శ్రీకాకుళం, డిసెంబర్ 16: గత నాలుగు నెలలకు పైగా సమైక్యాంధ్ర కోరుతూ సిక్కోలు వాసులు ఉద్యమిస్తూనే ఉన్నారు.వీరు చేస్తున్న ఆందోళనలను పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా విభజనను ఆమోదించి..టి.బిల్లు సిద్ధం చేయడమే కాకుండా అసెంబ్లీలో కూడా ప్రవేశపెట్టడంపై సమైక్యవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఒక్కసారిగా టి.బిల్లుపై నిరసన జ్వాలలు ఎగిసాయి. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు రెండు నెలలుగా జీతాలు కాదు..జీవితాలే ముఖ్యమంటూ అర్ధాకలితో చేసిన ఉద్యమాన్ని యుపిఏ లెక్కచేయకపోవడం దారుణమంటూ ఆవేదన చెం దుతున్నారు. దౌర్జన్యంగా రాష్ట్రాన్ని విభజించేందుకు ఆగమేఘాల మీద చర్యలు చేపడుతున్నా నిమ్మకునీరెత్తినట్లుఉన్న సీమాంధ్ర ప్రజాప్రతినిధుల తీరును ఎండగడుతున్నారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా టి.బిల్లు ప్రతులను తగలబెడుతూ సోనియా గో బ్యాక్ అంటూ నినాదాలతో పాటు సమైక్య నినాదాలు మిన్నంటాయి. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు పలువురు సమైక్యవాదులు సమైక్య పరిరక్షణ వేదిక సారథ్యంలో నిరసనల పర్వం కొనసాగించారు. దిష్టిబొమ్మల దగ్ధం, పలు ప్రధాన కూడళ్ల వద్ద మానవహారాలు, రాస్తారాకోలు, ర్యాలీలతో ఆందోళన చోటుచేసుకొంది. ఇదిలా ఉండగా పట్టణంలో కేంద్ర ఐటి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి కిల్లి కృపారాణి క్యాంపు కార్యాలయాన్ని సమైక్య వాదులు ముట్టడించి ఆందోళన చేపట్టారు. సిగ్గులేని కేంద్రమంత్రులు అంటూ నినాదాలు చేస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థి ఐక్య కార్యాచరణ కమిటీ నేతలు రెండు రోజులుగా చేపట్టిన రిలే నిరాహారదీక్షలతో పాటు సోమవారం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ జిల్లా శాఖ పిలుపుమేరకు మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణతో పాటు పార్టీ జిల్లా అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి సారథ్యంలో పార్టీ కార్యకర్తలు ఏడురోడ్ల కూడలి వద్ద ధర్నా చేపట్టారు. సోనియా గో బ్యాక్, ఇటలీ గో బ్యాక్ అంటూ నినాదా లు చేస్తూ టి.బిల్లుకు రాష్టప్రతి 40 రోజులు సమయం ఇచ్చినా సభలో హడావిడిగా ప్రవేశపెట్టడం కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంలో భాగమే అన్నారు. అంబేద్కర్ జంక్షన్ వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు జిల్లా కమిటీ సారథ్యంలో సమైక్య ర్యాలీ చేపట్టారు. మానవహారంగా ఏర్పడి సమైక్య నినాదాలు చేశారు. టి.బిల్లును దగ్ధం చేసి నిరసన వ్యక్తంచేశారు. అలాగే పలు మండల కేంద్రాల్లో సమైక్యవాదులు తమ నిరసనలను వ్యక్తంచేశారు.
