తెర్లాం, డిసెంబర్ 18: పార్వతీపురం డివిజన్ పరిధిలో గల బ్రాంచి పోస్టు ఆఫీసుల ద్వార 2.63 లక్షల ఆర్‌డి, ఎస్‌బి పొదుపు ఖాతాలను ప్రారంభించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామని ఆ శాఖ పోస్టల్ సూపరిండెంట్ నాగాదిత్యకుమార్ తెలిపారు. తెర్లాం సబ్ పోస్ట్ఫాసు ఆఫీసు పరిశీలన కోసం బుధవారం వచ్చారు. ఈ సందర్భంగా ఆయనను కలిసిన విలేకర్లతో మాట్లాడుతూ ఇంత వరకు లక్ష 70వేల పొదుపు ఖాతాలను ప్రారంభించామని ఇంకా 93వేల పొదుపు ఖాతాలను మార్చి 31లోగా పూర్తి చేయాలని సంబంధిత బిపి ఎంలను ఆదేశించడం జరిగిందన్నారు. బొబ్బిలి, పార్వతీపురం హెడ్ పోస్ట్ఫాసుల ద్వార మీ-సేవ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఎటిఎంలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. డివిజన్ పరిధిలో గల అన్ని బ్రాంచ్ పోస్ట్ఫాసులను కంప్యూటరీకరణ చేయడం జరుగుతుందన్నారు. పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రభుత్వ ఉద్యోగాలకు మాత్రమే పాలసీలను ఇవ్వడం జరిగిందని ప్రస్తుతం గుర్తింపు పొందిన కళాశాలలో పనిచేస్తున్న ఉద్యోగాలు కూడా ఈ అవకాశాన్ని కల్పించడం జరిగిందన్నారు. ఆశ్వీర వచనం పథకం కింద తిరుమల తిరుపతి దేవస్థానానికి 5రూపాయిలు మనియార్డర్ చేస్తే ప్రసాదం, అక్షింతలు, వెంకటేశ్వరస్వామి ఫొటోలను అందచేస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. 20పోస్టల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని అందులో 8మందికి ఇంటర్వ్యూలను నిర్వహించడం జరిగిందని వీరికి త్వరలో నియామక పత్రాలను అందచేయడం జరుగుతుందన్నారు. ఆయనతో పాటు స్టెనో జి.వి.రమణ, ఎస్.పి.ఎం.బొత్స రాము, తదితర సిబ్బంది ఉన్నారు.
రూ. 1.92 కోట్ల విలువైన
ఆధునిక యంత్రాలు పంపిణీ
బొండపల్లి, డిసెంబర్ 18: జిల్లాలో 1.92 కోట్ల విలువైన రైతులకు ఆధునిక వ్యవసాయ పరికరాలను పంపిణీ చేసినట్లు అంతరజిల్లా వ్యవసాయ శాఖ బృందం సభ్యులు ఎం.పి ఆధరణకుమార్ (ఎడి) తెలిపారు. బుధవారం మండలంలోని కనిమెరకలో పంపిణీ చేసిన పరికరాల వినియోగాన్ని వీరు పరిశీలించారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ ఈ ఏడాది యాంత్రీకరణ పరికరాలను కొనుగోలు చేసేందుకు 5.61 కోట్లు మంజూరు చేయగా ఇప్పటివరకు 1.92 కోట్ల విలువైన పరికరాలను అందజేశామని అన్నారు. రాష్ట్ర కమీషన్ ఆదేశాల మేరకు వీటి వినియోగాన్ని తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో బాగంగా కనిమెరక గ్రామంలో పద్మావతి రైతు మిత్ర సంఘం వారికి అందించిన పరికరాలను పరిశీలించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి ఎడి వి.జోగిరాజు, గజపతినగరం సబ్‌డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు సి.హెచ్ లచ్ఛన్న, బొండపల్లి, దత్తిరాజేరు మండల వ్యవసాయాధికారులు మాధవి, కె.తిరుపతిరావు, ఆర్.రేఖ తదితరులు పాల్గొన్నారు.
