Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

చైనా మార్కెట్‌తోనే స్మగ్లింగ్ పెరిగింది

$
0
0

తిరుపతి, డిసెంబర్ 18: ప్రపంచంలో అత్యంత అరుదుగా శేషాచలం అడవుల్లో లభించే విలువైన ఎర్రచందనం వృక్ష సంపదను కొల్లగొట్టేందుకు చైనా స్మగ్లింగ్‌ను ప్రోత్సహిస్తున్నది. చైనా వస్తువులను ఎలా స్మగ్లింగ్ గూడ్స్‌గా భారతదేశంలోకి సముద్రమార్గం ద్వారా సరఫరా చేస్తోందో అదే తరహాలో దేశంలోని ఎర్రచందనం సంపదను కూడా తమ దేశానికి తెప్పించుకునేందుకు అడ్డదారులు వెతుకుతోంది. దేశంలో ప్రభుత్వ లోపభూయిష్ట విధానం, రాజకీయ వ్యవస్థ అధికారాలతో విలువైన ఎర్రచందనం వృక్ష సంపద దేశ సరిహద్దులు దాటుతోంది. ఎర్రచందనంకు ధర నిర్ణయించాల్సిన మనం పరాయి దేశాల చేతిల్లో కీలుబొమ్మలుగా మారడం దారుణమైన పరిస్థితి అని అటవీశాఖ అధికారులు అంటున్నారు. ప్రభుత్వ విధానాలతోనే చైనా మన మార్కెట్‌లోకి ప్రవేశించిందని అటవీశాఖ అధికారులు అంటున్నారు. కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వెలసి ఉన్న శేషాచలం అడవుల్లో మాత్రమే ఈ ఎర్రచందనం వృక్ష సంపద ఉంది. చిత్తూరు, కడప జిల్లాలతో పాటు కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కొంత భాగం మాత్రమే ఎర్రచందనం వృక్ష సంపద విస్తరించింది ఉంది. సుమారు 4.50 లక్షల హెక్టార్లలో విస్తరించి ఉన్న ఈ విలువైన ఎర్రబంగా కాపాడుకునేందుకు ప్రభుత్వం ఎటువంటి ప్రత్యేక చర్యలు తీసుకోలేదు. అటవీశాఖ అడవుల్లోని ఇతర వృక్షాల వలే ఈ వృక్షాలను కూడా కాపాడాలన్న నిబంధనలతో ప్రభుత్వం సర్వసాధారణంగానే వ్యవహరిస్తోంది. ప్రతి నిత్యం వందల టన్నుల జిల్లా సరిహద్దులు దాటుతున్నా తూతూ మంత్రంగా పట్టుకుంటూ అధికారులు చేతులు దులుపుకునే పరిస్థితి ఉంది. గతంలో అయితే ఏనాడు కూడా దుంగలు తప్ప దొంగలను పట్టుకున్న సందర్భాలు లేవు. ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టేందుకు అటవీశాఖ, పోలీసు శాఖను సమన్వయం చేస్తూ ప్రభుత్వం ప్రత్యేక టాస్క్ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఓఎస్‌డిగా ఉదయ్‌కుమార్‌ను నియమించారు. ఓఎస్‌డి ఉదయ్‌కుమార్ నేతృత్వంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇంటి దొంగలతో ఏమాత్రం ఫలితం దక్కలేదు. దీంతో అడవుల్లో కాకుండా రహదారుల్లోనే పట్టుకోవాలన్న తలంపుతో ఆయన ప్రత్యేక దళాలను ఏర్పాటు చేసి ఫలితాలను తీసుకువచ్చారు. మూలాలను పెకలించాలన్న దృక్పథంతో అసలు స్మగ్లర్లను ఏరివేయాలన్న కృతనిశ్చయంతో చేసిన ప్రయత్నాలు పూర్తి స్థాయి ఫలితాలను ఇవ్వకున్నా కొంత మేరకు ఇచ్చాయి. చెన్నై సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ అధికారిని, అటవీశాఖ అధికారులను, పోలీసులను పట్టుకుని అరెస్టులు చూపిన విషయం విదితమే. అంతేకాకుండా వైట్ కాలర్ స్మగ్లర్లను కూడా పట్టుకుని ఆయన సత్ఫలితాలను చూపారు. వైఎస్‌ఆర్ కడప జిల్లాలో బండారు శివయ్య, బండారు హరి, తిరుపతికి చెందిన భాను తదితర స్మగ్లర్లను చిత్తూరు, కడప జిల్లాల్లో వేటాడి పట్టుకున్నారు. చెన్నైలో, చైనాలో దాగి ఉన్న బడా