ఏలూరు, డిసెంబర్ 18: అక్కడ కాకపోతే...ఇక్కడ అన్న చందంగా సరికొత్త వ్యూహాన్ని కార్పొరేషన్ నిర్వాహకులు తెరపైకి తీసుకువస్తున్నట్లు కన్పిస్తోంది. ఒక ప్రయత్నం చేయటం అది బెడిసికొడితే మరోచోట మళ్లీ అవకాశాలు కల్పించటం మాదిరిగా ఈ చెరువుల మాయ సాగిపోతోంది. ఇప్పటికే కృష్ణమాయ కుంభకోణంతో గందరగోళంగా మారిన కార్పొరేషన్ వ్యవహారం అదే వరుసలో చెరువుల వ్యవహారం కూడా చేరిపోవటంతో మొత్తంమీద ఇది భారీగానే సాగుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్పెషల్ ఆఫీసరు హోదాలో జిల్లా కలెక్టరు సిద్ధార్ధ్‌జైన్ ఇటీవల గజ్జలవారి చెరువు వేలం వ్యవహారాన్ని నిలిపివేసి పద్దతిగా చేయాలని చెపుతూనే దానికి తగిన సూచనలు కూడా జారీ చేశారు. దీంతో అప్పటికే అసలు వ్యవహారం నడిపించేసిన కార్పోరేషన్ పెద్దలకు ఇది మింగుడుపడలేదు. దీంతో అనుకున్న చెరువు ఎలాగా చేయి జారిందని భావించి మరో రెండు చెరువులను తెరపైకి తీసుకువచ్చి వెనువెంటనే వేలం వ్యవహారం ముగించేశారు. ఈ చెరువుల లీజు వ్యవహారంలోకి వెళితే కార్పోరేషన్ ఆధీనంలో ఉన్న చెరువుల్లో చేపలు పట్టుకునేందుకు లీజుకు ఇస్తారు. ఆవిధంగానే గజ్జలవారి చెరువు వేలం అత్యంత రహస్యంగా సాగించారు. అయితే ఈ ఫైల్‌ను పరిశీలించిన కార్పోరేషన్ స్పెషల్ ఆఫీసరు, కలెక్టరు సిద్ధార్ధ్‌జైన్ ఈ వ్యవహారంలో శాస్ర్తియత లేదని, మత్స్యశాఖతో ఆ చెరువులో ఎంతమొత్తంలో చేపలు ఉంటాయో నిర్ధారణ చేయించి ఆతర్వాత ఏలూరు తహసిల్దార్ సమక్షంలో బహిరంగ వేలం నిర్వహించాలని సూచిస్తూ ఆఫైల్‌ను పంపివేశారు. మరి కార్పోరేషన్ పెద్దలు ఈ సూచనను ఎలా అర్ధం చేసుకున్నారో గాని గజ్జలవారి చెరువుకు అనుసరించమని చెప్పిన సూచనలు మిగిలిన చెరువులకు వర్తించవనుకున్నారో లేక ముందుగానే మాయ జరిగిపోయిందో తెలియదుగాని గజ్జల వారి చెరువును మినహాయించి కార్పోరేషన్ పరిధిలో ఉన్న వెంకన్నచెరువు, లక్ష్మక్క చెరువులకు బుధవారం వేలం పాటలు నిర్వహించేశారు. ఈ చెరువుల్లో ఇంతకుముందు కలెక్టరు సూచించిన విధంగా ఎంతమొత్తంలో చేపలు ఉంటాయో అన్న అంచనా కార్పొరేషన్ వద్ద కూడా లేదనే చెప్పాలి. అయినప్పటికీ వాటికి మొత్తాలు నిర్ణయించేసి వాటి ఆధారంగా మూడేళ్ల కాలపరిమితికి వేలం జరిపించేశారు. ఈ చెరువులకు కూడా అవే సూచనలు వర్తిస్తాయన్న అంశం దాదాపుగా కామన్‌సెన్స్ పాయింట్ అనే చెప్పుకోవాలి. అయినప్పటికీ కార్పొరేషన్ మాత్రం ఈ చిన్న పాయింట్ అర్ధం కాలేదో, అర్ధం కానట్టు ఉన్నారో తెలియదుగాని వేలం మాత్రం ముగించేశారు. అయితే ఇప్పటికీ ఇది ఒక కొలిక్కి వచ్చినట్లు కాదన్న అభిప్రాయమే వ్యక్తమవుతోంది. ఈ ఫైళ్లు కూడా మళ్లీ స్పెషల్ ఆఫీసరు ఆమోదముద్రకు వెళ్లాల్సి ఉంది. ఆసమయంలో ఇంతకుముందు చేసిన