Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ఇతర పార్టీల వైపు టిఆర్‌ఎస్, వైఎస్‌ఆర్ సిపి నేతల చూపు

$
0
0

ఖమ్మం, డిసెంబర్ 18: ఖమ్మం జిల్లాలోని ఆయా పార్టీల నియోజకవర్గ స్థాయి నాయకులు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ప్రధానంగా వైఎస్‌ఆర్‌సిపి నేతలుగా ఉన్న అనేక మంది టిఆర్‌ఎస్ వైపుచూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో జిల్లాలో జగన్ ఓదార్పు యాత్ర చేసిన సమయంలో కీలకంగా వ్యవహరించిన నేతలు వైఎస్‌ఆర్‌సిపిలో చేరి ఆ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. కానీ ఇటీవల రాష్టస్థ్రాయిలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎన్నికల్లో పోటీ చేయటమే లక్ష్యంగా ఇతర పార్టీల వైపుచూస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆ పార్టీలో ప్రధాన నాయకులుగా ఉన్న కొద్ది మంది పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనకపోవటం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారంతా ఇతర పార్టీల్లో చేరేందు కోసమే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనటం లేదని సమాచారం. అయితే ఆ పార్టీలో ప్రధాన నాయకులుగా పేరొందిన వారిలో కొందరు ఇతర దేశాల్లో ఉన్నారని, మరి కొందరు ఇతర పార్టీల నాయకులతో చర్చలు జరుపుతున్నారని వైఎస్‌ఆర్‌సిపి నేతలే వ్యాఖ్యానిస్తున్నారు.
ఇదిలా ఉండగా జిల్లాలో గత 14 సంవత్సరాలుగా బలం పుంజుకునేందుకు అనేక ప్రయత్నాలు చేసి సఫలం కాలేకపోయిన టిఆర్‌ఎస్ నేతలు కూడా మరో పార్టీలో చేరేందుకు సన్నద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఖమ్మంలాంటి నియోజకవర్గాల్లో ఆ పార్టీలో ఉన్నటువంటి వర్గ విభేధాలను పరిష్కరించటంలో అధినాయకత్వం సైతం విఫలమవ్వటంపై పలు అనుమానాలు కూడా ఉన్నాయి. అలాగే జిల్లా కన్వీనర్‌గా ఉన్న వ్యక్తి జిల్లా కేంద్రంలో నిత్యం అందుబాటులో ఉండకపోవటం, జిల్లాలో అడపాదడపా పార్టీ అగ్రనేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొంటున్నప్పటికీ ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవటం, జిల్లాలో తెలంగాణ ఉద్యమాన్ని బలంగా నడిపించిన ఉద్యోగ సంఘాలు కూడా టిఆర్‌ఎస్ పట్ల అంతగా ఆసక్తి కనబర్చకపోవటంతో ఆ పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహాం వ్యక్తమవుతోంది. త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల్లో పోటీ చేయటమే లక్ష్యంగా ఉన్న నేతలు తమకు అందుబాటులో టిక్కెట్ ఇచ్చే వాటిలో చేరేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఒకరిద్దరు నేతలు ఇప్పటికే ఇతర పార్టీల నేతలతో సంప్రదింపులు కూడా జరిపినట్లు తెలిసింది. వైఎస్‌ఆర్‌సిపి, టిఆర్‌ఎస్ నాయకుల్లో కొద్ది మంది ఇటీవల తెలుగుదేశం, కాంగ్రెస్ అగ్రనేతలను కూడా కలిసినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. వైఎస్‌ఆర్‌సిపిని అంతా తానై జిల్లాలో నడిపిస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి నాయకత్వాన్ని ఆమోదిస్తూనే తమకు పోటీ చేయటమే ప్రధాన లక్ష్యమంటూ వేరే పార్టీలోకి చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. టిఆర్‌ఎస్‌లోనైతే నాయకత్వ లేమి, ప్రజలను ఆకట్టుకోలేకపోవటం లాంటి కారణాల వల్లే కార్యకర్తలు, నాయకులు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ఇసుక దందాలో మా పాత్ర ఉందని నిరూపిస్తే దేనికైనా సిద్ధం
పాల్వంచ, డిసెంబర్ 18: ఇసుకదందాలో తమ పాత్రవుందని మావోయిస్టులు నిరూపిస్తే దేనికైనా సిద్ధంగా ఉన్నానని మాజీమంత్రి వనమా వెంకటేశ్వరరావుఅన్నారు. తన స్వగృహంలో బుధవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇసుకదందాలో తనపాత్ర ఉన్నట్లుగా మావోయిస్టుల ఆరోపణలు అర్థరహితమన్నారు. మావోయిస్టులు చేసిన ప్రకటన పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తమపై ద్వేషంతో కొంతమంది మావోయిస్టులకు తప్పుడు సమాచారాన్ని అందించి తన రాజకీయ జీవితానికి అడ్డుకట్టవేయడానికి కుట్రలు పన్నుతున్నారన్నారు. తమపై చేసిన ఆరోపణలను మావోయిస్టులు నివృత్తి చేసుకోవాలన్నారు. తమపై వచ్చిన అభూతకల్పనపై ప్రభుత్వం, జిల్లా