ఎర్రచందనం స్మగ్లర్లను పట్టుకోవడానికి ప్రభుత్వం నుండి తగిన అధికారులు, ఆదేశాలు లేకపోవడంతో అటవీశాఖ, పోలీసు శాఖ పూర్తి స్థాయిలో విధులు నిర్వహించలేక పోతోంది. ఒక వైపు దుంగలను, మరో వైపు దొంగలను పట్టుకుంటున్నా ప్రభుత్వం నుండి అధికారులకు ఎటువంటి ప్రశంసలు లేకపోగా విమర్శలు, ఇబ్బందులు తలెత్తడటంతో స్మగ్లర్లకు వరంగా మారుతోంది. దీంతో అటవీశాఖ సిబ్బందిలో నిద్రాణం, నిరుత్సాహం రాజ్యమేలుతోంది. పట్టుకుంటున్న కూలీలు, స్మగ్లర్లు జైళ్లకు అలా వెళ్లి ఇలా వస్తుండటంతో అధికారుల ఆత్మవిశ్వాసం దెబ్బతింటున్నది. స్మగ్లర్లపై పిడి యాక్టు ప్రయోగించడానికి అనేక నిబంధనలు పెట్టింది. ఇందులో ఏమాత్రం తేడా వచ్చినా పిడి యాక్టు పెట్టిన అధికారులు ఇబ్బందుల్లో పడుతున్నారు. అనేక మంది రిటైర్డు అయిన డిఎఫ్‌ఓలు నేటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్న సందర్భాలున్నాయి. దీంతో స్మగ్లింగ్ యథేచ్ఛగా సాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బిడ్డింగ్స్‌కు ఆహ్వానించినా మార్కెట్లోకి ఎవ్వరు రావడం లేదు. స్మగ్లర్లు తమకు అడ్డు వచ్చిన అధికారులను సైతం హతమార్చుతున్నారంటే రాజకీయ, ఆర్థిక అండదండలు ఏ స్థాయిలో ఉన్నాయో ఇట్టే అర్థం అవుతోంది. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎర్రచందనం పరిరక్షణకు ప్రత్యేక కార్యాచరణ చేయాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా పట్టుపడిన ఎర్రచందనం స్మగ్లర్లు, కూలీలు పట్ల కఠిన చట్టాలు తీసుకోవడంతో పాటు అటవీశాఖ అధికారులకు విశేష అధికారాలు ఇస్తే తప్ప వ్యవస్థలో మార్పు రాదన్నది అక్షర సత్యం.

సామర్థ్య పరీక్షల పేరుతో వేధించడం మానుకోవాలి
* ఎడి బిల్డింగ్ ముందు అన్నమయ్య కళాకారుల ఆందోళన
* ఇఓ, జెఇఓల హామీతో ధర్నా విరమణ
తిరుపతి, డిసెంబర్ 18: సామర్థ్య పరీక్షల పేరుతో అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులను వేధించడం మానుకోవాలని కోరుతూ ప్రాజెక్టు కళాకారులు టిటిడి పరిపాలనా భవనం ముందు బైఠాయించి ధర్నాను నిర్వహించారు. బుధవారం ఉదయం 11 గంటల నుంచి 12.30 వరకు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి ప్రసంగిస్తూ కళాకారుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి, టిటిడి యాజమాన్యం కళాకారుల అభిప్రాయాలను పెడచెవినపెట్టి సామర్థ్య పరీక్షలకు పూనుకోవడం అన్యాయమని విమర్శించారు. కళాకారుల వౌలిక సమస్యలను పరిష్కరించకుండా పరీక్షల నిర్వహణకు అత్యుత్సాహం చూపుతున్నారని, అన్నమాచార్య ప్రాజెక్టు అధికారులు కళాకారుల్లో తీవ్ర భయాందోళనలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఇవో హామీలు, బోర్డు నిర్ణయాల అమలుకు ప్రథమ ఫ్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. 19వ తేదీ నుండి చేపట్టిన ఇంటర్వ్యూలను తక్షణం రద్దుచేయాలని విజ్ఞప్తి చేశారు. యూనియన్ అధ్యక్షులు ఇ.మునికన్నయ్య మాట్లాడుతూ ఇప్పటికి నాలుగుసార్లు ఇంటర్వ్యూలకు హాజరయ్యామని, 5వసారి ఇంటర్వ్యూలు నిర్వహించడంలో అంతర్యమేమిటని ప్రశ్నించారు.
ఇఓ కారును అడ్డుకున్న కళాకారులు
12 గంటల సమయంలో కార్యాలయం నుంచి బయటకు వచ్చిన ఇఓ కారును కళాకారులు అడ్డుకున్నారు. ఇఓ తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. ఇఓ ఎం.జి గోపాల్, కందారపు మురళి, యూనియన్ నాయకులతో మాట్లాడుతూ కళాకారులు ఎవరినీ తొలగించబోమని, గ్రేడింగ్‌లు తగ్గించడం లేదని, వేతనాలు పెంచుతున్నామని, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని వివరించారు. కళాకారులందరికీ న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఇఓతో జరిగిన చర్చల్లో గౌరవాధ్యక్షులు కందారపుమురళి, అధ్యక్షులు ఇ.మునికన్నయ్య, ప్రధాన కార్యదర్శి ఎం.గుగులప్ప, చంద్రశేఖర్, సరస్వతీ ప్రసాద్, ఆనంద్, లోకనాధ రెడ్డి, నారాయణ,కుప్పుస్వామి, విద్యాదర్, మోహన, రవికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
సామర్థ పరీక్షలు రద్దు : జెఇఓ
19వ తేదీనుంచి ఎస్.వి సంగీత కళాశాలలలో తలపెట్టిన సామర్థ్య పరీక్షలను రద్దు చేస్తున్నామని జెఇఓ పోలా భాస్కర్ ప్రకటించారు. ప్రాజెక్టులో పనిచేస్తున్న కళాకారులందరి బాగోగులు గురించి ఆలోచిస్తున్నామని, అందుకు అనుగుణమైన చర్యలు చేపడుతున్నామని, ప్రాజెక్టులో కొందరి అధికారుల అవగాహనా రాహిత్యం వలన తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని, కళాకారులు ఎవరూ నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. కళాకారుల సమ్మతితోనే కళాకారుల సామర్థ్యం అంచనా వేస్తామని కళాకారులు ఆందోళన చెందుతున్నట్లు యాజమాన్యం ప్రవర్తించబోదని, ధర్మప్రచారం విస్తృతం చేయడానికి కార్యక్రమాలు పెంచబోతున్నట్లు జెఇఓ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కళాకారుల సంఘం అధ్యక్షులు ఇ.మునికన్నయ్య, ప్రధాన కార్యదర్శి ఎం.గంగులప్ప కళాకారులు కె.చంద్రశేఖర్, రాజా, బషీర్, రేవతి, భార్గవి, టిఎం నాగమణి, అలిమేలు, సరస్వతీ ప్రసాద్, కుప్పుస్వామి, విద్యాధర్, టి భానుప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

విధులు సక్రమంగా నిర్వర్తించండి
* సమీక్షా సమావేశంలో కలెక్టర్ ఆదేశం
* వచ్చే ఏడాది నుంచి పైలట్ పథకం కింద ఆంగ్లబోధన
రొంపిచెర్ల, డిసెంబర్ 18: ఉద్యోగాలు జాగ్రత్తగా చేయండి.. తక్కువ సమయంలో ఎక్కువ పనిచేయండి.. బాగాపనిచేసి మంచి పేరు తెచ్చుకోండి అని కలెక్టర్ రామ్‌గోపాల్ అధికారులకు సూచించారు. బుధవారం రొంపిచెర్ల మండలపరిత్ కార్యాలయంలో ఆయన వివిధశాఖల అధికారులతో సమీక్షాసమావేశం నిర్వహించారు. మండలంలో బిఆర్‌జిఎఫ్ నిధులతో పనులు నత్తనడక జరుగుతున్నందుకు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గ్రాంట్లతో పనులు చేయిస్తున్నందుకు అధికారులను