విశాలాక్షినగర్, డిసెంబర్ 18: ఆంధ్రా యూనివర్శిటీ అకడమిక్ స్ట్ఫా కాలేజీకి యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యుజిసి) కోటి రూపాయల నిధులు విడుదల చేసినట్టు ఎయు విసి జిఎస్‌ఎన్ రాజు తెలియచేశారు. ఈ నిధులతో ఏర్పాటు చేసిన సోషల్ సైనె్సస్‌కు సంబంధించి వింటర్ స్కూల్ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ వింటర్ స్కూల్‌ను ప్రారంభించిన రాజు మాట్లాడుతూ సోషల్ సైన్స్ ఎలా ఉపయోగపడుతోందో వివరించారు. మానవ ఆలోచనలకు మరింత పదునుపెట్టేందుకు సోషల్ సైనె్సస్ ఉపయోగపడుతున్నాయని ఆయన వివరించారు. వివిధ రంగాలు సాంకేతికంగా అభివృద్ధి చెందడానికి సోషల్ సైనె్సస్ పునాది వేశాయని ఆయన చెప్పారు.
ఈ కార్యక్రమం తరువాత విసి రాజు విలేఖరులతో మాట్లాడుతూ యజిసి విడుదల చేసిన కోటి రూపాయల నిధులతో ఫార్మా, ఇంజనీరింగ్, సైన్స్, ఆర్ట్స్ విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండే 15-16 శిక్షణా శిబిరాలను నిర్వహించనున్నామని అన్నారు. అలాగే 24 కంప్యూటర్లతో ఒక ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తామని ఆయన తెలియచేశారు. ఈ నిధులతో షార్ట్ టెర్మ్, రిఫ్రెషివ్ కోర్టులను నిర్వహిస్తామని ఆయన చెప్పారు. గతంలో యుజిసి 50 లక్షల రూపాయలనే విడుదల చేసేదని, తొలిసారిగా కోటి రూపాయలు మంజూరు చేసిందని ఆయన తెలిపారు.
‘బడా’ ఇళ్ళకు వుడా రాం రాం
* ‘హరిత’ లబ్దిదారులకు ఊరట
* 34 ప్రాజెక్ట్‌లు రద్దు
విశాఖపట్నం, డిసెంబర్ 18: విశాఖ నగరాభివృద్ధి సంస్థకు ఉన్న బ్రాండ్ ఇమేజ్ నెమ్మది నెమ్మదిగా తెరమరుగవుతోంది. వుడా వేసిన లే-అవుట్‌లంటే జనం వెనక్కు చూడకుండా కొనుగోలు చేస్తారు. అదే వుడా నిర్మించిన ఇళ్ళంట ఎగబడి కొంటుంటారు. ఇది ఒకప్పటి మాట. గత పదేళ్ళలో వుడా కార్యాలయంలో సిబ్బంది, వైస్ చైర్మన్‌ల నిర్వాకం వలన వుడా పరపతి మంట కలిసింది. తప్పుడు లే-అవుట్‌లు, అర్థం పర్థం లేని గృహ నిర్మాణ ప్రాజెక్ట్‌ల వలన జనంలో వుడాకు ఉన్న ఇమేజ్ పూర్తిగా దెబ్బతింది. విశాఖ, శివారు ప్రాంతాల్లో భూముల ధరలను అనూహ్యంగా పెంచేసేందుకు ఒకప్పుడు వుడా నిర్వహించిన వేలం పాటలే కారణం. అలాగే రో హౌసింగ్ పేరుతో రుషికొండ వద్ద గృహాలను నిర్మించి, కోట్ల రూపాయలకు వెచ్చించే ప్రయత్నం చేసింది. దీనివలన 2006-08 సంవత్సరాల మధ్య విశాఖలో భూములు, ఫ్లాట్ల ధరలు ఆకాశాన్నంటాయి. పోనీ ఆ ఇమేజ్‌ను నిలుపుకోగలిగిందా? అంటే అదీ లేదు. గృహ నిర్మాణంలో వుడాకు ఉన్న ట్రాక్ రికార్డు మొత్తం చెడిపోయింది. రో హౌసింగ్‌లో ఇళ్ళు అమ్ముడుపోవడం లేదు. హరిత ప్రాజెక్ట్ తడిసి మోపెడైంది. పోనీ లబ్దిదారులైనా సంతృప్తి చెందారా? అంటే అదీ లేదు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వుడా ఇకపై హెచ్‌ఐజి, ఎంఐజి ఇళ్ళను నిర్మించదు. కేవలం వుడా వేసిన లే-అవుట్లలో ఆర్థికంగా వెనుకబడి ఉన్న వారికి, లో ఇన్‌కం గ్రూప్ వారికి మాత్రమే ఇళ్ళను మాత్రమే నిర్మించాలని నిర్ణయించింది. నగరంలో ప్రైవేటు సంస్థలు భారీగా ఇళ్ళను నిర్మిస్తున్న నేపథ్యంలో వుడా ప్రత్యేకించి గృహాలను నిర్మించాల్సిన అవసరం లేదని వుడా బోర్డు తేల్చి చెప్పిందని వుడా విసి యువరాజ్ తెలియచేశారు. అనకాపల్లిలో వుడా గృహ నిర్మాణాన్ని చేపట్టాలని ప్రతిపాదించిందని, దాన్ని కూడా విరమించుకుంటున్నామని ఆయన తెలిపారు. వచ్చే సంవత్సరం వుడాపై ఆర్థిక భారం పడకూడదన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు.