‘ద్రోహులుగా మిగిలిపోతారు’
విజయనగరం , డిసెంబర్ 18: సీమాంధ్ర ప్రజాప్రతినిధులు తెలుగుజాతి ద్రోహులుగా మిగిలిపోయారని విశాలాంధ్ర మహాసభ జిల్లా కన్వీనర్ మామిడి అప్పలనాయుడు అన్నారు. ముడుపులకు, పదవులకు అమ్ముడుపోయి రాష్ట్రాన్ని తెలుగుజాతిని సోనియాకు తాకట్టు పెట్టారని ఆరోపించారు. రాష్టవ్రిభజనకు వ్యతిరేకంగా బుధవారం ఇక్కడ ఆర్టీసీకాంప్లెక్స్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. అసెంబ్లీకి బిల్లు వచ్చిన వెంటనే అసెంబ్లీని ముట్టడిస్తామని ప్రగల్బాలు పలికిన ఎన్‌జిఓ అసోసియేషన్ నాయకుడు అశోక్‌బాబు కూడా ఇప్పుడు ఎందుకు నోరు మెదపడంలేదని ప్రశ్నించారు. అలాగే సీమాంధ్ర మంత్రులు, ఎం.పి.లు, ఎమ్మెల్యేలు పదవులకు, ప్యాకేజిలకు అమ్ముడుపోయి సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నిర్వీర్యం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు కర్రోతు సత్యనారాయణ, అక్యాన తిరుపతిరావు పాల్గొన్నారు.
పోలీసుల అదుపులో దారి దోపిడీ ముఠా
పార్వతీపురం, డిసెంబర్ 18: దారిదోపిడీకి యత్నించిన ఆరుగురు ముఠాను అరెస్ట్ చేసి వారి వద్ద వివిధ సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు ఇక్కడి ఎఎస్పీ రాహుల్ దేవ్ శర్మ తెలిపారు. బుధవారం ఆయన తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరులతో మాట్లాడుతూ విలాసాలకు అలవాటు పడడంతో యువత దొంగతనం చేసేందుకు దారితీసిన పరిస్థితులు గురించి ఆయన వివరించారు. దారిదోపిడీకి పాల్పడిన వారిని అరెస్టు చేయడంతో పాటు వారివద్ద నుండి రెండు మోటారు బైక్‌లు, మూడుకత్తులు, మద్యం, ఇనుపరాడ్టు, ఏడు సెల్ ఫోన్లు, ఐదు పేపరుగ్లాసులు, స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. అరెస్టయిన వారంతా 20 నుంచి 30 సంవత్సరాల లోపు వారే నని తెలిపారు. 28 ఏళ్ల మహిళ కూడా ఉన్నట్లు తెలిపారు. వీరిని కోర్టుకు గురువారం హాజరు పరుస్తామన్నారు. విశాఖపట్నం జల్లా దేవరాపల్లికి చెందిన ఆశా అనే యువతి ఏవియేషన్ శిక్షణ పొంది చిరుద్యోగిగా పనిచేస్తుంది. అయితే ఈమె విలాసాలకు అలవాటు పడడంతో రూ.1.5లక్షలు అప్పు కూడా చేసింది. ఈ అప్పు తీర్చడానికి తన తల్లికి చెందిన ఎనిమిది తులాల బంగారం తెచ్చి ఒక ఫైనాన్స్ కంపెనీలో తనఖా పెట్టింది. అయితే బంగారం గురించి తల్లి ఆశాకు ఒత్తిడి తేవడంతో తనకు పరిచయం ఉన్న కాకినాడలో ఒక కంపెనీలో వంటమనిషిగా పనిచేస్తున్న పార్వతీపురంలోని బంగారమ్మకాలనీకి చెందిన సతీష్‌ను సంప్రదించగా డబ్బు సంపాదించే మార్గాన్ని అనే్వసిస్తానని చెప్పి తాను పనిచేసే చోట హౌస్ కీపర్‌గా పనిచేస్తున్న శ్రీను సహాయం కోరాడు.దీంతో శ్రీను రూ.50వేలు ఖర్చుపెడితే ముగ్గురు నేరాల చేసేవారిని పురమాయించి చోరీకి పాల్పడవచ్చునని సలహా ఇచ్చారు. దీంతో ఆ ప్రకారం ఒక ప్రణాళిక రూపొందించుకున్నారు. ఈమేరకు ఆశా, సతీష్, శ్రీను అనే వ్యక్తులు కాకినాడ ప్రాంతానికి చెందిన పాత నేరస్తులు వెంకటేశం, రాజు, సత్తిబాబులను దొంగతానానికి పురమాయించి వారితో పాటు ఈ ముగ్గురు కూడా దారిదోపిడీకి ప్లాన్ చేసుకుని, రోజువారీ వడ్డీ వ్యాపారులను అటకాయించే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు మంగళవారం రాత్రి పెట్రోలింగ్ చేస్తుండగా తొలుత ముగ్గురు పట్టుబడగా వారిని విచారించగా మరో ముగ్గురు పట్టుబడ్డారు. దీంతో వీరందరినీ అరెస్ట్ చేసి గురువారం కోర్టుకు తరలించనున్నట్టు ఎ ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ తెలిపారు. పార్వతీపురం పోలీసు సర్కిల్ ఇనస్పెక్టర్ బి.వెంకటరావు, ఎస్‌ఐ లు బి.లక్ష్మణరావు, డి.దీనబంధు, రమణ, నారాయణరావులు పాల్గొన్నారు.
