డునెడిన్, మార్చి 7: దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగిన మూడు ట్వంటీ-20 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతోనూ, మూడు వనే్డల సిరీస్‌ను 3-0 తేడాతోనూ చేజార్చుకుని డీలాపడిన న్యూజిలాండ్ జట్టు తొలి టెస్టులో విజృంభించింది. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా బుధవారం డునెడిన్‌లో ప్రారంభమైన తొలి టెస్టులో ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు బౌలర్ క్రిస్ మార్టిన్ అద్భుత ప్రదర్శన కనబర్చి దక్షిణాఫ్రికా జోరుకు కళ్లెం వేశాడు. ప్రపంచంలోని ముగ్గురు ఉత్తమ బ్యాట్స్‌మన్లను కేవలం నాలుగు బంతుల వ్యవధిలో పెవిలియన్‌కు చేర్చి సఫారీలను చావుదెబ్బ తీశాడు. మార్టిన్‌కు తోడు ట్రెంట్ బౌల్ట్, డగ్ బ్రేస్‌వెల్, డేనియల్ వెటోరీ కూడా ఒక్కో వికెట్ సాధించి దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ పతనంలో తమవంతు పాత్ర పోషించారు. దీంతో దక్షిణాఫ్రికా జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు నష్టపోయి 191 పరుగులు సాధించింది. వర్షం వల్ల అంతరాయం కలగడంతో బుధవారం మ్యాచ్ 59 ఓవర్లు మాత్రమే సాగింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు కెప్టెన్ రాస్ టేలర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కెప్టెన్ గ్రేమీ స్మిత్‌తో కలిసి దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన నాన్‌స్ట్రైకింగ్ ఓపెనర్ అల్విరో పీటర్సన్ 11 పరుగులు సాధించి ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో లెగ్ బిఫోర్ వికెట్‌గా నిష్క్రమించాడు. దీంతో దక్షిణాఫ్రికా జట్టు 34 పరుగుల స్కోరు వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత ఫస్ట్ డౌన్ బ్యాట్స్‌మన్ హషీమ్ ఆమ్లా స్థిమితంగా ఆడుతూ క్రీజ్‌లో నిలదొక్కుకుని స్మిత్‌కు సహకరించాడు. దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్న స్మిత్ అర్ధ శతకాన్ని నమోదు చేసుకోవడంతో పాటు రెండో వికెట్‌కు 52 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. అనంతరం స్మిత్ (53) మార్టిన్ బౌలింగ్‌లో రోబ్ నికోల్ చేతికి చిక్కాడు. అయితే ఆ తర్వాత కొద్దిసేపటికే దక్షిణాఫ్రికా జట్టుకు మరో రెండు పెద్ద ఎదురుదెబ్బలు తగిలాయి. స్మిత్ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన జాక్ కాలిస్ (0), ఎ.బి.డివిలియర్స్ (0)లను మార్టిన్ వెంటవెంటనే పెవిలియన్‌కు చేర్చి సఫారీలను చావుదెబ్బ తీశాడు. దీంతో దక్షిణాఫ్రికా జట్టు 90 పరుగుల స్కోరుకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఈ తరుణంలో హషీమ్ ఆమ్లా, జాక్ రుడాల్ఫ్ కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే వీరి ప్రయత్నాలు ఎంతోసేపు కొనసాగలేదు. అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత ఆమ్లా 62 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద డేనియల్ వెటోరీ బౌలింగ్‌లో కివీస్ కెప్టెన్ టేలర్ చేతికి చిక్కాడు. దీంతో మళ్లీ దక్షిణాఫ్రికా వికెట్ల పతనం ప్రారంభమైంది. ఆమ్లా స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన వికెట్ కీపర్ మార్క్ బౌచర్ 4 పరుగులు సాధించి రనౌట్ రూపంలో పెవిలియన్‌కు చేరగా, అతని స్థానంలో వచ్చిన డేల్ స్టెయిన్ (9) డగ్ బ్రేస్‌వెల్ బౌలింగ్‌లో టేలర్‌కు క్యాచ్ ఇచ్చి స్వల్ప స్కోరుకే నిష్క్రమించాడు. ఆ తర్వాత రుడాల్ఫ్ (46), వెర్నోన్ ఫిలాండర్ (4) అజేయంగా నిలువడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్ల నష్టానికి (59 ఓవర్లలో) 191 పరుగులు సాధించింది.
దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగిన మూడు ట్వంటీ-20 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతోనూ,
english title:
toli test
Date:
Thursday, March 8, 2012