సూచనలు ఎంతవరకు అమలయ్యాయి, వాటిని ఈ చెరువుల విషయంలో ఎందుకు అమలుచేయలేదు అన్న ప్రశ్నలు తలెత్తక మానవని చెపుతున్నారు. ఈ పరిణామాలు చూస్తుంటే ఒకపక్క కృష్ణమాయ పేరుతో దుకాణాలకు భారీగా వసూళ్లు చేసి లోపాయికారీగానే వ్యవహారాలు నడిపించేసిన కార్పొరేషన్‌కు ఆ ఫైల్ తిరిగొచ్చి తల బొప్పికట్టినా ఇంకా ఆ పైత్యం మాత్రం తగ్గినట్లు కన్పించటం లేదు. ఈసారి ఏకంగా కలెక్టరు చెర్వుల విషయంలో అభ్యంతరం చెప్పినా మరో రెండు చెర్వులను వెంటవెంటనే తెరపైకి తీసుకురావటం, వేలం ముగిసిందన్న ముద్ర వేసేయటం జరిగిపోయింది. బుధవారం నాటి పరిణామాల్లో అయిదు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న వెంకన్న చెర్వుకు ఏడాదికి లక్షా 30వేల రూపాయల చొప్పున మూడేళ్లపాటు లీజుకు పాడుకున్నారు. మొత్తం ఏడుగురు పాటదారులు పాటలో పాల్గొనగా కార్పోరేషన్ ఆవరణలోనే వీరంతా రింగ్ అయి అతితక్కువ మొత్తానికి చెర్వు దక్కించుకున్నారని ఆరోపణలు విన్పిస్తున్నాయి. అలాగే లక్ష్మక్క చెర్వుకు ఏడాదికి లక్షా 56వేల రూపాయల చొప్పున మూడేళ్లపాటు లీజుకు పాడుకున్నారు. దీనిలో ఆరుగురు పాటదారులు పాల్గొనగా ఇక్కడ కూడా రింగ్ అయిపోయి తక్కువ మొత్తానికే చెర్వును దక్కించుకోగలిగారు.
సమైక్యవాదానికి సంకెళ్లు
చింతలపూడి, డిసెంబర్ 18: సమైక్య వాదానికి సంకెళ్లు పడ్డాయి... కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావుకు వ్యతిరేకంగా సమైక్య రాష్ట్ర నినాదాలతో నిరసన తెలిపిన చింతలపూడి మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్‌కుమార్ తదితరులను ఊహించని రీతిలో నాటకీయ ఫక్కీలో బుధవారం రెండోసారి అరెస్టు చేశారు. రాజేష్‌తోపాటు వైసిపికి చెందిన మరో 19 మంది నాయకులను కూడా తిరిగి అరెస్టు చేయడంతో పట్టణ ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు. మంగళవారం కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనే నిమిత్తం కేంద్ర మంత్రి, స్థానిక ఎంపి కావూరి సాంబశివరావు చింతలపూడి రావడం, మద్దాల రాజేష్ ఆధ్వర్యంలో సమైక్య వాదులు నిరసన తెలపడం, కావూరి వారిని అసభ్య పదజాలంతో దూషించడం, కావూరి పైకి కోడిగుడ్లు విసరడం, పోలీసులు రాజేష్‌తో సహా 20 మందిని అరెస్టుచేసి తదుపరి బెయిలుపై విడుదల చేయడం పాఠకులకు విదితమే. అయితే ఊహించని రీతిలో బుధవారం మధ్యాహ్నం పెద్ద సంఖ్యలో పోలీసులు మద్దాల రాజేష్ ఇంటిపై దాడిచేసి అనారోగ్యంతో నిద్రిస్తున్న ఆయనను బలవంతంగా అరెస్టు చేశారు. అయితే జీపులో రావడానికి నిరాకరించిన రాజేష్ దాదాపు 2 కిలోమీటర్లు మెయిన్ రోడ్డుపై పోలీస్ పహరాలో కాలినడకన స్టేషన్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా సమైక్య