదు)
తారాగణం:
క్యూ జియో, సింగ్-డాంగ్
ఎడిటింగ్: జినో కిమ్
నిర్మాత: యూ జిన్ వూ
రచన, దర్శకత్వం: కిమ్ యాంగ్ హువా

జంతువులకు, మానవులకు మధ్య ఏర్పడిన అనుబంధం ఎన్ని కష్టాలు ఎదురైనా చెక్కుచెదరకుండా వుంటుందని నిరూపిస్తూ హాలీవుడ్‌లో ఎన్నో సినిమాలు వచ్చాయి. ముఖ్యంగా సాధు జంతువులు, పెంపుడు జంతువులతో అనగా కుక్క, గుర్రంతో తీసిన సినిమాలు ఎక్కువగా వచ్చాయి. అలాగే సముద్ర జంతువులైన తిమింగిలంతో, ఒక బాలుడికి ఏర్పడిన అనుబంధమే ‘‘ఫ్రీ విల్లీ’’ కాగా, డాల్ఫిన్-బాలుడు కలిసి వచ్చిన చిత్రం ‘‘డాల్ఫిన్ టేల్’’. సీల్‌కు, ఒక బాలికకు మధ్య ఏర్పడిన అనుబంధం ‘‘ఆండ్రే’’గా రూపుదాల్చింది. కోతులకు, మానవులతో సారూప్యం వుంటుంది కాబట్టి వాటితో ఎంత త్వరగా అనుబంధం ఏర్పడుతుందో, అది దృఢంగా ఎలా నిలిచిపోతుందో తెలుపుతూ ‘‘కింగ్‌కాంగ్, డస్టిన్ చెక్స్ ఇన్, ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’’ చిత్రాలు వచ్చాయి. మనుషులకు, జంతువులకు మధ్య ఏర్పడిన అనుబంధాన్ని చిత్రీకరించడంలో- మానవులంటే పెద్దవాళ్ళు కాకుండా, చిన్న పిల్లలతో తీయడంవల్ల ఆ ప్రేమానురాగాల్ని రక్తికట్టించడానికి, సెంటిమెంట్ పండించడానికి అవకాశం వుంటుంది. నిర్మాతలంతా ఇదే అంశాన్ని సొమ్ముచేసుకున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన దక్షిణ కొరియా చిత్రం ‘‘మిస్టర్ గో’’ అలాంటిదే. ఇందులో ఒక బాలికకు, గొరిల్లాకు మధ్య ఏర్పడిన అనుబంధం- గొరిల్లాను బేస్‌బాల్ సూపర్ స్టార్‌గా దాని శిక్షకురాలు, ఆత్మీయురాలిగా వ్యవహరించే ఆ అమ్మాయి కథనే ‘‘మిస్టర్ గో’’ చిత్రంగా రూపొందించారు. ఇది హ్యూ యంగ్‌మాన్ 1984లో రాసిన కామిక్ బుక్ ‘‘ది సెవెన్త్ టీమ్’’ ఆధారంగా తయారయింది. మొదటి దక్షిణ కొరియా త్రీడి చిత్రమైన దీన్ని చైనా భాగస్వామ్యంతో నిర్మించడం విశేషం.
సర్కస్‌లో పెరిగిన వివి అనే అందమైన, తెలివైన బాలిక కథనే ‘‘మిస్టర్ గో’’. రింగ్ మాస్టర్‌గా సర్కస్ నడుపుతున్న తాత, శిశుప్రాయంలో వున్న తన మనవరాలు వివిని గొరిల్లా వున్న బోనులో విడిచిపెడతాడు. ఆ బోనులో ఒకే దగ్గర పెరిగిన వివి, గొరిల్లా లింగ్ లింగ్ ఒకర్ని విడిచి ఒకరు వుండలేనంత ఆత్మీయ అనుబంధాలు ఏర్పడుతాయి. లింగ్ లింగ్ భాష, బాడీ లాంగ్వేజ్‌ను గుర్తించి వివి తన కనువుగా మలచుకుంటుంది. క్రమంగా దానికి బేస్‌బాల్ ఆటలో శిక్షణ ఇస్తుంది.
హఠాత్తుగా సంభవించిన భూకంపంలో ఆ గ్రామంతోపాటు సర్కస్ కూడా నాశనమవుతుంది. భూకంపంలో చిక్కుకుని రింగ్ మాస్టర్ చనిపోగా, శిథిలాల్లో ఇరుక్కుపోయిన వివిని, లింగ్‌లింగ్ రక్షిస్తుంది. రింగ్ మాస్టర్ చనిపోవడంతో అప్పులవాళ్ళు వచ్చి, అతడు పెద్ద మొత్తంలో చేసిన అప్పులను తీర్చవల్సిందిగా వివిపై ఒత్తిడి తెస్తారు. గొరిల్లాను, సర్కస్ పిల్లలను అమ్మి అప్పుతీర్చమంటారు. వివికి, లింగ్ లింగ్‌కి, అందులో వున్న పిల్లలకు తమ స్వంత ఇంటిలాంటి సర్కస్‌ను వదులుకోవడం ఇష్టం వుండదు. దిక్కుతోచని వివికి స్పోర్ట్స్ ఏజెంట్ దుసాన్ రూపంలో అవకాశం వెతుక్కుంటూ వస్తుంది. గొరిల్లా లింగ్ లింగ్‌ను బేస్‌బాల్ ఆటగాడుగా తీసుకుని వస్తే బోలెడు డబ్బు సంపాదించుకోవచ్చని అతడు ఒక ప్రతిపాదనను తెస్తాడు. దాంతో లింగ్ లింగ్ బేస్‌బాల్ ఆటగాడిగా ‘‘మిస్టర్ గో’’ పేరుతో క్రీడామైదానంలోకి దిగుతాడు. బౌలర్లు వేసే ఏ బంతినైనా బలంగా మోదడంతో అది ప్రేక్షకుల గ్యాలరీలోనైనా పడుతుంది. లేదా స్టేడియం బయటపడి కనిపించకుండా పోతుంది. మిస్టర్ గో ప్రతిభతో ఆ జట్టు సాధించిన విజయాలతో మిస్టర్ గో ప్రేక్షకుల్లో, మీడియాలో సూపర్ స్టార్‌గా పేరుప్రఖ్యాతులు సంపాదించుకుంటాడు.
