బ్రిటన్ తదితర విదేశాల దురాక్రమణనుండి మన దేశానికి భౌగోళిక విముక్తి దశలవారీగా జరిగింది! క్రీస్తుశకం 1947 ఆగస్టు 15వ తేదీన విముక్తి లభించడం ‘ప్రతీక’ మాత్రమే. తెలంగాణ, కర్నాటకలోని మహారాష్టల్రోని కొన్ని ప్రాంతాలు కలిసిన హైదరాబాద్ ప్రాంతానికి 1948 సెప్టెంబర్ 17వరకు స్వాతంత్య్రం లేదు! సుభాష్ చంద్రబోస్ 1943లో అండమాన్ దీవులను ఈశాన్యంలోని కొన్ని ప్రాంతాలను బ్రిటిష్‌వారి నుండి విముక్తం చేయగలిగాడు. 1943 అక్టోబర్ 21న రాసవిహారీ వసు అధ్యక్షుడుగా, సుభాస్ చంద్రబోస్ ప్రధానమంత్రిగా స్వతం త్ర ప్రభుత్వం కూడ ఏర్పడింది! ఈ ప్రభుత్వాన్ని జపాన్ గుర్తించింది కూడ! బ్రిటిష్ వారు గుర్తించని ప్రథమ ప్రధానమంత్రి సుభాస్‌చంద్రబోస్... బ్రిటిష్‌వారు గుర్తించలేదు కాబట్టి స్వతంత్ర భారతీయ చరిత్రకారులు సైతం గుర్తించకపోవడం కొనసాగుతున్న భావ దాస్యానికి చిహ్నం! భౌగోళిక స్వాతం త్య్రం లభించినప్పటికీ భావదాస్య విముక్తికోసం ఇప్పటికీ పోరాటం నడుస్తూనే ఉంది. ఈ పోరాటానికి జాతీయ సమగ్రతా సాధకుడు సర్దార్ పటేల్ కేంద్ర బిందువు కావడం నడుస్తున్న చరిత్ర! డిసెంబర్ 15వ తేదీన సర్దార్ పటేల్ వర్ధంతి అన్న విషయం జాతీయ సమాజానికి అకస్మాత్తుగా స్ఫురించడం శుభ పరిణామం. 1875 అక్టోబర్ 31న జన్మించిన వల్లభభాయి ఝవేర్ భాయ్ పటేల్ జీవితం భారత జాతీయ భౌగోళిక సమగ్రతకు ప్రతీక, జాతీయ సాంస్కృతిక సమైక్యభావ కాంతి కళిక! కానీ ఆయన పుట్టినరోజును సైతం పెద్దగా పట్టించుకోక పోవడం అరవై దశాబ్దుల జాతీయ వైపరీత్యం! ఇప్పుడు పుట్టిన రోజును మాత్రమే కాదు, పరమపదించిన రోజును సైతం కోట్లాది మంది గుర్తుచేసుకోవడం దేశ చరిత్రకు జరిగిపోయిన అన్యాయాలను సవరించడానికి శ్రీకారం కాగలదు! సర్దార్ వర్ధంతి రోజున దేశమంతటా దాదాపు పదకొండువందల చోట్ల సమైక్యతకోసం పరుగు పందాలను నిర్వహించారట! పాఠశాలల విద్యార్థులు కళాశాలల విద్యార్థులు ఇతరేతర యువతీ యువకులు లక్షల సంఖ్యలో ‘వల్లభ మంత్రి’ స్ఫూర్తితో పరుగులు తీయడం మరుగున పడిన స్ఫూర్తిని మళ్లీ నిలబెట్టడం! ఉక్కు నరాలు ఇనుప కండరాలు వజ్ర సంకల్ప నిబద్ధులైన యువజనుల గురించి వివేకానందస్వామి ఆకాంక్షించాడు. ఆయన ఆకాంక్షకు సాకారం సర్దార్‌పటేల్ జీవన ప్రస్థానం! సర్దార్‌పటేల్ జన్మించే నాటికి వివేకానందుడైన నరేంద్రుడు పనె్నండేళ్ల వాడు! వివేకానందుడు మరణించే నాటికి వల్లభ భాయి ఇరవై ఆరేళ్ల యువకుడు!
