హైదరాబాద్, డిసెంబర్ 12: శాసనసభ శీతాకాల సమావేశాల తొలి రోజున సభలో సీమాంధ్ర టిడిపి సభ్యులు, వైఎస్‌ఆర్ కాంగ్రెసు పార్టీ సభ్యులు సమైక్యరాగాన్ని వినిపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని కోరుతూ ఇరు పార్టీలకు చెందిన సభ్యులు ఒకే నినాదం రాసిఉన్న ఫ్లకార్డులను ప్రదర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు తమ పార్టీ వ్యతిరేకం కాదు, విభజన జరిగిన తీరుకు మాత్రమే వ్యతిరేకం అని ఇంతకాలంగా చెబుతూ వచ్చిన సీమాంధ్ర టిడిపి నేతలు, శాసనసభలో విభజనను వ్యతిరేకిస్తూ ఫ్లకార్డులను ప్రదర్శించడంతో టిడిపి తెలంగాణ టిడిపి నేతలు విస్తుపోయారు. పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో సీమాంధ్ర టిడిపి సభ్యులు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ స్పీకర్ పోడియాన్ని ముట్టడించినప్పటికీ, వారిని చంద్రబాబు వారించకపోవడంతో టిడిపి తెలంగాణ సభ్యులు ఒక్కసారిగా విస్తుపోయి, ఇదేమి పద్ధతి అంటూ, సీమాంధ్ర సభ్యులను సైగలతో ప్రశ్నించారు. అయితే వారు మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా సభలోనే జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేస్తూ సభా కార్యకలాపాలకు అడ్డుతగిలారు. సీమాంధ్ర టిడిపి సభ్యులతో పాటు వైఎస్‌ఆర్ కాంగ్రెసు పార్టీ సభ్యులు కూడా ఒకే నినాదం రాసిఉన్న ఫ్లకార్డులతో స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి సమైక్యరాగాన్ని ఆలపించారు. సభలో దివంగత నెల్సన్ మండేలాతో పాటు, ఇటీవల మృతి చెందిన సభ్యుల మృతికి సభలో సంతాపం తెలియజేయాల్సి ఉండగా, సభా కార్యకలాపాలకు అడ్డుతగలడం పద్ధతి కాదని స్పీకర్ నాదెండ్ల మనోహర్ అభ్యంతరం తెలిపారు. అయినప్పటికీ వైఎస్‌ఆర్‌సిపి, సీమాంధ్ర టిడిపి సభ్యులు వినిపించుకోకుండా పోడియం వద్దనే ఉండిపోవడంతో, సభా నాయకులు తమ సభ్యులను వెనక్కి పిలిపించుకోవాలని, సభ్యుల మృతికి సంతాపం తెలియజేయడాన్ని అడ్డుకోవడం మంచి సంప్రదాయం కాదని స్పీకర్ సూచించారు. దీంతో టిడిపి, వైఎస్‌ఆర్‌సిపి సభ్యులు తమ స్థానాలలోకి వచ్చి కూర్చొవడంతో, సభలో సంతాప తీర్మానాలను చేపట్టారు. సంతాప తీర్మానాలు ముగిసిన వెంటనే తిరిగి పోడియం వద్దకు వెళ్లడానికి వైఎస్‌ఆర్‌సిపి, సీమాంధ్ర టిడిపి సభ్యులు సన్నద్ధం అవుతుండగానే, సభను శుక్రవారం ఉదయం పది గంటలకు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించడంతో, సభ్యులు కంగుతిన్నారు.
ఏకతాటిపై సీమాంధ్ర టిడిపి-వైఎస్‌ఆర్‌సిపి విస్తుపోయిన టిటిడిపి సభ్యులు సంతాప తీర్మానం ముగియగానే సభ వాయిదా
english title:
ragam
Date:
Friday, December 13, 2013