హైదరాబాద్, డిసెంబర్ 12: రాష్ట్ర విభజన బిల్లును ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు పంపించడం పట్ల టిడిపి అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. తెలుగు జాతి అంటే గౌరవం లేదా? అంత చులకన ఎందుకని ఆయన మండిపడ్డారు. ఇష్ఠానుసారంగా రాష్ట్ర విభజనపై ముందుకు వెళ్తే వదిలిపెట్టే సమస్యే లేదు, వెంటపడుతాం అని చంద్రబాబు హెచ్చరించారు. రాష్ట్ర విభజనపై మంత్రుల బృందం (జీవోఎం) ఎవరితో సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయం ఎలా తీసుకుందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. రాష్ట్ర విభజన ప్రక్రియను రాజ్యాంగబద్ధంగా జరగడం లేదని గురువారం తన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో దుయ్యబట్టారు. విభజన ముసాయిదా బిల్లును ఆగమేఘాలపై ప్రత్యేక విమానంలో పంపించాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. ఒకవైపు విమానంలో బిల్లు రావడం, మరోవైపు దిగ్విజయ్‌సింగ్ హైదరాబాద్‌కు రావడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. దిగ్విజయ్‌సింగ్ ఏమి చేయడానికని హైదరాబాద్‌కు వచ్చారని ఆయన ప్రశ్నించారు. అందరికి సమన్యాయం జరిగేలా చూడాల్సిన రాష్టప్రతి విభజన బిల్లుపై న్యాయ సలహా తీసుకోకుండానే అసెంబ్లీకి పంపించడం ఏమిటని ఆయన అభ్యంతరం వ్యక్తం చేసారు. అసెంబ్లీలో విభజన బిల్లు ఆమోదం పొందిన తర్వాతనే పార్లమెంట్‌కు వెళ్లాలని చంద్రబాబు డిమాండ్ చేసారు. శ్రీకృష్ణ కమిటి నివేదికను పట్టించుకోలేదు, ఆంటోని కమిటి నివేదికను పట్టించుకోకుండా జీవోఎం ఏకపక్షంగా ఎలా నిర్ణయం తీసుకుంటుందని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్‌లో సీమాంధ్రులకు రక్షణ లేదని, వారి ఆస్తులకు, అలాగే ఇక్కడ పెట్టుబడులు పెట్టిన వారిని తెలంగాణవాదులు బెదిరిస్తున్నారని ఆంటోని కమిటి తన నివేదికలో పేర్కొందని చంద్రబాబు గుర్తు చేసారు. ‘తెలంగాణ జాగో...ఆంధ్రవాలే భాగో’, ‘హైదరాబాద్ సిర్ఫ్ హమారా’ వంటి నినాదాలతో ఇక్కడ స్థిరపడిన సీమాంధ్ర ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురి అవుతున్నారని ఆంటోని కమిటీయే ఆందోళన వ్యక్తం చేస్తే, ఆ విషయాన్ని జీవోఎం ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని చంద్రబాబు ప్రశ్నించారు. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా పదేళ్లపాటు కొనసాగిస్తామని ముసాయిదాలో పేర్కొన్నారు, ఉమ్మడి రాజధాని అనే పదం రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందా అని చంద్రబాబు ప్రశ్నించారు. అందరికి సమన్యాయం జరిగేలా చూడటమే తమ విధానమని స్పష్టం చేసారు.
అవిశ్వాసంపై ఆసక్తి లేదు
అవిశ్వాస తీర్మానం పెట్టడంపై తమకు పెద్దగా ఆసక్తి లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అసెంబ్లీ లాబీల్లో చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ, ఈ ప్రభుత్వం ఎలాగూ మూడు నెలల్లో ఇంటికి పోతుంది, ఈ నాలుగు రోజులు ఉంటే ఎంత? పోతే ఎంత? దీని కోసం అవిశ్వాసం పెట్టి దించాల్సిన అవసరం లేదన్నారు. పార్లమెంట్ వాయిదా పడితే, ఈ సమావేశాల్లో విభజన బిల్లు చర్చకు రావడం అనుమానమేనని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కెసిఆర్‌పై తన ఎదురుదాడి కొనసాగుతూనే ఉంటుందని, తాను ఎవరికీ భయపడనని ఆయన అన్నారు.
తెలుగు జాతి అంటే ఇంత చులకనా? విభజనపై ముందుకు వెళ్తే వదలిపెట్టం, వెంటపడతాం దిగ్విజయ్‌సింగ్ ఎందుకు వచ్చినట్టు? కేంద్రంపై మరోసారి చంద్రబాబు ఆగ్రహం
english title:
flight
Date:
Friday, December 13, 2013