‘జూన్ నాటికి పాఠశాల నూతన భవనాలు’
విజయనగరం, డిసెంబర్ 18: రాష్ట్రీయ మాథ్యమిక శిక్ష అభియాన్ కింద మంజూరైన పాఠశాలల అదనపు తరగతుల గదుల భవన నిర్మాణాలను వచ్చే ఏడాది జూన్ నాటికి వినియోగంలోకి తీసుకురావాలని జిల్లాకలెక్టర్ కాంతిలాల్ దండే అధికారులను ఆదేశించారు. బుధవారం తన కార్యాలయంలో డిఇఒ, పంచాయతీరాజ్ ఇంజనీర్లతో పాఠశాల భవన నిర్మాణాలు, వసతుల కల్పనపై కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలో 16 మోడల్ స్కూల్ భవనాలు మంజూరు కాగా 12 పాఠశాలలు పూరిత చేశారు. మిగిలిన 4 ప్రగతిలో ఉన్నాయని డిఇఒ కృష్ణారావు కలెక్టర్‌కు వివరించారు. నిర్మాణాలు పూర్తయిన పాఠశాలలకు నీటి సరఫరా, టాయిలెట్స్, విద్యుత్ తదితర సౌకర్యాలు కల్పించాలన్నారు. పాఠశాలల్లో ప్రాథమిక సౌకర్యాలపై నివేదికను అందజేయాలని ఎజెసి నాగేశ్వరరావును ఆదేశించారు. జిల్లాకు 331 వంట గదులు, స్టోర్ రూమ్‌లు మంజూరు కాగా కేవలం 13 మాత్రమే పూర్తి కావడం వల్ల పంచాయతీరాజ్ ఇఇ శ్రీనివాసరావుపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్చి 31లోగా మొత్తం పనులు గ్రౌండ్ కాకపోతే ప్రభుత్వానికి సరెండర్ చేస్తానని హెచ్చరించారు. స్థలాభావం వల్ల, కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడం వల్ల నిర్మాణాలు చేపట్టలేకపోతున్నామని ఇఇ వివరించారు. ఇప్పటికీ ప్రారంభం 228 యూనిట్లకు పనివారీగా స్థలం లభ్యత ఉన్నదీ, లేనిదీ నివేదికను తయారు చేసి వచ్చే నెల 9లోగా అందజేయాలని డిఇఒను ఆదేశించారు. ఎంపిడిఒల సహకారంతో విద్యా కమిటీలతో మాట్లాడి కిచెన్ షెడ్లు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 80పాఠశాలలకు మరమ్మతులు చేపట్టేందుకు రూ.1.87 కోట్లు మంజూరైయ్యాయని తెలియజేశారు. ఈ సమావేశంలో సిపిఒ మోహనరావు, ఎజెసి యుసిజి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
‘ప్రభుత్వ రంగ బ్యాంకుల పరిరక్షణకు పోరాటం’
విజయనగరం , డిసెంబర్ 18: ప్రభుత్వ రంగ బ్యాంకుల పరిరక్షణకు పోరాటం చేయాలని, బ్యాంకింగ్‌రంగంలో జరుగుతున్న సంస్కరణలను తిప్పికొట్టాలని స్టేట్ బ్యాంకు ఆఫీసర్స్ అసోషియేషన్ విజయనగరం రీజియన్ కార్యదర్శి పి.