నెల్లూరు, డిసెంబర్ 18: తమ శాఖ పరిధిలో సీజ్ అయిన అశోక్ లైలాండ్ లారీ (ఏపి 26 టిటి 7951)ను ఈ నెల 26న వేలం వేయనున్నట్లు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ నెల్లూరు రెండో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ బి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ లారీ గత ఏడాది మద్యం అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడిందన్నారు. తమ కార్యాలయ ఆవరణలో 26న ఉదయం పదిన్నర గంటలకు వేలం వేస్తున్నట్లు చెప్పారు.
కోవూరులో ఎటిఎం చోరీకి విఫల యత్నం
కోవూరు, డిసెంబర్ 18: పట్టణంలో మైథిలి సెంటర్ సమీపంలో నున్న ఆంధ్రాబ్యాంక్ ఏటి ఎంలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి ప్రయత్నించి విఫలయత్నం జరిగిన సంఘటన మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగింది. స్థానిక పోలీసుల సమాచారం మేరకు పట్టణంలోని మైథిలి హాల్ సెంటర్ సమీపంలో ఆంధ్రాబ్యాంక్ ఏటి ఎం ఉంది. ఈ ఏటి ఎం సంరక్షణను టాటా కన్సల్‌టెన్సీకి అప్పగించారు. టాటా వారు ఏటి ఎంకు సెక్కూరిటీని నియమించలేదు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు ఏటి ఎంలోకి ప్రవేశించి, ఇనుపరాడ్లతో సిసి కెమేరాలను అద్దాలను ద్వంసం చేశారు. ఏటి ఎం నగదు వచ్చే భాగాన్ని ద్వంసం చేశారు. ఏటి ఎం తెరుచుకోకపోయేసరికి చోరీకి ప్రయత్నించి విఫలమయ్యారు. ఎతంకూ నగదు రాకపోయేసరిగి అక్కడినుంచి ఉడాయించారు. తెల్లవారు జామున స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. కోవూరు పి ఎస్సై నాగరాజు, అంధ్రాబ్యాంక్ మేనేజర్ చంద్రశేఖర్‌రెడ్డి, టాటా కన్‌న్సల్‌టెన్సీ సిబ్బంది, వేలిముద్ర అధికారులు ఏటి ఎంను పరిశీలించారు. ఏటి ఎంలో 15లక్షలరూపాయలను లోడ్‌చేసి ఉంచారు. అందులో కార్డుదారులు 350000ల రూపాయలను డ్రా చేసి ఉన్నారు. మిగిలిన నగదు ఏటి ఎంలోనే ఉండడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు అక్కడ వదిలి వెళ్లిన ఇనుప రాడ్డును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కోవూరు పి ఎస్సై తెలిపారు.
30 క్వింటాళ్ల బియ్యం పట్టివేత
నాయుడుపేట, డిసెంబరు 18: విన్నమాల గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన 26 క్వింటాళ్ల ఉప్పుడు బియ్యం, 4 క్వింటాళ్ల పచ్చి బియ్యం బుధవారం పౌర సరఫరాల విజిలెన్స్ డిప్యూటీ కలెక్టర్ జి.మల్లికార్జున సిబ్బందితో దాడి చేసి పట్టుకున్నారు. విన్నమాల గ్రామంలో నివాసం ఉంటున్న వాకాటా హరి నివాసంలో అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ ఉంచారన్న సమాచారం అందుకున్న అధికారులు ఇంటిపై దాడి చేయగా అప్పటికే సమాచారం అందుకొన్న హరి ఇంటికి తాళాలు వేసి పలాయనం చిత్తంగించాడు. ఇంటి తలుపులు తెరవాలని వారి బంధువులకు తెలిపినప్పటికీ ఎవరూ స్పందించక పోవడంతో అధికారులు తలుపులు పగుల గొట్టి బియ్యాన్ని స్వాధీనం చేసుకొన్నారు. అనంతరం సరుకుల పంచనామ నిర్వహించారు. ఈ దాడుల్లో ఎఎస్‌వో హరి, డిటి కాంతయ్య, ఆరై గోపినాథ్‌రెడ్డి, విఆర్వో శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
సూళ్లూరుపేటలో..
సూళ్లూరుపేట : సూళ్లూరుపేటలో రైస్‌మిల్లులపై డిఎస్‌వో ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో విజిలెన్స్ అధికారులు బుధవారం దాడులు చేశారు. జాతీయ రహదారి పక్కనే ఉన్న ఓ రైస్‌మిల్లులో నిబంధనలకు విరుద్ధంగా 100టన్నుల బిపిటి బియ్యం బస్తాలు నిల్వ ఉండడంతో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 6ఎ కేసు నమోదు చేసి రైస్‌మిల్లును సీజ్‌చేశారు.