వుడా చేపట్టిన హరిత ప్రాజెక్ట్ వినియోగదారులకు కాస్త ఊరట లభించింది. ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి సుమారు 45 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చవుతుందని అంచనా వేశారు. ఈ మొత్తాన్ని లబ్దిదారులే భరించాలా? లేక వుడా, లబ్దిదారులు చెరి సగం భరించాలా? అన్న అంశంపై సస్పెన్స్ తొలగింది. ఈ ప్రాజెక్ట్ ప్రారంభించేటప్పుడు చదరపు అడుగు 1719 రూపాయలుగా నిర్దేశించారు. సవరించిన ధర ప్రకారం 2170 రూపాయలు అవుతుందని అంచనా వేశారు. 710 మంది లబ్దిదారుల్లో 42 మంది ఈ ప్రాజెక్ట్‌లో కొనసాగలేక వెనక్కు వెళ్లిపోయారు. ప్రస్తుతం 668 మంది లబ్దిదారులు మిగిలారు. వీరు చెల్లించిన వాయిదాల మొత్తాన్ని బ్యాంకులలో జమ చేసి ఉంచామని ఆయన తెలియచేశారు. దీనిపై వచ్చిన వడ్డీని తిరిగి లబ్దిదారులకే ఇస్తామని విసి యువరాజ్ చెప్పారు. సవరించిన రేట్ల ప్రకారం లబ్దిదారులు చెల్లించాల్సిన మొత్తం నుంచి ఈ వడ్డీని మినహాయించగా, మిగిలిన సొమ్మును వారు చెల్లిస్తే సరిపోతుందని ఆయన చెప్పారు. దీంతో హెచ్‌ఐజి, ఎంఐజి లబ్దిదారులు కేవలం రెండు నుంచి ఐదు లక్షల రూపాయలు అదనంగా చెల్లిస్తే సరిపోతుందని ఆయన వివరించారు. ఈ ప్రాజెక్ట్‌లో మిగిలిన 42 గృహాలకు జనవరిలో నోటిఫికేషన్ జారీ చేస్తామని ఆయన తెలియచేశారు. కొత్తగా గృహాలు కొనుగోలు చేయదలచిన వారికి ఎస్‌ఎఫ్‌టి 2,600 రూపాయలకు విక్రయిస్తామని ఆయన చెప్పారు.
ఇదిలా ఉండగా వుడా నాలుగు, ఐదు సంవత్సరాల కిందట చేపట్టిన ప్రాజెక్ట్‌లు నేటికీ గ్రౌండ్ కాలేదు. ఈ ప్రాజెక్ట్‌లను రద్దు చేయాలని బోర్డు నిర్ణయించినట్టు విసి వెల్లడించారు. ఇలాంటివి 34 వర్క్‌లను రద్దు చేస్తున్నామని ఆయన చెప్పారు. సరైన ప్రణాళిక లేకుండా ప్రాజెక్ట్‌లను ప్రారంభించడం వలనే గ్రౌండ్ కాలేదని ఆయన చెప్పారు. మల్టీ లెవెల్ పార్కింగ్, శ్రీకాకుళంలో ఆడిటోరియం, గంభీరం లే-అవుట్‌లో 133 కోట్ల రూపాయలతో శాటిలైట్ టౌన్ షిప్ నిర్మాణం, బీచ్ రోడ్డు సుందరీకరణ, అనకాపల్లిలో మున్సిపల్ కార్యాలయ నిర్మాణం వంటి పనులను రద్దు చేస్తున్నట్టు ఆయన చెప్పారు. వీటికి ప్రత్యామ్నాయంగా ప్రతి జోన్‌లో మాస్టర్ రోడ్లను అభివృద్ధి చేయనున్నామని విసి తెలిపారు. తుని, చినముషిడివాడలో స్టేడియంలను నిర్మించనున్నామని అన్నారు. వైఎస్‌ఆర్ పార్క్‌ను 35 కోట్ల రూపాయలతో నిర్మించాలని నిర్ణయించినా, అందులో కొన్ని కట్టడాలను తగ్గించి 15 నుంచి 20 కోట్ల రూపాయలకే పరిమితం చేయాలని నిర్ణయించామని యువరాజ్ వెల్లడించారు. చిల్డ్రన్ ఎరీనాను తొమ్మిది కోట్ల రూపాయలతో నిర్మించాలని భావించామని, కానీ అది 25 కోట్లకు పెరిగిందని విసి చెప్పారు. ఇటీవల జరిగిన బోర్డు సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చినప్పుడు నిర్మాణ వ్యయాన్ని 18.6 కోట్ల రూపాయలకు తగ్గించామని ఆయన చెప్పారు.
