బ్రిటిష్ వారి పాలనా కాలంలో వివిధ సంస్థానాధిపతులు విక్టోరియా రాణిని ఆశ్రయించుకొని తమ పరిమిత రాజ్యపాలనను కాపాడుకున్నారు. అంతేకాని ఈ విక్టోరియా ఎవరు? ఈమెకు మనం ఊడిగం చేయటం ఏమిటి? అనే ఆలోచన వారికి శతాబ్దాలు గడిచినా రాలేదు.
1947వరకు స్వాతంత్య్రంకోసం గాంధీజీ నేతృత్వంలో పోరాటం సాగింది. స్వరాజ్యం వచ్చిన తర్వాత కాంగ్రెసు సంస్థను రద్దుచేయాలని గాంధీజీ భావించారు. అందుకు కాంగ్రెసువారు ఒప్పుకోలేదు. గాంధీగారి తర్వాత రాజకీయ నాయకత్వం నెహ్రూగారి చేతిలోకి వెళ్లింది. మన పాలెగాండ్రందరూ దేశవ్యాప్తంగా నెహ్రూ కుటుంబాన్ని ఆశ్రయించుకొని బ్రతకసాగారు. ఇదే స్వతంత్ర భారత చరిత్ర.
దుగ్గిరాల గోపాలకృష్ణయ్య కుటుంబ సభ్యులు ఏమైనారు? గరిమెళ్ల సత్యనారాయణ, మారేమండ రామచంద్రశాస్ర్తీ, కొడాలి ఆంజనేయులు, త్రిపురనేని రామస్వామిచౌదరి, తుమ్మల సీతారామమూర్తిచౌదరి, లాల్‌బహదూర్‌శాస్ర్తీ ఇలాంటి వారి పిల్లలంతా ఏమైనారు. మదనమోహన్ మాలవీయ, లోకమాన్య బాలగంగాధర తిలక్, గోపాలకృష్ణ గోఖలే వీరి సంతానం ఏమైనారు? ఎవరికీ తెలియదు. కేవలం ఒక నెహ్రూ కుటుంబం దేశ సార్వభౌమాధికారాన్ని అందుకున్నది- పాలించింది. శాసించింది- శపించింది. దాదాపు 60 ఏళ్లు ఒకే కుటుంబాన్ని నమ్ముకొని పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేకుండా చేశారు. ఇవ్వాళ ఇటలీ దేశంనుండి కోడలుగా వచ్చిన వ్యక్తి తన జన్మదిన కానుకగా డిసెంబరు 9వ తేదీని పురస్కరించుకొని ఇండో పాక్ విభజన లాంటి మరో విభజన చేస్తుంటే కాంగ్రెసు నాయకులలో కొందరు చంకలు గుద్దుకుంటున్నారు. ఇవ్వాళ ఓ వందమంది కౌరవులు దేశవ్యాప్తంగా సోనియాగాంధీ భజనలో జీవితం గడుపుకుంటున్నారు. వీరు అంగుష్టమాత్రులు. తాను స్వయంభువువై నాయకులుగా ఎదగలేరు. 1947కు ముందు కాంగ్రెసు చేసిన మంచి ఏమిటో ఈ తరంవారికి తెలియదు. అందువల్ల కాంగ్రెసు వృక్షం ఇక పండ్లు రాల్చే స్థితిలో లేదు. అందుకు వారు వేరే ప్రత్యామ్నాయం ఆలోచించుకోగలరా? సుశీల్‌కుమార్‌షిండే, గిరిజావ్యాస్, జయంతి నటరాజన్, నారాయణస్వామి, చిదంబరం, ఆంటో నీ, చాకో, దిగ్విజయ్‌సింగ్, కమలనాథ్, షీలాదీక్షిత్, కిల్లి కృపారాణి, పురంధీశ్వరి, పళ్లంరాజు, కావూరి సాంబశివరావు, ఎస్.ఎం. కృష్ణ, ఆస్కార్ ఫెర్నాండెజ్, మార్గెరట్ అల్వా వీరికిక రాజకీయ భవిష్యత్తులేదు. ఇదే నేటి సంక్షోభం!
