ఖాతాదారుల ఇక్కట్లు
ఒంగోలు, డిసెంబర్ 18:యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్‌లు ఇచ్చిన పిలుపుమేరకు జిల్లావ్యాప్తంగా జాతీయ బ్యాంకులకు చెందిన సిబ్బంది బుధవారం సమ్మెలో పాల్గొన్నారు. బ్యాంకు సిబ్బంది సమ్మెతో సుమారు రెండు వేల కోట్ల రూపాయల లావాదేవీలు నిలిచిపోయాయి, దీంతో ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జిల్లాకేంద్రమైన ఒంగోలులో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచి, టౌన్ బ్రాంచి, ఎస్‌ఎంఇ బ్రాంచి, కోర్టు బ్రాంచి, ప్రకాశం భవనం బ్రాంచి, కర్నూలురోడ్డు బ్రాంచి, ఆర్‌బిఒ బ్రాంచీలకు చెందిన సిబ్బంది స్థానిక స్టేట్‌బ్యాంకు ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచి వద్ద సమావేశమై నినాదాలు చేశారు. వేతన సవరణ ఒప్పందాన్ని త్వరగా పరిష్కరించాలని, బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలకు వ్యతిరేకంగా సిబ్బంది నినాదాలు చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల నియామకాలను నిలిపివేసి లక్షలాది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, పబ్లిక్ సెక్టారు బ్యాంకుల ప్రైవేటీకరణ ఆపాలని, బ్యాంకింగ్ రంగంలో కారుణ్య నియామకాలను పునరుద్ధరించాలని సిబ్బంది నినాదాలు చేశారు. ఈసందర్భంగా ఎస్‌బిఐ ఎస్‌యుహెచ్‌సి గుంటూరు వైస్ ప్రెసిడెంట్ ఎం కృష్ణ మాట్లాడుతూ వేతన సవరణ ఒప్పందాన్ని త్వరగా పరిష్కరించాలని, సబ్‌స్ట్ఫా రిక్రూట్‌మెంట్ జరపాలని డిమాండ్ చేశారు. ప్రకాశం రీజియన్ కార్యదర్శి జి విజయమోహన్ మాట్లాడుతూ బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలను నిలుపుదల చేయాలన్నారు. బ్యాంకు ఉద్యోగులకు సిఐటియు జిల్లాకార్యదర్శి డి శ్రీనివాసరావు సంఘీభావాన్ని ప్రకటించి ప్రసంగించారు. బ్యాంకింగ్ రంగ ఒత్తిళ్లను ముందుముందు ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. సిండికేట్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం వద్ద ఎఐబిఇఏ నాయకులు వి పార్ధసారధి అధ్యక్షతన సభ జరిగింది. ఆయా కార్యక్రమాల్లో ఆలిండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ జిల్లాఅధ్యక్షుడు సర్దార్, సిఐటియు జిల్లాకార్యదర్శి సిహెచ్ శ్రీనివాసరావు, ఎఐబిఓఏ నాయకులు ఎ సుధాకరరావు, పికె రాజేశ్వరరావు, మల్లికార్జునరావు, డి కోటేశ్వరరావు, నగర కో ఆర్డినేషన్ కమిటీ అధ్యక్షుడు ఎ వేణుగోపాలరావు, బిఇఎఫ్‌ఐ నాయకులు సిహెచ్ శోభన్‌బాబు, ఒంగోలు నగర కమ్యూనిస్టు సమితి కార్యదర్శి యు ప్రకాశరావు, యూనియన్ ఒంగోలు కార్యదర్శులు వి కృష్ణమోహన్, వి శ్రీనివాసరావు, వెంకటరెడ్డి, జివి సుబ్బారావు, జకీర్, కెఎన్‌బి చారి, నరేంద్ర, యు నాగేశ్వరరావు, రాజశేఖరరెడ్డి, ఉద్యోగులు పాల్గొని ప్రసంగించారు.
