కడప, మార్చి 6 : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న వ్యవసాయ కూలీలను భవన నిర్మాణ కార్మికులుగా గుర్తిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో భవన నిర్మాణ కార్మికులకు వర్తించే ప్రోత్సాహకాలు ఉపాధి కూలీలకు కూడా అందుతాయి. ఈ పథకం పక్కాగా అమలైతే ఇక ఉపాధి కార్మికులకు బీమా యోగం కలుగనుంది. అయితే చిన్నపాటి మెలికతో వేలాది మంది ఈ వసతికి దూరమవుతున్నారు. ప్రమాదవశాత్తు మృతి చెందితే ఇప్పటి వరకు అపద్బంధు పథకంలో 50 వేలు బాధిత కుటుంబానికి అందేది. భవన కార్మికులుగా గుర్తించిన నేపథ్యంలో కొత్తగా బీమా ప్రీమియం చెల్లించి, ఉపాధి కోసం వచ్చి మృత్యువాత పడితే 2 లక్షల బీమా వస్తుంది. అంతేకాకుండా దహన క్రియాలకు 5 వేల రూపాయలు మంజూరు చేస్తారు. కార్మికులు ప్రమాదవశాత్తు పాక్షికం, మధ్యరకం, వికలాంగులుగా మారితే 25వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు ఆర్థిక సాయం అందుతుంది. సాధారణ మరణమైతే 30 వేల రూపాయలు చెల్లిస్తారు. పని వద్దకు వెళ్తు కానీ, పని నుండి ఇంటికి వస్తూ గాయపడి కూలీకి వెళ్లేందుకు వీలుకాక పోతే వారికి నెలకు 1500 రూపాయలు పెన్షన్ రూపంలో ఇవ్వాలని కార్మిక శాఖ భావిస్తోంది. జిల్లాలో 5 లక్షల 22వేల 370 మందికి ఉపాధి పత్రాలు ఇచ్చారు. 17,889 శ్రమశక్తి సంఘాల్లో 3 లక్షల 13వేల 626 మంది సభ్యులు ఉన్నారు. వ్యక్తిగతంగా చూస్తే పురుషులు 1 లక్ష 18వేల 938 మంది మహిళలు 1,67,019 మంది ఉన్నారు. ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో 1 లక్ష 68వేల 249 కుటుంబాలు లబ్ధిపొందుతున్నాయి. 2011-2012లో ఇప్పటి వరకు 100 రోజులు పని దినాలు పొందిన కుటుంబాలు 35వేల 390 మంది ఉన్నారు. వీరంతా బీమాకు అర్హులే. వీరి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం రోజుకు జిల్లా వ్యాప్తంగా సగటున 40 నుంచి 46 వేల మంది ఉపాధి పనులు చేస్తున్నారు. పని చేస్తున్న వారు ముందుగా తమ పేరు నమోదు కోసం 50 రూపాయలు, సభ్యత్వం కోసం అదనంగా 12 రూపాయలు కలిపి 62 రూపాయలు చెల్లించాలి. తర్వాత రెన్యూవల్ కోసం ఏడాదికి 12 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. మహిళలకు ప్రసూతి ఖర్చుల నిమిత్తం 5వేలు, పిల్లల వివాహం కోసం 5 నుంచి 10వేల రూపాయలు, మహిళలు రెండు విడతలుగా పొందవచ్చు. నిర్మాణ రంగ పనుల్లో మాత్రమే ఏడాదికి 90 రోజుల పాటు పని చేయాల్సి ఉండాలి, అంతకంటే తక్కువ రోజుల పనులు పని చేసిన వారికి బీమా ఇతర సౌకర్యాలు వర్తించవు. జిల్లా వ్యాప్తంగా గత నెల 21 నుంచి ఈ నెల 21వ తేదీ వరకు పేర్ల నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ పథకం విజయవంతం అయితే ఎంతో మంది కార్మిక కుటుంబాల్లో వెలుగులు నింపుతాయి. దీనిపై ప్రజా ప్రతినిధులు దృష్టి పెట్టి న్యాయం చేయాలని జిల్లాలో పని చేస్తున్న కూలీలు వేడుకుంటున్నారు.
ఉద్యోగాల కోసం నిరాహార దీక్షలు
ఓబులవారిపల్లె, మార్చి 6: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఎపియండిసి ముగ్గురాళ్ల గనుల్లో మంగళవారం స్థానిక మహిళలు, గ్రామంలో నివసిస్తున్న నిర్వాసితులు ఉద్యోగాల కోసం నిరాహార దీక్షలను ప్రారంభించారు. గనుల్లో దాదాపు 5 గంటల పాటు ముగ్గురాయి తవ్వకాలు, ఎగుమతుల పనులను స్తంభింప చేశారు. ఈ సందర్భంగా మంగంపేట డైంజర్‌జోన్ నిర్వాసితులు మాట్లాడుతూ గత ఎనిమిదేళ్లుగా మా గ్రామంలో అభివృద్ధి పనులను నిలిపేశారని, మంగంపేట గనుల విస్తరణ కోసం తాము సాగుచేసుకుంటున్న భూములు, ఇళ్లను లాక్కొని మీకు మంచిరోజులు ఉన్నాయని, కల్లబొల్లి మాటలతో మభ్యపెట్టారని వారు పేర్కొన్నారు. వృద్ధులతో పాటుచిన్నపిల్లలు కూడా మంగంపేట కాలుష్యం మూలంగా వింతవ్యాధులకు గురవుతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. స్థానికంగా ఉన్న అధికారులుగాని, పెత్తనం చెలాయిస్తున్న నాయకులు కాని పట్టించుకోవడం లేదన్నారు. గత రెండేండ్ల క్రితం సంస్థ ఎండి మీనాకుమార్ స్వయంగా తమ గ్రామంలో గ్రామసభ నిర్వహించి 2011 నెలాఖరుకు 200 ఉద్యోగాలను నిర్వాసితులకు ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇంతవరకు ఉద్యోగాల విషయంలో అధికారులు, నాయకులు ఏలాంటి అధారాలు చూపడం లేదని వారు వాపోయారు. ఉద్యోగాలు ఇస్తారనే ఉద్దేశ్యంతో అంతో ఇంతో చదువుకున్న తమ పిల్లలు గ్రామాల్లో తిరుగుతూ తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని వారు వాపోయారు. డేంజర్‌జోన్‌లో ఇళ్లు ఖాళీ చేసేందుకు రూ. 50 మొదటి విడత ఇవ్వగా నాయకులు కేవలం రూ. 20 వేలు ఇచ్చారని వారు ఆరోపించారు.