ద్రోహి, దళిత ద్రోహి, కావూరి నశించాలి అనే కార్యకర్తల, అభిమానుల నినాదాలతో మెయిన్ రోడ్డు దద్దరిల్లింది. మద్దాల రాజేష్‌తోబాటు మంగళవారం అరెస్టు చేసిన 20 మందిని తిరిగి అరెస్టు చేయడంతో వందల సంఖ్యలో వీరి అభిమానులు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. దీంతో పోలీస్ స్టేషన్ వద్ద కొంత ఉద్రిక్తత ఏర్పడింది. తదుపరి పోలీసులు అరెస్టు చేసిన 20 మందిని స్థానిక కోర్టులో హాజరుపరచగా మెజిస్ట్రేట్ పి పురుషోత్తమరావు వీరికి తొలుత రిమాండ్ విధించి, తదుపరి బెయిల్ మంజూరు చేశారు. ఈ సందర్భంగా బెయిల్‌కోసం దరఖాస్తు చేసుకోడానికి మద్దాల తిరస్కరించారు. అయితే సమైక్య న్యాయవాదుల జెఎసి సభ్యులు రాజేష్‌కు నచ్చజెప్పి బెయిల్‌కు దరఖాస్తుకు ఒప్పించారు. ఈ సంఘటనతో పట్టణంలో సర్వత్రా చర్చగా మారాయి. కాగా అరెస్టయిన వారిలో మాజీ ఎమ్మెల్యే రాజేష్‌తోబాటు స్థానిక సర్పంచ్ మారిశెట్టి జగన్, ఉప సర్పంచ్ బొల్లం వెంకటలక్ష్మి, వార్డు మెంబర్ బి అన్నపూర్ణ, మాజీ ఎఎంసి ఛైర్మన్ బొడ్డు వెంకటేశ్వరరావు, వైఎస్సార్ సిపి నాయకులు గంధం చంటి, గోలి చంద్రశేఖర్‌రెడ్డి, సిహెచ్ నరేంద్రరాజు, జె శ్రీహరరెడ్డి, శ్రీనివాస గౌడ్, కె రవి, ఇమ్మానియేల్, యు రామకృష్ణ, వెంకటేశ్వరరావు, చెంచమ రాజు, జల్లిపల్లి పుల్లారావు, పి నర్సారెడ్డి, రమేష్‌రెడ్డి, రామరాజు నాయక్, తోట కుమార్ ఉన్నారు. వీరిపై ఐపిసి సెక్షన్ 141, 149, 341 సెక్షన్ల కింద కేసులు నమోదుచేసి అరెస్టు చేసినట్టు స్థానిక సిఐ వెంకటేశ్వరరావు తెలిపారు.
కేసులకు భయపడం...
సమైక్యవాదాన్ని వదలం:రాజేష్
చింతలపూడి, డిసెంబర్ 18: ఎలాంటి కేసులకైనా భయపడేది లేదని, సమైక్య రాష్ట్ర వాదాన్ని విడనాడేది లేదని చింతలపూడి మాజీ ఎమ్మెల్యే, వైసిపి నియోజకవర్గ కన్వీనర్ మద్దాల రాజేష్‌కుమార్ స్పష్టం చేశారు. బుధవారం ఆయన స్థానిక పోలీస్ స్టేషన్లో విలేఖరులతో మాట్లాడుతూ కేంద్ర మంత్రి కావూరికి ప్రజాస్వామ్య బద్ధంగా సమైక్య రాష్ట్రంకోసం నిరసన తెలిపినందుకు కావూరి తన అధికార బలంతో జిల్లా అధికారులపై వత్తిడి తెచ్చి తనను రెండోసారి అరెస్టు చేయించారని ఆరోపించారు. ఇప్పటికే సీమాంధ్ర ప్రాంతానికి అన్యాయం చేసి సమైక్య ద్రోహి అయిన కావూరి సమైక్యాంధ్రను కోరుకునే తనతోపాటు 20 మందిపై అక్రమ కేసులు పెట్టించి అరెస్టు చేయించడం సమైక్య ఉద్యమానికి తూట్లు పొడవడమేనన్నారు. ఈ చర్య సమైక్య వాదులపై దాడి అని, సమైక్య వాదానికి వ్యితిరేకమైన కుట్ర అని రాజేష్ పేర్కొన్నారు. ఈ కేసులకే కాదు, ఇంతకంటె పెద్ద కేసులు పెట్టినా భయపడేది లేదని, ప్రజలు అంతా గమనిస్తున్నారని, జగన్ నాయకత్వంలో సమైక్య రాష్ట్రాన్ని కాపాడుకుంటామని మద్దాల ప్రకటించారు.