ఆయన భారత జాతీయ సామాజిక క్షేత్రమంతటా సంచరించకపోయి ఉంచినట్టయితే బ్రిటిష్ దురాక్రమణదారులు వెళ్లిపోయిన తరువాత వారి భౌగోళిక విభజన షడ్యంత్రం కొనసాగి ఉండేది. భారతదేశం మధ్యలో అనేక స్వతంత్ర దేశాలు వెలసి ఉండేవి! ఒక వ్యక్తి శరీరంలో మరో ప్రాణి మొలచినట్టయితే అది పురుగవుతుంది, అది పుండవుతుంది! భారత మాతృదేవి శరీరమంతటా ఈ విచ్ఛిన్నకరమైన స్వతంత్ర దేశాలనే పురుగులు పుండ్లు ఏర్పడకుండా నిరోధించగలిగిన సహజసిద్ధ వైద్యుడు వల్లభభాయి పటేల్! బ్రిటిష్ సామ్రాజ్యవాదులు భారతదేశాన్ని దురాక్రమించిన తరువాత రెండుగా విభజించి పెత్తనం చెలాయించారు! యాబయి ఐదు శాతం భూభాగాన్ని బ్రిటిష్‌వారు స్వయంగా పాలించారు. ఈ భూభాగంపై దేశంలోని డెబ్బయి శాతం ప్రజలు నివసించారు. మిగిలిన ముప్పయి శాతం ప్రజలు నివసించిన నలబయిఐదు శాతం భూభాగాన్ని బ్రిటన్ పరమోన్నత అధికార- పారవౌంటసీ- పరిధికి లోబడిన స్వదేశీయ పాలకులు పాలించారు. బ్రిటన్ ప్రత్యక్ష దురాక్రమణలోని భూభాగాన్ని ‘ప్రాంతాలు’- ప్రావెనె్సస్-గా విడగొట్టారు. వీటిపై గవర్నర్లు పెత్తనం వహించారు. స్వదేశీయ పాలకుల పెత్తనం వహించిన భూభాగం సంస్థానాలు- స్టేట్స్-గా విడిపోయింది. 1947కు పూర్వం బ్రిటిష్ పాలిత దేశం మధ్యలో ఇలాంటి సంస్థానాలు దాదాపు ఐదువందల అరవై ఐదు ఉండేవి. బ్రిటిష్‌వారు తమ నిష్క్రమణకు పూర్వం ఈ ‘సంస్థానాల’ను అన్నింటినీ దేశంలో విలీనం చేయాలి! దానివల్ల ఒకే భారత స్వతంత్ర దేశం ఏర్పడుతుంది. కానీ అలాచేయడంవల్ల కొత్తగా స్వతంత్రం పొందే దేశం ‘సమస్యల’నుండి విముక్తం అవుతుంది. అలా ‘సమస్యలు’ లేని భారతదేశం అగ్రరాజ్యంగా ఎదుగుతుంది. భారతదేశం అగ్ర రాజ్యంగా ఎదగడం పాశ్చాత్యులకు నచ్చని పరిణామం!
అందువల్లనే బ్రిటిష్‌వారు అవశేష భారతదేశాన్ని 1947లో మళ్లీ విభజించారు. భారతదేశంనుండి గాంధారం, బర్మా, శ్రీలంక, మాల్‌దీవులు, నేపాల్, భూటాన్ వివిధ సమయాలలో విడిపోవడం బ్రిటన్ దురాక్రమణ ఫలితం. అందువల్ల 1947నాటికే అఖండ భారతదేశం ‘అవశేష భారతం’గా మారింది. ఈ అవశేష భారతం మధ్యలో ఈ వందలాది స్వతంత్ర సంస్థానాలు! ఇదీ 1947నాటి స్థితి! అవశేష భారతదేశాన్ని మళ్లీ విడగొట్టి 1947 ఆగస్టు 14న పాకిస్తాన్‌ను ఏర్పాటుచేశారు! పరస్పరం కలహించుకుంటూ ఈ కలహాలకోసం పెద్దఎత్తున సైనిక వ్యయం చేస్తున్న భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, బర్మా, శ్రీలంక, మాల్ దీవులు, అఫ్ఘానిస్తాన్, నేపాల్, భూటాన్‌లు అనాదిగా ఉండిన