* భక్తులకు 18 నుంచి సాంస్కృతిక కనువిందు
ఆదిత్యుని సన్నిధిలో.. ఆధ్యాత్మిక సంరంభానికి రంగం సిద్ధం
శ్రీకాకుళం, డిసెంబర్ 16: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి సూర్యనారాయణస్వామివారి దేవస్థానంలో మహాకుంభాభిషేక, మహాసౌరయాగ సంస్కృతి సంరంభానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 18 నుండి ప్రతిరోజు ఉద యం ఆలయ మండపాల్లో యాగపూజలు జరుగనున్నా యి. అదేవిధంగా భక్తులకు ఆహ్లాదాన్ని చేకూర్చడానికి ఇంద్రపుష్కరిణి ఆవరణలో ప్రత్యేక వేదికను ఏర్పరచి హరికథ, నాట్య, లలితగాన, పౌరాణిక నాటకాలు తదితర ప్రదర్శించనున్నారు. ఆలయ ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ నేతృత్వంలో కమిటీ బుధవారం నుండి ఈ నెల 30వ తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం ప్రదర్శించనున్న సాంస్కృతిక కార్యక్రమాలను ప్రణాళిక రూపొందించారు. భక్తులంతా ఈ అరుదైన కార్యక్రమాలను వీక్షించి జయప్రదం చేయాలని కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు. వివరాలివే..
18వ తేదీ సా. 5.30 గంటలకు జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ కార్యక్రమాల్ని ప్రారంభించనున్నారు. అనంతరం పర్లాఖిమిడి, విజయనగరం, శ్రీకాకుళానికి చెందిన రేడియో కళాకారులు ఇనపకుర్తి మన్మథరావు, సుందరంపల్లి శ్రీనివాసరావు, అన్నవరపు శ్రీనివాసరావు, ఎం.లోకేశ్వరరావులచే సెక్సోఫోన్ కచేరి జరుగుతుంది. రాత్రి ఏడు గంటలకు కృష్ణా జిల్లాకు చెందిన టి.వి.రేడియో కళాకారిణి విన్నకోట రామకుమారిచే హరికథా గానలహరి. 19వ తేదీన రేడియో కళాకారులు జగ్గారావు, దుంపల ఈశ్వరరావులచే క్లార్‌నెట్ కచేరి. రాత్రి ఏడు గంటలకు జిల్లా కళాకారులచే కురుక్షేత్రంలోని ఔద్ధత్యభంగం నాటకం ప్రదర్శిస్తారు. 20వ తేదీ పి.సాయిజ్యోతిచే కూచిపూడి నాట్యం. అనంతరం ఆదిత్య వైభవం భక్తి సంగీత కార్యక్రమాలు జరుగుతాయి. 21వ తేదీన హైదరాబాద్‌కు చెందిన భాగవతుల సేతురామ్-వనజ ఉదయ్‌లచే గిరిజా కల్యాణం. 22వ తేదీన సాయంత్రం సాయిశివ నృత్యకళానికేతన్, నృత్యదర్శకులు శివకుమార్ శిష్యబృందంచే భారతనాట్యం, అనంతరం రఘుపాత్రుని శ్రీకాంత్, శిష్యబృందంచే విఘ్నేశ్వర స్తుతి, శక్తిస్వరూపిణి, శివతాండవం, ఆదిత్యుని ఏకాంత సేవ నృత్యరూపకాలు. 23న చెన్నైకు చెందిన రాజేష్ వైద్యచే వైణిక నాథ సమ్మేళనం వీణా నైపుణ్యప్రదర్శన. ఈయన పలు సినిమాలకు సంగీతం సమకూర్చారు. 24వ తేదీన విశాఖపట్నంకు చెందిన చైతన్య సోదరులచే వాగ్నేయ వైభవం భక్తి సంగీత విభావరి కార్యక్రమం. రాత్రి ఎనిమిది గంటలకు చింతామణి నాటకంలో అనుభూతి పరివర్తన ఘట్టం ప్రదర్శిస్తారు. 25న సాయంత్రం హైదరాబాద్ రేడియో ఆర్టిస్టు పప్పు పద్మప్రసన్నచే వీణావాద కచేరి అనంతరం సినీ సంగీత దర్శకులు ఎస్.వాసురావు ఆధ్వర్యంలో భక్తిసంగీతలహరి. 26వ తేదీ రాత్రి కంచికామకోటి పీఠం ఆస్థాన విధ్వాంసులు, మావుడూరు సత్యనారాయణశర్మచే నవవాద్య తరంగణి ఉంటుంది. 27న శ్రీమద్రామాయణ విశేషాలు, భక్తజన వర్ధనం, భక్తకుచేల హరికథ. అనంతరం బండారు చిట్టిబాబుచే లలిత సంగీతం. 28న కిల్లి పరిమలచే భరతనాట్యం అనంతరం భక్తిసంగీత విభావరి జరుగుతుంది. 29న హైదరాబాద్‌కు చెందిన పెరవళి జయభాస్కర్ బృందంచే కర్ణాటక స్వరలయ సుధావాద్య సమ్మేళనం , రాత్రి 8.30 గంటలకు సీతారామ కల్యాణం నాటకం. 30న కర్ణాటకకు చెందిన లక్ష్మీగురురాజ్‌చే మువ్వలసవ్వడి భరతనాట్య ప్రదర్శన ఉంటుంది.ఈ కార్యక్రమాలన్నింటినీ ప్రముఖులు ప్రారంభిస్తారు.