నేడు చింతలపూడి బంద్
స్థానిక మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్‌తోబాటు 20 మందిని అక్రమంగా అరెస్టు చేసినందుకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సమైక్య జెఎసిలు గురువారం చింతలపూడి బంద్‌కు పిలుపునిచ్చాయి. బంద్‌కు సహకరించాల్సిందిగా బుధవారం సాయంత్రం పట్టణంలో మైక్‌లో విస్తృత ప్రచారం చేశారు.
కావూరి క్షమాపణ చెప్పాలి
-ఏలూరులో దిష్టిబొమ్మ దగ్ధం చేసిన ఎన్జీవోలు
ఏలూరు, డిసెంబర్ 18: సమైక్యవాదులను, ప్రభుత్వ ఉద్యోగులను దుర్భాషలాడిన కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు క్షమాపణలు చెప్పితీరాలని ఎన్‌జిఓ సంఘ నాయకులు డిమాండ్ చేశారు. స్ధానిక ఫైర్‌స్టేషన్ సెంటరులో ఎన్‌జిఓ సంఘం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించి కావూరి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈసందర్భంగా నగర సంఘం అధ్యక్షులు చోడగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర విభజనను అడ్డుకోలేకపోయిన కేంద్రమంత్రి కావూరి సీమాంధ్ర ఉద్యమం జరుగుతున్నా ఆ ఉద్యమాన్ని దుర్భాషలాడే పరిస్ధితి రావటం దారుణమన్నారు. ఉద్యమంలో భాగంగా అడ్డుకున్న ఎన్‌జిఓలను, సమైక్యవాదులను దుర్భాషలాడటం సమంజసం కాదని పేర్కొన్నారు. ఉద్యోగులు లంచగొండులైతే మంత్రి పదవి కోసం రాష్ట్రానే్న తాకట్టు పెట్టిన కావూరి పెద్ద లంచగొండి అని ధ్వజమెత్తారు. కృష్ణా జిల్లా ప్రజలు తరిమేస్తే పశ్చిమగోదావరికి వచ్చి రెండుసార్లు ఇక్కడి ప్రజలు, ఉద్యోగులు ఓట్లు వేస్తే గెల్చి పదవిని పట్టుకుని వేళ్లాడుతున్నారని విమర్శించారు. ఉద్యోగులను దుర్భాషలాడటం కావూరి అహంకారానికి నిదర్శనమన్నారు. సీమాంధ్ర ఉద్యమానికి తూట్లు పొడిచింది కావూరి వంటివారేనని ధ్వజమెత్తారు. బహిరంగ క్షమాపణలు చెప్పకపోతే కావూరిని ఏలూరులో అడుగుపెట్టనివ్వబోమని హెచ్చరించారు. కార్యక్రమంలో పంచాయితీరాజ్ మినిస్టీరియల్ అసోసియేషన్ అధ్యక్షులు జి శ్రీ్ధర్‌రాజు, ఎన్‌జిఓ నాయకులు నెర్సు వెంకట రామారావు, లీలామోహన్, సురేష్, లీలాకుమారి, సునీత, రాజు తదితరులు పాల్గొన్నారు.
