శ్రీకాకుళం, డిసెంబర్ 18: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి ఆదిత్యుని ఆలయంలో కన్నులపండువగా మహాసౌరయాగ సహిత మహాకుంభాభిషేక మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. బుధవారం నుంచి ఈ నెల 29వ తేదీ వరకు మహాసౌరయాగం, అనంతరం 30వ తేదీన మహాకుంభాభిషేకాన్ని నిర్వహించేందుకు దైవజ్ఞులు నిర్ణయించారు. ఉదయం ఆరు గంటలకు పూర్ణకుంభంతో వేదమంత్రోచ్ఛరణల మధ్య తిరువీధి నిర్వహించి మహోత్సవాలను ప్రారంభించారు. 7.30 గంటలకు ఆరుద్ర నక్షత్రయుత ధనుర్‌లగ్నమందు మహాకలశాన్ని ఆదిత్యుని వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రత్యేక యాగశాలలో ప్రధాన కలశాన్ని ప్రతిష్ఠించారు. సద్గురు కృష్ణయాజీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహోత్సవాల్లో 150 మంది రుత్వికులు శాస్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనివెట్టి మండపంలో ఏర్పాటు చేసిన 36 హోమగుండాల వద్ద 36 మంది దంపతులు 108 వనమూలికలతో మహాసౌరయాగంలో పాల్గొన్నారు. మహోత్సవాల్లో భాగంగా ప్రత్యేక సంకల్పం, గణపతిపూజ, పుణ్యాహవచనం, రక్షసూత్రాధారణ, యాగశాల ప్రతిష్ఠ, అఖండదీప ప్రతిష్ఠాపన, అంకురార్పణ, అగ్నిమధనం వంటి కార్యక్రమాలను అర్చక బృందం ఘనంగా నిర్వహించింది. విశాఖ వౌనానంద తపోవనం పీఠాధిపతి రామానంద భారతీ స్వామిజీకి, కుటుంబ సమేతంగా హాజరైన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావులకు ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ, అర్చకులు రాజేశ్వరకాశ్యపలు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనివెట్టి మండపంలో భక్తులనుద్దేశించి పీఠాధిపతి భారతీస్వామిజీ, సద్గురు కృష్ణయాజీలు అనుగ్రహభాషణం చేశారు. 1982, 1999, 2007 సంవత్సరాల్లో ఆదిత్యుని ఆలయంలో జరిగిన మహాసౌరయాగ ఆవశ్యకతను, ఆలయ అభివృద్ధిని ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ వివరించారు. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు యాగశాలల్లో క్రతువులు నిర్వహించారు. రెండు గంటలకు పైగా మహోత్సవాల్లో పాల్గొన్న ధర్మాన ప్రసాదరావు ఇంద్రపుష్కరిణి సమీపంలో ఏర్పాటుచేసిన మహాసౌరయాగ మహోత్సవ సాంస్కృతిక సంరంభం వేదికను జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. సాయంత్రం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. ఆలయంలో పూజా కార్యక్రమాలు భక్తుల సౌకర్యార్ధం నారాయణమిల్లు జంక్షన్ వరకు భారీ సౌండ్ సిస్టమ్స్‌ను అమర్చారు. ఇంద్రపుష్కరిణి ప్రాంగణంలో సాంస్కృతిక సంరంభం వేదికను 300 మంది వీక్షించేవిధంగా ఏర్పాట్లు చేసారు. స్వామిని దర్శించుకునే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు ప్రత్యేకంగా ఆలయంలో క్యూలైన్లను ఏర్పాటుచేశారు. తొలిరోజు మహోత్సవాల్లో ఆలయ ఇ.ఒ పుష్పనాధం, పండితులు భాస్కరభట్ల శ్రీరామ్మూర్తి, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్లు అంధవరపు వరహానరసింహం, ఎం.వి.పద్మావతి, కాంగ్రెస్ నేతలు నర్తు నరేంద్రయాదవ్, మోహిని, కె.ఎల్.ప్రసాద్, కోణార్క్ శ్రీను, కమిటీ ప్రతినిధులు ప్రేమ్‌చంద్, మండవిల్లి రవి, ట్రస్టు బోర్డు సభ్యులు పొట్నూరు సూరిబాబు, పసగాడ సూర్యనారాయణ, తెలుగు సూర్యనారాయణ, డబ్బీరు వాసు, టిడిపి మాజీ ప్లోర్‌లీడర్ గుండ లక్ష్మీదేవి, వైకాపా నాయకులు అంధవరపు సూరిబాబు, హనుమంతు కిరణ్‌కుమార్, ఎన్ని ధనుంజయ్, జి.రాధారాణి తదితరులు పాల్గొన్నారు.
