హైదరాబాద్, మార్చి 7: ఒలింపిక్ క్రీడల్లో ఎంతో ప్రాచుర్యం కలిగిన కబడ్డీ క్రీడను చేర్చాలని ఇటీవల పాట్నాలో జరిగిన ప్రపంచ కప్ మహిళల కబడ్డీ టోర్నమెంట్‌లో స్వర్ణ పతకం సాధించిన భారత జట్టు కెప్టెన్, హైదరాబాద్‌కు చెందిన దక్షిణ మధ్య రైల్వేలో పనిచేస్తున్న మమతా పూజారి ఆశాభావం వ్యక్తం చేసింది. కొద్ది రోజుల క్రితం పాట్నాలో ముగిసిన ప్రపంచ కప్ మహిళల కబడ్డీ తొలి టోర్నమెంట్‌లో భారత జట్టును విజయపథంలో నడిపిన మమతా పూజారికి బుధవారం ఎపి ఒలింపిక్ అసోసియేషన్, హైదరాబాద్ కబడ్డీ అసోసియేషన్ సంయుక్తంగా సత్కరించాయ. హైదరాబాద్‌లోని ఒలింపిక్ భవన్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మమతా పూజారి మాట్లాడుతూ, పపంచకప్ టోర్నమెంట్‌లో భారత జట్టు టైటిల్ విజేతగా నిలువడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఈ పోటీల్లో 16 దేశాల జట్లు పాల్గొన్నాయని, ప్రతి జట్టునుండి గట్టిపోటీని ఎదుర్కోవాల్సి వచ్చిందని, ప్రధానంగా ఇరాన్‌తో ఆడిన ఫైనల్ మ్యాచ్ మరువలేకపోతున్నామన్నారు. ఈ టోర్నమెంట్‌లో అభిమానులు కూడా తమను ఎంతో ఆదరించారని, అడుగడుగునా వెన్నుతట్టి ప్రోత్సహించారని ఆమె హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా అఖిలభారత కబడ్డీ సమాఖ్య, హైదరాబాద్ కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె.జగదీశ్వర్ యాదవ్ మాట్లాడుతూ, ఒలింపిక్స్ క్రీడల్లో కబడ్డీ క్రీడను చేర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. 2020 ఒలింపిక్ క్రీడల్లో కబడ్డీని చేర్చేందుకై త్వరలో స్విట్జర్లాండ్‌లో జరుగునున్న అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సమావేశంలో నివేదికను సమర్పించనున్నట్లు వారు తెలిపారు. ప్రతి ఒలింపిక్ క్రీడోత్సవాల్లో రెండు నూతన క్రీడలకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఆమోదముద్ర వేయనుంది. ఈ ఏడాది జరిగే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీలో కబడ్డీతోపాటు 8 క్రీడలకు సంబంధించిన నివేదికను పరిశీలిస్తారని జగదీశ్వర్ యాదవ్ తెలిపారు. ప్రపంచ కప్ మహిళల కబడ్డీ టోర్నమెంట్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన క్రీడాకారిణులకు మహారాష్ట్ర, కర్నాటక ప్రభుత్వాలు నగదు పురస్కారాలను ప్రకటించి ప్రోత్సహించాయన్నారు. హైదరాబాద్ నుండి భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించిన కెప్టెన్ మమతాపూజారి, నాగలక్ష్మీలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తగిన ప్రోత్సాహకాలను అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డా.టిఆర్‌కె.రావు మాట్లాడుతూ, రాష్ట్రంలో కబడ్డీ అభివృద్ధికి కృషిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎపి ఒలంపిక్ అసోసియేషన్ ఇన్‌చార్జి కార్యదర్శి పి.మల్లారెడ్డి, కబడ్డీ కోచ్ ధనంరెడ్డిలతోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
భారత మహిళా జట్టు కెప్టెన్ మమతా పూజారి
english title:
kabbaddi
Date:
Thursday, March 8, 2012