ఆదోని, డిసెంబర్ 12: రైలు ప్రయాణికుల చేతిలో చావుదెబ్బలు తిన్న ఓ టిటిఐ స్టేషన్‌మాస్టర్ గదిలో ప్రాణాలు విడిచాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా మంత్రాలయం రైల్వేస్టేషన్‌లో గురువారం తెల్లవారుజామున ఒంటి గంటకు జరిగింది. రైలు బోగీలో నీళ్లు లేవన్న కారణంతో ఆగ్రహించిన చెన్నై-షిరిడీ ఎక్స్‌ప్రెస్ రైలు ఎసి బోగీ ప్రయాణికుల ట్రావెలింగ్ టికెట్ ఇన్‌స్పెక్టర్(టిటిఇ) సంజీవరావు(57)తో గొడవపడి కొట్టారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన మంత్రాలయం రైల్వేస్టేషన్‌లో రైలు ఆగగానే స్టేషన్‌మాస్టర్ గదికి చేరుకుని జరిగింది చెబుతూ అక్కడే కుర్చీలో కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. ఈ సంఘటనకు సంబంధించి నలుగురు ప్రయాణికులను రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రైల్వే అధికారులు, ప్రత్యక్షసాక్షుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురానికి చెందిన సంజీవరావు ధర్మవరం స్టేషన్‌లో టిటిఇగా విధులు నిర్వహిస్తున్నారు. బుధవారం రాత్రి ఆయన చెన్నై-షిరిడీ ఎక్స్‌ప్రెస్ రైలులో ధర్మవరంలో విధుల్లో చేరారు. ఎసికోచ్‌లో నీళ్లు రావడం లేదని, ఎలుకలు, బొద్దింకలు ఉన్నాయని ప్రయాణికులు టిటిఇకి ఫిర్యాదు చేశారు. అప్పటికే రైలు కదలడంతో ఆయన గుంతకల్లులోని అధికారులకు సమాచారం అందించారు. రైలును గుంతకల్లు స్టేషన్‌లో 1వ నెంబరు ఫ్లాట్‌ఫారంపై నిలపడంతో బోగీలో నీళ్లు పట్టే వీలు లేకుండా పోయింది. దీంతో ప్రయాణికులు అక్కడి రైల్వే సిబ్బంది, టిటితో వాగ్వివాదానికి దిగారు. రైలు కదలగానే మరోసారి టిటిపై మరోసారి దాడిచేసి చావగొట్టారు. రైలు మంత్రాలయం స్టేషన్‌కు చేరుకోగానే సంజీవరావు పరుగున స్టేషన్‌మాస్టర్ గదికి చేరుకున్నారు. అతని వెంటే ఎసికోచ్ ప్రయాణికులు సైతం వచ్చారు. సంజీవరావు జరిగిన విషయాన్ని స్టేషన్‌మాస్టర్‌కు వివరించారు. కాగా సంజీవరావు తమ బోగీలోని డబ్బు కాజేశాడని ప్రయాణికులు స్టేషన్‌మాస్టర్‌కు ఫిర్యాదుచేశారు. స్టేషన్‌మాస్టర్ సమక్షంలోనే ప్రయాణికులు టిటితో గొడవకు దిగారు. దీంతో టిటిఐ ఉన్నపళంగా కుర్చీలో కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. విషయం తెలుసుకున్న రైల్వే ఉద్యోగులు, టిటిఇలు నిరసనకు దిగారు. ప్రయాణికులు కొట్టడం వల్లే రావు మృతి చెందారని వారు ఆరోపించారు. రైల్వే పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసుకున్నారు. మృతుని కుటుంబసభ్యులు, రైల్వే ఉద్యోగుల ఫిర్యాదు మేరకు రైలులోని బి-2 బోగీ ప్రయాణికులు వంశీకృష్ణ, అతని భార్య ఉషారాణి, ఆమరేష్‌బాబు, అతని భార్య మహాలక్ష్మిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతదేహాన్ని ఆదోని నుంచి గురువారం గుంతకల్లుకు తీసుకువచ్చారు. డిఆర్‌ఎం కార్యాలయం వద్దకు పెద్దసంఖ్యలో చేరుకున్న రైల్వే ఉద్యోగులు, కార్మికులు సంజీవరావు మృతదేహంతో ధర్నాకు దిగారు. డిఆర్‌ఎం మనోజ్‌జోషి, ఎడిఆర్‌ఎం సత్యనారాయణ, సీనియర్ డిసిఎం స్వామినాయక్ సంజీవరావు మృతికి గల కారణాలను తెలుసుకున్నారు. (చిత్రం) గుంతకల్లు డిఆర్‌ఎం కార్యాలయం ఎదుట రైల్వే ఉద్యోగుల ధర్నా (ఇన్‌సెట్‌లో) టిటిఇ సంజీవరావు
అనుచితంగా ప్రవర్తించొద్దు
హైదరాబాద్: ప్రయాణికులకు కావాల్సిన సౌకర్యాలు కల్పించేందుకు రైల్వే శాఖ సిద్ధంగా ఉందని ఎస్సీ రైల్వే సిపిఆర్వో కె. సాంబశివరావు చెప్పారు. సౌకర్యాలపరంగా రైలులో ఏదైనా సమస్య ఉంటే ప్రయాణికులు రైల్వే టిటిఇ చెబితే, ఆ సమాచారాన్ని ఆయన సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తి పరిష్కారమయ్యేలా చూస్తారని తెలిపారు. ప్రయాణీకులు రైల్వే సిబ్బందిపై, ముఖ్యంగా టిటిఇలపై అనుచితంగా ప్రవర్తించడం సరైన పద్ధతికాదని ఆయన అన్నారు.
* ప్రయాణికుల దెబ్బలకే చనిపోయారని ఉద్యోగుల ఆందోళన * డిఆర్‌ఎం కార్యాలయం ఎదుట ధర్నా.. నిందితుల అరెస్టు
english title:
tte's death
Date:
Friday, December 13, 2013