త్వరలో శాశ్వత ఆధార్ కేంద్రాల ఏర్పాటు
శ్రీకాకుళం, డిసెంబర్ 16: జిల్లాలో శాశ్వత ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ తెలిపారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సోమవారం కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి ఒకటవ తేదీ నుండి అన్ని మం డల కేంద్రాల్లో, శ్రీకాకుళం పురపాలక సంఘంలో ఆరు కేంద్రాలు పనిస్తాయన్నారు. ఆధార్‌కార్డులు ఇప్పటివరకు నమోదు చేయించుకున్నవారు చేర్పులు మార్పులు ఈ కేంద్రంలో చేయించుకోవచ్చునని తెలిపారు. మీసేవా కార్యక్ర మం గూర్చి మాట్లాడుతూ వచ్చే విద్యాసంవత్సరానికి కళాశాలలో, పాఠశాల విద్యార్థుల తాకిడి మే, జూన్ నెలల్లో అధికంగా ఉం టుందని, ఇప్పటి నుండే విద్యార్థులకు కుల, ఆదా య తదితర ధ్రువపత్రాలను తీసుకోవాల్సిందిగా సమాచారం అందించాలని డిఇఒను ఆదేశించారు. మీసేవలో పొందినపత్రాలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటామన్నారు. మీసేవ ద్వారా 150 సేవలు అందిస్తున్నామన్నారు. ఓటరు నకిలీ కార్డులు, ఆధార్ కార్డులు పొందవచ్చునని చెప్పారు. ఓటరుగా మీసేవ కేంద్రంలో నమోదుకావచ్చునని చెప్పారు. ఉపాధి హామీ పనులను తక్షణం ప్రారభించాలని ఆదేశించారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం మరింత వేగవంతం చేయాలన్నారు. విద్య, వైద్య శాఖలు తమ పనితీరుకు పారామీటర్స్‌ను రూపొందించాలని ఆదేశించారు. మాతృ మరణాలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని, ఇమ్యూనైజేషన్ కార్యక్రమంలో ప్రగతి సంతృప్తికరంగా లేదని పేర్కొన్నారు. ఈ సమావేశంలో అదనపు జాయింట్ కలెక్టర్ ఆర్‌ఎస్ రాజ్‌కుమార్, డిఆర్‌డిఏ పిడి రజనీకాంతరావు, డ్వామా పిడి కల్యాణచక్రవర్తి, డిఎంహెచ్‌ఒ గీతాంజలి, పంచాయతీరాజ్ పర్యవేక్షక ఇంజనీరు బివిఎస్ చిరంజీవి, ఆర్‌విఎం పిఒ నగేష్, సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు అచ్యుతానందగుప్తా, వ్యవసాయ శాఖ జెడి మురళీకృష్ణా, డిఇఒ అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు.