జనవరి 8,9,10 తేదీల్లో పక్షుల పండుగ
సూళ్లూరుపేట, డిసెంబరు 18: ప్రతియేటా సూళ్లూరుపేట వేదికగా నిర్వహించే పక్షుల పండుగను ప్రణాళికా బద్ధంగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ ఎన్.శ్రీకాంత్ అన్నారు. ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహణపై బుధవారం స్థానిక చెంగాళమ్మ కల్యాణ మండపంలో అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విదేశాల నుంచి పులికాట్, నేలపట్టుకు వలస వచ్చే పక్షుల కోసం పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా పక్షుల పండుగ నిర్వహించేందుకు అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వచ్చే ఏడాది జనవరి 8,9,10తేదీల్లో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో పక్షుల పడుగ నిర్వహించేందుకు మూహూర్తం ఖరారు చేశారు. ఫెస్టివల్ కన్వీనర్‌గా గృహ నిర్మాణ శాఖ అధికారి రవిప్రకాష్‌ను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. గతంలో జరిగిన లోటుపాట్లను దృష్టిలో పెట్టుకొని ముందస్తుగానే ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. అన్ని ప్రభుత్వ స్టాల్స్‌తో పాటు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామన్నారు. నేలపట్టులో సందర్శకుల కోసం ప్రత్యేకంగా తాగునీరు, బస్సుల సౌకర్యం కల్పిస్తామన్నారు.
తడ మండలం భీములవారిపాళెం పడవల రేవులో పర్యాటకుల కోసం బోటు షికారు ఏర్పాటు చేస్తామన్నారు. మూడు రోజుల్లో ఫెస్టివల్‌పై అధికారులు నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. సమావేశం అనంతరం జూనియర్ కళాశాల మైదానాన్ని అధికారులతో కలసి పరిశీలించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో జితేంద్ర, డ్వామా పిడి గౌతమిరెడ్డి, టూరిజం శాఖ అధికారి నాగభూషణం, గూడూరు డీఎస్పీ చౌడేశ్వరిదేవి, నాయుడుపేట ఆర్డీవో ఎం.వి రమణ అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఉద్యోగుల సమ్మెతో మూతపడ్డ బ్యాంకులు
నెల్లూరు, డిసెంబర్ 18: యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంకర్ల యూనియన్ ఇచ్చిన పిలుపుతో జిల్లావ్యాప్తంగా బ్యాంకులు మూతపడ్డాయి. మంగళవారం జరిగిన ఈ సమ్మె కారణంగా జిల్లా వ్యాప్తంగా సుమారు వెయ్యి కోట్ల రూపాయల వరకు ఆర్థిక లావాదేవీలకు అంతరాయం ఏర్పడింది. జిల్లా పరిధిలో 342 బ్యాంకులున్నాయి. ఈ సందర్భంగా నగరంలోని బారకాస్ ఎస్‌బిఐ ప్రధాన బ్రాంచి వద్ద జరిగిన ధర్నాలో భాగంగా ఉద్యోగ సంఘ నాయకులు మాట్లాడుతూ కొత్తగా ప్రైవేట్ బ్యాంకులకు లైసెన్స్‌లు ఇస్తుండటాన్ని తప్పుబట్టారు. ఈ పరిణామం ప్రైవేటీకరణకు దారి తీస్తుందన్నారు. పే రివిజన్ కమిషన్ వేసి ఐదేళ్లు దాటి 18 నెలలైనా ఇంతవరకు ఈ సమస్య పరిష్కరించకపోవడం దారుణమన్నారు. 30శాతం వరకు ఇవ్వాల్సిన పిఆర్‌సి కేవలం 5 శాతంకే పరిమితం చేస్తుండటాన్ని కూడా తప్పుబట్టారు. బ్యాంకింగ్ సంస్కరణలు చేయడాన్ని కూడా విమర్శించారు. కార్యక్రమానికి బ్యాంకర్ల ఫోరమ్ జిల్లా అధ్యక్షులు ఎన్వీఎస్ ప్రసాద్ నేతృత్వం వహించారు.
తహశీల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ చోరీ
బాలాయపల్లి, డిసెంబర్ 18: తహశీల్దార్ కార్యాలయంలో మంగళవారం అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ప్రధాన తలుపు తాళం పగులగొట్టి లోనికి ప్రవేశించిన దొంగలు మూడు రూముల తాళాలు పగులగొట్టారు. తహశీల్దార్ ఉపయోగించే కంప్యూటర్‌ను అపహరించుకొని వెళ్లారు. కంప్యూటర్ రూం తాళాలు పగుల గొట్టినా అక్కడ ఏమీ తాకలేదు. ఎఎస్‌ఓ రూంలో బీరువా తాళాలు పగుల గొట్టి కాగితాలు చిందర వందర చేశారు. అక్కడ ఉన్న ఒక గోనెసంచి, అట్టపెట్టే తీసుకొన్నారు. ఈ అట్టపెట్టె, గోనెసంచిలోనే కంప్యూటర్‌ను అపహరించుకుని వెళ్లుంటారని భావిస్తున్నారు. దొంగలు ప్రధాన ద్వారం తలుపునకు లోపల గడియపెట్టి కుర్చీలు అడ్డుపెట్టి వెనక ద్వారం నుండి పారిపోయారు. కార్యాలయంలో చోరీ విషయం గుర్తించిన స్వీపర్ తహశీల్దార్‌కు సమాచారం అందించింది. పోలీసులు పరిశీలించే వరకు తహశీల్దార్ పూర్ణచంద్రరావు సిబ్బందిని ఎవరినీ లోనికి వెళ్లనీయలేదు. ఎస్సై ఎం కొండయ్య, పిఎస్సై నాగరాజు సంఘటన స్థలాన్ని పరిశీలించి క్లూస్‌టీంకు సమాచారం అందించారు. నెల్లూరు నుండి వచ్చిన క్లూస్‌టీం సభ్యులు వేలి ముద్రలనుసేకరించారు. ఎస్సై మాలకొండయ్య తహశీల్దార్ పూర్ణచంద్రరావును, కార్యాలయ సిబ్బందిని విచారించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.