భద్రాచలంపై పూర్తిహక్కు సీమాంధ్రదే
భీమవరం, డిసెంబర్ 18: భద్రాచలం 1956కు ముందు సీమాంధ్ర ప్రాంతంలోనే ఉండేదని, దానిపై పూర్తిహక్కు ఈ ప్రాంతవాసులకే ఉంటుందని భారతీయ జనతాపార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు, భీమవరం అసెంబ్లీ కన్వీనర్ అల్లూరి సాయిదుర్గరాజు పేర్కొన్నారు. సీమాంధ్ర ప్రజలను యుపిఎ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. శాసనసభలో ప్రవేశపెట్టిన తెలంగాణ బిల్లుకు సీమాంధ్ర భారతీయ జనతాపార్టీ వ్యతిరేకమని ఆయన స్పష్టంచేశారు. ఒకేవేళ ఆ బిల్లుకి భారతీయ జనతాపార్టీ అధినాయకత్వం పూర్తిస్థాయిలో మద్దతిస్తే పదవులను వదులుకోవడానికైనా వెనకడబోమని ఆయన ప్రకటించారు. బుధవారం భీమవరం పార్టీ కార్యాలయంలో విలేఖర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సాయిదుర్గరాజు, పట్టణ అధ్యక్షుడు అరసవల్లి సుబ్రహ్మణ్యం, ప్రధాన కార్యదర్శి అడ్డగర్ల ప్రభాకర గాంధీ మాట్లాడారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలను సోనియాగాంధీకి వివరించడంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపిలు, కేంద్ర మంత్రులు విఫలమయ్యారని వెల్లడించారు. బిజెపి పదవుల కోసం పనిచేయదని, రాష్ట్ర భవిష్యత్తు కోసమే పనిచేస్తుందన్నారు. ముఖ్యంగా శాసనసభలో రాష్ట్ర విభజన అంశంలో స్పష్టత లేదని, అన్ని సమస్యలకూ పరిష్కారాన్ని చూపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వారు డిమాండ్ చేశారు. 2014లో భారతీయ జనతాపార్టీ నరేంద్ర మోడి నాయకత్వంలో పూర్తిస్థాయిలో అధికారంలోకి వస్తుందని, ఆ తరువాతే సీమాంధ్ర, తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుందని పట్టణ అధ్యక్షుడు అరసవల్లి సుబ్రహ్మణ్యం అన్నారు.
ఏజెన్సీలో వాణిజ్య నిర్మాణాలపై విచారణ
జీలుగుమిల్లి, డిసెంబర్ 18: ఏజన్సీలో వాణిజ్య సముదాయాల నిర్మాణంపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించనున్నట్టు జంగారెడ్డిగూడెం డివిజినల్ పంచాయతీ అధికారి కె.సాయిబాబా తెలిపారు. ఏజన్సీలో పీసీ చట్టం ఉల్లంఘించి, ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా వాణిజ్య సముదాయాలు నిర్మిస్తున్నారని గిరిజనుడు పద్దం రామకృష్ణ ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌కు చేసిన ఫిర్యాదు నేపథ్యంలో బుధవారం జీలుగుమిల్లి విచారణకు వచ్చిన డిఎల్‌పిఒను గిరిజనేతరులు నిలదీశారు. జీలుగుమిల్లిలో వాణిజ్య సముదాయాలు నిర్మిస్తున్న 38 మందికి ఇఒ పిఆర్‌డి పేరుతో నోటీసులు జారీ చేశారు. వారంతా బుధవారం పరిశీలనకు వచ్చిన డిఎల్‌పిఒ సాయిబాబను చుట్టుముట్టి తమ కుటుంబాలు 50 నుండి వందేళ్ళుగా ఏజన్సీలో నివిస్తున్నాయని, తాము జీవించేందుకు వ్యాపారాలు చేసుకోకూడదా? అనుమతులు లేకుండా ఇళ్ళ నిర్మాణం చేసుకునే వీలున్నప్పుడు, వ్యాపార భవనాలు ఎందుకు నిర్మించుకోరాదని ప్రశ్నించారు. ఒకపక్క రెవెన్యూ శాఖ గిరిజనేతరులకు ఇండ్ల స్థలాల పట్టాలు ఇస్తుంటే, మరో పక్క గృహనిర్మాణ శాఖ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణలకు అనుమతులు ఇస్తున్నారని, ఈ పరిస్థితులలో చట్టం ప్రకారం ఆ రెండు శాఖలపై ఎందుకు చర్యలు తీసుకోరని ప్రశ్నించారు. కొద్దిసేపు వాగ్వివాదాల అనంతరం డిఎల్‌పిఒ సాయిబాబా విలేఖరులతో మాట్లాడుతూ ఉన్నతాధికార్ల ఆదేశాల మేరకే తాను పరిశీలనకు వచ్చినట్టు చెప్పారు. పూర్తిస్థాయి నివేదిక ఉన్నతాధికార్లకు అందజేస్తానని చెప్పారు. గిరిజనేతరుల అభ్యంతరాలను సైతం నివేదిస్తానని చెప్పారు. జీలుగుమిల్లి గ్రామ కార్యదర్శి తాతారావును వేరే పంచాయతీకి బదిలీ చేస్తున్నట్టు తెలిపారు. టి.గంగన్నగూడెం కార్యదర్శిని ఇక్కడ ఇన్‌ఛార్జిగా నియమిస్తామని చెప్పారు. సర్పంచ్ మొడియం రామచంద్రరావు, ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో గ్రామ కార్యదర్శిని బదిలీ చేస్తున్నట్టు వివరించారు.
ముగిసిన యువతరంగ్
ఏలూరు, డిసెంబర్ 18: జాతీయ, సాంస్కృతిక సమగ్రతకు యువత నడుంబిగించాలని జిల్లా జాయింట్ కలెక్టరు డాక్టరు టి బాబూరావునాయుడు అన్నారు. స్ధానిక ఇండోర్ స్టేడియంలో మూడురోజులపాటు నిర్వహిస్తున్న యువతరంగ్ జిల్లా స్ధాయి యువజనోత్సవాల ముగింపులో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో యువత నిర్మాణాత్మకమైన పాత్ర పోషించాల్సి ఉండగా నేడు యువతరం కీలక విషయాల్లో ఆసక్తి చూపలేకపోతున్నదని ఇటువంటి పరిస్ధితి విడనాడాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. జిల్లాలో లక్షా 26వేల మంది యువత ఓటుహక్కు పొందాల్సి ఉండగా ఇప్పటివరకు కేవలం 25వేల మంది మాత్రమే ఓటుహక్కు నమోదు చేసుకున్నారని, మిగిలినవారి కోసం గ్రామీణ ప్రాంతాలలో విస్తృతస్ధాయి ప్రచారాన్ని నిర్వహించాల్సి ఉందన్నారు. ఎదుగుదలకు అవరోధంగా నిలిచే పిరికితనం, భయాన్ని యువత పారద్రోలినప్పుడే మంచి భవిష్యత్ లభిస్తుందన్నారు. ఉజ్వల భవిష్యత్ నిర్దేశించుకునేందుకు ప్రణాళిక, ఆలోచనపటిమను పెంపొందించుకోవాలన్నారు. దేశంలోని యువతలో సరైన నిర్దేశం, అంకితభావం కొరవడటం మూలంగానే క్రీడల్లో వెనుకబాటుతనం కనపడుతుందన్నారు. యువతశాతం ఎక్కువగా ఉన్న భారతదేశం ప్రపంచంలో అద్భుతమైన శక్తిగా నిలిచేందుకు యువత పాత్ర ఎంతో కీలకమైందన్నారు. వివిధ పోటీల్లో విజేతలకు డాక్టరు బాబూరావునాయుడు సర్ట్ఫికెట్లు, మెమొంటోలను అందజేశారు. హెల్దీబేబీ పోటీల్లో పాల్గొన్న యం అనన్యశ్రీ, యస్ లయశ్రీ, సిహెచ్ నాగచైతన్య, పి భార్గవసాయి, పి మహాలక్ష్మిలకు మెమొంటోలు, సర్ట్ఫికెట్లు అందజేశారు. ఓవరాల్ ఛాంపియన్‌షిప్‌గా నిలిచిన డిఎన్‌ఆర్ కళాశాలకు ఆ కళాశాల తరపున హాజరైన కార్యదర్శి రామకృష్ణంరాజుకు మెమొంటో అందజేశారు. తొలుత నాట్యాచార్య గండికోట రాజేష్ శిష్యబృందం ప్రదర్శించిన నృత్యరూపకంతోపాటు పలువురు యువతీయువకులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సెట్‌వెల్ సిఇఓ ఎండిహెచ్ మెహర్రాజ్, మైనార్టీస్ కార్పోరేషన్ ఇడి మహ్మద్ జలీల్ అహ్మద్‌గౌరి, డిపిఆర్‌ఓ ఆర్‌విఎస్ రామచంద్రరావు, సహాయ పర్యాటక శాఖాధికారి పట్ట్భా పాల్గొన్నారు.