1996లో జారీ అయిన కోస్టల్ రెగ్యులేటరీ జోన్ ఉత్తర్వుల స్థానే 2011లో కోస్టల్ జోన్ మెనేజ్‌మెంట్ ప్లాన్ అమల్లోకి వచ్చిందని అన్నారు. దీన్ని 48 నెలల్లో అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిందని దాన్ని అమలు చేయకపోవడం వలన పాత జోన్‌లే కొనసాగుతాయని విసి వెల్లడించారు. వుడా భూములకు సంబంధించి ఒక రిజిస్టర్‌ను నిర్వహించనున్నామని అన్నారు. రికార్డుల ప్రకారం వుడాకు ఆరు వేల ఎకరాల భూమి ఉందని, కానీ రెండు వేల ఎకరాలకే జిఓలు ఉన్నాయని అన్నారు. మిగిలిన నాలుగు వేల ఎకరాలకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నామని ఆయన చెప్పారు. ఈ భూముల బాధ్యతను హెచ్‌ఓడిలకు అప్పగించనున్నామని ఆయన తెలియచేశారు.
ఇదిలా ఉండగా వుడా భూ కుంభకోణంతో సంబంధం ఉన్న సిబ్బందిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి రంగం సిద్ధమైందని అన్నారు. ఎనిమిది మందిపై ఇప్పటికే చార్జిషీట్ నమోదైందని యువరాజ్ వెల్లడించారు.
విలీనానికి వ్యతిరేకంగా
‘ప్రజా’్భప్రాయం
* సందిగ్థంలో ‘పంచా’యితీలు
విశాఖపట్నం, డిసెంబర్ 18: భీమిలి నియోజకవర్గంలోని ఐదు పంచాయతీలను జివిఎంసిలో విలీనం చేయడంపట్ల అక్కడి ప్రజలు తీవ్ర అభ్యంతరం తెలియచేశారు. భీమిలి నియోజకవర్గంలోని నగరంపాలెం, కాపులుప్పాడ, చేపలుప్పాడ, నిడిగట్టు, జయంతివారి అగ్రహారం పంచాయతీలను జివిఎంసిలో విలీనం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఆ ప్రాంతానికి చెందిన వారు కోర్టుకు వెళ్లడంతో విలీనంపై కథ మళ్లీ మొదటికి వచ్చింది. ఈ పంచాయతీను విలీనం చేసే విషయమై ప్రజాభిప్రాయాన్ని సేకరించాలని ఆదేశించడంతో బుధవారం ప్రజాభిప్రాయ సేకరణను నిర్వహించారు. ఈ ఐదు పంచాయతీల్లో ప్రజలతోపాటు, శివారు ప్రాంతాలకు చెందిన వందలాది మంది ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి హాజరయ్యారు. జివిఎంలో తమ పంచాయతీలను విలీనం చేయద్దంటూ చెప్పారు. పంచాయతీల్లో ఉన్నందువలన ఉపాధి హామీ పథకం తమకు అమలు అవుతోందని, దీని వలన పేదలు సుఖంగా జీవిస్తున్నారని అన్నారు. విలీనం జరిగితే, ఉపాధి హామీ పనులు కోల్పోతామని అన్నారు. ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోకుండా విలీనం చేయడం వలన తాము చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని అన్నారు. జివిఎంసిలో విలీనమైనప్పటి నుంచి తాము నానా అవస్థలు పడుతున్నామని జనం చెప్పారు. అంతేకాకుండా, విశాఖకు సుమారు 30 కిలో మీటర్ల దూరంలో ఉన్న భీమిలిని విలీనం చేయడం సమంజసమా అంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. జివిఎంసిలో ఈ పంచాయతీలు కానీ, భీమిలి కానీ విలీనానికి ఒక్కరు కూడా మద్దతు తెలపకపోవడం గమనార్హం. ప్రజల అభిప్రాయాలను పంచాయతీరాజ్ శాఖకు తెలియచేస్తామని అధికారులు వెల్లడించారు.
