Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

కొత్త సూపర్‌హిట్ సూచిక 300కోట్లు!

$
0
0

వందేళ్ళు దాటిన భారతీయ సినిమా మెయిన్ స్ట్రీమ్ విభాగంలో ‘‘సూపర్ హిట్’’ అన్న మాటకు కొలమానం ఏమిటి? అనేది మొదట్నించీ చర్చల్లోనే ఉంది. తాజాగా బాలీవుడ్ సినిమాలకు సంబంధించి, కమర్షియల్ సూపర్ హిట్‌కు కొలమానంగా ‘‘300 కోట్లు’’ అనేది తెరమీదికి వచ్చింది. బిగ్ బడ్జెట్, బడా స్టార్‌కాస్ట్, భారీ ప్రచార వ్యూహాలతో వచ్చిన సినిమాలకు ఇప్పుడు 300 కోట్లు ఓ ‘బెంచ్ మార్క్’లా మారింది. పెద్ద ప్రొడక్షన్ హౌజ్‌లన్నింటి లక్ష్యంకన్నా ఇప్పుడు ఈ మైలురాయిని దాటడం పైననే ఉంది. ఇటీవలి ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’, ‘క్రిష్ 3’ సినిమాలు ఈ మైలురాయిని దాటి తమ సత్తాను చాటగా, మరోవైపున ఈ ‘నెంబర్’ భారతీయ సినిమా స్టామినాను తెలియజేసే సూచికగా మారడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది.
సూపర్ హిట్ కొలమానమేంటి?
సాధారణంగా సినిమాలకు సంబంధించి, ‘‘హిట్, ఫ్లాప్’’నుంచి మొదలుకొని ‘‘సూపర్ హిట్, డిజాస్టర్, యావరేజ్’’ అని చెప్పుకునే సూచికలన్నీ మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ సినిమాలకు సంబంధించినవే. సినిమా అనేది వ్యాపారంగానూ, లాభార్జనే లక్ష్యంగా, పెట్టుబడికి మించిన ఆదాయాన్ని ఆర్జించడానికి ఉన్న వాణిజ్యంగానూ భావించడం అనేది భారతీయ భాషలలోని అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీలలోనూ ఉంది. అందుకే బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్ వంటి అన్ని మెయిన్‌స్ట్రీమ్ సినిమా రంగాలన్నింటికీ ‘‘కమర్షియల్ సక్సెసే’’ ప్రధానం!
దానిని అనుసరించే ఈ సినిమాల సక్సెస్- ఫెయిల్యూర్స్‌ను అంచనావేయడానికి ఆ సినిమాకి వచ్చిన బాక్సాఫీస్ కలెక్షన్లు, దానిని అనుసరించి ‘సూపర్‌హిట్’, ‘డిజాస్టర్’వంటి సూచికలు నిర్ధారణ అయ్యాయి. అదే సమాంతర సినిమాలు, ఆర్ట్ ఫిలిమ్‌ల విషయంలో ఈ సూచికలకు అర్థంకానీ, పరమార్థం కానీ లేవు. అందుకే ‘‘కలెక్షన్లు’’ ఆధారంగా, ‘‘పెట్టుబడి ఆదాయం’’ ఆధారంగా చేస్తున్న ఈ వర్గీకరణను మెయిన్‌స్ట్రీమ్ కమర్షియల్ సినిమాలకు మాత్రమే వర్తింపచేయవచ్చు.
కాగా, ఈ ‘సూపర్‌హిట్’అనే మంత్రాక్షరాన్ని నిర్ధారించే కొలమానం భారతీయ సినిమా మొదలైన నాటినుంచీ కామన్‌గా ఒకటే ఉంటూ వస్తోంది. అదే ఆ సినిమా సాధించిన ‘‘కలెక్షన్లు’’! 