కలెక్టర్, ఎస్పీ, మైనింగ్‌శాఖ అధికారులతోపాటు జిల్లాలోని జర్నలిస్ట్‌లకు లేఖలు పంపనున్నట్లు వనమా తెలిపారు. ప్రజలకు సేవలు అందించాలని రాజకీయాల్లోకి వచ్చి 20ఏళ్లలో వార్డుమెంబర్ నుంచి మంత్రిగా పదవులు చేపట్టి బడుగు, బలహీనవర్గాల ప్రజలకు సేవలు అందించిన తమపై మావోయిస్టులు ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు. ఇసుకదందా అంటే ఏమిటోనని ఆయన ప్రశ్నించారు. తన రాజకీయ ప్రస్థానంలో దందాలు చేయడం లేదనే విషయాన్ని మావోయిస్టులందరూ గుర్తించాలన్నారు. తన కుటుంబం గత అనేక సంవత్సరాలుగా అన్నివర్గాల ప్రజల కోసం అహర్నిశలు కృషి చేస్తున్నామన్నారు. ఈవిలేఖరుల సమావేశంలో మహిపతి రామ
యువతతోనే దేశాభివృద్ధి
* జిల్లాలో సైన్స్ మ్యూజియం: జెసి సురేందర్ మోహన్
* ఘనంగా జిల్లా యువజన ఉత్సవాలు
ఖమ్మం(మామిళ్ళగూడెం), డిసెంబర్ 18: యువతతోనే దేశాభివృద్ధి జరుగుతుందని జాయింట్ కలెక్టర్ సురేందర్ మోహన్ పేర్కొన్నారు. బుధవారం భక్తరామదాసు కళాక్షేత్రంలో జిల్లాస్థాయి యువజన ఉత్సవాలను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశం అభివృద్ధి చెందాలంటే యువకుల కృషి ఎంతో అవసరం అన్నారు. యువతీ, యువకుల కోసం ప్రభుత్వం ఆధ్వర్యంలో అనేక యువజన సర్వీసులు ప్రవేశ పెట్టనున్నట్లు తెలిపారు. యువకుల్లో కళలను వెలికి తీయడం కోసం యువజన సర్వీసుల శాఖ అధికారుల కృషి ప్రశంసనీయమన్నారు. యువకుల్లో కళానైపుణ్యం వెలికి తీయడానికి గ్రామీణ స్థాయి నుంచి వారిని ప్రోత్సహించాలని యువజన సర్వీసుల శాఖకు సూచించారు. ప్రభుత్వం యువకులకు తగిన ప్రొత్సాహం అందిస్తుందని తెలిపారు. యువకుల కోసం జిల్లాలో ప్రత్యేకంగా మనవ వరుల అభివృద్ధి అనే సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ సంస్థ ద్వారా మెడికల్, టెక్నికల్, యూత్ సర్వీసులను అనుసంధానం చేయనున్నట్లు సూచించారు. ఈ సర్వీసుల గురించి జిల్లా కలెక్టర్‌తో కూడా చర్చించినట్లు తెలిపారు. జిల్లా కేంద్రంల్లో విద్యార్థులు, యువకుల కోసం ప్రత్యేక సైన్స్ మ్యూజియం త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. భవిష్యత్‌లో యువకుల కోసం మరిన్ని సేవలు అందించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని కళాకారుల ప్రతిభను గుర్తించి రాష్ట్ర స్థాయి పోటీలకు పంపించనున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకోసం జిల్లా కేంద్రంలోని అన్ని సంస్థల సహకారంతో కళాకారులను ప్రోత్సహించనున్నట్లు పేర్కొన్నారు. దేశ భవిష్యత్ ముందుకు సాగాలంటే యువత పాత్ర ప్రధానమైందని అన్నారు. యువకులు పర్యావరణాన్ని పరిరక్షించడానికి సంసిద్ధులు కావాలన్నారు. విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే క్రమశిక్షణను అలవరుచుకోవాలని, ఇందుకోసం ఉపాద్యాయులు తమవంతు కృషి చేయాలని ఆయన కోరారు. సమాజంలో ఎదుటి వారికి ఇచ్చే గౌరవం వల్లనే మనకు గౌరవం దక్కుతుందన్నారు. పాఠశాల స్థాయి నుంచి కళాశాలల స్థాయి వరకు విద్యార్థి దశ ఎంతో ముఖ్యమైందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల అభివృద్ధికి అధికారులతో పాటు యువత కూడా పాటు పడాలని, అదేవిధంగా జిల్లాలో ఉన్న స్వచ్ఛంద సంస్థలు, వాలంటరీలు దేశ అభ్యున్నతి కోసం కృషి చేయలన్నారు. వికలాంగులకు ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేస్తామని హమీ ఇచ్చారు. ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం కళాశాలల యాజమాన్యంతో సంప్రందించి ఐటి రంగంలో ఉద్యోగాలు పొందేందుకు ప్రయత్నిస్తామన్నారు. అనంతరం యువకులు, విద్యార్థులు ప్రదర్శించిన సంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. ఈ కార్యక్రమంలో సెట్‌కమ్ సిఇవో వెంకటరంగయ్య, బిసి సంక్షేమసంఘ ఇడి అంజనేయశర్మ, డిడి అనంద్త్న్రాకర్, వికలాంగుల శాఖ అధికారి మున్నయ్య, ఎస్సీ సంక్షేమసంఘ ఇడి సీతామహలక్ష్మీ, సెట్‌కమ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

వైరా పిఎస్‌లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
