హైదరాబాద్, మార్చి 7: మహిళలు ఆర్థిక శక్తిగా ఎదగడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర భారీపరిశ్రమల శాఖ మంత్రి జె గీతారెడ్డి అన్నారు. సమాజంలో అసమానతలు పోవాలంటే మహిళలు చదువుతో పాటు పరిస్థితులను అవగాహన చేసుకునే విధంగామెలగాలని ఆమె పిలుపు ఇచ్చారు. బుధవారం సచివాలయంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమంలో మంత్రి గీతారెడ్డి మాట్లాడుతూ తొలుత ఉద్యోగస్తుల్లో మహిళల పట్ల చులకన భావం తొలగిపోవాలని అన్నారు. మహిళలకు సమానత్వం ఇవ్వాలని చెప్పుతున్నప్పటికి పురుషాధిక్య ప్రపంచంలో అది అమలు కావడంలేదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా సాధికారితపై మాట్లాడే నేటి రాజకీయ పార్టీలు, సంస్థలు, సంఘాలు వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా వ్యవహరిస్తున్నాయని ఆమె విమర్శించారు. నేడు వెయ్యి మంది పురుషులకు 954 మంది మహిళలు ఉన్నారంటే భ్రూణహత్యలే కారణమన్నారు. ముఖ్యంగా సమాజంలో మహిళల పట్ల ఉన్న దృక్ఫధం మారకపోవడమేనని ఆమె చెప్పారు. మహిళలేనిదే పురషుడు లేడని మహిళలను పూజించిన తర్వాతే పురుషుడు పూజలందుకుంటున్నారని మంత్రి చెప్పారు. ఉద్యోగం చేసే మహిళ పట్ల వివక్షత తగదని ఆమె హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తోందన్నారు. దేశ వ్యాప్తంగా 20వేల కోట్లు మహిళలకు కేటాయిస్తే ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో 10వేల కోట్లు కేటాయించిన ఘనత మనదేనని ఆమె గుర్తు చేశారు. తాను విదేశాల్లో చదువుకున్నా తెలుగు సాంప్రదాయాన్ని మరచిపోలేదన్నారు. అయితే ఇటీవల తన కట్టు బొట్టుపై వ్యాఖ్యలు రావడాన్ని మంత్రి విచారం వ్యక్తం చేశారు. కార్యక్రమానికి ముందు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన మహిళలను మంత్రి అభినందించారు. హాస్యనటుడు గుండు హనుమంతరావు అందరినీ నవ్వించారు. కార్యక్రమంలో సచివాలయ మహిళ ఉద్యోగుల సంఘం అధ్యక్షురాలు నిర్మల, ఉపాధ్యక్షురాలు ఇందిరారాణి, కార్యదర్శి లక్ష్మసులోచన, శారదాంబ, కృష్ణవేణి పాల్గొన్నారు.
..............
ఫోటో.... బుధవారం సచివాలయంలో జరిగిన మహిళా దినోత్సవం కార్యక్రమంలో
మాట్లాడుతున్న మంత్రి గీతారెడ్డి
మహిళా దినోత్సవ సభలో మంత్రి గీతారెడ్డి
english title:
mahilalu
Date:
Thursday, March 8, 2012