తప్పుబట్టారు. బిఆర్‌జిఎఫ్ నిధులు పది శాతం కూడా ఖర్చుపెట్టలేదు ఇక యుసిలు ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. బిఆర్‌జిఎఫ్ నిధులు గురించి సరైన సమాచారం ఇవ్వకపోవడంతో ఎంపిడిఒ ఉమాలక్ష్మిని నిధులు ఎంత వచ్చింది తెలుసుకోకపోతే ఎట్లని కలెక్టర్ విస్తుపోయారు. మండలంలో తాగునీటి సమస్య ఉన్న గ్రామాల్లో వ్యవసాయ బావుల నుంచి నీటిని అద్దెకు తీసుకుని నీటి సరఫరా చేయాలని అర్‌డబ్ల్యుఎస్ అధికారులతో అన్నారు. పంటల సాగు, చెరువుల కింద ఆయకట్టు భూముల విస్తీర్ణం, సీడ్ డ్రమ్ వాడకం గురించి వ్యవసాయశాఖ అధికారులను వివరాలు అడిగారు. మండలంలో స్వయం సహాయక సంఘాలకు ఈ ఏడాది రూ. 10.34 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యం కాగా ఇంత వరకు రూ. 7 కోట్లు రుణాలుగా ఇచ్చామని ఈ ఏడాది లోపల లక్ష్యం పూర్తిచేస్తామని ఐకేపీ ఎపిఎం స్వర్ణలత తెలిపారు. పింఛన్ల పంపిణీలో లబ్ధిదారులకు ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలని అన్నారు. మండలంలో 2006 నుంచి మంజూరైన ఇందిరమ్మ ఇళ్ళలో 539 ఇళ్ళు ఇంకా నిర్మాణం చేపట్టలేదని హౌసింగ్ డిఇ శంకర్‌లాల్ అన్నారు. ఇల్లు అవసరమా లేదా గుర్తించకుండా ఇళ్ళు మంజూరు చేయడం వల్లే ఇలాంటి పొరబాట్లు జరిగాయని, కట్టుకోని వారి ఇళ్ళు రద్దుచేసి కొత్తవారికి ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. విద్యాశాఖ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్వీఎం లెక్క ప్రకారం మండలంలో 60 నుంచి 70 మంది బడిబయట పిల్లలు జాబితా ఇచ్చారని మండల విద్యాశాఖ బడిబయట పిల్లలు ఇద్దరు తప్ప ఎక్కువ మంది లేరని అంటున్నారని దీన్ని మరోసారి పరిశీలించాలని విద్యాశాఖాధికారి చంద్రమోహన్‌రెడ్డిని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో మండల ప్రత్యేకాధికారి రామ్మోహన్‌రెడ్డి, ఎంపిడి ఒ ఉమాలక్ష్మి, తహశీల్దార్ సుధాకరయ్య, అధికారులు ఎల్లయ్య, కళ్యాణ్‌బాబు, యోగానంద్, సుబ్రమణ్యంనాయుడు, బాలకృష్ణ, విజయకుమార్, సిడిపి ఒ నాగశైలజ, కొండయ్య, స్వర్ణలత, నందకుమార్‌రెడ్డి, చిన్నపరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కాపురానికి రాలేదని భార్యను హతమార్చిన భర్త
ఐరాల, డిసెంబర్ 18: కాపురానికి రాలేదని భార్యను భర్త హతమార్చిన సంఘటన ఐరాల మండలం సింగనపల్లె సమీపంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు వెదురుగుండ్లపల్లె ఆనందయ్య కుమార్తె శ్రీలత(22)కు తిరుపతికి చెందిన నాగరాజుకు ఏడాది క్రితం వివాహం జరిగింది. భార్యాభర్తల మధ్య గొడవలు ఏర్పడడంతో నెలరోజుల క్రితం శ్రీలత పుట్టింటికి వచ్చింది. భార్యను కాపురానికి తీసుకురావడానికి వెదురుగుండ్లపల్లెలోని తన అత్త ఇంటికి