గ్రంథాలయాల్లో పాఠకులు కోరుకునే పుస్తకాలు
భీమడోలు, డిసెంబర్ 18 : గ్రంధాలయాల పట్ల పాఠకుల ఆసక్తి పెంచేందుకు పబ్లిక్ ఆన్ డిమాండ్ పేర పాఠకులు కోరుకొన్న పుస్తకాన్ని అందజేయనున్నామని గ్రంథాలయ సంస్థ జిల్లా ఛైర్మన్ నాగ చంద్రారెడ్డి అన్నారు. ఆయన బుధవారం సాయంత్రం మండలంలోని గుండుగొలను, భీమడోలు శాఖా గ్రంధాలయాలను సందర్శించారు. పాఠకులు, గ్రంథాలయ అభివృద్ధి కమిటీ సభ్యులతో పాఠకులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. పాఠకుల డిమాండ్‌పై భీమడోలు గ్రంధాలయ పాలకుడు సిహెచ్ నాగేశ్వరరావును అడిగారు. రికార్డులు తనిఖీ చేశారు. అనంతరం స్థానిక విలేఖర్లతో మాట్లాడుతూ పబ్లిక్ ఆన్ డిమాండ్ కోసం ప్రత్యేక వెబ్‌సైట్ ప్రారంభించామన్నారు. వీటి వివరాలు ప్రతి గ్రంధాలయంలో పాఠకులకు అందుబాటులో ఉంచామన్నారు. జిల్లాలోని అన్ని గ్రంధాలయాలను ఆన్‌లైన్ ద్వారా అనుసంధానం చేసే ప్రక్రియ ప్రారంభమైందన్నారు. ఆన్‌లైన్ ద్వారా పాఠకులు తమకు అవసరమైన పుస్తకం ఏ గ్రంధాలయంలో అందుబాటులో ఉంటుందన్న విషయాన్ని తెలుసుకోవచ్చునన్నారు. నవలల సరఫరాపై ప్రభుత్వం కొంత మేరకు ఆంక్షలు విధించిందన్నారు. అయినప్పటికీ పాఠకులు కోరుకొనే ప్రాచుర్యం పొందిన నవలలు అందుబాటులో ఉంచుతామన్నారు. గ్రంధాలయాల అభివృద్ధికి స్థానిక సంస్థలు గ్రంధాలయాల సెస్‌లు సంస్థకు చెల్లించాలని కోరారు. దీనికి సహకరించాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశామన్నారు. జనవరిలో జిల్లాలోని ఆరు కేంద్రాలలోని నూతన భవనాలలో గ్రంధాలయాలు ప్రారంభం కానున్నాయన్నారు. నల్లజర్ల, కామవరపుకోట, లింగపాలెంలో నూతన భవనాల నిర్మాణానికి స్థల సేకరణ అడ్డంకిగా ఏర్పడిందన్నారు. భీమడోలు గ్రంధాలయానికి స్థల సేకరణ విషయం హైదరాబాద్ స్థాయిలో పెండింగ్‌లో వుందన్నారు. భీమడోలు గ్రంధాలయాన్ని మోడల్ గ్రంధాలయంగా తీర్చిదిద్దేందుకు తన వంతు సహకారం అందజేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గ్రంధాలయ సంస్థ జిల్లా కార్యదర్శి సిహెచ్ మదార్, గ్రంధాలయ అభివృద్ధి కమిటీ ఛైర్మన్ చింతా శ్రీరామచంద్రమూర్తి, సభ్యులు వై ఏడుకొండలు, సుతాపల్లి ప్రసాద్, మద్దాల అప్పారావు పాల్గొన్నారు.