వైరా, డిసెంబర్ 18: స్థానిక పోలీస్ స్టేషన్‌లో విచారణ నిమిత్తం తీసుకువచ్చిన వ్యక్తి పేలమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ సంఘటన బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గత నెల 7న మధిర పట్టణంలో జరిగిన శ్రీరామ్ సిటీ గోల్డ్‌లోన్స్‌లో చోరీకి సంబంధించి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. చోరీ సుమారు 3.5కోట్ల రూపాయలు కావడంతో పోలీసులు గత నెల పదిహేనురోజులుగా దశలవారీగా విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే జిల్లా ఎస్పీ రంగనాథ్, వరంగల్ రేంజ్ డిఐజి కాంతారావు ఈకేసుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. పోలీసులు తొలుత సిబ్బందినుండి విచారణ మొదలుపెట్టదలిచారు. చోరీ జరిగిన రాత్రి సమయంలో సెంట్రీ డ్యూటీ నిర్వహించిన మేకా లక్ష్మీనారాయణను స్థానిక పోలీసు స్టేషన్‌లో విచారణ చేసేందుకు సిద్ధమవుతున్న సమయంలో అతను ఆత్మహత్యాయత్నం చేయడంతో పోలీసులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అయితే లక్ష్మీనారాయణకు ప్రాణపాయం లేదని తెలిసి పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

ఉయ్యాలమడుగులో అక్రమ కలప పట్టివేత
* సిబ్బందిపైనే అనుమానాలు
* మీడియాపై డిఆర్‌ఓ చిందులు
చర్ల, డిసెంబర్ 18: కంచే చేను మేసిందన్న చందంగా తయారైంది అటవీశాఖ పరిస్థితి. వేలకు వేలు జీతాలు తీసుకుంటూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. కొందరు అటవీ అధికారులు, సిబ్బంది. చర్ల మండలంలోని ఉయ్యాలమడుగులో రెండోసారి అదే ప్రాంతంలో బయటపడ్డ అక్రమ కలప వ్యవహారమే ఇందుకు ఉదాహరణ. వివరాల్లోకి వెళ్తే... దుమ్ముగూడెం రేంజ్ పరిధిలోని చర్ల మండలంలోని ఉయ్యాలమడుగు బీట్‌లో మంగళవారం అర్థరాత్రి కొంతమంది స్మగ్లర్లు అక్రమ కలపను దాచి ఉంచారనే సమాచారం అందుకున్నారు అటవీ అధికారులు. వెంటనే అక్కడకు చేరుకొని ఆ కలపను స్వాధీనం చేసుకొని ఆఘమేఘాల మీద దుమ్ముగూడెం రేంజ్‌కు తరలించారు. కాగా ఈ అక్రమ కలప వ్యవహారంలో బేస్ క్యాంపులోని కొంతమంది అక్రమార్కులతో చేతులు కలిపి దట్టమైన అడవుల నుంచి అత్యంత విలువైన జిట్రేగి, టేకు కలపను తీసుకువచ్చి సైజులుగా మార్చి వ్యాపారాన్ని జోరుగా సాగిస్తున్నారు. పట్టుబడిన ఈ కలప కూడా అక్రమ రవాణాకే సిద్ధం చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. కాగా కొంతమంది వ్యక్తులు భద్రాచలం డిఎఫ్‌ఓకు సమాచారం అందించకపోతే వీటిని మాయం చేసి ఉండేవారని పలువురు ఆరోపిస్తున్నారు. ఉయ్యాలమడుగులో పట్టుబడిన అక్రమ కలపను డిఎఫ్‌ఓ ఆదేశాల మేరకు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తుండగా అక్కడికి వెళ్లిన విలేఖరులపై డిఆర్‌ఓ హన్మంతరావు చిందులేశారు. ఏం రాసుకుంటారో రాసుకొండంటూ విలేఖరులపై ఆయన దుర్భాషలాడారు. ఈ విషయాన్ని విలేఖరులు డిఏఫ్‌ఓ దృష్టికి తీసుకెళ్ళగా మద్యం తాగి విధులకు హాజరైన డిఆర్‌ఓ హన్మంతరావుపై చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే ఉయ్యాలమడుగులో పట్టుబడిన కలప వ్యవహారంలో కూడా బేస్ క్యాంపు సిబ్బంది హస్తం ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందని, విచారణ చేసి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇదే విషయమై దుమ్ముగూడెం రేంజర్ వెంకటేశ్వరరావును వివరణ కోరగా మొత్తం ఉయ్యాలమడుగులో 12 టేకు దిమ్మెలు లభ్యమయ్యాయని, వీటి విలువ రూ.51 వేలు ఉంటుందని తెలిపారు. ఇదిలా ఉండగా సామాన్యుడి వద్ద రెండు కర్ర ముక్కలు దొరికితే మూడురెట్లు జరిమానాలు వేసి కార్యాలయం చుట్టూ తిప్పించుకునే అధికారులు అక్రమంగా పట్టుబడిన కలపకు మాత్రం సాధారణ జరిమానా విధించి చేతులు దులుపుకోవడం పట్ల పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
స్ర్తి , శిశు సంక్షేమ శాఖ
టిజివోస్ ఎన్నికలు ఏకగ్రీవం