రూ.11 వేల కోట్ల బ్యాంక్ లింకేజిలు లక్ష్యం
* ఎనిమిది ఐటిడిఎల పరిధిలో ఎస్‌హెచ్‌జి సంఘాలను బలోపేతం చేయాలి
* సెర్ప్ అసిస్టెంట్ సిఇఓ మురళి
సీతంపేట, డిసెంబర్ 16: ఈ ఏడాది రూ.11 వేల కోట్లు బ్యాంక్‌లింకేజి రుణాలు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సెర్ప్ రాష్ట్ర అసిస్టెంట్ సిఇఓ మురళి చెప్పారు. సోమవారం సీతంపేట ఏజెన్సీలోని కీసరజోడు పంచాయతీ పరిధిలో పర్యటించిన ఆయన పొంజరుగూడ గ్రామాన్ని సందర్శించి గిరిజన మహిళలతో మాట్లాడారు.అనంతరం స్థానిక ఐటిడిఎ కార్యాలయంలో ఐకెపి ఏపిఎం,డిపిఎంలతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడారు. రాష్ట్రంలో 10.40లక్షల సంఘాలు, 1.16కోట్ల మంది సభ్యులు ఉన్నారన్నారు. ఈ ఏడాది రూ11 వేల కోట్లు బ్యాంక్‌లింకేజి రుణాలు లక్ష్యం కాగా ఇప్పటికి రూ 8వేల కోట్లు వర కు లింకేజి రుణాలు ఇచ్చామన్నారు. బంగారుతల్లి పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది 5.6 లక్షల మంది పిల్లలను గుర్తించామన్నారు. వారికి రూ.170కోట్లు వరకు చెల్లించామని తెలిపారు. అలాగే ఏపిఆర్‌ఐజిపి(రూరల్ ఇన్‌క్లూజివ్ గ్రోత్) పథకంలో భాగంగా ఐటిడిఎల పరిధిలోని 1098 మండలాలను పరిగణలోకి తీసుకొని అన్ని కార్యక్రమాలు ఈ పథకం ద్వారా చేస్తామన్నారు. 2300 పాలప్రగతి కేంద్రాలు ఏర్పాటు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అలాగే రాష్ట్రంలో 76 లక్షల మందికి పెన్షన్‌లు ఇస్తున్నామని, రచ్చబండలో 8.6 లక్షల పెన్షన్‌లు ఇచ్చామన్నారు. శతశాతం అంగవైకల్యం ఉన్న వికలాంగులకు రూ.1000 వరకు పింఛన్ ఇచ్చే అవకాశం ఉందని, దీనికి సంబంధించి పరిశీలిస్తున్నామ న్నారు. రాష్ట్రంలో 26 వేల అమృతహస్తం కేంద్రాలతో పాటు 2600 బాలబడి కేంద్రాలు నిర్వహిస్తున్నామన్నారు.అలాగే ఈ ఏడాది స్ర్తినిధి బ్యాంక్ ద్వారా రూ.1000 కోట్లు రుణాలు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అదే విధంగా ఎన్‌పిఎం పథ కం ద్వారా 36 వేల మంది రైతులతో సుస్థిర వ్యవసాయం చేయిస్తున్నామన్నారు. తన పరిశీలనలో అభయహస్తం పథ కం బాగుందన్నారు. ఐటిడిఎల స్థాయిలో గ్రీవెన్స్‌ను పక్కాగా నిర్వహించాలన్నారు. అనంతరం ఐకెపి సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఐటిడిఎ పీవో కె సునీల్‌రాజ్‌కుమార్, ఐకెపి ఏపిడి కుమార్, డిపిఎం సత్యంనాయుడు, ఏపిఎంలు పాల్గొన్నారు.
కేంద్ర మంత్రి కృపారాణి ఇంటి ముట్టడి
శ్రీకాకుళం , డిసెంబర్ 16: రాష్ట్ర విభజన బిల్లు సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టడంతో జిల్లా విద్యార్థి జెఎసి ఆధ్వర్యంలో పట్టణంలోని కేంద్ర ఐటి, కమ్యూనికేషన్లు శాఖ సహాయ మంత్రి కిల్లి కృపారాణి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. ఉదయం సుమారు మూడు వందల మంది విద్యార్థులు, సమై క్యరాష్ట్ర పరిరక్షణ వేదిక నేతలు కలసి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించి సమైక్య నినాదాలు చేశా రు. సమైక్యవాదులు మూకుమ్మడిగా కేంద్ర మంత్రి కార్యాలయాన్ని ముట్టడించడంతో టూ టౌన్ సిఐ రాధాకృష్ణ సారథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పా టు చేశారు. సమైక్యవాదులను లోపలికి పోనీయకుం డా అడ్డుకునేందుకు రోప్‌పార్టీని ఏర్పాటు చేశారు. గతంలో కేంద్ర మంత్రి కార్యాలయం ముట టడి సందర్భంగా అద్దాలు పగులగొట్టిన విషయాన్ని దృష్టిలో ఉంచుకొని పోలీసులు ముందుగానే భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటు కార్యాలయానికి దూరం గా బారికేడ్లు ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా సమైక్యవాదులు సిగ్గులేని మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నినదించారు. సీమాంధ్ర మం త్రుల చేతకాని తనంగానే రాష్ట్ర విభజన బిల్లు అసెంబ్లీకి చేరుకొందని ఆరోపించారు. సమైక్యం కోరుతూ ప్రజలు గత 150 రోజులుగా వివిధ రూపాల్లో ఆందోళన చేపడుతున్నప్పటికీ, ప్రజల ఓట్లతో గెలిచి అందలమెక్కిన మంత్రులు ప్రజలను గాలికొదిలి వారు రాజభోగాలు అనుభవించడం అన్యాయమన్నారు. వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే రాజకీయ భవిత్యవ్యం కనుమరుగుకాక తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో హేమంతకుమార్, ముఖేష్, మహేష్, హనుమంతు సాయిరాం, కిల్లారి నారాయణరావు, వై.ఉమామహేశ్వరరావు, కొంక్యాణ వేణుగోపాలరావు, జామి భీమశంకర్, దుప్పల వెంకటరావు, పి.జయరాం పాల్గొన్నారు.