రీతిలోనే ఒకే దేశంగా ఉండి ఉంటే ఈ అఖండ భారతదేశం చైనాకంటె పెద్దదిగా ఉండేది! యుద్ధ్భయం లేని ఈ అఖండ భారతం ఈ సైనిక వ్యయాన్ని సంక్షేమంకోసం, ఆర్థిక ప్రగతికోసం వెచ్చించగలిగి ఉండేది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సార్వభౌమ దేశంగా ఎదిగి ఉండేది! కానీ అది జరగకుండా బ్రిటిష్ సామ్రాజ్యవాదులు శాశ్వతమైన ఏర్పాటుచేసి పోయారు!! మిగిలిన ‘్భరత్’ మధ్యలో ఈ సంస్థానాలను నెలకొల్పిపోయారు! ఈ సంస్థానాలు కూడ స్వతంత్ర దేశాలుగానో, బ్రిటిష్ పాలనలోవలె అర్ధ స్వతంత్ర దేశాలుగానో ఉండి ఉంటే మన దేశం మరింత బలహీన పడి ఉండేది! అలా జరగకుండా నిరోధించినవాడు సర్దార్‌పటేల్! ‘అవశేష దేశ’ విభజనను ఆపలేక పోయినప్పటికీ ఖండిత భారత్‌లో మళ్లీ ఐదువందలకు పైగా స్వతంత్ర దేశాలు ఏర్పడకుండా నిరోధించగలిగాడు!! సర్దార్ పటేల్ లేకపోయినట్టయితే అనేకానేక సంస్థానాలు ‘యధాతథ’స్థితి- స్టాండ్ స్టిల్- ఒప్పందాన్ని అడ్డుపెట్టుకొని స్వతంత్ర దేశాలుగా ఉండేవి! ఈ‘సంస్థానాలు’ భారత్‌లో కాని పాకిస్తాన్‌లో కాని విలీనం కావచ్చునని లేదా, ‘స్టాండ్ స్టిల్’ ఒప్పందం ప్రాతిపదికగా స్వతంత్రంగా ఉండవచ్చునని బ్రిటిష్ దోపిడీదారులు చెప్పిపోయారు! సర్దార్‌పటేల్ కాక జవహర్‌లాల్‌నెహ్రూ స్వయంగా ఈ సంస్థానాలను భారత్‌లో విలీనంచేసే ప్రక్రియను ఆరంభించి ఉంటే ‘జమ్మూకాశ్మీర్’ తరహా సమస్యలు మరిన్ని ఏర్పడి ఉండేవి. జమ్మూకాశ్మీర్‌కు ‘ప్రత్యేక ప్రతిపత్తి’కట్టబెట్టడంవల్లనే అక్కడ సర్వమత సమభావ వ్యవస్థకు విఘాతం ఏర్పడింది, జిహాదీ బీభత్సకాండ పెరిగింది! దేశంలోని అన్ని సంస్థానాలనూ విలీనం చేయగలిగిన, పటేల్‌కు జమ్మూకాశ్మీర్ వ్యవహారంలో మాత్రం నెహ్రూ అడ్డుతగలడమే ఇందుకు కారణం! పటేల్ మాటను నెహ్రూ పట్టించుకోని మరో వ్యవహారం చైనా టిబెట్‌ను దురాక్రమించడం!!
పటేల్ మాట చెల్లిన వందలాది సంస్థానాల విలీనం విషయంలో విలీనం తరువాత ఎలాంటి సమస్యలూ ఏర్పడలేదు! కాశ్మీర్, టిబెట్ వ్యవహారాలలో నెహ్రూ మాట చెల్లింది. ఒకటి ఆంతరంగిక కల్లోలానికి కేంద్రమైపోయింది. రెండవది బాహ్య ప్రమాదాలకు ఆలవాలమైపోయింది. చైనా దురాక్రమణను నిరోధించడానికై మన దేశం సహాయంకోసం టిబెట్ ఎదురుచూస్తోంది- అని పటేల్ వ్రాసిన ఉత్తరానికి సమాధానంగా, ‘‘టిబెట్ స్వాతంత్య్రం చచ్చిపోయింది...’’