మంచిగా నటిస్తూ మోసగించిన కిలాడీ లేడీ
గోపాలపట్నం, డిసెంబర్ 18: మహిళలకు టైలరింగ్‌లో శిక్షణ ఇస్తూ, మంచిగా నటిస్తూ పలువురు మహిళల వద్ద బంగారు ఆభరణాలు, వేలాది రూపాయల నగదు తీసుకునిన పరారీలో ఉన్న మహిళపై 42వ డివిజన్ పరిధిలోని పలువు ఎయిర్‌పోర్టు జోన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మహిళ జివిఎంసి ఉచిత ఉపాధి శిక్షణ కోర్సులు నేర్పించేందుకు శిక్షకురాలిగా డివిజన్ పరిధిలోని శాంతినగర్ కల్యాణమండపంలో నాలుగేళ్లుగా పనిచేస్తోంది. అలాగే మల్కాపురంలో కూడా శిక్షకురాలిగా పనిచేస్తుండేది. అయితే తనకు జివిఎంసి సమయానికి జీతం చెల్లించడం లేదంటూ అవసరం నిమిత్తం సొమ్ములు అడిగేది, శిక్షణ పొందుతున్న వారందరూ పేదవాళ్లు కావడంతో వారి దగ్గర నగదు లేకపోతే చిన్న చితక మంగారు ఆభరణాలు తీసుకుని కుదువపెట్టి డబ్బులు వాడుకునేది. అలాగే జివిఎంసిలో ఉద్యోగాలు వేయిస్తానంటూ రూ.50 వేలు చొప్పున వసూలు చేసింది. బంగారు ఆభరణాలు ఇఛ్చిన మహిళలు, నగదు ఇచ్చిన వారు తమకు తిరిగి ఇచ్చేయ్యాలంటూ ఒత్తిడి తీసుకురావడంతో పరారైంది. దీంతో బాధిత మహిళలు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు సెల్‌ఫోన్‌లో మాట్లాడి మహిళను గుర్తించారు. విషయం తెలుసుకున్న నిందితురాలు నేరుగా నగర పోలీస్‌కమిషనర్ వద్దకు వెళ్ళి 42వ డివిజన్ మాజీ కార్పొరేటర్ తనపై పలువురిని ఉసి కొల్పుతున్నాడని ఫిర్యాదు చేసింది. తిరిగి పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తుండగా తనకు ఏదో అయ్యిందని ఏ విషయాలు జ్ఞాపకం లేవని, ఎవర్ని గుర్తించ లేకపోతున్నానని నటించడం మొదలుపెట్టింది. దీంతో బాధిత మహిళలు, మాజీ కార్పొరేటర్ బుధవారం నగర సిపిని కలిసి ఆ మహిళపై ఫిర్యాదు చేశారు. మల్కాపురం శిక్షణ కేంద్రంలో కూడా ఆమెపై ఫిర్యాదులున్నాయని తెలిపారు. నిందితురాలిని పోలీసులు విచారిస్తున్నారు.
కాంగ్రెస్‌కు వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారు
విశాలాక్షినగర్, డిసెంబర్ 18: రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయడానికి ప్రయత్నిస్తున్న కాంగ్రెస్, టిడిపిలకు రానున్న ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని వైఎస్సార్‌సిపి నగర కన్వీనర్ వంశీకృష్ణ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. బుధవారం అక్కయ్యపాలెం 80 ఫీట్ రోడ్డులో ఉత్తర నియోజకవర్గం పార్టీ ఇన్‌ఛార్జి జివి.రవిరాజ్ ఆధ్వర్యంలో సమైక్య శంఖారావం సభ జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా పాల్గొన్న వంశీకృష్ణశ్రీనివాస్ మాట్లాడుతూ గతంలో స్వర్గీయ వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారని అన్నారు. వైఎస్సార్ తరువాత వచ్చిన వారు సంక్షేమ పథకాలు ప్రజలకు అందకుండా చేసారని ఆరోపించారు. కాంగ్రెస్, టిడిపి పార్టీలు సీమాంధ్ర ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోకుండా రాష్ట్ర విభజనకు కేంద్ర ప్రభుత్వంతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారన్నారు. అనంతరం రవిరాజు మాట్లాడుతూ సీమాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బకొట్టిన కాంగ్రెస్, టిడిపి నాయకులకు ప్రజలు బుద్ధి చెప్పాలని అన్నారు. రానున్న రోజుల్లో వైఎస్సార్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలు ముందుకు రావడం శుభపరిణామని అన్నారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు, నాయకులు ప్రజా సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ సభలో నాయకులు చొక్కాకుల వెంకటరావు, కోరాడ రాజబాబు, కోలాం గురువులు, దాడి రత్నాకర్, కంపా హునూక్, పక్కి దివాకర్, కొయ్య ప్రసాదరెడ్డి, ప్రభాగౌడ్, పసుపులేటి ఉషాకిరణ్ తదితరులు పాల్గొన్నారు.