నాగరాజు మంగళవారం మేకలు మేపేందుకు దగ్గరే ఉన్న అటవీ ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ ఇరువురి మధ్య వాగ్వివాదం జరిగినట్లు తెలిపారు. భర్త నాగరాజు ఆవేశాన్ని అదుపు చేసుకోలేక శ్రీలతను గొంతునులిమి పక్కనే ఉన్న ముళ్ల పొదల్లో చంపి పడేసి బుధవారం ఉదయం నాగరాజు పోలీస్టేషన్‌కు వెళ్లి తనకు తానే లొంగిపోయాడు. అనంతరం సిఐ శ్రీకాంత్, ఎస్సై వాసంతి సంఘటన స్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈమేరకు ఎస్సై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
సత్యవేడు, డిసెంబర్ 18: సత్యవేడు - తడ మార్గం శ్రీసిటీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న బి సురేష్ (28) అనే కార్మికుడు మృతి చెందిన సంఘటన బుధవారం రాత్రి జరిగింది. సత్యవేడు మండలం రాజపాళ్యెం దళితవాడకు చెందిన బి సురేష్ శ్రీసిటిలో ఆంత్రోస్ కంపెనీలో పనిచేస్తున్నాడు. బుధవారం విధులు ముగించుకుని తన స్నేహితుడు మురిగేషన్‌తో కలిసి ద్విచక్రవాహనంలో ఇంటికి వెళుతుండగా శ్రీసిటి సమీపంలో ఎదురుగా తమిళనాడు నుండి ద్విచక్ర వాహనం వస్తున్న వారు వేగంగా ఢీకొనడంతో పక్కనే వెళుతున్న జెసిబి కింద పడి సురేష్ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. సురేష్ వెనుక సీట్లో ఉన్న మురిగేషన్ కాలుపైకి జెసిబి ఎక్కడంతో కాలు విరిగి పోయింది. దీంతో అతన్ని చికిత్స నిమిత్తం స్థానిక ఏరియా ఆసుపత్రికి శ్రీసిటి అంబులెన్స్‌లో తరలించారు. మెరుగైన చికిత్స కోసం చెన్నైకి తరలించారు. సురేష్ మృతదేహాన్ని పోస్టు నిమిత్తం సత్యవేడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సత్యవేడు సిఎస్‌ఐ శివకుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సురేష్ మృతితో రాచపాళ్యెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సురేష్‌కు ఇటీవలే వివాహం కావడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మృతుని కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

శ్రీవారి ఆలయం ముందు గుండెపోటుతో భక్తుడు మృతి
* ఆలస్యంగా సహస్ర దీపాలంకరణ సేవ
తిరుపతి, డిసెంబర్ 18: శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన తమిళనాడు రాష్ట్రం ఈరోడ్డుకు చెందిన పద్మనాభం అనే అయ్యప్ప భక్తుడు బుధవారం ఆలయం ముందున్న గ్యాలరీ వద్ద మృతి చెందారు. ఈ విషయాన్ని గమనించిన టిటిడి ఉద్యోగులు వెంటనే మృతదేహాన్ని తిరుమల అశ్వనీ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా సాయంత్రం వైభవోత్సవ మండపంలో జరిగిన సహస్ర దీపాలంకరణ సేవను ఆలస్యంగా, నామమాత్రంగా నిర్వహించారు. అంతకు మునుపు సంప్రోక్షణా కార్యక్రమాలను చేపట్టారు.