ఖానాపురం హవేలి, డిసెంబర్ 18: తెలంగాణ స్ర్తి శిశు సంక్షేమ శాఖ గెజిటెడ్ అధికారుల సంఘం ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. బుధవారం టిజీవో సంఘం భవనంలో శేషుప్రసాద్ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. ఈ ఎన్నికల్లో 11మందిని కార్యవర్గ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా ఎం ఉషారాణి, అసోసియేట్ ప్రెసిడెంట్‌గా ఆర్.వరలక్ష్మి, ఉపాధ్యక్షురాలిగా ఝాన్సీలక్ష్మిభాయి, ఉదయశ్రీ, నిర్మలజ్యోతి, జయసుగుణకుమారి, సహాయ కార్యదర్శిగా లెనినా, ప్రభావతి, సంధ్యాకుమారి, ట్రెజరర్‌గా రాజేశ్వరి, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ప్రమీల ఎన్నికయ్యారు. అనంతరం జరిగిన సమావేశంలో టిజీవోస్ జిల్లా అధ్యక్షుడు ఖాజామియా ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను అభినందించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో మహిళలు కీలకపాత్ర వహించారని, అదే విధంగా తెలంగాణ బిల్లును ఆమోదించే వరకు తమ కర్తవ్యాన్ని నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో ఉషశ్రీ, ఉషారాణి, వెంకటేశ్వర్లు, సత్య నారాయణ తదితరులు పాల్గొన్నారు.
‘బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుతో
ఖమ్మం జిల్లా రైతులకు అధిక నష్టం’

తల్లాడ, డిసెంబర్ 18: నదీజలాల విషయంలో ఇటీవల బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుతో ఖమ్మం జిల్లాలో అధిక నష్టం కల్గుతుందని రైతుసంఘ భాద్యులు అన్నారు. బుధవారం తల్లాడలో జరిగిన రైతుసంఘ విస్తృత స్థాయి సమావేశంలో రైతుసంఘ జిల్లా నాయకులు నున్నా నాగేశ్వరరావు, తాతా భాస్కర్‌రావు మాట్లాడుతూ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుతో రాష్ట్రంలో 11 జిల్లాలలో అధికంగా రైతులు నష్టపోనున్నారని, వీటిలో ఖమ్మం జిల్లాలో రైతులకు అధికనష్టం వాటిల్లనుందన్నారు. దీనివల్ల ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకంగా మారనుందన్నారు. అడపాదడపా కురిసిన వర్షాల వల్ల రబీకి సాగునీరు అందుతుందని, ఆల్‌మట్టి ఎత్తు పెంపుతో ఖరీఫ్‌కు నీరు అందటం కష్టమవుతుందన్నారు. తక్షణమే దుమ్ముగూడెం వద్ద రాజీవ్‌సాగర్ నిర్మించాలని,దీని వల్ల సుమారు 7లక్షల 50వేల ఎకరాల ఆయకట్టు స్థీరికరింపబడుతుందన్నారు. రాజీవ్‌సాగర్‌ను పాలేరు జలాశయానికి అనుసంధానం చేస్తే మరింత భూమి సాగులోకి వస్తుందన్నారు. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌పై రాష్ట్ర ప్రభుత్వం మరోమారు అప్పీలుకు వెళ్ళాలని డిమాండ్ చేశారు. రైతుల పక్షపాతిగా చెప్తున్న ఈ ప్రభుత్వం రైతులకు చేసింది ఏమి లేదన్నారు. కాంగ్రెస్ పాలన వల్ల రైతులు తీవ్ర నిరాశలతో క్రాఫ్ హాలీడేలు ప్రకటిస్తున్నారని, తుఫాన్ బాధిత రైతులకు తక్షణమే ప్రభుత్వం సహాయం అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు మాదినేని రమేష్, గుంటుపల్లి వెంకటయ్య, నల్లమోతు మోహన్‌రావు, నారికొండ అర్జున్‌రావు, వెంకటయ్య, కృష్ణయ్య, రాంబాబు, బస్విరెడ్డి, అరుణ, పకీరయ్య తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యేక మెగా వైద్య శిబిరానికి ఏర్పాట్లు చేయండి
* ఐటిడిఏ పీఓ వీరపాండియన్
చింతూరు, డిసెంబర్ 18: నిరుపేద గిరిజన కుటుంబాలలో వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారికి చికిత్స కోసం ఏడుగురాళ్లపల్లిలో ఏర్పాటు చేసే ప్రత్యేక వైద్య శిబిరాలను అన్ని శాఖల సమన్వయంతో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అందరికీ లబ్ధి చేకూర్చే విధంగా విజయవంతం చేయాలని భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి జి వీరపాండియన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మండలంలోని ఏడుగురాళ్లపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో వివిధ శాఖల అధికారులతో బుధవారం ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ప్రాంతంలో మలేరియా వ్యాధి విజృంభిస్తున్నందున దాన్ని రూపుమాపేందుకు ముందుగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినప్పటికీ ఈ ప్రాంత ప్రజలు వివిధ వ్యాధులతో బాధపడుతున్న దృష్ట్యా వారందరికీ లబ్ధి చేకూర్చే విధంగా చేయాలనే ఉద్దేశ్యంతో ఈనెల 21న ప్రత్యేక మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని, కావున ఆయా శాఖలకు కేటాయించిన పనులను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ముందుగా గ్రామాల షెడ్యూలు ప్రకారంగా గ్రామాల్లో, నివాసిత ప్రాంతాల్లోకి వెళ్లి ఏఏ వ్యాధులతో ఎవరెవరు బాధపడుతున్నారో గుర్తించి సర్వే చేసిన వివరాలు అందించాలన్నారు.