ఈనెల 22న మరో స్పెషల్ డ్రైవ్
* ఓటర్ల నమోదుపైనే దృష్టి
* కళాశాలల్లో నమోదునకు చర్యలు
* చదువుకే ప్రాధాన్యం ఇస్తున్న యాజమాన్యాలు
విశాఖపట్నం, డిసెంబర్ 19: ఎన్నడూ లేనంతగా ఈసారి అధికార యంత్రాగం ఓటర్ల నమోదుపై దృష్టిసారిస్తోంది. గత నెల రోజులుగా నిర్వహిస్తున్న ప్రత్యేక డ్రైవ్‌ను మరో అయిదు రోజుల పాటు పొడిగించడంతో పాటు ఈనెల 22న మరోసారి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈనెల 18న నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో సుమారు 34 వేల మంది కొత్తగా ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకున్నట్టు అంచనా. గత నవంబర్‌లో ప్రారంభించిన ఓటరు నమోదు కార్యక్రమంలో ఇప్పటి వరకూ 91వేల మంది ఓటర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. విచారణ అనంతరం వీరికి ఓటరు గుర్తింపు కార్డును జారీ చేస్తారు. ఆన్‌లైన్ ద్వారా ఓటరు నమోదు అవకాశాన్ని కల్పించగా ఒక్క రోజులోనే 8500 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. చివరి రోజున ఆన్‌లైన్ అంతరాయం కారణంగా పలువురు జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకోలేకపోయారు. ఇప్పటికే ఆన్‌లైన్‌లో ఓటరుగా పేర్లు నమోదు చేసుకున్న సుమారు 18వేల మంది ఓటర్లకు గుర్తింపు కార్డులు మంజూరైనట్టు సమాచారం లేదు. ముఖ్యంగా యువతను ఓటర్లుగా నమోదు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కళాశాలల్లో చదువుతున్న యువతను ఓటర్లుగా నమోదు చేసేందుకు చేసిన ప్రయత్నాలు పెద్దగా ప్రయోజనం చేకూర్చలేదని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా ప్రైవేటు కళాశాలల్లో చదువుతున్న సంఖ్యతో పోలిస్తే కొత్తగా ఓటర్ల నమోదులో వారి నమోదు తక్కువగా ఉన్నట్టు గుర్తించారు. సమైక్యాంధ్ర ఉద్యమంతో తరగతులు కోల్పోయిన విద్యార్థులు పూర్తిగా చదువుపైనే దృష్టి కేంద్రీకరించే విధంగా కళాశాల యాజమాన్యాలు ప్రాధాన్యత నిస్తున్నాయి. దీంతో ఇక్కడ విద్యార్థులకు ఓటరు నమోదుపై అవగాహన కల్పించే విషయానికి ప్రాధాన్యత తగ్గింది. దీన్ని గమనించిన అధికారులు కళాశాలల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం ద్వారా ఓటరు నమోదు శాతాన్ని పెంచడంపై దృష్టి సారిస్తున్నాయి.
ఇక అంగన్‌వాడీ కేంద్రాల్లో సహాయకుల ద్వారా చేపట్టిన ఓటరు నమోదు కార్యక్రమం వల్ల పెద్దగా ఫలితం కన్పించట్లేదు. బూత్ స్థాయిలో అంగన్‌వాడీ, ఆశ కార్యకర్తలతో పాటు మహిళా సమాఖ్య ప్రతినిధులు, విఆర్‌ఓలు అందుబాటులో ఉండి ఓటరు నమోదును ప్రోత్సహించాల్సి ఉండగా అటువంటి ప్రక్రియ జరుగుతున్నట్టు కన్పించలేదు. బూత్ స్థాయిలో కొత్తగా ఓటరు నమోదుకు అవసరమైన దరఖాస్తులు అందుబాటులో లేవు. ఒక కాపీని జెరాక్స్ తీయించుకోమంటూ బిఎల్‌ఓలు, అంగన్‌వాడీ,ఆశ కార్యకర్తలు సూచించడంతో పలువురు ఆసక్తి కనబరచట్లేదు.
దిగ్విజయ్ దిష్టిబొమ్మ దగ్ధం
* అసెంబ్లీ నుంచి బిల్లు తిప్పి పంపండి
* ఎపి ఎన్‌జిఓల డిమాండ్
విశాఖపట్నం, డిసెంబర్ 19: రాష్ట్ర విభజన విషయంలో మొండి వైఖరితో ముందుకెళ్తున్న కేంద్ర ప్రభుత్వం తీరుపై ఎపి ఎన్‌జిఓలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర విభజనపై కర్రపెత్తనం చేస్తూ, కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దిగ్విజయ్‌సింగ్ తీరుకు నిరసనగా జిల్లా ఎన్జీఓలు బుధవారం నాడిక్కడ జెడ్పీ కార్యాలయం వద్ద దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈసందర్భంగా ఎన్జీఓ సంఘం జిల్లా అధ్యక్షుడు ఈశ్వరరావు మాట్లాడుతూ దిగ్విజయ్‌సింగ్ వైఖరి వల్లే రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకోవడం మొదలు జిఓఎం ఏర్పాటు, కేంద్ర క్యాబినెట్ ఆమోదం, రాష్టప్రతికి ముసాయిదా బిల్లు పంపడం వంటి అంశాలను చకచకా ముందుకు తీసుకెళ్లడంలో దిగ్విజయ్‌సింగ్ కీలకపాత్ర పోషించారని ఆరోపించారు. మెజార్టీ ప్రజలు నిరాకరిస్తున్న రాష్ట్ర విభజన నిర్ణయాన్ని కేంద్రం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్టప్రతికి క్యాబినెట్ పంపిన ముసాయిదా బిల్లు మొత్తం తప్పుల తడకగా ఉందని ఆరోపించారు. కుట్ర పూరితమైన కాంగ్రెస్ విభజన రాజకీయాన్ని అసెంబ్లీ వేదికగా తిప్పికొట్టాలని సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలను వారు డిమాండ్ చేశారు. బిల్లును ఆమోదించకుండా తిప్పి పంపాలని ఎమ్మెల్యేలకు సూచించారు. ఈసందర్భంగా రాష్ట్ర విభజనకు మూలకారకుడు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దిగ్విజయ్‌సింగ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కార్యక్రమంలో ఎన్‌జిఓ జిల్లా కార్యదర్శి ఎస్ గోపాలకృష్ణ, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