భీమవరంలో ప్రణీత హల్‌చల్
భీమవరం, డిసెంబర్ 18: అత్తారింటికి దారేది ఫేం ప్రణీత బుధవారం భీమవరంలో సందడి చేశారు. స్థానిక ఆనంద ఫంక్షన్ హాలులో ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్ అండ్ సేల్స్ వస్త్ర షోరూం ప్రారంభోత్సవానికి ఆమె ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించారు.
విదార్థుల్లో క్రీడాస్ఫూరి పెంపొందించాలి
భీమవరం, డిసెంబర్ 18: విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తి పెంపొందించడానికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కృషి చేయాలని డిఎన్నార్ కళాశాల పాలకవర్గ అధ్యక్షుడు గోకరాజు వెంకట నర్సింహరాజు అన్నారు. భీమవరం గన్నాబత్తుల క్రీడామైదానంలో భీమవరం జోన్ వ్యాయామ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యాన భీమవరం జోన్ ఆటల పోటీలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ సభకు భీమవరం జోన్ అధ్యక్షుడు కె.సత్యనారాయణ ప్రసాద్ అధ్యక్షత వహించారు. విద్యార్థులు తొలుత క్రీడామార్చ్ నిర్వహించారు. డిఎన్నార్ కళాశాల పాలకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు గోకరాజు వెంకట నర్సింహరాజు, గాదిరాజు సత్యనారాయణరాజు (బాబు) క్రీడాజ్యోతి వెలిగించి ఆటల పోటీలు ప్రారంభించారు. విద్యార్థుల స్వాగత నృత్యంతో సభ ప్రారంభమైంది. డివైఇఒ కె.రామకృష్ణంరాజు సభలో స్వాగత ఉపన్యాసం చేశారు. పిఇటిలు కెఎస్‌ఎన్ ప్రసాద్, పి.గంగాధర్, జి.నర్మద, డివి రామభద్రరాజు, కె.చిట్టిబాబు, సిహెచ్.శ్రీనివాస్, కె.విజయశ్రీ, కె.వెంకటేశ్వరరావు, సిహెచ్.సుందర్‌కుమార్ పోటీలను పర్యవేక్షించారు.
రాణిస్తున్న క్రీడాకారులు
భీమవరం జోన్ ఆటల పోటీల్లో 100 మీ, 200 మీ, 400 మీ, 800 మీ, 1500 మీ, లాంగ్‌జంప్, షార్ట్‌పుట్ క్రీడాల్లో పోటీలు జరిగాయి. అలాగే జూనియర్స్ విభాగంలో 100 మీ, 200 మీ, 400 మీ, 800 మీ, షాట్‌పుట్, డిస్కస్ త్రో, లాంగ్‌జంప్ పోటీలు జరిగాయి. అలాగే సబ్ జూనియర్స్ విభాగంలో కూడా పోటీలు జరిగాయి.
కాపులకు రిజర్వేషన్ కల్పించాలి
చింతలపూడి, డిసెంబర్ 18: అన్ని రంగాల్లో వెనుకబడిన కాపులకు రిజర్వేషన్లతోబాటు అన్ని రకాల సంక్షేమ పథకాలు అందించాలని కాపునాడు సమావేశం డిమాండ్ చేసింది. చింతలపూడి నియోజకవర్గ కాపునాడు సమావేశం బుధవారం స్థానిక మార్కెట్ యార్డులో జరిగింది. రాష్ట్ర నాయకుడు సిద్ధోజి, రాంబాబు, జిల్లా కాపునాడు అధ్యక్షుడు చినమిల్లి వెంకట్రాయుడు, ప్రధాన కార్యదర్శి టి ప్రభాకరరావు, స్థానిక ఎఎంసి ఛైర్మన్ తూతా లక్ష్మణ్‌రావు, బొడ్డు వెంకటేశ్వరరావు, జి విక్రమనాయుడు, కె రాంబాబు పాల్గొన్నారు.