హైదరాబాద్, డిసెంబర్ 12: దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా మృతికి శాసనసభ, శాసనమండలి ఉభయ సభలు గురువారం ఘన నివాళులు ఆర్పించాయి. మండేలా మృతికి ఉభయ సభలు వౌనం పాటించి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేసాయి. గురువారం సమావేశాలు ప్రారంభం కాగానే, స్పీకర్ నాదెండ్ల మనోహర్ నెల్సన్ మండేలా మృతికి సంతాప తీర్మానాన్ని ప్రవేశ పెట్టాల్సిందిగా ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమార్‌రెడ్డిని కోరారు. అలాగే మండలిలో చైర్మన్ డాక్టర్ ఎ. చక్రపాణి ఆదేశాల మేరకు శాసనమండలి నాయకుడు, దేవాదాయ శాఖ మంత్రి సి. రామచంద్రయ్య సంతాప తీర్మానాన్ని ప్రతిపాదించారు. తెల్లజాతి దురహంకారానికి అలుపెరుగని రీతిలో పోరాటం జరిపి, దక్షిణాఫ్రికా ప్రజలకు మండేలా స్వేచ్ఛను ప్రసాదించారని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కొనియాడారు. స్పీకర్ నాదెండ్ల మనోహర్, టిడిపి అధినేత చంద్రబాబు, టిఆర్‌ఎస్ సభ్యుడు కెటిఆర్, బిజెపి సభ్యుడు లక్ష్మినారాయణ, సిపిఐ సభ్యుడు గుండా మల్లేశ్, సిపిఎం సభ్యుడు జూలకంటి రంగారెడ్డి, ఎంఐఎం సభ్యుడు పాషాఖాద్రి తదితరులు తమ సంతాప సందేశాల్లో నెల్సన్ మండేలా వ్యక్తిత్వాన్ని కొనియాడారు.
స్వదేశంలోనే కాకుండా, విదేశాల్లో కూడా మంచి పేరుతెచ్చుకున్న మండేలా ప్రపంచానికే మార్గదర్శకుడిగా నిలిచారని మంత్రి రామచంద్రయ్య పేర్కొన్నారు. దక్షిణాఫ్రికా ప్రజలకోసం మండేలా కఠోరంగా శ్రమించారని, జీవితాన్ని త్యాగం చేశారని చైర్మన్ చక్రపాణి పేర్కొన్నారు. 27 సంవత్సరాల పాటు జైలు జీవితం అనుభవించినప్పటికీ, దక్షిణాఫ్రికా ప్రజల కోసం పోరాటం చేసిన యోధుడిగా పేరుతెచ్చుకున్నారని టిడిపి పక్షం నాయకుడు యనమల రామకృష్ణుడు శ్లాఘించారు. మండేలా మరణం ప్రపంచానికే నష్టమన్నారు.
భారతరత్న బిరుదులను అందుకున్న నెల్సన్ మండేలా - అంబేద్కర్‌లకు అనేక పోలికలు ఉన్నాయని వైఎస్‌ఆర్‌సిపికి చెందిన ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు పేర్కొన్నారు. మండేలా 1918 లో జన్మించి, 2013 డిసెంబర్ 6న మరణిస్తే, అంబేద్కర్ 1891 లో (వీరు జన్మించిన సంవత్సరంలో 1-8-9-1 అంకెలు అటుఇటుగా ఉన్నాయని), అలాగే అంబేద్కర్ కూడా డిసెంబర్ 6 న (1956) మరణించారని జూపూడి గుర్తు చేశారు.
మండేలా మరో 5-10 సంవత్సరాలు జీవించి ఉంటే ప్రపంచంలో వినూత్నమార్పులు వచ్చేవని సిపిఐ పక్షం నాయకుడు చంద్రశేఖర్ పేర్కొన్నారు. తిరుగుబాటు చేస్తే అధికారం లభిస్తుందని మండేలా చాటి చెప్పారని టిఆర్‌ఎస్ నాయకుడు స్వామిగౌడ్ పేర్కొన్నారు.
మండేలాకు సంతాపం తెలిపినవారిలో ఎం.వి.ఎస్. శర్మ, ఎంఐఎం సభ్యుడు సయ్యద్ అమీన్ జాఫ్రి, శ్రీనివాసులు నాయుడు, నన్నపనేని రాజకుమారి, డాక్టర్ కె. నాగేశ్వర్, డాక్టర్ గేయానంద్, రుద్రరాజు పద్మరాజు, యాదవ రెడ్డి, పాలడుగు వెంకటరావు, మహ్మద్ అలీ షబ్బీర్, దిలీప్‌కుమార్, విఠపు బాలసుబ్రహ్మణ్యం, బి. వెంకటేశ్వర్లు, తదితరులున్నారు.
సభానాయకుడు సి. రామచంద్రయ్య ప్రతిపాదించిన సంతాప తీర్మానాన్ని చైర్మన్ చక్రపాణి సభ ముందుంచి ఆమోదం తీసుకున్నారు. ఈ సందర్భంగా సభ్యులు రెండు నిమిషాలపాటు వౌనంగా నిలబడి నెల్సన్ మండేలాకు ఘనంగా నివాళులు అర్పించారు.
దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా మృతికి శాసనసభ,
english title:
tributes to mandela
Date:
Friday, December 13, 2013