* లోకకల్యాణార్ధమే
లోక కల్యాణార్ధమే ఆదిత్యుని ఆలయంలో మహాసౌరయాగాన్ని నిర్వహిస్తున్నట్లు వౌనానంద తపోవన పీఠాధిపతి రామానందభారతీ స్వామిజీ తెలిపారు. భాస్కరుని దర్శించుకుంటే మనస్సు స్తిమితంగా ఉండడంతోపాటు ఆరోగ్యం సిద్ధిస్తుందన్నారు. కుటుంబ సమేతంగా ఈ మహోత్సవాల్లో పాల్గొనాలని కోరారు.
* పునీతులు కండి
పుష్కరకాలం అనంతరం అరసవల్లిలో నిర్వహిస్తున్న మహాసౌరయాగంలో పాల్గొని పునీతులు కావాలని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు. సౌరయాగ ప్రారంభోత్సవంలో భాగంగా పూర్ణకుంభాన్ని తిరువీధి నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ నెల 30వ తేదీవరకు ఈ మహోత్సవాలు జరుగుతాయన్నారు. దేశంలో వివిధ ప్రాంతాల నుంచి యాగంలో పాల్గొనే భక్తుల సౌకర్యార్ధం అన్ని ఏర్పాట్లను పూర్తిచేసినట్లు వివరించారు. దేవస్థానం నిధులతో కాకుండా దాతల సహకారంతోనే మహాసౌరయాగానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.
తెరుచుకోని బ్యాంకులు
శ్రీకాకుళం, డిసెంబర్ 18: బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలకు వ్యతిరేకంగా ఆల్ ఇండియా బ్యాంకింగ్ ఎంప్లారుూస్ యూనియన్ ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ మూతపడ్డాయి. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు 236 ఉండగా సుమారు రెండు వందల కోట్ల రూపాయల పైబడే లావాదేవీలు నిలచిపోయినట్లు బ్యాంకింగ్ ఎంప్లారుూస్ యూనియన్ అధికారుల బోగట్టా. ఇదిలా ఉండగా సంస్కరణలకు తోడు వేతనాల ఒప్పందంలో యాజమాన్యాలు తాత్సారం సహించరానిదని ఉద్యోగులు చెబుతున్నారు. బంద్‌లో భాగంగా ఉద్యోగులంతా భారీ ర్యాలీ నిర్వహించారు. ఆంధ్రాబ్యాంకు, స్టేట్ బ్యాంకు ప్రధాన కార్యాలయాల వద్ద ఉద్యోగులు పెద్దపెట్టున నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. బ్యాంకింగ్ ఎంప్లారుూస్ ఫెడరేషన్ ఆప్ ఇండియా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ మూడు సంవత్సరాల పాటు చర్చించి నిర్ణయం తీసుకున్న పదవ వేతన ఒప్పందం పట్ల తాత్సారం చేయడం, ప్రతికూల ధోరణి సహించరానిదన్నారు. వేరియబుల్ పే, కాస్ట్ టు కంపెనీ ప్రవేశపెట్టాలనుకుంటున్న ఐబి ధోరణికి నిరసనగా సమ్మెలో పాల్గొంటున్నట్లు తెలిపారు. లక్షకోట్ల రూపాయల రుణాలు వినియోగదారులైన 30 కార్పొరేట్ సంస్థలకు యుపిఎ ప్రభుత్వం కొమ్ము కాయడంపై దుయ్యబట్టారు. కార్యక్రమంలో ఎస్‌బిఐ నేతలు రమేష్, ఎస్‌బిహెచ్ నేతలు శంకరరావు, ఆంధ్రాబ్యాంకు నేతలు శ్రీనివాసశాస్ర్తీ తదితరులు పాల్గొన్నారు.