ప్రచార కార్యక్రమాలను పక్కాగా నిర్వహించాలి
శ్రీకాకుళం, డిసెంబర్ 16: జిల్లాలో ప్రారంభించిన ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో తీసుకువెళ్లేందుకు ప్రచార కార్యక్రమాన్ని పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ సౌరభ్‌గౌర్ అధికారులను ఆదేశించారు. ప్రచార కార్యక్రమాలు, ఓటర్ల నమోదు కార్యక్రమం, ఆధార్ సీడింగ్, ఉపాధి హామీ పథకం తదితర కార్యక్రమాలపై సోమవారం సాయంత్రం మండల అధికారులతో వీడియోకాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. జిల్లాలో పది నియోజకవర్గాలకు పది ప్రచార వాహనాలు వస్తున్నాయని, అందులో ఆమదాలవలస, ఇచ్ఛాపురం, ఎచ్చెర్ల నియోజకవర్గాలకు ఇప్పటికే వాహనాలు వచ్చాయని చెప్పారు. మిగిలిన నియోజకవర్గాలకు ఒకటి, రెండురోజుల్లో చేరుకుంటాయన్నారు. పది నియోజకవర్గాల్లో వచ్చే జనవరి 12వ తేదీ వరకు నిర్వహించే ప్రదర్శనల వివరాలను గ్రామాల వారీగా పంపించామని తెలిపారు. ఇచ్చిన తేదీలలో సాయంత్రం ఏడు గంటల నుండి కళాబృందాల ద్వారా ప్రదర్శన ఉంటుందని తెలిపారు. ఈ ప్రచార వాహనాల ద్వారా కళాశాలలు, పాఠశాలల వద్ద ఓటర్ల నమోదు కార్యక్రమం, అమ్మలాలన పథకం గూర్చి కూడా ప్రత్యేకంగా వివరించాలన్నారు. వాహనంలో రాజీవ్ యువశక్తి, ఓటరు నమోదు ఫారాలు, సర్పంచ్‌లకు రాసిన ఉత్తరాలు, ఇతర ప్రచార బ్రోచర్లను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అమలుచేస్తున్న కార్యక్రమాలపై దీనిని ప్రత్యేకంగా రూపొందించారన్నారు. జిల్లాలో మంచి శిక్షణా సంస్థలు నెలకొల్పామని, వాటిలో యువత వివిధ కోర్సుల గూర్చి శిక్షణ పొందవచ్చునని తెలిపారు. కళాకారులకు వసతి గృహం లేదా రెసిడెన్షియల్ పాఠశాలలో రాత్రి బస ఏర్పాటుచేయాలని సూచించారు. ప్రతి మండలం నుండి ఒక ఇన్‌ఛార్జ్‌ను ప్రచార వాహనానికి నియమించాలని ఆదేశించారు. ఆర్.