శంకరసూర్యరావు పిలుపునిచ్చారు. బ్యాంకింగ్‌రంగంలో జరుగుతున్న సంస్కరణలకు వ్యతిరేకంగా తొమ్మిది బ్యాంకు యూనియన్లు ఇచ్చిన పిలుపుమేరకు బ్యాంకు ఉద్యోగులు ఒక రోజు సమ్మె చేశారు. దీనిలోభాగంగా స్థానిక ఎస్‌బిఐ మెయిన్ బ్రాంచ్‌వద్ద నిరసన ప్రదర్శన చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బ్యాంకింగ్‌రంగంలో ఔట్‌సోర్సింగ్ విధానం వల్ల అర్హత కలిగిన విద్యావంతులైన నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు లేకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఔట్ సోర్సింగ్ వల్ల సరైన వేతన విధానం అమలు కాకపోవడం వల్ల వారికి సరైన ఉద్యోగభద్రత ఉండటంలేదన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఉన్న బ్యాంకు శాఖలను లాభాలు లేనికారణంగా మూసివేస్తున్నారని, దీనివల్ల గ్రామీణ ప్రాంత ప్రజలు ప్రభుత్వరంగ బ్యాంకుల సేవలకు దూరమవుతున్నారన్నారు.
ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి వి.కృష్ణంరాజు మాట్లాడుతూ ప్రభుత్వబ్యాంకుల్లో ప్రభుత్వవాటాను తగ్గించడం వల్ల ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో వెళ్లే ప్రమాదం ఉందని ఆరోపించారు. దీనివల్ల సామాన్య ప్రజలకు బ్యాంకింగ్ సేవలను దూరం చేస్తుందన్నారు. ఎన్‌సిబిఇ రీజనల్ కార్యదర్శి పి.సతీష్, జిల్లా బ్యాంకు ఉద్యోగుల సంఘం నాయకుడు మధుసూదనరావుతదితరులు పాల్గొన్నారు.
సమ్మెతో నిలిచిన బ్యాంక్ సేవలు
విజయనగరం (్ఫర్టు), డిసెంబర్ 18: దేశవ్యాప్తంగా జరుగుతున్న బ్యాంకు ఉద్యోగుల సమ్మెలో భాగంగా అన్ని బ్యాంకులకు చెందిన ఉద్యోగులు బుధవారం సమ్మెలో పాల్గొన్నారు. ఈ కారణంగా జిల్లాలో సుమారు 100 కోట్ల రూపాయల మేరకు వ్యాపార లావాదేవీలు, ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. బ్యాంకులు మూతపడటంతో ఖాతాదారులు అనేక ఇబ్బందులకు గురయ్యారు. అన్ని ఎటిఎంల వద్ద ఖాతాదారులు బారులుతీరారు. బ్యాంకు ఉద్యోగుల సమ్మెలో భాగంగా ప్రదర్శనగా బయలుదేరి ఉద్యోగులు ఎస్‌బిఐ మెయిన్ బ్రాంచ్‌కు వెళ్లారు. కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న సంస్కరణలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్‌ఎపి ముసుగులో కొంతమంది బడా పారిశ్రామికవేత్తలకు సహాయం చేసేవిధంగా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు దోహదపడుతున్నాయని వారు ఆరోపించారు.