తొమ్మిది మంది ఎస్‌ఐలు బదిలీ
ఒంగోలు, డిసెంబర్ 18:జిల్లాలో మరో తొమ్మిది ఎస్‌ఐలను బదిలీచేస్తూ జిల్లా ఎస్‌పి పి ప్రమోద్‌కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పొదిలిలో ఎస్‌ఐగా పని చేస్తున్న కె కమలాకర్‌ను టంగుటూరు పోలీస్‌స్టేషన్‌కు, టంగుటూరులో పనిచేస్తున్న వై వెంకటరమణయ్యను కందూకురు టౌన్ పోలీసుస్టేషన్‌కు, కంభంలో పనిచేస్తున్న జె రామకోటయ్యను దర్శికి బదిలీ చేశారు. అదేవిధంగా దొనకొండలో పనిచేస్తున్న సిహెచ్ హజరత్తయ్యను కంభం, కందూకురులో పనిచేస్తున్న హెచ్‌ఎస్ హుస్సేన్ బాషాను గుడ్లూరు, గుడ్లూరులో పనిచేస్తున్న ఎన్ నాగమల్లేశ్వరరావును పొదిలి, దర్శిలో పనిచేస్తున్న వై నాగరాజును త్రిపురాంతకం, కురిచేడులో పనిచేస్తున్న ఎస్ సుబ్బారావును చినగంజాం, చినగంజాంలో పనిచేస్తున్న ఎం రాజేష్‌ను దొనకొండకు బదిలీచేస్తూ జిల్లా ఎస్‌పి ప్రమోద్‌కుమార్ ఉత్తర్వులు జారీచేశారు.
మిన్నంటుతున్న ఆందోళనలు
తెలంగాణ బిల్లు ప్రతులను తగలబెట్టిన న్యాయవాదులు
విద్యార్థి జెఎసి ఫ్రంట్ నేతల ధర్నా
ఒంగోలు, డిసెంబర్ 18: కేంద్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా జిల్లావ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు మిన్నంటుతున్నాయి. జిల్లా కేంద్రమైన ఒంగోలులోని జిల్లా కోర్టు సెంటర్ వద్ద న్యాయవాదులు తెలంగాణ బిల్లు ప్రతులను దగ్ధం చేసి నిరసన తెలిపి అక్కడే రాస్తారోకో చేపట్టారు. ఈసందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పైనిడి సుబ్బారావు, ప్రధానకార్యదర్శి పి సుబ్బారావు, బార్ అసోసియేషన్ నాయకులు శిరిగిరి రంగారావు తదితరులు మాట్లాడుతూ తెలంగాణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడటం బాధాకరమన్నారు. సీమాంధ్రకు చెందిన శాసనసభ్యులందరూ మూకుమ్మడిగా తెలంగాణ బిల్లును వ్యతిరేకించి సమైక్యాంధ్రకు మద్దతు తెలపాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్, సమైక్యాంధ్ర విద్యార్థి ఫ్రంట్ ఆధ్వర్యంలో ఒంగోలులోని దివంగత మాగుంట సుబ్బరామరెడ్డి విగ్రహం వద్ద తెలంగాణ బిల్లును సీమాంధ్ర శాసనసభ్యులు ఓడించాలని డిమాండ్ చేస్తు ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా సమైక్యాంధ్ర విద్యార్థి జెఎసి ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు పైనం నాగరాజు, ఆప్సా జిల్లా అధ్యక్షుడు మాధవరావు, గౌరవాధ్యక్షులు కిశోర్, రామిరెడ్డిలు మాట్లాడుతూ సీమాంధ్రకు చెందిన శాసనసభ్యులందరూ పార్టీలకు అతీతంగా తెలంగాణ బిల్లును ఓడించి సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతు తెలపాలని కోరారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి చెందుతుందని వారు తెలిపారు. గత వంద రోజులకు పైగా సీమాంధ్రకు చెందిన ప్రజలు, విద్యార్థులు ఆందోళనలు చేపట్టినప్పటికీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ బిల్లుకు అసెంబ్లీకి పంపటం బాధాకరమని పేర్కొన్నారు. సీమాంధ్రకు చెందిన శాసనసభ్యులు ఇప్పటికైనా కళ్ళుతెరిచి సమైక్యాంధ్ర సాధించేందుకు కృషి చేయాలని వారు కోరారు. ఈకార్యక్రమంలో ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్ నాయకులు మల్లికార్జున్, సమైక్యాంధ్ర విద్యార్థి జెఎసి ఫ్రంట్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు కందుకూరి రాజశేఖర్, నాయకులు విశ్వనాధ్ తదితరులు పాల్గొన్నారు.
