హైదరాబాద్, డిసెంబర్ 12: రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్‌కు సమైక్య సెగ తగిలింది. గురువారం మధ్యాహ్నం ఆయన ఢిల్లీ నుంచి నేరుగా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. కాగా దిగ్విజయ్ రాక అపశకునమని, ఆయనను అడ్డుకుంటామని సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు శంషాబాద్ విమానాశ్రయం వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ ఉదయమే విమానాశ్రయానికి చేరుకున్న సమైక్యవాదులు దిగ్విజయ్ సింగ్ రాగానే ఆందోళనకు దిగారు. దిగ్విజయ్ వెనక్కి వెళ్లిపోవాలంటూ నినాదాలు చేస్తూ నిరసనకు దిగారు. దిగ్విజయ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో వారిని దిగ్విజయ్‌కు స్వాగతం పలికేందుకు వచ్చిన తెలంగాణవాదులు అడ్డుకున్నారు. ఈ సమయంలో తెలంగాణవాదులకు, సమైక్యవాదులకు తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి సమైక్యవాదులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం దిగ్విజయ్ సింగ్, ఎఐసిసి కార్యదర్శులు తిరునవుక్కరసు, కుంతియాలు విమానాశ్రయం నుంచి నేరుగా లేక్‌వ్యూ అతిథి గృహానికి చేరుకున్నారు.
లేక్‌వ్యూ వద్ద కూడా..
దిగ్విజయ్ సింగ్ రెండు రోజులపాటు నగరంలోనే ఉండనున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయన బస చేసే లేక్‌వ్యూ అతిథి గృహం వద్ద సిఐఎస్‌ఎఫ్, ఆర్‌ఎఎఫ్, టాస్క్ఫోర్స్ బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా ఇదిలా ఉండగా గురువారం సాయంత్రం దిగ్విజయ్‌తో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి భేటీ అయ్యారన్న విషయం తెలుసుకున్న సమైక్యాంధ్ర విద్యార్థి జెఎసిలు లేక్‌వ్యూ వద్ద ఆందోళనలకు దిగాయి. దిగ్విజయ్ సింగ్ గో బ్యాక్ నినాదాలు చేస్తూ విద్యార్థులు అతిథి గృహంలోనికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు కల్పించుకుని విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.
విమానాశ్రయంలో సమైక్యవాదుల నిరసన లేక్‌వ్యూ వద్ద విద్యార్థుల ఆందోళన
english title:
diggy raja
Date:
Friday, December 13, 2013