1913లో తొలి భారతీయ సినిమా ‘రాజాహరిశ్చంద్ర’ పెట్టుబడిని మించి 10 రెట్లు ఆదాయాన్ని గడించింది. ఆమేరకు అది ఆ కాలానికి సూపర్‌హిట్ అని అర్థం! ఆ లెక్కన ‘సూపర్‌హిట్ సినిమా’అనే స్థాయిని నిర్ధారించేది ఆ సినిమా సాధించిన వసూళ్ళే అయినప్పటికీ, ఆ సంఖ్య మాత్రం స్థిరంగా ఉండకుండా కాలానుగుణంగా మారుతూ వస్తోందనేది నిజం! అలాగే ఈ ‘అంకె’అన్ని సినిమా పరిశ్రమలకూ ఒకేలా ఉండదని, ఆయా సినీ పరిశ్రమల స్థాయి, ప్రేక్షకజనం, మార్కెట్ వంటి కారకాల ఆధారంగా నిర్ధారణ అవుతుందని కూడా గమనించాలి. అందుకే బాలీవుడ్ సినిమాకు ఉన్న సూపర్‌హిట్ కొలమానాన్ని గుజరాతీ సినిమాకో, మరాఠీ సినిమాకో వర్తింపచేయలేము. అలాగే తెలుగు సినిమా కలెక్షన్ల స్థాయిని బాలీవుడ్ సినిమాకు అనువర్తింపచేసి ‘సూపర్ హిట్’ను నిర్ధారించలేము. ఆ లెక్కన ఈ సూపర్ హిట్ కొలమానాన్ని ఏ భాషా సినీ పరిశ్రమకు, దానికి సంబంధించి మాత్రమే నిర్ధారించుకోవాలి.
1 కోటి నుండి 100 కోట్లు...
భారతీయ భాషా చిత్రాలన్నింటిలోనూ కమర్షియల్ మెయిన్‌స్ట్రీమ్ సినిమాకు కేరాఫ్ అడ్రస్- బాలీవుడ్ సినిమాలే! ఆ తర్వాత స్థానంలో తెలుగు (టాలీవుడ్), తమిళ (కోలీవుడ్), మలయాళ (మాలీవుడ్), బెంగాలీ (టాలీవుడ్), కన్నడ (సాండల్ వుడ్) సినీ పరిశ్రమలు నిలుస్తాయి. అయితే, బాలీవుడ్‌లో 1949లో వచ్చిన ‘కిస్మత్’ సినిమా తొలిసారిగా కమర్షియల్ సక్సెస్, సూపర్‌హిట్ అన్నమాటకు తొలి ఉదాహరణగా నిలిచింది. ఈ సినిమా భారతీయ సినీ చరిత్రలో మొదటిసారిగా కోటి రూపాయలను వసూళ్ళుచేసి ప్రపంచ వినోద రంగానికి రెండు విషయాలు వెల్లడి చేసింది. 1) వ్యాపారంగా సినిమా రంగం లాభదాయకం అనే విషయం తేటతెల్లం అయింది. ఇతర వ్యాపారులు సినీ పరిశ్రమలోకి తమ పెట్టుబడులను పెట్టడానికి ప్రోత్సాహాన్నిచ్చింది. 2) భారతీయ సినిమాకి ప్రేక్షకాదరణ విపరీతం అనీ, భారతదేశంలో సినిమాలు ఓ ‘‘పొటెన్షియల్ వినోద సాధనం’’అనీ అర్థం అయింది. అలా 1950 దశకం నాటికి బాలీవుడ్ సినిమాలకు సూపర్ హిట్ కొలమానం 10 కోట్ల లోపే ఉండిపోయింది. ఆ తర్వాత 1990 దశకం వరకూ సూపర్‌హిట్ కొలమానాన్ని నిర్ధారించిన వాటిలో ‘షోలే’ ఓ మైలురాయిగా మిగిలింది.
1990 దశకంలో రాజశ్రీ బ్యానర్‌లో వచ్చిన ‘‘హమ్ ఆప్ కే హై కౌన్’’ సినిమా తొలిసారిగా భారతీయ సినీ నిర్మాత 100 కోట్ల కలను కనే అవకాశాన్నిచ్చింది. సల్మాన్‌ఖాన్- మాధురీ దీక్షిత్‌లతో ఫ్యామిలీ డ్రామాగా వచ్చిన ఈ సినిమా ‘మ్యారేజ్ వీడియో’అనే విమర్శలను ఎదుర్కొన్నప్పటికీ, అన్ని ప్రాంతాల ప్రేక్షకులకూ విపరీతంగా నచ్చి ట్రెండ్ సెట్టర్‌గా మారింది.
కానీ ఆ తర్వాత అమీర్‌ఖాన్ ‘గజినీ’ వచ్చేంతవరకూ 100 కోట్లు అనేది ఓ అందని ద్రాక్షపండుగానే మిగిలిపోయింది. ‘లగాన్’, ‘గదర్ ఏక్ ప్రేమకథ’ వంటి సినిమాలు కమర్షియల్ గానూ, క్రిటికల్ గానూ సక్సెస్ అయినప్పటికీ 100కోట్ల మైలురాయిని దాటలేకపోయాయి. కానీ ‘గజినీ’తో ఆ టార్గెట్ బ్రేక్ అయి ఆ తర్వాత బాలీవుడ్ సినిమాలలో ‘సూపర్‌హిట్’అనే మాటకు కొలమానంగా 100 కోట్ల కలెక్షన్ స్థిరపడింది.
100 కోట్ల క్లబ్...