సమైక్యవాదులపై బైండోవర్ కేసులు
శ్రీకాకుళం, డిసెంబర్ 18: రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని, ప్రజాప్రతినిధుల చేతకాని తనంగానే విభజన ప్రక్రియ సాగుతోందని నిరసిస్తూ ఉద్యమం చేపడుతున్న సమైక్యవాదులపై బైండోవర్ కేసులు నమోదయ్యాయి. గతనెల 19వ తేదీన కేంద్ర ఐటి, కమ్యూనికేషన్లు శాఖ సహాయ మంత్రి కిల్లి కృపారాణి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు చించివేసి, తగులబెట్టిన నేపథ్యంలో జడ్పీ, ఆడిట్, ఇంజనీరింగ్ విభాగాల ఉద్యోగులు ఏడుగురిపై బైండోవర్ కేసులు నమోదుచేస్తూ పోలీసులు ఆర్డీవోకు నివేదించారు. కాంగ్రెస్ కార్యకర్త భాషా ఫిర్యాదును అనుసరించి ఎం.పి 33 బై 2013 నెంబరుతో ఈనెల 12వ తేదీ నమోదును అనుసరించి ఆర్డీవో ఈనెల 30వ తేదీన కిల్లారి నారాయణరావు, జి.త్రినాధరావు, పి.శోభారాణి, ఎన్.గోవింద, డి.సూర్యచంద్ర, ఎన్.సోమశేఖర్, టి.శ్రీనివాసరావులను తన ముందు హాజరుకావాలంటూ వారికి నోటీసులు జారీచేయడంతో సమైక్యవాదులు మండిపడుతున్నారు. ప్రజాప్రతినిధుల చేష్టలను వివిధ రూపాల్లో వివరిస్తూ, వారిపై తిరుబాటుబావుటా ఎగురవేస్తుండటాన్ని సహించలేని సీమాంధ్ర ప్రజాప్రతినిధులు సమైక్యవాదులపై కేసులు బనాయించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. రాష్ట్రాన్ని అడ్డంగా నరుకుతుంటే చూస్తూ ఊరుకుంటున్న నేతలు వారి చిత్రపటాలు చిరుగుతుంటే మాత్రం సహించలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
* కేసులతో భయపెట్టలేరు - ఉద్యోగ సంఘాల నేతలు
కేసులతో సమైక్యవాదులను భయపెట్టలేరని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు. దీనిపై జెడ్పీ ఉద్యోగుల సంఘం నేత కిల్లారి నారాయణరావు మాట్లాడుతూ సమైక్యాంధ్ర సాధనే లక్ష్యంగా ఉద్యమిస్తున్న ఉద్యోగులను ప్రజాప్రతినిధులు కేసులతో భయపెట్టాలని చూస్తే భయపడేది లేదని, త్వరలోనే సీమాంధ్రకు ద్రోహం చేస్తున్న ప్రజాప్రతినిధులు ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.
‘అణు’దీక్షల విరమణపై అనుమానాలు
రణస్థలం, డిసెంబర్ 18: మండలం కొవ్వాడలోని అణుపార్కు దీక్షలు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆధ్వర్యంలో విరమించడంపై స్థానిక మత్స్యకార నాయకులు పలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఈ మేరకు మత్స్యకార నాయకుడు మైలపల్లి పట్టయ్య ఆధ్వర్యంలో విలేఖరుల సమావేశం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అణు విద్యుత్ కేంద్రం అధికారులు తెలుగుదేశం పార్టీ నాయకులకు, స్థానిక సర్పంచ్ మైలపల్లి పోలీసుకు ఎంత సొమ్ములు ఇచ్చారన్నారు. తేదెపా నాయకులు దీక్షలు విరమించినా పోరాటం కొనసాగిస్తామని ప్రకటించారు.
రైతుల్లో రింగ్ రోడ్ గుబులు
రాజాం, డిసెంబర్ 18: రాజాం నగర పంచాయతీ అనుసరించి ఏర్పాటు చేయనున్న రింగ్ రోడ్ నిర్ణయం రైతుల్లో గుబులు రేపుతోంది. ఇందిరమ్మ గృహ నిర్మాణాలు, తోటపల్లి ప్రాజెక్టు కోసం వందలాది ఎకరాలు కోల్పోయిన రైతాంగానికి రింగ్‌రోడ్ ఏర్పాటు నిర్ణయం ఆందోళన కలిగిస్తోంది. రాజాం, కొత్తవలస, సారధి, పొనుగుటివసల, కొండంపేట గ్రామాల పరిధిలో సుమారు 39 ఎకరాలు జిరాయితీ భూమిలో ఈ రహదారి ఏర్పాటు చేసేందుకు నగర పంచాయతీ మాస్టర్ ప్లాన్ అనుసరించి ప్రాథమికంగా సర్వే నిర్వహించారు. ఈ సర్వే నివేదిక వుడాకి కూడా పంపించారు. వంద కోట్ల రూపాయలతో ఈ రహదారి ఏర్పాటుకు ప్రతిపాదనకు వైద్య విద్య ఆరోగ్యమంత్రి కోండ్రు మురళీమోహన్ కూడా పచ్చజెండా ఊపారు. అయితే మారుతీనగర్ ప్రాంతంలో నిర్మించిన భవనాలను మినహాయించాలనే ఆందోళనలో మళ్లీ సర్వే నిర్వహించేందుకు జిల్లా సర్వే శాఖ నుండి ఇద్దరు సర్వేలను పంపించాలని కమిషనర్ లేఖ రాయడంతో రింగ్‌రోడ్ ప్రతిపాదన ఊపందుకుంది. అయితే ఈ గ్రామాల పరిధిలోని భూములకు విపరీతమైన ధరలు పలకడంతో పాటు, అలాగే మంచి పంటలు పండే భూములు రహదారి పరిధిలోకి వచ్చే పరిస్థితిని రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనిపై ఆందోళన సాగించేందుకు రైతులు సిద్ధమవుతున్నారు.