రూ. 2.4 కోట్లతో తహాశీల్దార్ కార్యాలయాల నిర్మాణం
విజయనగరం, డిసెంబర్ 18: జిల్లాలోని శిధిలావస్థలో ఉన్న తహశీల్దార్ కార్యాలయాల స్థానంలో నూతన భవనాల నిర్మాణాలను వచ్చే ఏడాది మార్చిలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే అధికారులను ఆదేశించారు. జిల్లాలో 18 మండలాల్లో భవనాలకు అత్యవసర మరమ్మతులు చేయించవలసి ఉందన్నారు. డెంకాడ, గుర్ల, కొత్తవలస మండలాలకు మాత్రమే భవనాలు ఉన్నాయన్నారు. సాలూరు, సీతానగరం, నెల్లిమర్ల, బోగాపురం మండలాల్లో భవనాల నిర్మాణాలకు రూ 2.40 కోట్లు మంజూరైనందున భవన నిర్మాణాలు మార్చి నెలాఖరులోగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. సాలూరు మండలంలో భవన నిర్మాణం సగం పూర్తయినందున బిల్లులు చెల్లింపు చర్యలు తీసుకోవాలన్నారు. మిగిలిన మూడు మండలాల్లో యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించి పూర్తి చేయాలన్నారు. మిగిలిన మండలాల్లో కూడా తహశీల్దార్ కార్యాలయాల్లో నిర్మించడానికి ఆధునిక పద్దతిలో నమూనా డిజైన్ తయారు చేసి సమర్పించాల్సిందిగా ఇంజనీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
కురపాం, ఎస్.కోట మండలాల్లో భవనాల నిర్మాణాలకు రూ.10 లక్షలు చొప్పున మంజూరైనందున కొత్త ఎస్‌ఎస్‌ఆర్‌ఎ రేట్ల ప్రకారం తిరిగి నవీకరణ అంచనాలను, కొత్త భవనాల మంజూరుకు, బకాయిలు విడుదలకు సమగ్ర నివేదికలను రూపొందించి సిసిఎల్‌ఎకు సమర్పించాలని ఎజెసి యుసిజి నాగేశ్వరరావును ఆదేశించారు. గిరిజన మండలాల్లో కొన్ని తహశీల్దార్ కార్యాలయాలను ఎసిఎస్ నిధులతో భవన నిర్మాణాలకు గల సాధ్యాసాధ్యాలు పరిశీలించి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఎసిఎస్ నిధులతో చేపట్టిన పాఠశాల భవనాలు, అంగన్‌వాడీ కేంఅదాలు, ఇతర నిర్మాణాల ప్రగతిని పరిశీలించాలని సబ్‌కలెక్టర్ శే్వతామహంతిని కలెక్టర్ ఆదేశించారు.
నాలుగు నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ వసతి గృహాలు
జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో నాలుగు ఇంటిగ్రేటెడ్ వసతి గృహాల నిర్మాణానికి కలెక్టర్ అధ్యక్షతన నాలుగు ప్రాంతాలను ఎంపిక చేశారు. సాలూరు నియోజకవర్గ పరిధిలో పాచిపెంట, పార్వతీపురం, ఎస్.కోట, చీపురుపల్లి నియోజకవర్గాల్లో ఆయా మండల ప్రధాన కేంద్రాల్లో ఇంటిగ్రేటెడ్ వసతి గృహాలు నిర్మించడానికి ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించడానికి చర్యలు తీసుకోవాలని ఎజెసి యుసిజి నాగేశ్వరరావును కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో సబ్‌కలెక్టర్ శే్వతామహంతి, ఎజెసి యుసిజి నాగేశ్వరరావు, జెడ్పి సిఇఒ మోహనరావు, కలెక్టరేట్ ఎఒ రమణమూర్తి, డిప్యూటి డైరెక్టర్లు ఆదిత్యలక్ష్మి, మోహనరావు పాల్గొన్నారు.
పార్కింగ్ స్థలాల కేటాయింపు
విజయనగరం (్ఫర్టు), డిసెంబర్ 18: పట్టణంలో వాహనాల పార్కింగ్ కోసం స్థలాలను కేటాయిస్తామని మున్సిపల్ కమిషనర్ ఎస్.గోవిందస్వామి చెప్పారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్యపై కమిషనర్‌తో ట్రాఫిక్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అడబాల రవికుమార్ చర్చించారు. పెరుగుతున్న వాహనాల వల్ల ట్రాఫిక్ సమస్య పెరుగుతుందని, సరైన పార్కింగ్ స్థలాలు లేకపోవడం వల్ల వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని రవికుమార్ తెలిపారు. పార్కింగ్, నో పార్కింగ్ బోర్డులు లేకపోవడం వల్ల ఎక్కడ పడితే అక్కడే వాహనాలను నిలిపివేస్తున్నారని, దీనివల్ల వాహనచోదకులు, పాదచార్లు నానా అవస్థలు పడుతున్నారని చెప్పారు. ఈ సమస్యల మయూరి జంక్షన్ వద్ద ఎక్కువగా ఉందని రవికుమార్ తెలిపారు. అందువల్ల ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు, పార్కింగ్ స్థలాలను కేటాయించేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై మున్సిపల్ కమిషనర్ ఎస్.గోవిందస్వామి మాట్లాడుతూ మున్సిపల్ కార్యాలయానికి ఎదురుగా ఉన్న స్థలాన్ని, జనతాబజార్‌ను పార్కింగ్ కోసం కేటాయిస్తామన్నారు.
