హైదరాబాద్, డిసెంబర్ 12: భారీ భద్రతా బలగాల మధ్య రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో ఏర్పడిన విపత్కర పరిస్థితులు, అసెంబ్లీకి తెలంగాణ డ్రాఫ్ట్ బిల్లు వచ్చిన నేపథ్యంలో భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. గతంలోని ఎన్నడూలేని విధంగా ఈసారి దాదాపు మూడువేల మందితో అసెంబ్లీకి బందోబస్తు ఏర్పాటు చేశారు. అసెంబ్లీలోకి ప్రవేశించే ప్రతీ ద్వారం వద్ద ఐపిఎస్ స్థాయి అధికారిని బాధ్యుడిగా నియమించారు. అసెంబ్లీ భద్రత ఏర్పట్లను నగర పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ పర్యవేక్షిస్తున్నారు. అలాగే నిషేధిత ప్రాంతాల్లో సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహిస్తే కఠిన చర్యలుంటాయని పోలీస్ శాఖ హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో అందుబాటులో ఉన్న సిబ్బందితోపాటు ఇతర జిల్లాలు, కేంద్ర బలగాలను ఏర్పాటు చేశారు. రక్షణ చర్యల్లో భాగంగా భారీగా సిసి కెమెరాలు, హ్యాండీ క్యామ్‌లు, ప్రత్యేక వాహనాలను ఉపయోగిస్తున్నారు. అసెంబ్లీతోపాటు ట్యాంక్ బండ్, ఆదర్శ్‌నగర్‌లోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, గన్‌పార్క్, పబ్లిక్ గార్డెన్స్ తదితర ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. దీంతో అసెంబ్లీ పరిసర ప్రాంతాలు దేశ సరిహద్దు ప్రాంతాలను తలపించాయి. అసెంబ్లీ చుట్టూరా రెండంచెల భద్రత వ్యవస్థ ఏర్పాటు చేశారు. ప్రతీ ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అసెంబ్లీ ప్రాంగణంలోనికి పంపించారు. వెహికిల్ పాస్‌లు ఉంటేనే వాహనాలను లోనికి అనుమతించారు.
అసెంబ్లీని ముట్టడిస్తామన్న సమైక్యవాదుల పిలుపు నేపథ్యంలో అసెంబ్లీ పరిసర ప్రాంతాలు, సమీప బస్‌స్టాప్‌లపై కూడా ప్రత్యేక నిఘా ఉంచారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా, వ్యక్తుల కదలికలపై ఏమాత్రం సందేహం వచ్చినా వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. అసెంబ్లీ బయటే కాకుండా లోపల కూడా భారీగా భద్రత ఏర్పాటు చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలోని మీడియా పాయింట్ చుట్టూ కూడా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. వాహనాల పార్కింగ్ కోసం అసెంబ్లీ ప్రాంగణంలోని మజీద్ వెనకాల ఉన్న ఖాళీ ప్రదేశాన్ని కేటాయించారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి, మంత్రులతోపాటు శాసనసభ్యులు అసెంబ్లీకి వచ్చే ముందు, సభ ముగిశాక సభ్యులు వెళ్లే ముందు పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరించారు. సభ ప్రారంభం, ముగింపు సమయాల్లో ట్రాఫిక్‌ను కొద్దిసేపు ఆపి సభ్యులకు ట్రాఫిక్ సమస్య కలగకుండా చూశారు.
మూడువేల మందితో బందోబస్తు టి-బిల్లు నేపథ్యంలో మరింత కట్టుదిట్టం
english title:
tight security
Date:
Friday, December 13, 2013