గిరిజనుల భాష మాట్లాడే విధానం ఇతరులకు అర్థమయ్యే విధంగా ట్రాన్స్‌లేటర్‌ను కూడా ఏర్పాటు చేయాలని, వ్యాధిగ్రస్తులను గుర్తించడంలో అంగన్‌వాడీ, ఆశావర్కర్లకు పూర్తి వివరాలను తెలుసునని, గ్రామంలో జరుగతున్న విషయాలు, సమస్యలకు గల కారణాలు తెలుసుకొని ప్రజలను గుర్తించడంలో అంగన్‌వాడీ కార్యకర్తలకు సులభవౌతుందని తెలిపారు. క్యాంపులో గుర్తించిన వారికి మందులు ఇచ్చి చికిత్స చేసి వదిలిపెట్టకుండా పూర్తిగా నయం అయ్యేంత వరకు వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిని రిఫరల్ వైద్యం కోసం పంపించకుండా అవసరమైతే ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా చికిత్స అందించేలా కృషి చేయాలన్నారు. రక్తపరీక్షల్లో మలేరియా పాజిటివ్ కేసులను చికిత్స అనంతరం వదిలి పెట్టకుండా వారికి పూర్తిగా నయమయ్యేంత వరకు చికిత్సలు చేయిస్తూ పరిశీలించాలన్నారు. అందుకు అంగన్‌వాడీ కార్యకర్తల అవసరం ఉందన్నారు. ఈ ప్రాంతంలో సుమారు 25 వేల మంది ప్రజలకు స్క్రీనింగ్ చేయాల్సి ఉంటుందని, అందుకోసం అనువైన స్థలాన్ని ఎంపిక చేసి ఎలాంటి లోపాలు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. అలాగే తాగునీరు, విద్యుత్ ఏర్పాట్లు చేయాలని సూచించారు. క్యాంపు నిర్వహణకు తమవంతు సాయంగా ఎంఎస్‌ఏఫ్ స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చిందని తెలిపారు. ఈ సమావేశంలో డిడి ఎం సరస్వతి, కొండరెడ్ల స్పెషలాఫీసర్ బి మల్లీశ్వరి, జిల్లా మలేరియా అధికారి ఎ రాంబాబు, అడిషనల్ డిఎంఅండ్‌హెచ్‌ఓ డా.పుల్లయ్య, ఐకెపి ఏపిఎం జయశ్రీ, తహశీల్దార్లు, ఎండీఓలు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

అక్రమంగా తరలిస్తున్న
3.5 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
చండ్రుగొండ, డిసెంబర్ 18: అక్రమంగా తరలిస్తున్న మూడున్నర క్వింటాల రేషన్ బియ్యాన్ని బుధవారం ఉదయం ట్రైనీ ఎస్‌ఐ ఎల్లయ్య స్వాధీనం చేసుకున్నారు. వివరాలిలావున్నాయి. ట్రైనీ ఎస్‌ఐ ఎల్లయ్య తన సిబ్బందితో కలిసి సీతాయిగూడెం గ్రామశివారుల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా అబ్బుగూడెం నుంచి సుజాతనగర్‌కు అక్రమంగా తరలిస్తున్న మూడున్నర క్వింటాల బియ్యాన్ని తనిఖీ చేసి పట్టుకున్నారు. అబ్బుగూడెంకు చెందిన వేముల శ్రీనివాసరావు అనే వ్యాపారి మూడున్నర క్వింటాల బియ్యాన్ని తన సొంత ఆటోలో సుజాత నగర్ తరలిస్తున్నట్లు ఎస్‌ఐ దేవేందర్‌రావు తెలిపారు. శ్రీనివాసరావుపై కేసు నమోదు చేసి రెవెన్యూ అధికారులకు అప్పగించినట్లు తెలిపారు. ఈదాడుల్లో హెడ్‌కానిస్టేబుల్ హేమచంద్రరావు, సిబ్బంది రంగారావు, రవి, రాంబాబు పాల్గొన్నారు.