వర్గపోరుతో ఉద్యోగాలు ఆలస్యం
మంగంపేటలో ఇంతవరకు ఎటువంటి వర్గాలుగాని, పార్టీలకు గాని తావీవుకుండా అంతా కలిసికట్టుకా ఉండేవారు, అయితే కొంతమంది స్వార్థపరులు తమ చెప్పుచేతల్లో ఉండేందుకు తమ పెత్తనం కొనసాగేందుకు రాజకీయంగా ఎదగడానికి నిరుపేదల జీవితాలను ఆసరా చేసుకుని తమ కడుపులు కొడుతున్నారని వారు పేర్కొన్నారు. 200 ఉద్యోగాలు ఎపియండిసి ఎపుడో ఇచ్చిందని, స్థానికంగా ఉన్న బడాబాబులు తమ వాళ్లకే కేటాయించుకోవాలని గొడవలు పడడం వల్లే ఉద్యోగాల భర్తీ ఆలస్యం ఆవుతుందన్నారు. ప్రతిసారి గనుల్లో పనులు స్థంభింప చేసినపుడల్లా హైద్రాబాద్‌కు వెళ్లడం అక్కడ స్వంత పనులు చేసుకోవడం, స్థానికులకు మాత్రం ఉద్యోగాలు తొందరలో వస్తాయని మభ్యపెడుతున్నారన్నారు. రెండేళ్ల నుండి ఒక్క నిరుపేదకు కూడా ఉద్యోగం రాలేదని వారు వాపోయారు. ఇప్పటికైనా ఎపియండిసి అధికారులు అర్హులెవరో, అనర్హులెవరో గమనించి న్యాయం చేకూర్చాలని వారు డిమాండ్ చేశారు. అర్హులకు న్యాయం జరిగేంత వరకు నిరాహరదీక్షలు ఆగవని వారు స్పష్టం చేశారు.
సిపిఓ రమణ వివరణ
ఎపియండిసి ఉద్యోగాల విషయంలో చాలా స్పష్టంగా ఉందని, గ్రామపెద్దలు, సంస్థ ఉన్నతాధికారులు ఒకే వేదికపైకి వచ్చి విషయాలను చర్చించుకోవాలని సిపిఓ రమణ పేర్కొన్నారు. ఈ విషయాలను సంస్థ ఈడి, యండి ప్రమేయంతో ముడిపడి ఉందన్నారు. ఈడి చైనాలో ఉండడం, సంస్థ యండి ఎన్నికల స్పెషలాఫీసర్‌గా యుపిలో ఉండడం వల్ల వారం రోజుల వరకు ఏ విషయం చెప్పలేమన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు లాలూరి సుబ్రమణ్యం, కౌలూరి రాజశేఖర్‌రెడ్డి, గ్రంథే సురేష్, చొప్పల వెంకటరెడ్డి, అమీనమ్మ, శ్రీనివాసులు, రత్నమ్మలతో పాటు గ్రామస్థులు పాల్గొన్నారు.
ఏప్రిల్ 1కి అన్ని మండలాల్లో
‘మీ సేవా’ : కలెక్టర్
కడప, మార్చి 6 : ఏప్రిల్ 1వ తేదీ నాటికి ప్రతి మండలంలో ఒక మీ సేవా కేంద్రాన్ని ప్రారంభించాలని కలెక్టర్ వి. అనిల్‌కుమార్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సభా భవన్‌లో కడప డివిజన్ తహశీల్దార్లతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మీ సేవా ప్రాజెక్టుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంద న్నారు. మీ సేవా కేంద్రాల ద్వారా ప్రజలకు సేవలు అందించడంలో భాగంగా భూ సంబంధిత రికార్డులన్ని డిజిటల్ సిగ్నేచర్ చేయించాలన్నారు. నిర్దేశించిన సమయంలో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని తహశీల్దార్లను ఆదేశించారు.జాయింట్ కలెక్టర్ కె. నిర్మల మాట్లాడుతూ ప్రతి రోజు 2 వేల రికార్డులను డిజిటల్ సిగ్నేచర్ చేస్తే తప్ప పూర్తి కాదన్నారు. ఈసేవ, ఆన్‌లైన్ సెంటర్లు లేని మండలాల్లో ఏప్రిల్ 1 నాటికి మీ సేవా కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు. ఎండోమెంట్, వక్ఫ్‌బోర్డు భూముల వివరాలను రెవెన్యూ సదస్సులు పూర్తి కాగానే సేకరించాలన్నారు. ఈ సమావేశంలో ఆర్డీఓ వీరబ్రహ్మం, డిఎస్‌ఓ బహుదూర్ సాహెబ్, తహశీల్దార్లు పాల్గొన్నారు.