‘గోగు పంట లాభదాయకంగా చేసుకోవాలి’
విజయనగరం, డిసెంబర్ 18 : గోగు పంటను లాభదాయకంగా మలచుకునేందుకు సాగులో ఆధునిక పద్దతులపై రైతులు అవగాహన పెంచుకోవాలని జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే అన్నారు. కలకత్తాలోని గోగు, అనుబంధ నార పరిశోధన కేంద్రం పరిశీలన, శిక్షణకు జిల్లా నుంచి బయలుదేరిన 22 మంది రైతుల బృందం యాత్రకు జిల్లా కలెక్టర్, కొరుకొండ సైనిక్ స్కూల్ రిజిస్ట్రార్ అశోక్‌బాబులు బుధవారం కలక్టర్ కార్యాలయంలో జెండా ఊపి ప్రారంభించారు. నార ఊర వేయటంలో మెలకువలు నేర్చుకొని జిల్లాలోని రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. అక్కడి రైతులతో చర్చించి ఆధునిక వ్యవసాయ పద్దతులు తెలుసుకోవాలన్నారు. ఐదేళ్ల క్రితం 40 వేల హెక్టార్లతో గోగు సాగు చేయాగా ప్రస్తుతం ఆరువేల హెక్టార్లకు పడిపోవటం విచారకరమన్నారు. యాత్ర ద్వారా గోగు సాగు, నార నాణ్యత పెంచేందుకు మెళకువలను తెలుసుకుని గోగు రైతులకు సహకరించాలన్నారు. ఎజెసి నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు లీలావతి పాల్గొన్నారు.
బ్యాంక్ రుణాల మంజూరులో అక్రమాలపై పోలీసులకు ఫిర్యాదు
సాలూరు, డిసెంబర్ 18: స్థానిక విశాఖ గ్రామీణ బ్యాంకు శాఖలో రుణాల మంజూరులో జరిగిన అక్రమాలపై పోలీసులకు ఫిర్యాదు అందింది. మంగళవారం విశాఖ గ్రామీణ బ్యాంకు బ్రాంచ్ మేనేజర్ అల్లాడ శంకరరావు పట్టణ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బ్యాంకు ద్వారా ఇంతవరకు పంట రుణాలు అనేక మందికి పంపిణీ చేశామన్నారు. భూములకు సంబంధించిన 1బి పట్టాదారు పాసుపుస్తకాలు, నో-డ్యూ ధ్రువపత్రాల ఆధారంగా చేసుకుని రైతులకు రుణాలు పంపిణీచేస్తుంటామన్నారు. అయితే గతంలో బ్యాంకు మేనేజర్‌గా పనిచేసిన అధికారి హయాంలో తప్పుడు ధ్రువపత్రాలపై అధిక మొత్తంలో రుణాలు పంపిణీ చేశారని బ్యాంకు ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందిందన్నారు ఆ ఫిఠ్యాదు మేరకు రుణాల మంజూరు వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణ జరిపించారన్నారు. ఒక అధికారిని తహశీల్దార్‌తో పాటు ఇతర వ్యక్తులను విచారించారన్నారు. 165మంది రైతులకు తప్పుడు ధ్రువపత్రాలపై రుణాలు పంపిణీ చేశారని విచారణలో తేలిందన్నారు. అప్పుడు మేనేజర్‌గా ఉన్న అధికారితో పాటు కొంతమంది దళారీలపై ఫిర్యాదు చేశారన్నారు. 72,23,848రూపాయలు రుణాలుగా పంపిణీ చేసినట్లు నిర్థారణ అయిందన్నారు. బ్యాంకు మేనేజర్ ఫిర్యాదుపై పట్టణ ఎస్ ఐ పి.శ్రీనివాసరావు కేసు నమోదు చేశారు.