పోలీస్ చర్యలను నిరసిస్తూ అఖిలపక్షం ప్రదర్శన
కొత్తగూడెం, డిసెంబర్ 18: తెలంగాణ ఉద్యమ కార్యకర్త, ఎఐవైఎఫ్ జిల్లానేత కొప్పరి నవతన్‌పై కొత్తగూడెం స్పెషల్‌పార్టీ పోలీసులు, 1వటౌన్ పోలీసులు చట్టానికి వ్యతిరేకంగా కేసులు పెట్టారని నిరసిస్తూ అ ఖిలపక్షం ఆధ్వర్యంలో బుధవారం 1వటౌన్ పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించడంతో పాటు పోస్ట్ఫాస్ సెంటర్ నుంచి డిఎస్పీ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించి డిఎస్పీ రంగరాజు భాస్కర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా సిపిఐ జిల్లా స హాయ కార్యదర్శి ఎస్‌కె సాబీర్‌పాషా నవతన్‌పై పోలీసులు చేపట్టిన చర్యలను ఈవిధంగా వివరించారు. మంగళవారం సిపిఐ పట్టణ, అర్భన్ కార్యదర్శులైన బండి విజయభాస్కర్, సలిగంటి శ్రీనివాస్‌లు మోటా ర్ సైకిల్‌పై బస్టాండ్ సెంటర్ మీదుగా రైటర్‌బస్తీలోని విజయభాస్కర్ ఇంటికి వెళ్తుండగా అదేసమయంలో రోడ్డుపై నిర్లక్ష్యంగా నడుపుతూ రోడ్డుదాటుతున్న వ్య క్తిని చూసి హరన్‌కొట్టారు. అయినా ఆ వ్యక్తి పట్టించుకోకుండా అడ్డంగా రావడంతో సదరు వ్యక్తిని బండి నడుపుతున్న శ్రీనివాస్ కళ్ళు కనపడడం లేదా అని ప్రశ్నించడంతో సదరు వ్యక్తి శ్రీనివాస్‌ను ఉద్దేశించి ఎ వడివిరా నువ్వు....నీ.. అంటూ దుర్భాషలాడుతుండడంతో అదేసమయంలో అటువైపు వెళ్తున్న నవతన్ మావారిపై ఎందుకు బూతులు తిడుతున్నావంటూ అ డగడంతో అసలు నువ్వెవడివంటూ నవతన్‌పై కూడా దుర్భాషలాడడం జరిగిందని ఆ సందర్భంగా ఇరువు రు ఒకరినొకరు నెట్టుకోవడం జరిగిందని సాబీర్‌పా షా డిఎస్పీకి తెలిపారు. తరువాత సదరు వ్యక్తి పోలీస్‌స్టేషన్‌కు వెళ్ళి తాను ఎఎన్‌ఎస్ కానిస్టేబుల్‌నని నవతన్‌పై ఫిర్యాదు చేయడంతో పోలీసులు 353సెక్షన్ కింద నవతన్‌పై కేసునమోదు చేశారు. తరువాత కేసుపెట్టిన కానిస్టేబుల్ రెండుజీపుల్లో తన సహచర స్పెష ల్ పార్టీ సిబ్బందితో కలిసి నవతన్ ఇంటికి వెళ్ళి అక్క డ నవతన్ లేకపోవడంతో గుండెజబ్బుతో బాధపడుతున్న నవతన్ తండ్రితో పాటు కుటుంబసభ్యులను భయబ్రాంతులకు గురిచేసి నవతన్‌ను స్టేషన్‌కు పిలిపించుకొని రాత్రి వరకు నిర్భందించారు. తరువాత అ ర్ధరాత్రి స్పెషల్ పార్టీ పోలీసులు నవతన్‌ను హింసించడానికి ప్రణాళికలు రూపొందించుకోగా అనారోగ్యంతో ఉన్న తన కూతురు గుర్తుకువచ్చి ఉద్రేకంతో నవతన్ తనచేతిని తానే గాయపర్చుకోగా ప్రైవేట్ ఆ సుపత్రికి తరలించి వైద్యం చేయించి తిరిగి 1వటౌన్ పోలీస్‌స్టేషన్‌లో నిర్భందించారు. బుధవారం తెల్లవారుజామున ప్రకాశం స్టేడియంగేటు నుంచి 1వటౌన్ పోలీస్‌స్టేషన్‌లోకి 15మంది స్పెషల్‌పార్టీ పోలీసులు వెళ్ళి రాయడానికి వీలులేని బూతులు తిడుతూ మూ డులాఠీ కర్రలు విరిగేవిధంగా కొట్టారు. అంతేకాకుం డా అనాగరిక అరాచక విధానంగా బానిసలను పెత్తందారులు కాళ్ళు మొక్కించుకునే విధంగా సదరు కానిస్టేబుల్ కాళ్ళను నవతన్‌తో మొక్కించుకున్నారు. చట్టాన్ని చేతిలోకి తీసుకొని పోలీస్‌శాఖపై ప్రజలకు ఉన్న గౌరవానికి మచ్చతెచ్చే విధంగా ప్రవర్తించిన వా రిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చిన్నవిషయానికి నవతన్ అనే దళితుడిపై 353సెక్షన్ పెట్టి అరాచకంగా కొట్టడాన్ని తాము ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కా ర్యదర్శి ఎస్‌కె సాబీర్‌పాషా, జిల్లా నాయకులు బరిగె ల సాయిలు, బందెల నర్సయ్య, టిఆర్‌ఎస్ నాయకు లు కంచర్ల చంద్రశేఖర్, జెవిఎస్ చౌదరి, హుస్సేన్, అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు మ ద్దెల శివకుమార్, టి ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు గుండా రమేష్, బిసిసంఘం నాయకులు ఆకుల నాగేశ్వరరావు, బిజెపి నాయకులు జివికె మనోహర్, న్యా యవాద జెఎసి నాయకులు వై ఉదయ్‌భాస్కర్, భా స్కర్‌రావు, మునిగడప వెంకటేశ్వర్లు, పుల్లయ్య, లక్కినేని సత్యనారాయణ, దుర్గారావు, ప్రభాకర్‌రెడ్డి, బా గం మాధవరావు, రామ్మూర్తి, కోటం రాజు పాల్గొన్నారు.