డిసెంబరు 8వ తేదీ (2013)నాడు వెలువడిన ఐదు రాష్టల్ర ఎన్నికల ఫలితాలవల్ల దేశంలో కాంగ్రెసు పార్టీ ఒక ప్రాంతీయ పార్టీగా మిగిలిపోయింది. ‘కాంగ్రెసు ఓడిపోయినందుకు ఆనందిస్తున్నాను’’ అంటూ విజయవాడ ఎంపీ శ్రీ లగడపాటి రాజగోపాల్ ప్రకటించటం ఆ పార్టీలోని ధిక్కార స్వరాన్ని తెలియజేస్తున్నది. 1975 ఎమర్జెన్సీ కాలంలో ఇందిరా ఈజ్ ఇండియా- అని ఈ నాయకులు ప్రకటించారు. 1980లో ఒకనాడు శ్రీమతి సరోజినీపుల్లారెడ్డిని కలుద్దామని ఆమె ఇంటికి వెళ్లాడు. నా భర్త - నా జీవితం ఇందిరాగాంధీయే’ అని ఆమెగారు అన్నారు. దీనినిబట్టి మనవారు ఈ రాజవంశాన్ని ఎంత తీవ్రంగా ఆదరించారో తెలుస్తున్నది. మనం అక్బర్‌ను గౌరవించాము. గుంటూరులో జిన్నాటవర్ ఏర్పాటుచేశాము. ఢిల్లీలో ఒక వీధికి ఔరంగజేబుమార్గ్ అని పేరుపెట్టాము. విక్టోరియారాణికి వికటేశ్వరీదేవి అని పేరుపెట్టి వ్యాసుని పేరుతో భవిష్యత్ పురాణంలో ఒక అధ్యాయం చేర్చాము. ఎలిజబెత్, లేడీ వౌంట్‌బాటెన్, సోనియా ఇటాలియా బాంచను దొర సామి నీ కాల్మొక్తా? ఇదే ఈ భారత జాతి చరిత్ర!!
ఐతే ఈరకమైన ఒకే కుటుంబ పాలన తక్కిన చోట్ల కూడా చూడవచ్చు. యు.పి.లో ములా యం కుటుంబం, బీహారులో లల్లూ కుటుంబం, ఎ.పి.లో ఎన్.టి.ఆర్ కుటుం బం, తమిళనాడులో కరుణ కుటుంబం అనువంశిక పాలనకు శ్రీకారం చుట్టారు. ఫిలిం ఫీల్డులో ఒక నటుని కొడుకు నటుడు కావాలనుకుంటే అది వారి ఇష్టం. లాయరు కొడుకు లాయరు కావాలనుకోవటం సహజం. కాని రాజకీయాలు అలా కాదు. ప్రజాసేవ పేరుతో ఒకే కుటుంబం అధికారోన్మత్తతో దేశ సంపదను దోచుకోవటం సమర్ధనీయమేనా?? మదర్‌థెరిసా వలె వీరు కలకత్తా మురికివాడలలో ఆనువంశిక సేవాకార్యక్రమాలు చేపట్టవచ్చుకదా!!
ఢిల్లీలో ఉమాశంకర దీక్షిత్ అనే ప్రసిద్ధ రాజకీయ నాయకుడు ఉండేవారు. వారి కుటుంబానికి చెందిన వ్యక్తియే శ్రీమతి శీలాదీక్షిత్. ఆమె సమర్ధవంతంగా ఢిల్లీని అభివృద్ధిచేసిందని నిష్పాక్షికంగా ఉన్న విమర్శకులు చెప్పారు. అయితే అందరిలాగే ఆమెకూ ఆనువంశిక పాలనా లక్షణం సంక్రమించింది. తన కొడుకు సాందీప్ దీక్షిత్‌ను ఎఐసిసి నాయకుణ్ణి చేసింది. అతడు ఎంతవరకు వెళ్లాడంటే తెలుగుదేశానికి చెందిన ఒక ఎం.పి.ని చంపేస్తానని ఢిల్లీ వీధులల్లో తిరుగనివ్వను అని బెదిరించాడు. ఫలితంగా ఢిల్లీ అసెంబ్లీకి డిసెంబరు 2013లో జరిగిన ఎన్నికలలో అక్కడి ఏడు లక్షల మంది తెలుగువారు కాంగ్రెసుకు వ్యతిరేకంగా ఓటువేశారు. శ్రీమతి శీలాదీక్షిత్ కూడా చాలా దారుణంగా ఓడిపోయింది.
మధ్యప్రదేశ్‌లో బిజెపి విజయానికి కారణం దిగ్విజయ్‌సింగ్ అంటే ఎవరూ నమ్మలేదు. కాని ఇది నిజం గ్వాలియర్ రాజవంశానికి చెందిన జ్యోతిరాదిత్య సింధియాను ముఖ్యమంత్రి చేయాలని కాంగ్రెసు అధిష్టానం ఆలోచించింది. ఇతడు మాధవరావు సింధియా కొడుకు. ఆయన గ్వాలియర్ రాజమాత విజయరాజ సింధియా కొడుకు. ఇదొక రాజకుటుంబ పాలన. అయితే దిగ్విజయ్‌సింగ్ తన కొడుకు కోసం జ్యోతిరాదిత్యను బలహీనపరచాడనే వార్తలు అందాయి. పితృవాత్సల్యం అలాంటిది మరి!! ఎపి విభజనలో కీలక పాత్ర పోషిస్తున్నది ఈయనగారే.
బ్రిటిష్ వారి పాలనా కాలంలో వివిధ సంస్థానాధిపతులు
english title:
queen victoria
Date:
Thursday, December 19, 2013