ఘనంగా ముగిసిన యువజనోత్సవాలు
తిరుపతి, డిసెంబర్ 18: సెట్విన్ ఆధ్వర్యంలో గత రెండురోజులుగా తిరుపతి ఎస్వీ సంగీత నృత్య కళాశాలలో నిర్వహిస్తున్న యువజనోత్సవాలు బుధవారం ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ పి వెంకటసుబ్బారెడ్డి మాట్లాడుతూ యువత అన్ని రంగాల్లో ప్రావీణ్యత సాధించి దేశాన్ని ప్రగతి పథంలో నడిపించాలన్నారు. దేశాభివృద్ధిలో యువత పాత్ర కీలకమన్నారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులను అందజేశారు. జానపద నృత్యంలో గ్రూప్స్ విభాగంలో తిరుపతికి చెందిన నందిని, రమ్య బృదం, పుత్తూరుకు చెందిన నేతాజి బృందాలు మొదటి, ద్వితీయ బహుమతులను అందుకున్నారు. జానపద సంగీతంలో తిరుపతికి చెందిన కృష్ణవేణి, పుత్తూరుకు చెందిన హర్షిత బృందాలు మొదటి, ద్వితీయ బహుమతులను అందుకున్నారు. భరత నాట్యంలో శివప్రసాద్, ఒడిస్సా నృత్యంలో తిరుపతికి చెందిన రేష్మా, కూచిపూడిలో పుత్తూరుకు చెందిన హిందుమతిలు విజేతలుగా నిలిచారు. ప్లూట్ వాయిద్యంలో తిరుపతికి చెందిన ప్రేమలత, శాస్ర్తియ సంగీతంలో తిరుపతికి చెందిన రేఖ, శ్రీకాళహస్తికి చెందిన మల్లికలు మొదటి రెండు బహుమతులను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో సెట్విన్ సిఇఓ లావణ్యవేణి, ఎస్వీ సంగీత, నృత్యకళాశాల ప్రిన్సిపాల్ చల్లా ప్రభావతి తదితరులు పాల్గొన్నారు.

అదుపులో 12 మంది ఎర్రచందనం కూలీలు
వెదురుకుప్పం, డిసెంబర్ 17: మండలంలోని కురివికుప్పం అటవీప్రాంతంలో తమిళనాడుకు చెందిన 12 మంది ఎర్రచందనం కూలీలను బుధవారం అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌ఐ నాగన్న తెలిపారు. మరో 13 మంది కోసం అడవిలో విస్తృతంగా గాలిస్తున్నట్లు ఆయన తెలిపారు. స్థానికులు ఎర్రచందనం కూలీలకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు అందించాలని ఎస్‌ఐ కోరారు.

ప్రత్యేక అవసరాలు కల్గిన వారికి అధికారులే మార్గదర్శకులు
* ఎజెసి వెంకటసుబ్బారెడ్డి స్పష్టం
తిరుపతి, డిసెంబర్ 18: ప్రత్యేక అవసరాలు కల్గిన వారికి మార్గదర్శకులు మీరే అని అధికారులను ఉద్దేశించి జిల్లా అదనపు సంయుక్త కలెక్టర్ వెంకటసుబ్బారెడ్డి పేర్కొన్నారు. బుధవారం రాస్ భవనంలో డివిజన్ స్థాయి వికలాంగులు, వయోవృద్ధులకు సంబంధించిన చట్టాలు, పథకాలు, సదుపాయాలపై సమీకృత అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వానికి సంబంధించిన ఏపనికైనా వారు మీ వద్దకు వచ్చినప్పుడు ఆలస్యం చేయక ఆపని వెంటనే పూర్తిచేసి పంపాలన్నారు. ప్రత్యేక అవసరాలు కలిగిన వారు అంటే ప్రత్యేక నైపుణ్యం కల్గిన వారని గ్రహించాలన్నారు. దయచేసి వారిపై జాలి,దయ చూపకండి, సహృదయంతోవారిని అర్థంచేసుకోవాలన్నారు. జిల్లాలో గల