సరైన మెడికల్ ధృవీకరణ పత్రాలతో రిమాండ్ చేయాలని న్యాయమూర్తి ఆదేశం
పోలీస్ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదులో భాగంగా రిమాండ్ చేసిన నిందితుడిని సరైన మెడికల్ ధృవీకరణ పత్రాలతో రిమాండ్ చేయాలని కొత్తగూడెం ఒకటవ అదనపు న్యాయమూర్తి ఎం కిరణ్మయి 1వటౌన్ ఎస్‌హెచ్‌ఓ నరేష్‌కుమార్‌ను ఆదేశించారు. బుధవా రం స్థానిక కొత్తగూడెం కోర్టులో పోలీస్ కానిస్టేబుల్ ను అడ్డగించాడన్న కేసులో అభియోగంపై తీసుకువచ్చిన కందుల నవతన్ అనే వ్యక్తిని న్యాయమూర్తి ముందు హాజరుపర్చగా నడవలేని స్థితిలో ఉన్న అతడిని న్యాయమూర్తి ప్రశ్నించగా సదరు వ్యక్తి న్యాయమూర్తికి తనగోడును వినిపించాడు. పోలీస్, స్పెషల్ పార్టీ కానిస్టేబుళ్ళు తనను విచక్షణ రహితంగా కొట్టి హింసించారని తెలిపి తనను కొట్టిన గాయాలను న్యా యమూర్తికి చూపించగా అది చూసి స్పందించిన న్యాయమూర్తి సరైన మెడికల్ ధృవీకరణ పత్రంతో రి మాండ్ చేయాలని తీసుకువచ్చిన రిమాండ్‌ను వెన క్కి పంపించారు.

ఇసుక రీచ్‌ల ఆడిటింగ్‌కు
సహకరించకుంటే సంఘాలదే బాధ్యత
భద్రాచలం, డిసెంబర్ 18: పీసా చ ట్టం ద్వారా భద్రాచలం డివిజన్‌లో ఏ ర్పాటు చేసిన ఇసుక రీచ్‌ల ఆడిటింగ్‌ల కు సహకరించకుంటే భవిష్యత్‌లో జ రిగే పరిణామాలకు సంఘాలే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఐటిడిఏ పిఓ జి వీరపాండియన్ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన ఇసుక రీచ్‌ల అధ్యక్ష, కార్యదర్శులతో పాటు సంబంధిత అధికారులతో సమావేశమై మాట్లాడారు. ఇసుక రీచ్‌ల ఏర్పాటు, పరస్పర సహకార సంఘాలు ఏర్పడినందున స్వయంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. అనుకోని వి ధంగా ఏదైనా జరిగితే పూర్తి బాధ్యత సొసైటీలదేనని స్పష్టం చేశారు. ఇసుక రీచ్‌ల్లో లోపాలు లేకుండా అధికారులు సరి చేయాలన్నారు. రికార్డుల తయారీలో ఏవైనా సందేహాలు ఉంటే సహకా ర అధికారులను సంప్రదించాలని సూ చించారు. నిర్థిష్ట కాల వ్యవధిలో రికార్డులు సరి చేయని ఇసుక రీచ్‌లపై షో కాజు నోటీసులు, అవసరమైతే క్రిమిన ల్ కేసులు పెట్టేందుకు సైతం వెనుకాడే ది లేదన్నారు. ఇసుక రీచ్‌ల ద్వారా తీసి న ఇసుకలో 50 శాతం కమర్షియల్‌గా, 25 శాతం స్థానిక అవసరాలకు మరో 25 శాతం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు అందించాల్సి ఉందని, ఆ మేర కు ఇసుక నిల్వ ఉందో లేదో భూగర్భ గనుల శాఖ అధికారులు పరిశీలించాల ని ఆదేశించారు. భద్రాద్రి ఇసుక రీచ్ వా రు ఆడిటింగ్ రికార్డులు ఇవ్వడం లేదని డివిజనల్ సహాయ శాఖ అధికారిణి పి ఓ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమావేశం లో ఆర్డీఓ కె వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

పెన్షన్లు పెంచకుంటే ప్రభుత్వానికి బుద్ధి చెబుతాం
కొత్తగూడెం , డిసెంబర్ 18: వృద్ధులకు, వితంతువులు, వికలాంగులకు పెన్షన్లు పెంచకుంటే రా నున్న ఎన్నికల్లో ప్రభుత్వానికి తగిన బుద్దిచెబుతామ ని సిపిఎం రాష్టక్రమిటీ సభ్యులు కాసాని ఐలయ్య స్ప ష్టం చేశారు. సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలేనిరాహార దీక్షలు బుధవారం ముగిశాయ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరిగిన ధరలకు అనుగుణం గా పెన్షన్ పెంచాలని ధరలు ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో మధ్యతరగతి జీవనం కొనసాగిస్తున్న వృ ద్ధులు, వికలాంగులు, వితంతువులు అనేక