మన దేశానికి స్వాతంత్య్రం లభించిన తరువాత రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ ఆనాడు క్లిష్ట సమస్యగానే ఉంది. మన దేశంలో 560 సంస్థానాలుండేవి. అదృష్టవశాత్తు సమర్థవంతమైన నాయకత్వం ఉండ టం జాతీయ ఉద్యమంలో ప్రధాన పాత్రధారులైన సర్దార్‌వల్లభాయ్ పటేల్ హోం మంత్రిగా ఉండటం, బి.పి.మీనన్ లాంటి అంకితభావం కలిగిన అధికారులుండటం దేశం అదృష్టంగా భావించాలి. వారి అంకిత స్వభావాన్ని అనుమానపడే మనుషులు ఆనాడు లేరు. అందుకే ఆనాటి దేశ నిర్మాణం సులభసాధ్యమైంది.
ఏకీకరణ అంటే చినిగిన కాగితాన్ని అంటుపెట్టటం లాంటిది కాదు. ఎన్నో విషయాలను గమనంలోకి తీసుకోవాలి. అయినా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణను లోతుగా అధ్యయనం చేశారు. రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ కమిటీలను ఏర్పాటుచేశారు. ప్రజాపోరాటాల వలననో ఇతర ఒత్తిడుల వలననో భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. రాష్ట్రాలను రూపొందించటంలో కేవలం ఒకే భాష అనే ప్రాతిపదిక మాత్రమే కాకుండా ఆర్థిక, భౌగోళిక భౌతిక పరిస్థితులను కూడా గమనంలోకి తీసుకుంటే అది ఎంతో శాస్ర్తియంగా ఉండేది. రాష్ట్రాలను రూపొందించటం భావోద్వేగ దృష్టికోణంతో మాత్రమే కాదు. ఆ ప్రాంత ప్రజల నేపథ్యాన్ని గమనంలోకి తీసుకోవాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడటంలో కూడా అదే తొందరపాటు జరిగిందా? అన్న అనుమానం వస్తున్నది. సర్కారు జిల్లాలు, తెలంగాణ జిల్లాలు, రాయలసీమ జిల్లాలు...ఈ మూడు ప్రాంతాలను కలిసి ఒక రాష్ట్రంగా ఏర్పాటు చేశారు సర్కారు జిల్లాల పరిస్థితి వేరు. బ్రిటిష్ ప్రభుత్వం రాజనీతి పాలన వలన ఎన్నో సాగునీటి ప్రాజెక్టులు వచ్చాయి. ఆనాడు సంపద ఉత్పత్తికి నీరే ప్రధానం. కాబట్టి సహజ వనరులను ఉపయోగించుకుని సర్కారు జిల్లాలు అభివృద్ధి చెందాయి. సంపద సృష్టించి ఆ సంపదను ఇతర రంగాల్లో పెట్టుబడి పెడితే తిరిగి సంపద సంపదను సృష్టిస్తుంది. ఆ సంపద పంపిణీ కాకుంటే పెట్టుబడిదారి వ్యవస్థకు కారణభూతమవుతుంది. ఆ సంపద కారణంగా అభివృద్ధికి బదులుగా అంతరాల సృష్టికూడా జరుగుతుంది. పెత్తందార్లు తమ పెట్టుబడిని వృద్ధిచేసుకునేందుకై లాభాలు వచ్చే రంగంలోకి వెళతారు. దాని ప్రభావం ఇతర రంగాలపై పడుతుంది. కేవలం ఈ కారణం వల్లనే విద్య, వైద్యరంగాలపై పెట్టుబడిదారి ప్రభావం తీవ్రంగా కనిపిస్తున్నది.