ఐ వాహనంతో వెళ్లేటట్లు చర్యలు చేపట్టాలని, ఎంపిడిఒ, తహశీల్దార్ తరచూ తనిఖీలు నిర్వహించాలన్నారు. మం డలాలకు వాహనాలు వచ్చునప్పుడు అచ్చట ప్రారంభ కార్యక్రమం చేయాలని సూచించారు. ఓటర్ల నమోదు కార్యక్రమం గూర్చి మాట్లాడుతూ బూత్‌స్థాయి అధికారి ఇతర పోలింగ్ కేంద్రాలకు చెందిన ఫారాలను స్వీకరించడం లేదని ఆరోపణలు వస్తున్నాయన్నారు. ఏ పోలింగ్ కేంద్రం పరిధికి చెందిన ఫారాలను అయినా స్వీకరించాలని స్పష్టంచేశారు. ఓటరు నమోదు ఫారంతోపాటు రెండు ఫోటోలు, నివాస ధ్రువీకరణ నకలు అందిస్తే సరిపోతుందని చెప్పారు. ఆధార్ సీడింగ్ త్వరితగతిన చేయాలని పేర్కొన్నారు. రోజుకు కనీసం ఐదువందల వరకు చేయాలని ఆదేశించారు. ఈ కాన్ఫరెన్స్‌లో జిల్లా రెవె న్యూ అధికారి నూర్‌భాషా ఖాసీం, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ పి.రజనీకాంతరావు, ముఖ్య ప్రణాళిక అధికారి ఎం.శివరామనాయకర్, జిల్లా పౌరసరఫరాల అధికారి రమేష్ పాల్గొన్నారు.
డయల్ యువర్ కలెక్టర్‌కు 22 వినతులు
పాతశ్రీకాకుళం, డిసెంబర్ 16: డయల్‌యువర్ కలెక్టర్ కార్యక్రమానికి 22 వినతులు వచ్చాయి. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సోమవారం ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను కలెక్టర్ సౌరభ్‌గౌర్ స్వీకరించారు. ఇటీవలి సంభవించిన భారీ వర్షాలకు కృష్ణసాగరం చెరువు పూర్తిగా దెబ్బతిన్న కారణంగా మరమ్మతులు జరిపించాలని ఎచ్చెర్ల మండలం భగీరథపురానికి చెందిన ఎన్.కృష్ణమూర్తి ఫిర్యాదు చేసారు. పెద్దసాన చౌకధరల దుకాణంలో డీలరు సరుకులను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు టెక్కలికి చెం దిన ధర్మారావు ఆరోపించారు. ఇందిరమ్మ ఇళ్లు తమకు మంజూరైనప్పటికీ లింటల్ లెవల్ వరకు నిర్మాణానికి అనుమతిప్పించాల్సిందిగా కొత్తూరు చెందిన ఇప్పిలి రామారావు కోరారు. వంశధార ఎడమ కాలువ ద్వారా సాగునీటిని విడుదల చేయాలని నంది గాం మండలం కణితూరుకు చెందిన ఎం.శ్యామలరావు విన్నవించారు. గ్రామంలో వైద్యశిబిరం నిర్వహించే విధంగా చర్యలు చేపట్టాలని కొత్తూరుకు చెందిన ఐ.ప్రభాకరరావు కోరారు. తలసముద్రం చెరువుకు గండి పడడంతో పాడైన రోడ్డు మరమ్మతు పనులను త్వరితగతిన జరిపించాలని పోలాకికి చెందిన డి.రామయ్య కోరారు. ఈ కార్యక్రమంలో ఎజెసి ఆర్.ఎస్.రాజ్‌కుమార్, డిఆర్‌డిఏ పి.డి రజనీకాంతరావు, డిఎంహెచ్‌ఒ గీతాంజలి, ఇతర శాఖాధికారులు పాల్గొన్నారు.