అన్ని మండల ప్రజాపరిషత్ కార్యాలయాల్లో వారికోసం ర్యాంపులను ఏర్పాటుచేయడం అభినందనీయమన్నారు. చిన్నారి చూపు పథకం కింద గత ఏడాది 9,750 మంది చిన్నారులకు కంటి అద్దాలను పంపిణీ చేసి రాష్ట్ర స్థాయిలో ప్రధమస్థానం పొందామని గుర్తుచేశారు. వినికిడి సమస్యతో బాధపడుతున్న వారిని గుర్తించి త్వరలో వారికి అవసరమైన పరికరాలను అందిస్తామన్నారు. ప్రభుత్వంతో పాటు ప్రభుత్వేతర సంస్థలు కూడా వారికోసం ఎంతో కృషి చేస్తున్నాయన్నారు. ఉద్యోగాల భర్తీకై ప్రతిశాఖలో మూడు శాతం రిజర్వేషన్ మేర ఖాళీ వివరాలను తెప్పించుకొని త్వరలో భర్తీచేస్తామన్నారు. వికలాంగులను వివాహం చేసుకున్న వారికి ప్రభుత్వం ప్రోత్సాహక బహుమతిని రూ. 50 వేల వరకు ఇస్తున్నదన్నారు. ఈనెల 23 నుండి 26 వరకు చిత్తూరు అంబేద్కర్ భవన్‌లో కృత్రిమ కాలు - క్యాలిబర్ శిబిరంను ఏర్పాటచేస్తామన్నారు. ఇందులో వికలాంగులకు అవసరమైన పరికరాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి అనేకమంది వైద్యనిపుణులు వస్తున్నారన్నారు. తిరుపతి 5వ జిల్లా సెషన్స్ జడ్జి జస్టిస్ హెచ్. చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు కలిగిన వారికి ప్రభుత్వం అనేక చట్టాలను రూపొందించారన్నారు. వికలాంగులు అన్న పదాన్ని వాడకూడదని, ప్రత్యేక అవసరాలు కలిగిన వారు అని సంబోదించాలన్నారు. మానవసేవే మాధవసేవ అనుకునే వారిపట్ల ప్రేమ, ఆప్యాయతతో వారికి సేవలందించాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా వికలాంగుల శాఖ సహాయ సంచాలకులు ప్రసాదరావు, అర్బన్ ఐకెపి పిడి శివకుమార్, తహశీల్దార్‌లు, ఐకెపి సిబ్బంది, స్వచ్ఛంద సేవాసంస్థ ప్రతినిధులు, ప్రత్యేక అవసరాలు కలిగిన వారు పాల్గొన్నారు.

‘నాణ్యమైన పరిశోధనలపై యువత దృష్టి సారించాలి’
తిరుపతి, డిసెంబర్ 17: నాణ్యమైన పరిశోధనలపై యువత దృష్టి సారించి సమాజాభివృద్ధిలో భాగస్వాములు కావాలని జంతుశాస్త విభాగాధిపతి, పిప్స్ సదస్సు కార్యదర్శి ఆచార్య మచ్చా భాస్కర్ పిలుపునిచ్చారు. శ్రీ వేంకటేశ్వరా విశ్వవిద్యాలయంలో గత 2 రోజులుగా వర్శిటీ జంతుశాస్త్ర విభాగం ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫిజియోలాజికల్ సొసైటీస్ సంయుక్త ఆధ్వర్యలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు నాణ్యమైన పరిశోధనలు, ఆవశ్యకత సమాజానికి ఎంతో అవసరం ఆన్నారు. పరిశోధనా రంగంలో వస్తున్న నూతన పోకడల దృష్ట్యా యువత నూతన ఆవిష్కరణల దిశగా తమ పరిశోధనలను మెరుగుపరచుకుంటూ దినదినాభివృద్ధి చెందాలన్నారు. ఈ దృక్పథంతోనే శరీర ధర్మ శాస్త్రం, ఔషధశాస్త్రం, జీవసాంకేతిక శాస్త్రం, వ్యాధి నివారణోపాయాలు అనే కీలకాంశాలపై అంతర్జాతీయ సదస్సులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశ, విదేశాల