ఆధార్ దరఖాస్తులకు తోపులాట
కందుకూరు రూరల్, డిసెంబర్ 18: స్థానిక ఎన్‌జిఓ భవనంలో ఆధార్ దరఖాస్తులు పొందేందుకు ప్రజలు అధిక సంఖ్యలో రావడంతో కేంద్రం వద్ద తోపులాట జరిగింది. ఐదు రోజులకు ఒకసారి మాత్రమే దరఖాస్తులు పంపిణీ చేయడంతో ప్రజలు అధిక సంఖ్యలో ఆధార్ కేంద్రం వద్దకు చేరుకోవడంతో తోపులాట జరిగింది. పరిస్థితిని గమనించిన తహశీల్దార్ పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చి వరుసక్రమం ఏర్పాటు చేసి దరఖాస్తులు పంపిణీకి సహకరించారు.
ట్రాఫిక్ దిగ్బంధంలో చీరాల పట్టించుకోని పోలీసులు
చీరాల, డిసెంబర్ 18: చీరాల పట్టణం ట్రాఫిక్ దిగ్బంధంలో చిక్కుకున్నది. ట్రాఫిక్ పోలీసులు ఉదారంగా వ్యవహరించటంతో వాహనదారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పట్టణంలో ప్రతిరోజు వేలాది వాహనాలు తిరుగుతుంటాయి. ప్రధాన కూడళ్లల్లో ఆటోలు నిలపటంతో వాహనదారులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆటోడ్రైవర్ల నుండి ట్రాఫిక్ పోలీసులు మామూళ్లు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మామూళ్లు ఇవ్వని వారిపై ఇష్టం వచ్చినట్లు ట్రాఫిక్ సిబ్బంది చలానాలు రాస్తుండటంతో ఆటోడ్రైవర్లు బెంబేలెత్తిపోతున్నారు. అధికారులకు మామూళ్ళు ఇస్తున్నామనే నెపంతో డ్రైవర్లు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు. మద్యం సేవించి ఆటో నడిపినా ట్రాఫిక్ పోలీసులు వారిని నివారించటానికి సాహసించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం 18 సంవత్సరాలు నిండనివారు, లైసెన్స్‌లు లేనివారు వాహనాలను నడపకూడదు. కాని దాదాపు ముప్పై శాతం మంది 18 సంవత్సరాలలోపు వయస్సు కలిగినవారే ఆటోలను నడుపుతున్నారు. ఆటోలకు సరైన అనుమతి పత్రాలు లేకపోయినా, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకున్నా, రోడ్డుకు అడ్డంగా వాహనాలను నిలుపుదల చేసినా ట్రాఫిక్ పోలీసులు మిన్నకుంటున్నారు. ట్రాఫిక్ నియంత్రణకు పదుల సంఖ్యలో హోమ్‌గార్డులను వినియోగిస్తున్నా ట్రాఫిక్‌ను నియంత్రించ లేకపోతున్నారు. కొంతమంది ఆటోడ్రైవర్లు నేరప్రవృత్తి కలిగినవారు ఉండటం వల్ల అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. అలాంటి వారిపట్ల పోలీసులు అప్రమత్తంగా వుండాలని ప్రజలు కోరుతున్నారు. హోమ్‌గార్డులు ఆటోడ్రైవర్లు నుంచి రోజు వారి మామూళ్ళు వసూలు చేస్తున్నట్లు డ్రైవర్లు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో పోలీసులు ఆటోడ్రైవర్‌లపై నిబంధనలు విధించారు. ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుంటే ఆటోలను సీజ్ చేస్తామని డిఎస్‌పి ఆటో డ్రైవర్‌లకు హెచ్చరికలు జారీ చేశారు. అదేవిధంగా లైసెన్స్‌లు లేకుండా, మద్యం సేవించి ఆటోలను నడిపితే కఠిన చర్యలు ఉంటాయని కేసులు నమోదుచేస్తామని హెచ్చరించారు. అయినా ఆటోడ్రైవర్లు మాత్రం యథాతథంగా ఆటోలను నడుపుతున్నారు.
వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్
సిఎండి హెచ్‌జె దొర స్పష్టం
చీరాల, డిసెంబర్ 18: విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తిరుపతి ఎపిఎస్‌పిడిసిఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ హెచ్‌జె దొర తెలిపారు. బుధవారం స్థానిక సబ్ డివిజన్ కార్యాలయంలో విద్యుత్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ముందుగా రికార్డులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ చీరాల పరిధిలో మూడు సబ్ స్టేషన్‌లు మంజూరయ్యాయని, వీటిల్లో రెండు పూర్తయ్యాయని, మరొకటి ఫిబ్రవరిలో నిర్మించనున్నట్లు తెలిపారు. గతంలో విద్యుత్ కొరత తీవ్రంగా ఉండేదని, ప్రస్తుతం కొరత లేకుండా చర్యలు తీసుకున్నామని అన్నారు. రానున్న వేసవికాలంలో కూడా విద్యుత్ కొరత లేకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. 24 గంటలపాటు విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. పెండింగ్‌లో ఉన్న విద్యుత్ బిల్లులు రెవెన్యూ, వ్యవసాయ తదితర శాఖలలో ఆలస్యం అవుతున్నాయని, జాప్యం లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. సిబ్బంది కొరత లేకుండా కాంట్రాక్ట్ పోస్టులను భర్తీ చేస్తున్నామని అన్నారు. 45మంది సిబ్బంది కావాలని 2011లో ప్రభుత్వానికి విన్నవించుకోగా 20మందికి అవకాశం కల్పించిందని త్వరలో ఈ భర్తీ పూర్తిచేస్తామని అన్నారు. కృష్ణపట్నంలో 800 మెగావాట్ల ఉత్పత్తి కేంద్రం నిర్మాణం త్వరలో పూర్తవుతుందని చెప్పారు. పరిశ్రమలు, వ్యవసాయంపై విద్యుత్ కోతలను ఎత్తివేశామని తెలిపారు. కార్యక్రమంలో ఆపరేషన్ డైరెక్టర్ తిరుపతి రాధాకృష్ణ, ఎస్‌ఇ జయభారతరావు, డిఇ తోట శ్రీనివాసరావు, చీరాల, వేటపాలెం, ఎఇ, ఎడిఇలు పాల్గొన్నారు.
పంటలకు సాగునీరివ్వాలి:కరణం
పంగులూరు, డిసెంబర్ 18: సాగర్ శివారు భూములకు సాగునీరు అందించాలని రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షులు కరణం బలరామకృష్ణమూర్తి డిమాండ్ చేశారు. బుధవారం ఎన్‌ఎస్‌పి కాలువ రాంకూరు వద్ద పమిడిపాడు మేజర్ కాలువ నీటిపారుదలను ఆయన పరిశీలించారు. మేజర్ కాలువకు 330 క్యూసెక్కుల నీరు పారుదల ఉండాల్సి ఉండగా 152 క్యూసెక్కుల నీరు మాత్రమే ప్రవహిస్తోందని అన్నారు. ఈ విషయమై ఎన్‌ఎస్‌పి డిఇ శంకరనారాయణను ఫోన్‌లో సంప్రదించారు. గత వారంగా మేజర్ కాలువకు 152క్యూసెక్కుల నీరు మాత్రమే ప్రవహిస్తోందని ఈ నీరు పంటలకు చాలదని నీటి విడుదలను పెంచాల్సిందిగా ఆయన కోరారు. ఆయన వెంట టిడిపి మండల అధ్యక్షులు చింతల సహాదేవుడు, జిల్లా కార్యదర్శి కుక్కపల్లి ఏడుకొండలు, వర్క్ ఇన్‌స్పెక్టర్ సుబ్బారెడ్డి తదితరులు ఉన్నారు.
పోలేరమ్మ ఆలయంలో చోరీ
పర్చూరు, డిసెంబర్ 18:మండలంలోని నూతలపాడు గ్రామంలో గల పోలేరమ్మ ఆలయంలో చోరీ జరిగింది. ఈ సంఘటన మంగళవారం రాత్రి జరగ్గా గ్రామస్థులు బుధవారం స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇంకొల్లు సిఐ సత్యకైలాస్‌నాధ్, ఎస్సై ఎ శ్రీహరిరావు ఆలయానికి చేరుకొని చోరీ జరిగిన తీరుపై పరిశీలించారు. గ్రామస్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అమ్మవారి ఆలయ మండపంలోని గ్రిల్స్ తొలగించి ఆలయంలోకి ప్రవేశించి అమ్మవారికి అలంకరించే అరచేతి వెండి తొడుగును అపహరించుకెళ్ళారు. ఒంగోలు నుంచి వచ్చిన క్లూస్‌టీం ఆనవాళ్ళను సేకరించింది. అలాగే గుంటూరునుంచి వచ్చిన జాగిలాలు ఆలయ ప్రాంగణంలో తిరిగాయి. కేసును దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. చోరీ జరిగిన స్థలాన్ని చీరాల డిఎస్‌పి డి నరహర పరిశీలించారు. నిందితులను త్వరలో పట్టుకుంటామని చెప్పారు.