2010 నుంచి బాలీవుడ్ సినిమాల కొత్త సూపర్‌హిట్ కొలమానం అంటే ‘100 క్రోర్ క్లబ్’ అని నిర్ధారణ అయింది. దీనికితోడు ఈ క్లబ్‌లో చేరే సినిమాల సంఖ్యకూడా ఏటికేడు పెరుగుతూ వచ్చాయి. మల్టీప్లెక్స్‌ల పెరుగుదల, ఓవర్సీస్ మార్కెట్ విస్తరణ, శాటిలైట్ రైట్స్, పెరిగిన టిక్కెట్‌ల ధరలు వంటి కారణాలవల్ల బాలీవుడ్‌లో బిగ్ హీరో సినిమాలు 100 కోట్లు కలెక్షన్ చేయడం సులభం అయిపోయింది. ఒకప్పుడు కలగా ఉన్న 100 కోట్ల మైలురాయి, ఇప్పుడు సునాయాసంగా మారింది. అలా ధూమ్-2, క్రిష్-2, అగ్నీపథ్, బాడీగార్డ్, రెడీ, దబాంగ్, దబాంగ్ 2, గోల్‌మాల్ రిటర్న్స్, ఓమైగాడ్, రౌడీ రాధోడ్, రా.వన్, ఏక్ థా టైగర్ వంటి సినిమాలు ఈ రికార్డు సాధించి, బాలీవుడ్ ఇండస్ట్రీని లాభాల బాటలో నడిపించాయి. ఇక, హిందీయేతర ప్రాంతీయ భాషలలో ఈ మైలురాయిని దాటిన క్రెడిట్ ఒక్క తమిళ ఇండస్ట్రీనే దక్కించుకుంది. రజినీకాంత్ ‘రోబో’, కమల్‌హాసన్ ‘దశావతారం’ ఈ రికార్డును సాధించి బాలీవుడ్ సినిమాలతో తామూ సమానంగా వెళ్ళగలమని నిరూపించాయి.
300 కోట్ల టార్గెట్...
2012నుండీ బాలీవుడ్ కమర్షియల్ సినిమాల కొత్త కొలమానంగా క్రమంగా 200 కోట్లు పొడసూపింది. దీనికి అమీర్‌ఖాన్-కరీనాకపూర్ జంటగా, రాజూహీరానీ దర్శకత్వంలో వచ్చిన ‘‘3 ఇడియట్స్’’ సినిమా తెరతీసింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 386 కోట్లకు పైగా వసూలుచేసి, సూపర్‌హిట్ లక్ష్యాన్ని 100కోట్ల నుండి ఏకంగా 300 కోట్లకు పెంచింది. వందేళ్ళ భారతీయ సినీ ప్రస్థానంలో ఆల్‌టైమ్ సూపర్ హిట్ స్థానాన్ని కైవసం చేసుకుంది. అయితే అప్పట్లో ఈ సంఖ్యను చూసి ఈ రికార్డును బ్రేక్ చేయడం సమీప భవిష్యత్తులో అసాధ్యం అని ట్రేడ్ పండితులు భావించారు. కానీ ‘దూకుడు’గా వెళ్తున్న బాలీవుడ్ సినీ పరిశ్రమ రోజురోజుకీ కొత్తకొత్త వ్యాపార సూత్రాలనూ, మార్కెటింగ్ స్ట్రాటజీలను, మీడియా ప్రచార వ్యూహాలను అమలుచేస్తూ 300 కోట్లు కూడా గొప్ప టార్గెట్ ఏమీకాదని అనతికాలంలోనే నిరూపించాయి.
అలా ‘ఏక్‌థా టైగర్’ 319 కోట్లను, క్రిష్-3 సినిమా 302 కోట్లను, ‘యే జవానీ హై దీవానీ’ సినిమా 309 కోట్లను సాధించి బాలీవుడ్‌కే కాక, యావత్ భారతీయ సినిమాకు కమర్షియల్ సూపర్‌హిట్ బెంచ్‌మార్క్‌గా 300 కోట్లను కొత్త సూచికగా ఏర్పరిచాయి. కాగా, షారుఖ్‌ఖాన్- దీపికా పడుకొనే నటించిన ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ సినిమా ఏకంగా 399 కోట్లను సాధించి ఇప్పటివరకూ ఉన్న రికార్డులన్నింటినీ బ్రేక్‌చేసి కొత్త టార్గెట్‌ను ఫిక్స్ చేసింది.
ఆ లెక్కన బాలీవుడ్‌లో ఇప్పుడు ‘హిట్ సినిమా’ అంటే 100 కోట్లు, ‘సూపర్ హిట్’ అంటే 200 కోట్లు, ‘ఆల్‌టైమ్ టాప్ హిట్’ అంటే 300 కోట్లు అనే సూచికలను పునర్ నిర్వచించుకోవలసిన అవసరాన్ని సృష్టించాయి. (చిత్రం) క్రిష్ 3

వందేళ్ళు దాటిన భారతీయ సినిమా మెయిన్ స్ట్రీమ్
english title: 
superhit indicator
author: 
-మామిడి హరికృష్ణ

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>