నుంచి ఈ సదస్సుకు విచ్చేసిన 300 మంది శాస్తవ్రేత్తలు, యువ పరిశోధకులు పాల్గొని తమ పరిశోధనా వ్యాసాలను సమర్పించారు. గురువారం ముగింపు కార్యక్రమం జరుగనుంది. ఈ సందర్భంగా ఉత్తమ పరిశోధనలకు బహుమతి ప్రదానం చేయనున్నారు. బెంగళూరుకు చెందిన నిమ్‌హెన్స్ పరిశోధనా సంస్థకు చెందిన ప్రముఖ శాస్తవ్రేత్త డాక్టర్ బిఎస్ శంకర్‌నారాయణ రావ్ పాల్గొని మెదడుకు సంబంధించిన వ్యాధుల నివారణలో ఎదుర్కొనే సవాళ్లను కూలంకషంగా వివరించారు. కోల్‌కత్తా వర్శిటీ శాస్తవ్రేత్త డాక్టర్ అమర్ కె.చంద్ర వాతావరణం కాలుష్యంవల్ల థైరాయిడ్ గ్రంధిపై పడే ప్రభావం, తద్వారా ఏర్పడే జీవన సమస్యల గూర్చి వివరించారు. కాకతీయ వర్శిటీ ఆచార్యులు వై. ప్రమీలాదేవి మెదడు మూలకణాలు ఉత్పత్తి, మానసిక రుగ్మతలు నివారణలో వాటి పాత్రలను సుదీర్ఘంగా వివరించారు. స్విమ్స్ ఆచార్యులు డాక్టర్ పివిజికె శర్మ మాట్లాడుతూ మూలకణాల ద్వారా పునరుత్పత్తి, ఔషధాల తయారీలో పోషించే పాత్రను వివరించారు. డాక్టర్ అల్లాడి మోహన్ క్షయవ్యాధి, మధుమేహ వ్యాధి ప్రభావం వాటి ద్వంద్వ ప్రభావాన్ని సవివరంగా తెలిపారు.

బ్యాంకర్ల మెరుపు సమ్మె
* స్థంభించిన లావాదేవీలు
తిరుపతి, డిసెంబర్ 18: తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం బ్యాంకర్లు మెరుపు సమ్మెకు దిగారు. తిరుపతిలోని సుమారు 100కుపైగా బ్యాంకులు, బ్రాంచి కార్యాలయాలు అఖిల భారత బ్యాంకర్ల సమ్మెలో భాగంగా తిరుపతి మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా బ్యాంకు ఉద్యోగుల సంఘం నేతలు నాయకులు ధన్వంత్‌కుమార్, కె మూర్తి, సంపత్‌కుమార్, బాలశ్రీనివాస నాయక్, బాబు, నరేంద్ర సింహాజి, అశ్వర్థ నారాయణ, చంద్రశేఖర్‌లు మాట్లాడుతూ ప్రైవేటు బ్యాంకుల ఏర్పాటును నిలిపివేయాలని, అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బ్యాంకుల ప్రైవేటీకరణ, విదేశీ పెట్టుబడుల విధానం తదితర అంశాలను కేంద్ర ప్రభుత్వం దూర దృష్టితో ఆలోచించాలన్నారు. అవుట్ సోర్సింగ్ విధానంతో పనివత్తిడికి గురి అవుతున్న ఉద్యోగులను కాపాడాలని కోరారు. అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి కారుణ్య నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బుధవారం ఒక్కరోజే కోట్లాది రూపాయలు లావాదేవీలు ఆగిపోయాయి. ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

* ప్రభుత్వ లోపభూయిష్ట విధానాలతోనే తప్పిదాలు * నక్సలైట్ల మూమెంట్‌తో 1995లో ఆయుధాలు వెనక్కు తీసుకున్న ప్రభుత్వం * పరిధి తగ్గించి, ఆయుధాలు ఇవ్వాలని అటవీశాఖ సిబ్బంది డిమాండ్
english title: 
china market

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>