తొలి సినిమా ‘అలా మొదలైంది’లో ఓ రకంగా తన కథే ఉందని, అందుకే అందులో వున్న భావోద్వేగాలను అంత బాగా తాను పలికించగలిగి ఉంటానేమోనని అంటోంది నిత్యామీనన్. విషయంలోకి వెళితే నిత్యామీనన్ తన 18వ ఏటనే ప్రేమలో పడిందట. చూడడానికి చాలా సీరియస్‌గా తాను కన్పించినా జోవియల్‌గా మూవ్ అవడానికి ప్రయత్నిస్తానంటోంది. కాలేజీలో అనేకమంది తనకు ప్రపోజల్ చేస్తే చివరికి ఒకతని ప్రేమలో పడిపోయానంటోంది. సినిమా షూటింగ్ సమయంలో తమ ప్రేమకు బ్రేక్ అప్ అయిందని, ఆ తరువాత షూటింగ్‌లో ఆ విషయమే తాను మర్చిపోయానని చెబుతోంది. మళ్లీ ఇప్పుడు ఖాళీగా కూర్చోవడంవల్ల గత ప్రేమ జ్ఞాపకాలు గుర్తొచ్చాయని, మళ్లీ తమ ప్రేమ చిగురించిందని, త్వరలో పెళ్లిదాకా వెళ్ళనున్నామని భలే కథ చెప్పింది. అంతగా మర్చిపోయే ఆ ప్రేమకథలో ఎంత నిజముందో ఏమో మరి! ఏదైతేనేం ధైర్యంగా తాను ప్రేమిస్తున్నానని, పెళ్లిచేసుకోబోతున్నానని ఎవరూ చెప్పకుండా దాచే నిజాలను కూడా కుండబద్దలు కొట్టినట్లు చెప్పడంలో నిత్యామీననే టాప్!
మానవత్వంతో...
ఎవరైనా చివరి నిమిషంలో ఉన్నప్పుడు వారి కోరికలు తీర్చడం మానవతా దృక్పథం. అలా గతంలో కొంతమంది సినీ హీరోలు, హీరోయిన్లు స్పందించి తమలో కూడా మానవత్వం ఉందని నిరూపించిన సంఘటనలు మనకున్నాయి. తాజాగా ఓ మరణ ముఖంలో ఉన్న బాలుడి కోర్కెను హీరో మహేష్‌బాబు తీర్చాడు. ఒక్కసారి తాను చనిపోయేలోగా మహేష్‌బాబును కలవాలని అరుణ్ అనే బాలుడు కోరుకున్నాడట. క్రానిక్ వ్యాధితో బాధపడుతున్న అతనిని చివరి కోర్కెను తీర్చడానికి ‘మేక్ ఎ విష్ ఫౌండేషన్’వారు మహేష్‌బాబుతో సంప్రదించగా, ఆ పిల్లవాణ్ణి కలవడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు ప్రిన్స్. బిజీ షెడ్యూల్‌తో నిరంతరం షూటింగ్‌లకోసం ఎక్కడెక్కడో తిరిగే మహేష్‌బాబు ఆ బాలుణ్ణి కలిసినప్పుడు ఓ సరికొత్త మానవ హృదయం అక్కడ వెల్లివిరిసిందట. దానికితోడు మహేష్‌బాబు ఆ బాబుకి తన ఆటోగ్రాఫ్ వున్న టీషర్ట్‌ను కూడా బహుమతిగా ఇచ్చాడట. సినిమావాళ్ళకు కూడా ప్రేమలు, ఆప్యాయతలు, మానవత్వాలు ఉంటాయని మరోసారి మహేష్ రుజువుచేశాడు. గతంలో తారలు ఎలా వున్నా ఇప్పుడున్న బిజీ షెడ్యూల్స్‌తో ఇటువంటి వార్తలే వినబడటంలేదు. ఇప్పుడు ఈ వార్త అందరికీ ఆనందాన్నిస్తోంది!