ప్రజాప్రతినిధులపై విద్యార్థుల ఆగ్రహం
* హైవే దిగ్బంధం
ఎచ్చెర్ల, డిసెంబర్ 18: సీమాంధ్ర ప్రాంత ఎం.పి.లు, మంత్రులు అసమర్ధులు కావడం వల్లే నేడు టి.బిల్లు అసెంబ్లీకు చేరిందని అంబేద్కర్ విశ్వవిద్యాలయం విద్యార్థులు ధ్వజమెత్తారు. బుధవారం వీరంతా టి.బిల్లును వెనక్కు తీసుకోవాలని, లేకుంటే సీమాంధ్ర ప్రాంత ప్రజలు ఆగ్రహానికి పాలకులు గురికాక తప్పదని హెచ్చరించారు. తొలుత తరగతులు బహిష్కరించి ర్యాలీ, మానవహారం నిర్వహించి నిరసన వ్యక్తంచేశారు. జాతీయ రహదారిపైకి చేరుకుని సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎం.పి.లు డౌన్..డౌన్..అంటూ నినాదాలు చేశారు. యు.పి.ఏ, సోనియా, దిగ్విజయ్‌సింగ్ డౌన్..డౌన్..అంటూ నినదించారు. సుమారు 45 నిముషాలు పాటు జాతీయ రహదారిపై బైఠాయించి సమైక్యాంధ్రకు నినాదాలతో హోరెత్తించారు. దీంతో ఎక్కడ వాహనాలు అక్కడ నిలిచిపోయాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఎస్సై ఉదయ్‌కుమార్ తమ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు.
ఆక్రమించిన భూములను
ప్రభుత్వానికి అప్పగించాలి
*టిడిపి నేత కూన రవికుమార్ డిమాండ్
ఆమదాలవలస, డిసెంబర్ 18: ఆమదాలవలస పట్టణంలో తాండ్రాసిమెట్ట వద్ద సాయిబాబా కోఆపరేటివ్ టెక్స్‌టైల్స్ పేరుతో సుమారు 17 ఎకరాలు, రైల్వేస్టేషన్ ఎదురుగా సుమారు పది ఎకరాలు గల జమాల్ మిల్లు, ఇతర చెరువులు, చెరువు గర్భాలు వంటివి సుమారు 40 ఎకరాల భూములను స్థానిక కాంగ్రెస్ ప్రజాప్రతినిధి కబ్జా చేసి అక్రమంగా ఆక్రమించారని, వీటిన తక్షణమే ప్రభుత్వానికి అప్పగించాలని నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జి కూన రవికుమార్ డిమాండ్ చేశారు. బుధవారం ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమం పేరుతో ఇక్కడి 13వ వార్డులో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నేతల అవినీతే ఊపిరి, అక్రమాలే ఆయువుగా ప్రజాఆస్తులను, ప్రభుత్వ భూములను కొల్లగొడుతున్నారని ఆరోపించారు. మూతపడిన షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తానని హామీ ఇచ్చి గెలిచిన పదేళ్ల పాటు కేంద్ర, రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎమ్మెల్యే సత్యవతి కనీసం ఈ ఫ్యాక్టరీని తెరిపించేందుకైనా ప్రయత్నించలేదన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు విద్యాసాగర్, మొదలవలస రమేష్, బోర గోవింద్, బోయిన సునీత తదితరులు పాల్గొన్నారు.
