ఏలూరు/కాకినాడ, డిసెంబర్ 12: తెలంగాణ బిల్లు శాసనసభకు వస్తున్న నేపథ్యంలో గోదావరి జిల్లాల్లో సమైక్య ఉద్యమం ఉద్ధృతమవుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గురువారం తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జాతీయ రహదారుల దిగ్బంధం చేపట్టారు. ప్రధాన కూడళ్లలో రహదారులను దిగ్బంధించి, రోడ్లపైనే వంటావార్పు చేపట్టారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఈసందర్భంగా నినాదాలు చేశారు. కొన్ని ప్రాంతాల్లో ఉదయం నుండి సాయంత్రం వరకూ దిగ్బంధం కొనసాగడంతో వేల సంఖ్యలో వాహనాలు నిలిచిపోయి, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కాగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌సింగ్ (డిగ్గీరాజా) హైదరాబాద్‌కు రావడాన్ని నిరసిస్తూ సమైక్యాంధ్ర ఆందోళనకారులు పలు ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో దిగ్విజయ్‌సింగ్ దిష్టిబొమ్మను హిజ్రాల చేతుల మీదుగా దగ్ధంచేశారు. డిగ్గీరాజా గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. పాలకొల్లులో దిగ్విజయ్‌సింగ్ దిష్టిబొమ్మను పాడెకు కట్టి అంతిమసంస్కారాలు కూడా నిర్వహించారు. ప్రత్యేకంగా బ్రాహ్మణులను నియమించి, శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమం పూర్తిచేశారు. జిల్లా కేంద్రం ఏలూరులో దిగ్విజయ్‌సింగ్, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ ఫోటోలు ఉన్న ప్లెక్సీలను గాడిదకు కట్టి ఊరేగించారు. అనంతరం ఆ ఫ్లెక్సీలను దగ్ధం చేసి ధర్నా నిర్వహించారు. డిగ్గీరాజా గోబ్యాక్ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఇప్పటికే రాష్ట్రానికి విభజన బిల్లు చేరిపోవటం, మరికొద్దిరోజుల్లో రాష్ట్ర అసెంబ్లీలో దీనికి సంబంధించి చర్చ జరిగే అవకాశం ఉండటంతో ఉద్యమాలను మరింత తీవ్రస్ధాయికి తీసుకువెళ్లాలని సమైక్య ఉద్యమంలో పాల్గొంటున్న సంఘాలు నిర్ణయించుకున్నాయి. ఇప్పటికే పలుప్రాంతాలలో రాత్రి సమయాల్లోనూ రాస్తారోకోలు, ఇతర ఆందోళనలు ప్రారంభమయ్యాయి. శుక్రవారంనాటికి ఎమ్మెల్యేలకు కూడా విభజన బిల్లు ప్రతులు అందుతాయని చెపుతున్న నేపధ్యంలో ఈ ఆందోళన కార్యక్రమాలకు వినూత్న రూపాన్ని ఇచ్చి మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సమైక్యవాదులు నిర్ణయించుకున్నారు. (చిత్రం) పాలకొల్లులో దిగ్విజయ్ దిష్టిబొమ్మకు చితి ఏర్పాటుచేసి, తలకొరివి పెడుతున్న దృశ్యం
విశాఖలో హోరెత్తిన నిరసనలు
విశాఖపట్నం: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీల వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్ సింగ్ రాష్ట్ర పర్యటకు వ్యతిరేకంగా విశాఖలో ఎన్జీఓలు గురువారం తీవ్ర నిరసనలు తెలిపారు. ఎపి ఎన్జీఓ సంఘం ఇచ్చిన పిలుపు మేరకు విశాఖ జిల్లాలో పలు చోట్ల ఉద్యోగులు నిరసన ప్రదర్శనలు చేశారు. విశాఖ నగరంలో జిల్లా ఎపి ఎన్జీఓ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన జరిగింది. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఎన్జీఓలు దిగ్విజయ్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఆ తర్వాత దిష్ఠి బొమ్మను దగ్ధం చేశారు. అలాగే జిల్లాలో అనేక ప్రాంతాల్లో జాతీయ రహదారిపై సమైక్య వాదులు రాస్తారోకోలు చేయడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
కృష్ణాలో రహదార్ల దిగ్బంధం