విద్యుత్ అధికారులపై రైతుల కనె్నర్ర
పుల్లల చెరువు విద్యుత్ సబ్‌స్టేషన్ ముట్టడి
స్టేషన్‌కు తాళాలు వేసిన రైతులు
పుల్లల చెరువు, డిసెంబర్ 18: మండల కేంద్రమైన పుల్లల చెరువులోని రైతులు బుధవారం విద్యుత్ అధికారులపై కనే్నర్ర చేశారు. వందలాది ఎకరాల్లో పత్తి, మిరప , వరి పంటలు ఎండుముఖం పట్టడంతో వారు విద్యుత్ అధికారులపై అందోళనకు దిగారు. కనీసం రోజుకు రెండు గంటలు కూడా విద్యుత్ సక్రమంగా ఇవ్వడంలేదని, ఇటీవల మూడు రోజులకు గాను కేవలం ఆరుగంటలు మాత్రమే విద్యుత్ ఇచ్చారని రైతులు వాపోయారు. ఇదేవిధంగా విద్యుత్ సరఫరా చేస్తే వేలకువేల రూపాయలు పెట్టుబడులు పెట్టి సాగుచేసిన పంటలు ఎండిపోయి కనీసం పెట్టుబడులు కూడా రాసి పరిస్థితి ఏర్పడిందనివారు ఆందోళన వ్యక్తం చేశారు. పుల్లలచెరువు గామ్రానికి చెందిన సుమారు 200మంది రైతులు విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ముట్టడించి తాళాలు వేశారు. సంబంధింత అధికారులతో అధికారులు మాట్లాడి ఈరోజు నుంచి సక్రమంగా విద్యుత్ ఇస్తామని చెప్పడంతో వారు దాడి విరమించారు.
అక్షరాస్యతా శాతం పెంచడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
*కలెక్టర్ విజయ్‌కుమార్
మార్టూరు, డిసెంబర్ 18 : జిల్లాలో అక్షరాస్యతా శాతాన్ని పెంచడానికి గ్రామ ఐక్యసంఘాల ప్రతినిధులు కృషిచేయాలని కలెక్టర్ విజయ్‌కుమార్ అన్నారు. బుధవారం మార్టూరులో విజయలక్ష్మి కల్యాణమండపంలో పదిమండలాల గ్రామల ఐక్యసంఘాల సభ్యులతో ఆయన మాట్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 53శాతం మహిళా నిరక్ష్యరాస్యులు ఉన్నారని వారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని అన్నారు. మార్చి 23లోపు 10లక్షల మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకుకృషిచేయాలని అన్నారు. విద్య వలన సమాజం అభివృద్ధి చెందుతుందని అన్నారు. మూడ నమ్మకాలు పారద్రోలడానికి విద్య ఉపయోగపడుతుందని అందువల్ల ప్రతి ఒక్కరూ విద్యనభ్యసించినప్పుడే దేశం అభివృద్ది చెందుతుందని అన్నారు. స్ర్తి నిరక్ష్యరాస్యులైతే ఆ కుటుంబం కూడా వెనుకబడుంటుదని అందువల్ల ఐక్య సంఘాలు ఇంటింటికీ తిరిగి విద్య యోక్క ప్రాముఖ్యతను వారికి తెలియజేయాలని అన్నారు. గ్రామ ఐక్య సంఘాల సభ్యులు ఆయా గ్రామాల్లో నూటికి నూరు శాతం కృషిచేయాలని అన్నారు. ఈ సందర్భంగా మార్టూరులో గ్రానైట్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వేముల పల్లి శ్రీనివాసరావు అక్షర ప్రకాశానికి సంబంధించిన మెటీరియల్‌ను (40000) పంపిణీచేశారు. ఈ కార్యక్రమంను డి ఆర్‌డి పిడి పద్మజ, ఏపిడి రవికుమార్, వయోజన విద్యపిడి వీరభద్రయ్య, ప్రత్యేకాధికారి అఖిల్, ఎండి ఓ బత్తిన సింగయ్య, ఎం ఆర్ ఓ సుధాకర్, ఎం ఇ ఓ తిరుమల కిషోర్‌బాబు తదితరు పాల్గొన్నారు.