అదే తెలంగాణ భూస్వామ్య వ్యవస్థ క్రింద ఉన్న ప్రాంతం. చుట్టూ వనరులుంటాయి. ఫ్యూడల్ వ్యవస్థలో వనరులను వినియోగ వస్తువులుగా చేయకపోవటం వలన దరిద్రం సహజంగానే తిష్టవేసుకునే ఉంటుంది. ఇతర ప్రాంతాల మాదిరిగా తమ జీవన ప్రమాణం ఎందుకు పెరగటంలేదని ఆలోచించే వ్యక్తులు ఈ సమయంలోనే బయటకు వస్తారు. ఆ ఆలోచనలే ఎదిగి ఉద్యమాలుగా మారుతాయి. ఆ ఉద్యమమే తిరిగి సాయుధ పోరాటంగా మారింది. వనరులను వినియోగ వస్తువుగా మార్చుకునేందుకు పోరాటాలు వస్తా యి. దానివలన ప్రజలు త్యాగాలకు సిద్ధపడ్డారు. రాయలసీమలో వనరులు పరిమితంగా ఉన్నాయి. అక్కడ కూడా భూస్వామ్య వ్యవస్థ ఉంది. దీనివల్లనే అంతరాలు బాగా పెరిగాయి. బ్రిటిష్ పాలనలో ఉండటం వలన దారిద్య్రం ఉన్నప్పటికినీ క్రిస్టియన్ మిషనరీల వలన కొద్దోగొప్పో విద్యావ్యాప్తి జరిగింది. ఆ విద్యావ్యాప్తిలో కొన్ని ఉద్యోగాలు సంపాదించటంవల్ల కొంత ఉపశమనం కలుగుతుంది. బ్రిటిష్ ప్రభుత్వం మన వ్యవస్థలో అంతరాలను అలాగే ఉంచి ప్రజాపోరాటాలు రాకుండా జాగ్రత్తవహించారు. ఈ మూడు నేపథ్యాలు వేరు. అంతరాలు గల గ్రేడెడ్ సమాజం విషయంలో మూడు ప్రాంతాలు ఒకటేనని చెప్పవచ్చును.
ఒక ప్రాంతం వనరులను వినియోగించుకోవటం వల్ల దారిద్య్ర నిర్మూలనలో కొద్ది చలనం వచ్చింది. అభివృద్ధి సాధ్యమైంది. మరోప్రాంతంలో వనరులున్నా తిష్ట వేసిన దారిద్య్రం పోరాటాలకు దారితీసింది. మన రాష్ట్రంలో అశాంతి చెలరేగడానికి ఇదే ముఖ్య కారణం. ఈ అరవై సంవత్సరాల కాలంలో సాంకేతిక రంగంలో పెద్ద ఎత్తున వనరులను వినియోగ వస్తువులుగా మార్చే సాంకేతిక పరిజ్ఞానం రావటంవలన సంపద సృష్టించబడుతున్నది. ఆ సంపద అందరికీ అందలేదు. సమాజంలో అంతరాలు పెరుగుతూ వచ్చా యి.
ఒక ప్రాంతం పోరాటాలకు త్యాగాలకు అలవాటుపడింది కాబట్టి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ఎగయటానికి దోహదపడింది. దీనివల్ల ఇతర ప్రాంతాలలో అంతరాలు లేవని కాదు. తెలంగాణ పోరాట నేపథ్యం ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపిస్తుందనే భయంతో కొన్ని ఆధిపత్య శక్తులు, తమ స్వార్థ ప్రయోజనాలకోసం వూహాజనితమైన భావాలను ప్రచారంచేసి తమ కట్టడాలను కాపాడుకుంటారు. మరి వూహాజనిత భావాలు నీటి బుడగల మాదిరిగా ఎప్పుడైనా కొట్టుకుపోతాయి. తెలంగాణ రాష్టస్రాధన ఉద్యమం అన్ని ప్రాంతాలకు అక్కడి కష్టజీవులకు ఆదర్శంగానే నిలుస్తాయి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం వెనుక అనేక చారిత్రక కారణాలున్నాయ. వెనుక బాటుతనం, అన్ని రంగాల్లో తాము అభివృద్ధ చెందకపోవడం, వంటి కారణాలు తెలంగాణ ప్రజలను ఉద్యమ పథాన్ని ఎంచుకునేలా చేశాయ.
ఉద్యమానికి దారితీసిన ‘మూలకారణం’ లో నిజాయతీ ఉన్నప్పుడు అది విజయవంతమై తీరుతుంది. తెలంగాణ ఉద్యమమే అందుకు ఉదాహరణ.
మన దేశానికి స్వాతంత్య్రం లభించిన
english title:
sampada
Date:
Thursday, December 19, 2013