అని జవహర్‌లాల్ సమాధానం చెప్పడం చరిత్ర! జమ్మూకాశ్మీర్‌ను పూర్తిగా విముక్తంచేయాలని, పాకిస్తాన్ దురాక్రమణ అంతమయ్యేవరకు యుద్ధంచేయాలని పటేల్ భావించాడు. కానీ మూడవ వంతు కాశ్మీర్ పాకిస్తాన్ దురాక్రమణలో మిగిలి ఉండిన సమయంలోనే నెహ్రూ యుద్ధాన్ని ఆపుచేయించాడు! పాకిస్తాన్‌తో వివాదాన్ని ఐక్యరాజ్యసమితికి నివేదించి అంతర్గత సమస్యను అంతర్జాతీయ వేదికలకెక్కించాడు!! ఈ ‘ఐక్యరాజ్యసమితి’జోక్యాన్ని పటేల్ నిరసించాడు, కాశ్మీర్ విషయంలో నిరోధించలేక పోయినప్పటికీ హైదరాబాద్ సంస్థానం విషయంలో మాత్రం ‘ఐక్యరాజ్యసమితి’ రంగప్రవేశం చేయకుండా ‘ఉక్కుమనిషి’ అడ్డుకోగలిగాడు! అంతర్గత సమస్యలను పనికట్టుకొని అంతర్జాతీయపు రచ్చలకెక్కించడం నేలవిడిచి సాముచేయడం వంటిది! నెహ్రూ ఇలా నేల విడిచి సాము చేసినట్టు ఆయనకు అత్యంత సన్నిహితుడైన అప్పటి ఆంగ్లేయ గవర్నర్ జనరల్ వౌంట్ బాటన్ సైతం మహాత్మాగాంధీ వద్ద వ్యాఖ్యానించాడట! ‘‘వల్లభభాయి పటేల్ కాళ్లు భూమి మీద ఉన్నాయి, జవహర్‌లాల్ నెహ్రూ కాళ్లు ఎప్పుడూ మేఘాలలో ఉంటాయి...’’ అని వౌంట్ బాటెన్ గాంధీజీతో చెప్పినట్టు మణిబెన్‌పటేల్ తమ ‘దినచర్య’ డైరీలో వ్రాసుకున్నారు! మణిబెన్ వల్లభభాయిపటేల్ కుమార్తె! కానీ పటేల్ మాత్రం ‘తెల్లబొల్లి’ ప్రశంసలకు పొంగిపోలేదు! అందుకే జునాగఢ్ నవాబును ‘మంచి’చేసుకోవాలన్న వౌం ట్ బాటన్ మాటను సర్దార్ పట్టించుకోలేదు! పోలీసు చర్య ద్వారా మాత్రమే లొంగి వస్తాడన్న పటేల్ విధానం విజయవంతమైంది! ‘‘ఆయన ఇష్టంవచ్చినట్టు చేసుకోమనండి...’’ అని వౌంట్ బాటన్‌కు పటేల్ హెచ్చరిక కూడ చేయగలిగాడు. ఈ హెచ్చరిక చేసిన మరుసటి రోజుననే వౌంట్‌బాటన్, 1947 నవంబర్ 11న, ఢిల్లీనుండి లండన్‌కు వెళ్లిపోయాడు! మళ్లీ రాలేదు! రాజగోపాలాచారి గవర్నర్ జనరల్ అయ్యాడు!!
నిరాయుధ ఉద్యమంతోపాటు సాయుధ సమరం కూడ భారత స్వాతంత్య్ర సాధన లక్ష్యం సమగ్రం కావడానికి దోహదం చేయడం చరిత్ర! ఈ చరిత్రను సృష్టించిన వాడు సర్దార్‌పటేల్! ‘‘చరిత్రను వ్రాస్తూ కాలాన్ని వృధాచేయడం కంటె చరిత్రను నిర్మించడానికి శ్రమించడం కర్తవ్యం...’’ అన్నది తోటి భారతీయులకు పటేల్ ఇచ్చిన సందేశం! మహాత్మాగాంధీ సంపూర్ణ నిరాయుధవాది! ‘అహింస’ ఆయన ఏకైక ఆయుధం! నేతాజీ సంపూర్ణ సాయుధ సమరవాది! ఈ మహనీయుల మార్గాలను సమన్వయం చేసిన ఆచరణశీలి పటేల్! నిరాయుధమా? సాయుధమా? అన్న మీమాంసకు ఆయన దూరం! అందుకే జునాగఢ్‌కు, హైదరాబాద్‌కు సాయుధ మార్గంలోనే స్వాతంత్య్రాన్ని ప్రసాదించాడు!! ఆ తరువాత గోవా కూడ సాయుధ సమరం ద్వారానే స్వతంత్రమై దేశంలో మళ్లీ కలిసిపోయింది...
విశ్లేషణ
english title:
vishleshana
Date:
Thursday, December 19, 2013