బేస్‌బాల్ కాంపిటీషన్ పోటీల్లో దిగిన ప్రత్యర్థి జట్లు తమ గెలుపుకోసం రకరకాల ప్రయత్నాలు, కుట్రలు చేస్తూ అందులో భాగంగా మిస్టర్ గోను తప్పించడానికి చూస్తుంటారు. అక్కడ అప్పులవాళ్ళు సర్కస్‌ను స్వాధీనం చేసుకుంటారు. అందులో ఇంకా పూర్తిగా మచ్చిక కాని, క్రూరంగా వున్న మాక్ అనే గొరిల్లాను చూస్తారు. అది గురిచూసి విసిరే పద్ధతిని చూసి బేస్‌బాల్ బౌలర్‌గా శిక్షణ ఇస్తారు. అది అతివేగంగా విసిరే బంతులను పట్టుకోలేక కీపర్, ఫీల్డర్‌లు గాయపడాల్సిందే. వీళ్ళు మాక్‌ను తీసుకుని డబ్బు సంపాదించడానికి పోటీలకు వస్తారు. అక్కడ నడవలేకపోతున్న మిస్టర్ గోను ఆస్పత్రికి తీసుకువస్తే కుడికాలు ఎముక విరిగిందనీ, బాగుపడటానికి పదిహేనురోజులు పడుతుందని డాక్టర్ చెబుతాడు. రెండురోజుల్లో ఫైనల్స్ వుంటాయి. ఫైనల్స్‌లో మిస్టర్‌గో పాల్గొనకపోతే అంతవరకు పడిన శ్రమ వృధా అవుతుంది. పరిస్థితిని గమనించిన ఏజెంట్ దుసాన్ ప్రత్యర్థులతో చేతులు కలుపుతాడు. అక్కడ క్రీడామైదానంలో మాక్ బౌలింగ్ దాడికి ఆటగాళ్ళు హడలిపోతారు. తన భవిష్యత్తు అంతా ఆ గేమ్ గెలవడంపైనే ఆధారపడి వుందని గమనించిన వివి మగతగా పడివున్న మిస్టర్‌గో దగ్గరకు వచ్చి మేలుకోల్పి, ఆటగాడిగా మైదానంలోకి తీసుకువస్తుంది. పూర్తిగా మగత వీడక, కాలు స్వాధీనంలో లేక మాక్ బౌలింగ్‌ను ఎదుర్కోలేక చతికిలబడిన మిస్టర్‌గోను చూసి ప్రేక్షకులు ఒకవైపు, వివి ఒకవైపు ఉత్సాహపరుస్తుంటారు. వీళ్ళను చూసి లేని ఓపిక తెచ్చుకుని నిలబడి మాక్ విసిరిన బంతిని ఎదుర్కొని గెలిచిన విధానాన్ని తెరమీద చూడాల్సిందే తప్ప వివరించడం కష్టం. ఓటమితో రెచ్చిపోయిన మాక్, మిస్టర్‌గో మీద విరుచుకుపడటం, వారిద్దరిమధ్య సాగిన భీకర పోరాటాన్ని ఉత్కంఠ భరితంగా చిత్రీకరించారు. పరిస్థితిని వివి ఎలా అదుపుచేసింది, కథ ఎలా సుఖాంతం అయిందో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. మంచి ఎడిటింగ్, సంగీతం, స్పెషల్ ఎఫెక్ట్స్‌తో సినిమాను మరింత ఆసక్తికరంగా, ఉత్కంఠ భరితంగా చిత్రీకరించాయి. 15 ఏళ్ళ అమ్మాయి వివిగా క్యూ జియో అద్భుతంగా నటించింది. సినిమా ఎక్కువ భాగం బేస్‌బాల్ ఆటపై కేంద్రీకృతమైంది. ఈ ఆటను అభిమానించే యూరోపియన్ దేశాలలో ఈ చిత్రం విజయం సాధించడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఈ ఆట గురించి పట్టించుకోని మన దేశంలో, ముఖ్యంగా మన ప్రాంతంలో ఈ సినిమాను ఆదరించడం కష్టమే. లిప్ మూవ్‌మెంట్ కుదరక ఎబ్బెట్టుగా తయారైన ఆంగ్ల అనువాదం చూపడం కంటే, ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో వున్న ఒరిజినల్ సినిమా చూడడమే బెటర్. ప్రాంతీయ అనువాదాలతోసహా ఈ చిత్రం మన దగ్గర త్వరలో విడుదల కానున్నది.

రివ్యూ - హాలీవుడ్
english title: 
guerilla
author: 
-కె.పి.అశోక్‌కుమార్

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>