గనుల లీజు దరఖాస్తులను పరిష్కరించాలి:కలెక్టర్
ఒంగోలు, డిసెంబర్ 18: జిల్లాలో గనుల శాఖ ద్వారా లీజు అనుమతులకోసం వచ్చిన అర్హత కలిగిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని జిల్లాకలెక్టర్ జిఎస్‌ఆర్‌కెఆర్ విజయకుమార్ గనుల శాఖాధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక సిపిఒ సమావేశ మందిరంలో గనులశాఖ లీజు అనుమతుల మంజూరుపై కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. జిల్లాలో గనుల లీజుకోసం వచ్చిన దరఖాస్తులను ప్రభుత్వం మంజూరుచేసిన జీవో రెండు ప్రకారం నిబంధనలను పాటించి మంజూరు చేయాలన్నారు. గనుల లీజుల విషయంపై అభ్యంతరాలు ఉంటే దరఖాస్తులను తిరస్కరించాలన్నారు. గనుల లీజులకు సంబంధించి రెవెన్యూ డివిజన్ల అధికారులు, గనుల శాఖ ఎడి, డివిజన్ ఫారెస్టు అధికారి సంయుక్తంగా విచారణ చేపట్టి నివేదికలు ఇవ్వాలన్నారు. గనుల లీజుల కోసం 462 దరఖాస్తులు వివిధ శాఖల వద్ద పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఈసమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ కె యాకూబ్‌నాయక్, గనుల శాఖ ఒంగోలు ఎడి కె సుబ్రహ్మణ్వేశ్వరరావు, మార్కాపురం ఎడి శ్రీనివాసరావు, ఒంగోలు, కందుకూరు, మార్కాపురం ఆర్‌డిఒలు మురళి, బాపిరెడ్డి, సత్యనారాయణ, మార్కాపురం, గిద్దలూరు డిఎఫ్‌ఒలు తదితరులు పాల్గొన్నారు.
చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయనే అపోహలు విడనాడండి:కలెక్టర్
ఒంగోలు, డిసెంబర్ 18: చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయనే అపోహలు విడనాడాలని జిల్లాకలెక్టర్ విజయకుమార్ తెలిపారు. బుధవారం స్థానిక సీతారామ కల్యాణ మండపంలో ప్రకాశం అక్షర విజయం కార్యక్రమంపై ఇందిరాక్రాంతి పథం, గ్రామసమైక్య సంఘ సభ్యులకు అవగాహన సదస్సు జరిగింది. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో స్వయం సహాయక సంఘాల్లో ఉన్న సభ్యులు కుటుంబ సభ్యులందరిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలన్నారు. పొదుపు పథకాలను సక్రమంగా వినియోగించుకోవటంలో మహిళలు విజయం సాధించారన్నారు. సంఘంలో మహిళా సంఘాల పట్ల గౌరవం పెరిగిందన్నారు. ప్రకాశం అక్షర విజయం కార్యక్రమాన్ని స్వయం సహయక సంఘాలు ప్రత్యేక బాధ్యత తీసుకుని విజయవంతం చేయాలన్నారు. చదువుకున్న కుటుంబాలు ఎలా ఉంటాయి, చదువులేని కుటుంబాలు ఎలా ఉంటాయో పరిస్థితులను వివరించారు. చదువు కేవలం ఉద్యోగం కోసం కాదని, చదువుకోవటం వలన సమాజంలో జరిగే మంచిచెడులను సూక్ష్మంగా తెలుసుకునేందుకు వీలుంటుందన్నారు. చదువుకుంటే సమాజంలో తలెత్తుకుని ధైర్యంగా తిరగవచ్చునని తెలిపారు. ఈసమావేశంలో డిఆర్‌డిఎ పిడి పద్మజ, రాజీవ్ విద్యామిషన్ పిఒ రామశేషు, వెలుగొండ ప్రాజెక్టు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నాగరాజరావు తదితరులు పాల్గొన్నారు.
వేట కుక్కల దాడిలో 15 గొర్రెపిల్లలు మృతి
దర్శి, డిసెంబర్ 18: మండలంలోని తానంచింతల గ్రామంలో బుధవారం వేటకుక్కలు దాడి చేయటంతో ఆ గ్రామానికి చెందిన ఒంటేరు శ్రీనివాసరావు, గురవయ్యలకు చెందిన 15 గొర్రెపిల్లలు మృతి చెందాయి. తరచుగా వేటకుక్కలు దాడి చేస్తుండటంతో గొర్రెల యజమానులు భారీగా నష్టపోతున్నారు. పెద్దమొత్తంలో వేటకుక్కలు దాడి చేయటం దర్శి ప్రాంతంలో ఇదే ప్రథమం.