ఇబ్బందులకు గురౌతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీరికి ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ వారి కనీస అవసరాలు తీర్చేవిధంగా లేదని, ప్రభుత్వం స్పందించి వీరికి పెన్షన్లు రూ.1500వరకు పెంచాలని డిమాండ్ చేశారు. పెన్షన్‌దారులపై సవతితల్లి ప్రేమ చూపిస్తున్న ప్రభుత్వం రానున్న ఎన్నికల్లో కనుమరుగు అవ్వడం ఖాయమన్నారు. పెన్షన్‌దారులు ఐక్యమంగా ఉద్యమించి ప్రజావ్యతిరేక ప్రభుత్వాన్ని సాగనంపాలని పిలుపునిచ్చారు. తొలుత సిపిఎం ఆధ్వర్యంలో బస్టాండ్‌సెంట ర్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ ప్రదర్శన నిర్వహించి ఆర్డీఓ అమయ్‌కుమార్‌కు సమస్యలతో కూడిన వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం డివిజన్ కార్యదర్శి అన్నవర పు సత్యనారాయణ, డివిజన్ కార్యదర్శిసభ్యులు కు న్సోత్ ధర్మా, పట్టణ కార్యదర్శి భూక్య రమేష్, నాయకులు జునుమాల నగేష్, వీర్ల రమేష్, వీరన్న, భూక్య బాబు, రాజారావు, చల్లా నర్సింహా, బిక్కులాల్, చల్లా శకుంతల, శ్రీనివాస్, శోభ, వెంకటయ్య పాల్గొన్నారు.

ఇసుక ట్రాక్టర్ల యజమానులపై
పోలీసుల కక్షసాధింపు తగదు
పాల్వంచ, డిసెంబర్ 18: పాల్వంచ పట్టణ, మండల పరిధిలోని ఇసుక ట్రాక్టర్ల యజమానులపై పోలీస్ అధికారుల కక్షసాధింపుచర్యలు తగవని టిడిపి రాష్ట్ర కార్యదర్శి కిలారు నాగేశ్వరరావు, ఆ పార్టీ నాయకులు ఆరోపించారు. పాల్వంచ మండల పరిధిలోని వీరునాయక్ నివాసగృహంలో బుధవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఇసుక అక్రమరవాణ జరుపుతున్నారని ఇసుకట్రాక్టర్లను పట్టుకున్న పోలీసులు నెలలు గడుస్తున్నప్పటికీ రిమాండ్‌కు పంపకుండా స్టేషన్‌లోనే ఉంచుకోవడంలో అంతర్యమేమిటని నిలదీశారు. ట్రాక్టర్ యజమానులు ఇసుకను సరఫరా చేస్తుంటే పట్టుకున్న పోలీసులు వారిని రిమాండ్‌కు పంపకుండా కుంటిసాకులు చెబుతూ కావాలని స్టేషన్‌చుట్టు ట్రాక్టర్ యజమానులకు తిప్పుకుంటున్నారని వారు ఆరోపించారు. ట్రాక్టర్ డ్రైవర్లను ఇటీవల పోలీసులు విచక్షణరహితంగా కొట్టగా వారు ఇట్టి విషయాన్ని జిల్లా ఉన్నతాధికారులకు, మానవహక్కుల కమీషన్‌ను ఆశ్రయించారు. అయినప్పటికి పోలీసుల ప్రవర్తనలో మార్పురాకపోవడం శోచనీయమన్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ట్రాక్టర్ యజమానులను ఇటీవల గోప్యంగా ఉంచిన ట్రైనీ డిఎస్పీతో పాటు ఎస్‌ఐలు కావాలని ట్రాక్టర్ యజమానులను స్టేషన్‌కు పిలిపించుకొని వారిని కొట్టారని ఆరోపించారు. ఇప్పటికైనా పోలీసులు ఏకపక్ష విధానాలను విడనాడి ప్రవర్తనను మార్చుకోవాలని అన్నారు. ఇప్పటికైనా ఇసుక ట్రాక్టర్ల యజమానులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని, స్టేషన్‌లో ఉన్న ఇసుక ట్రాక్టర్లను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో హైకోర్టును ఆశ్రయిస్తామని వారు హెచ్చరించారు. ట్రాక్టర్ యజమానులపై పోలీసుల ప్రవర్తన వలన వారు జీవనోపాధిని కోల్పోతున్నారని కావున డ్రైవర్లకు, యజమానులకు నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఈసమావేశంలో టిడిపి నాయకులు కనగాల అనంతరాములు, రేగడి మధుసూధన్‌రావు, కత్తి శ్రీను, కుటుంబరావు, వెంకటేశ్వరరావు, శ్రీను పాల్గొన్నారు.

ఖమ్మం జిల్లాలోని ఆయా పార్టీల నియోజకవర్గ స్థాయి నాయకులు
english title: 
trs, ysrcp

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>