స్తంభించిన బ్యాంకులు
* నిలిచిన ఆర్ధిక లావాదేవీలు
విశాఖపట్నం, డిసెంబర్ 19: వేతన సంఘం ఏర్పాటు, బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలకు వ్యతిరేకంగా తొమ్మిది యూనియన్‌ల బ్యాంకు ఉద్యోగుల ఫెడరేషన్ బుధవారం తలపెట్టిన ఒక రోజు సమ్మె విజయవంతమైంది. జిల్లా వ్యాప్తంగా అన్ని జాతీయ బ్యాంకులు మూతపడ్డాయి. ఒక్కరోజులో దాదాపు 280 నుంచి 300 కోట్ల రూపాయల మేర ఆర్థిక లావాదేవీలు నిలిచిపోయాయని అంచనా. ఈసందర్భంగా యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఆధ్వర్యంలో బ్యాంకు ఉద్యోగులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈసందర్భంగా యూనియన్ ప్రతినిధులు వి శ్రీనివాస్ మాట్లాడుతూ వేతన ఒప్పందం గడువు ముగిసి ఏడాది దాటుతున్నప్పటికీ ప్రభుత్వం ఇప్పటికీ నూతన వేతన ఒప్పందాన్ని ప్రకటించలేదని ఆరోపించారు. గత కొంతకాలంగా తమ నిరసన తెలియజేస్తున్నప్పటికీ స్పందన లేదని ఆరోపించారు. ఇక బ్యాంకింగ్ రంగంలో సంస్కరణల పేరుతో ప్రభుత్వం కొత్త విధానాలను అవలంభిస్తోందని ఆరోపించారు. ఇటీవల రిజర్వ్‌బ్యాంకు ప్రకటన మేరకు ఈక్విటీ శాతాన్ని తగ్గించుకోవడం ద్వారా ప్రైవేటు వారికి దారులు చూపుతున్నారని ఆరోపించారు. ప్రపంచ ఆర్థిక రంగం ఒడిదుడుగుల మధ్య నడుస్తున్న తరుణంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల వల్ల మరిన్ని ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని ఆరోపించారు. పెద్ద సంఖ్యలో విధులను బహిష్కరించిన ఉద్యోగులు ఎస్‌బిఐ ప్రధాన కార్యాలయం వద్ద ప్రదర్శన నిర్వహించారు.
సిటిజన్ చార్టర్ అమలుకు ప్రత్యేక ఫోన్ నెంబర్
* సమీక్షలో జివిఎంసి కమిషనర్
విశాఖపట్నం, డిసెంబర్ 19: సిటిజన్ చార్టర్ అమల్లో జివిఎంసి విభాగాధిపతులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కమిషనర్ ఎంవి సత్యనారాయణ ఆదేశించారు. సిటిజన్ చార్టర్ అమలు, ఇతర సేవలపై కమిషనర్ అధికారులతో బుధవారం సమీక్షించారు. సిటిజన్ చార్టర్‌కు ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, ఇతర అంశాలపై ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఒక ప్రత్యేక ఫోన్ నెంబర్ కేటాయించాలని పేర్కొన్నారు. పలు సేవల నిమిత్తం జివిఎంసి పరిధిలోని ఆరు జోన్లు, అనకాపల్లి, భీమునిపట్నం విలీన ప్రాంతాలకు సంబంధించి అందిన ఫిర్యాదులు, పరిష్కరించిన దరఖాస్తులను ఈ సందర్భంగా ఆయన పరిశీలించారు. మొత్తం 17,161 దరఖాస్తులు అందగా, 13,192 దరఖాస్తులు ఇప్పటి వరకూ పరిష్కారమైనట్టు పేర్కొన్నారు. జోన్-5కు అత్యధికంగా 6873 దరఖాస్తులు రాగా వాటిలో 5,364 దరఖాస్తులు పరిష్కారమైనట్టు అధికారులు వెల్లడించారు. కొత్తగా విలీనమైన భీమునిపట్నం ప్రాంతం నుంచి 195 దరఖాస్తులకు గాను 132 పరిష్కరించినట్టు తెలిపారు. జోన్-3కి 3285 దరఖాస్తులకు గాను 2490, జోన్-6కు 2150, జోన్-2కు 1898 దరఖాస్తులకు గాను1236, జోన్-5కు 1562 దరఖాస్తులకు గాను 1236, అనకాపల్లికి 359 దరఖాస్తులకు గాను 200 దరఖాస్తులను పరిష్కరించినట్టు తెలిపారు. జివిఎంసి నుంచి చెల్లించాల్సిన ఇఎండిలను సకాలంలో చెల్లించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే ఐవిఆర్‌ఎస్ విధానం సక్రమంగా పనిచేయట్లేదని వస్తున్న ఫిర్యాదులపై స్పందిస్తూ తక్షణమే సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. అలాగే కాల్‌సెంటర్‌లకు వస్తున్న ఫిర్యాదులపై కూడా ఆయన అధికారులను వివరణ కోరారు. టౌన్ ప్లానింగ్ పరిధిలోని ఫిర్యాదులు, పెండింగ్ పనులను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు.