అభిమానులు మరింత స్ఫూర్తి నింపారు
* సమాలోచన సభ విజయంపై రామ్‌మనోహరనాయుడు
శ్రీకాకుళం, డిసెంబర్ 16: రాజకీయ సమాలోచన సభకు వేలాది మంది అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారని, దీనిని విజయవంతం చేసిన వారికి ధర్మాన ప్రసాదరావు తనయుడు రామ్‌మనోహరనాయుడు కృతజ్ఞతలు తెలిపారు. వర్జిన్‌రాక్ కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీవితంలో ఇది మధురమైన ఘట్టమని, అభిమానులంతా నమ్మకాన్ని పెంచి మరింత స్ఫూర్తినింపారన్నారు. సమాలోచన సభకు మహిళలు అధిక సం ఖ్యలో హాజరయ్యారని, వీరందరికీ ధన్యవాదాలు తెలిపారు. రానున్న రోజుల్లో కార్యకర్తలు, అభిమానుల అభిప్రాయాలను క్రోడీకరించి ముందుకు పోనున్నట్లు వెల్లడించారు. సమాలోచన సభకు మూడువేల మంది కార్యకర్తలు వస్తారని ఊహిస్తే ఆరువేలకు పైగా హాజరైనట్లు చెప్పారు. డిసిసి అధ్యక్షుడు నర్తు నరేంద్రయాదవ్ మాట్లాడుతూ నాయకత్వ పటిమ గల వ్యక్తి అవసరమని, ధర్మాన నాయకత్వాన్ని అందరూ సమర్ధిస్తూ గురుతర బాధ్యతను పెంచారన్నారు.ఈ సమావేశంలో డిసిఎంఎస్ అధ్యక్షుడు గొండు కృష్ణమూర్తి, పిఎసిఎస్ అధ్యక్షుడు జి.కృష్ణమూర్తి, ముంజేటి కృష్ణ, డి.పి.దేవ్, మండవిల్లి రవి తదితరులు పాల్గొన్నారు.
కార్మిక యూనియన్లను అణచివేసేందుకు కుట్ర
శ్రీకాకుళం , డిసెంబర్ 16: రానున్న రోజుల్లో ప్రభుత్వం ప్రజల హక్కులపై మరిన్ని దాడులు నిర్వహించేందుకు సిద్ధపడుతోందని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.సుధా భాస్కర్ ఆరోపించారు. సిటు 8వ జిల్లా మహాసభలు ముగింపు సందర్భంగా స్థానిక రైస్ మిల్లు అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమం లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుతం దేశం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకొని బయటపడేందుకు ప్రభుత్వ ఖర్చులు తగ్గించుకోవాలన్న ఆలోచనతో పేదలకు ప్రభుత్వం అందజేస్తున్న రాయితీలకు మంగళం పాడాలని యోచిస్తోందన్నారు. రాయితీలంటే గ్యాస్, బియ్యం వంటివే కాకుం డా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు సరఫరాలోనూ కోత విధించడానికి పూనుకుందన్నారు. రానున్న రోజుల్లో పేద ప్రజలపై మరిన్ని భారాలతో దాడులకు ప్రభుత్వం సిద్ధమవుతోందని ఆరోపించారు. కార్మికలోకం హక్కులు హరిం చి పెట్టుబడిదారుల వత్తిడితో చట్టాలను ఎత్తేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిపారు. కార్మికవర్గాలపై దాడులు మొదలయ్యాయని, పెట్టుబడిదారులకు వత్తాసు పలుకుతూ కార్మికశాఖ చట్టాలను ఉల్లంఘనకు పాల్పడుతున్న ఉదాంతాలను వివరించారు. ట్రేడ్ యూనియన్లు నడువకుండా చేసేందుకు ప్రభుత్వం కుట్రపన్నుతోందని, అయితే ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టేందుకు సమష్టి పోరాటాలే శరణ్యమన్నారు. ఇం దుకు సిటు శక్తివంతమైన యూనియన్‌గా ఎదిగిందన్నారు. సిటు జిల్లా ప్రధాన కార్యదర్శి డి.గోవిందరావు జిల్లాలో నెలకొల్పనున్న అణువిద్యుత్ కేంద్రాల నిర్మా ణం వద్దు అంటూ తీర్మానం ప్రవేశపెట్టగా, సిటు జిల్లా అధ్యక్షుడు ఎం.తిరుపతిరావు ఏకవాక్య తీర్మానంతో ఆమోదించారు. కార్యక్రమంలో పూర్వ రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్ నర్శింగరావు, సిటు రాష్ట్ర అధ్యక్షుడు భూపాల్, పంచాది అరుణ, కె.నాగమణి, పి.తేజేశ్వరరావుఉన్నారు.