మచిలీపట్నం: రాష్ట్ర విభజనకు వ్యితిరేకంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లాలో ఆ పార్టీ కార్యకర్తలు గురువారం పలుచోట్ల రహదారులను దిగ్బంధించారు. మైలవరం నియోజకవర్గ పార్టీ కన్వీనర్లు జోగి రమేష్, జ్యేష్ఠ రమేష్‌బాబు నాయకత్వంలో వేర్వేరుగా విజయవాడ - చత్తీస్‌గఢ్ జాతీయ రహదారిపై వంటావార్పు చేసి రహదారిని దిగ్బంధించారు. చిల్లకల్లులో 9వ నెంబరు జాతీయ రహదారిపై కార్యకర్తలు రాస్తారోకో చేశారు. తిరువూరు, నూజివీడు, అవనిగడ్డ, చల్లపల్లి, తదితర ప్రాంతాల్లో రహదార్లను దిగ్బంధించి నిరసన తెలిపారు. కలిదిండిలో ఉద్యోగ జెఎసి ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి చిరంజీవి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
నిరసనలతో అట్టుడికిన కడప
కడప: వైకాపా సమైక్యాంధ్ర ఉద్యమ కార్యాచరణలో భాగంగా గురువారం కడప జిల్లాలో రహదారుల దిగ్బంధం జరిగింది. కడప నగరాన్ని ఆనుకుని ఉన్న జాతీయ, రాష్ట్ర రహదారుల దిగ్బంధంతో వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరి నిలిచిపోయాయి. జిల్లా వ్యాప్తంగా ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు వాహనాలు కదల్లేదు. ఇదిలావుండగా ప ప్రొద్దుటూరు, బద్వేల్, రాజంపేట, రైల్వేకోడూరు, పులివెందుల, మైదుకూరు, కమలాపురం ప్రాంతాల్లో వైకాపా నేతలు ర్యాలీలు నిర్వహించి అనంతరం రహదారులపై బైఠాయించి దిగ్బంధం చేశారు. ఇదిలావుండగా అన్ని చోట్లా రోడ్లపై వంటా వార్పూ నిర్వహించి వాహనాల డ్రైవర్లు, సిబ్బందితోపాటు ప్రయాణికులకు కూడా భోజన వసతి కల్పించారు. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కార్యక్రమం భారీ ఎత్తున జరగడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కడపతోపాటు పలు చోట్ల వైకాపా నేతలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది.
అనంతలో వైకాపా రోడ్ల దిగ్బంధం
అనంతపురం: రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జిల్లావ్యాప్తంగా గురువారం వైకాపా శ్రేణులు రహదారుల దిగ్బంధం చేపట్టాయి. ఉదయం నుంచే వైకాపా నాయకులు, కార్యకర్తలు రోడ్లపైకి చేరుకుని వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. దీంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, సమైక్యాంధ్రకు మద్దతుగా సమైక్యవాదులు నినాదాలు చేశారు. అనంతరం వైకాపా నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లాలోని కదిరి, అనంతపురం, పెనుకొండ, కదిరి, కళ్యాణదుర్గం, తాడిపత్రి, గుంతకల్లు, కొడికొండ చెక్‌పోస్టు, రాయదుర్గం, గుత్తిలో నిరసనలు మిన్నంటాయి. ఎస్కేయూ ఐకాస ఆధ్వర్యంలో యూనివర్శిటీ ప్రధాన రహదారిపై విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు.
కర్నూలులో మిన్నంటిన నినాదాలు
కర్నూలు: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక, విశాలాంధ్ర మహాసభ, సమైక్య ఐకాస ఆధ్వర్యంలో గురువారం డిగ్గీ రాజా గో బ్యాక్ అంటూ నిరసన వ్యక్తం చేశారు. దిగ్విజయ్ సింగ్ హైదరాబాదు రావడాన్ని వ్యతిరేకిస్తూ ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. కర్నూలు నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా దిగ్విజయ్ సింగ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
నినదించిన సమైక్యవాదులుసీమాంధ్రలో దిష్టిబొమ్మలు దగ్ధం
english title:
digvijay go back
Date:
Friday, December 13, 2013