అప్పుల బాధ తళలేక దంపతుల ఆత్మహత్యా యత్నం
* భార్య మృతి, భర్త పరిస్థితి విషమం
పద్మనాభం, డిసెంబర్ 19: అప్పుల బాధ తాళలేక దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బుధవారం నాడిక్కడ చోటుచేసుకుంది. ఈ మండలం తునివలస పంచాయతీ శివారు నర్సాపురంలో నివాసం ఉంటున్న కొలగాని శ్రీనివాసరావు గ్రామంలో చీటీల వ్యాపారం చేస్తుంటాడు. గత కొద్ది రోజులుగా అప్పులతో బాధపడుతున్న శ్రీనివాసరావు భార్య సన్యాసమ్మతో కలిసి బుధవారం మధ్యాహ్నం గ్రామానికి సమీపంలోని మామిడితోటకు వెళ్లాడు. సాయంత్రం సమయంలో వీరు పురుగుల మందు సేవించి అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే సన్యాసమ్మ (39) మృతి చెందగా శ్రీనివాసరావు అపస్మారక స్థితికి చేరుకోవడంతో విజయనగరంలోని మహారాజ ఆసుపత్రికి తరలించారు. గత కొంతకాలంగా శ్రీనివాసరావు చీటీల సొమ్ము సక్రమంగా చెల్లించట్లేదని స్థానికులు ఫిర్యాదు చేసినట్టు పద్మనాభం సర్కిల్ ఇనస్పెక్టర్ ఎ శ్రీనివాసరావు విలేఖరులకు తెలిపారు. గతనెల్లో శ్రీనివాసరావు అదృశ్యం కావడంతో చీటీలు వేసిన వారంతా ఫిర్యాదు చేశారని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
వికలాంగురాలిపై అత్యాచారయత్నం
ఉక్కునగరం, డిసెంబర్ 18: వికలాంగురాలిపై అత్యాచార యత్నానికి ఒడిగట్టిన అగంతకుడిని దువ్వాడ జోన్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలావున్నాయి. వడ్లపూడి సమీపంలోని లక్ష్మిపురం కాలనీలో వికలాంగురాలిపై ఇంట్లో ఎవరూలేని సమయంలో గూర్ఖాగా పని చేసే గణేష్ శర్మ అనే వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బాధితురాలి అరుపులతో అక్కడ నుండి ఆయన ఉడాయించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు దువ్వాడ పోలీసులు అతడ్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
బలిమెల జలాశయంపై ఆంధ్రా - ఒడిషా అధికారుల సమావేశం
సీలేరు, డిసెంబర్ 18: బలిమెల నదీ జలాలపై సీలేరు ఎ.పి.జెన్‌కో అతిధి గృహంలో ఇరు రాష్ట్రాల అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆంధ్రా - ఒడిషా రాష్ట్రాల అధికారులు బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో నదీ జలాల వాడకంపై చర్చించారు. ఈసమావేశంలో రెండు రాష్ట్రాల ఉమ్మడి రిజర్వాయర్ అయిన బలిమెలలో ప్రస్తుతం నీటి నిల్వలు ఎవరెవ్వరు ఎంత వాడుకున్నది లెక్కలు కట్టారు. ఈ లెక్కల ప్రకారం బలిమెలలో 117 టి. ఎం.సి.ల నీటి నిల్వలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో ఒడిషా వాటా 42 టి. ఎం.సి.లు, ఆంధ్రా వాటా 78 టి. ఎం.సి.లు నీటిని వాడుకోవాలని ఈసమావేశంలో లెక్కలు తేల్చారు. గతంలో బలిమెల రిజర్వాయర్‌లో నదీ జలాలను ఒడిషా అధికారులు ఎక్కువగా వినియోగించుకున్నందునే 33 టి. ఎం.సి.లు ఆంధ్రా వాటాకు అదనంగా వాడుకోవచ్చని సమావేశంలో లెక్కలు తేల్చారు. దీని ప్రకారం బలిమెల రిజర్వాయర్ నుంచి ఆంధ్రా వాటా ఆరువేల క్యూసెక్కులు, సీలేరు రిజర్వాయర్‌కు 1,500 క్యూసెక్కుల నీటిని ఒడిషాకు రోజు తీసుకునేందుకు ఇరు రాష్ట్రాల అధికారులు సమావేశంలో తీర్మానించారు. ఈసమావేశంలో పొట్టేరు ఛీప్ కన్‌స్ట్రక్షన్ ఇంజనీర్ గణేశ్వర్‌సా, ఒడిషా హైడ్రో పవర్ కార్పొరేషన్ అధికారులు గణేష్‌రామ్‌పండా, ఎం.సి.బారిక్, ఒడిషా ఇరిగేషన్ అధికారులు నారాయణ, ప్రధాన్, సీలేరు ఎ.పి.జెన్‌కో ఎస్. ఇ. వి. ఎల్.రమేష్, డివిజన్ ఇంజనీర్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
గిరిజనుల పట్ల అలసత్వం ప్రదర్శిస్తే ఉపేక్షించేది లేదు
జి.మాడుగుల, డిసెంబర్ 18: గిరిజనుల పట్ల అలసత్వం ప్రదర్శిస్తే ఎవరినీ ఉపేక్షించబోమని పాడేరు ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి వినయ్‌చంద్ హెచ్చరించారు. జి.మాడుగుల మండలం గెమ్మెలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిగానీ, గెమ్మెలి ఎం.పి.హెచ్.ఎ., ఎ.ఎన్.ఎం.లు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ.పి.ని ల్యాబ్ టెక్నీషియం చూస్తుండడంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. గెమ్మెలి సబ్ సెంటర్ పరిధిలో ఎ.ఎన్.ఎం., హెల్త్ అసిస్టెంట్ గైర్హాజరవుతున్నట్టు తనకున్న సమాచారం మేరకు పరిశీలించిన ఆయన పరిశీలన సమయంలో కూడా ఇద్దరు లేకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ గిరిజన ప్రాంతంలో ఉద్యోగాలు చేయాలనుకుంటే చిత్తశుద్ధితో చేయాలని లేదంటే మరో ప్రాంతానికి వెళ్ళిపోవచ్చని ఆయన హెచ్చరించారు. గెమ్మెలి పి.హెచ్.సి. భవన నిర్మాణ పనులు, బాలుర ఆశ్రమ పాఠశాల వసతి గృహం నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు.
పాడేరులో క్లస్టర్ విశ్వవిద్యాలయం
అరకులోయ, డిసెంబర్ 18: పాడేరులో క్లస్టర్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు రాజమండ్రి కళాశాల విద్య ప్రాంతీయ సంయుక్త సంచాలకులు జి.శామ్యూల్‌మోజెస్ తెలిపారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలను బుధవారం తనిఖీ చేసిన ఆయన విలేఖరులతో మాట్లాడుతూ చింతపల్లి, అరకులోయ, జి.మాడుగుల, పాడేరు డిగ్రీ కళాశాలలకు అనుబంధంగా క్లస్టర్ విశ్వవిద్యాలయంను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. గిరిజన విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ఈ ప్రాంతం ప్రజాప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు క్లస్టర్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నామని ఆయన అన్నారు. డిగ్రీ కళాశాలలకు భవనాలకు ఇబ్బందులు ఎదురవుతున్నట్టు గుర్తించి నూతన భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేసామని ఆయన చెప్పారు. రాష్ట్రీయ ఉచ్చర్ శిక్షా అభియాన్ పథకం (రుసా) కింద ప్రతిపాదనలు తయారు చేసామని ఆయన అన్నారు. నూతన భవనాల నిర్మాణానికి గాను ఎస్.సి., ఎస్.టి. సబ్‌ప్లాన్ కింద నిధులు మంజూరుకానున్నట్టు ఆయన చెప్పారు. ఇప్పటికే కొన్ని డిగ్రీ కళాశాలలకు సంబంధించి నూతన భవనాల నిర్మాణానికి అవసరమైన స్థల సేకరణ చేస్తున్నట్టు ఆయన తెలిపారు. విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు పూర్తి స్థాయిలో వసతి కల్పించాలని యోచిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. కళాశాలల్లో సరిపడే సిబ్బందిని నియమించి విద్యాప్రమాణాలను మెరుగుపరుస్తామని ఆయన చెప్పారు. స్థానిక డిగ్రీ కళాశాలలో 480 విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని, వారికి తగిన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నట్టు తమ పరిశీలనలో గుర్తించామని ఆయన అన్నారు. అనంతరం గిరిజన విద్యార్థుల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ అప్పారావు, వైస్ ప్రిన్సిపాల్ సత్యనారాయణ, అద్యాపకులు ధర్మారావు, సంపత్‌రావు పాల్గొన్నారు.