ప్రజాప్రతినిధులారా ఏకంకండి
* ఎన్జీవో సంఘం నేతల బైక్ ర్యాలీ
శ్రీకాకుళం, డిసెంబర్ 18: రాష్ట్ర విభజన బిల్లును వ్యతిరేకించేందుకు అసెంబ్లీలో, పార్లమెంట్‌లో సీమాంధ్ర ప్రజాప్రతినిధులు ఏకం కావాలని సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక నేతలు పిలుపునిచ్చారు. బుధవారం ఈ మేరకు ఎన్జీవో సంఘం రాష్ట్ర సహాధ్యక్షుడు చౌదరి పురుషోత్తం నాయుడు, జిల్లా అధ్యక్షుడు హనుమంతు సాయిరాంల సారథ్యంలో సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక నేతలంతా పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఏడురోడ్ల కూడలి నుండి డే అండ్ నైట్ కూడలి మీదుగా రామలక్ష్మణ, సూర్యమహల్ కూడలి, పొట్టి శ్రీరాముల కూడలి వరకు ర్యాలీ సాగింది. అనంతరం ఏడురోడ్ల కూడలి వద్ద నిర్వహించిన దీక్షా శిబిరంలో వారు మాట్లాడుతూ అసెంబ్లీ నిర్వహిస్తున్న తీరు హేయమైనదిగా పేర్కొన్నారు. బిల్లుపై చర్చకు 40 రోజుల పాటు సమయం ఇచ్చినప్పటికీ, తెలంగాణావాదుల వాదనలకు భయపడి బిల్లుపై చర్చకు తొందరపడటం ఏంటని ప్రశ్నించారు. సీమాంధ్రకు చెందిన ప్రతిపక్ష నేతలంతా బిల్లును వ్యతిరేకిస్తూ మాట్లాడినా, కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు చూస్తూ ఉండిపోవడం దురదృష్టకరమన్నారు. ఇప్పటికైనా సీమాంధ్రకు చెందిన ప్రజాప్రతినిధులంతా ఏకతాటిపైకి వచ్చి బిల్లును వ్యతిరేకించాలని కోరారు. లేదంటే ద్రోహులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. కార్యక్రమంలో కిల్లారి నారాయణరావు, ఆర్.వి.ఎన్.శర్మ, బి.నర్శింగరావు, పి.జయరాం, గొలివి నర్శునాయుడు, కొంక్యాణ వేణుగోపాల్ పాల్గొన్నారు.
లోక్‌పాల్ బిల్లు ఆమోదం పట్ల హర్షం
శ్రీకాకుళం, డిసెంబర్ 18: సమాజాన్ని చీడపురుగులా పట్టిపీడిస్తున్నా అవినీతి జాప్యాన్ని నియంత్రించేందుకు రూపొందించిన లోక్‌పాల్ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నాయి. స్థానిక సిటిజన్‌ఫోరంలో అధ్యక్షులు బరాటం కామేశ్వరరావు ఆధ్వర్యంలో వక్తలు రాజకీయ, స్వచ్ఛంద సేవాసంస్థ ప్రముఖులు బాణాసంచాలు, మతాబులు వెలిగించి హర్షం వ్యక్తంచేసారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో వినియోగదారుల ఫోరం చైర్మన్ పప్పల జగన్నాధం, లోక్‌సత్తా రాష్ట్ర కార్యదర్శి డి.విష్ణుమూర్తి మాట్లాడుతూ ఇది జనలోక్‌పాల్ బిల్లు కాదని, లోక్‌పాల్ బిల్లు మాత్రమేనన్నారు. నాలుగు దశాబ్ధాల సుదీర్ఘ నిరీక్ష తరువాత ఎట్టకేలకు మోక్షం లభించిందని తెలిపారు. లోక్‌పాల్ వ్యవస్థ ఏర్పడి దేశంలో అవినీతికి అలవాటు పడిన అధికారులు, ప్రజాప్రతినిధులు తప్పకుండా అడ్డుకట్ట వేయగలదని ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ, లోక్‌సత్తా పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు కె.పోలినాయుడు, అప్పలరాజు, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.
మహిళా సంఘాలకు రూ.350 కోట్ల రుణాలు
నరసన్నపేట, డిసెంబర్ 18: ప్రభుత్వ ఆదేశాల మేరకు మహిళా సంఘాలను బలోపేతం చేసే దిశగా రుణాలను అందిస్తున్నామని జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ తెలిపారు. బుధవారం స్థానిక ఆంధ్రాబ్యాంకు కార్యాలయంలో నిర్వహించిన మహిళా సంఘాల రుణమేళాలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 36 వేల మహిళా సంఘాలు ఉన్నాయని, దీనికి సంబంధించి వడ్డీ లేని రుణాలను అందించి ఎనిమిది లక్షల మంది కుటుంబాలను ఆదుకుంటున్నామన్నారు. బ్యాంకుల ద్వారా జిల్లాలో 350 కోట్ల రూపాయల రుణాలను అందించామని వివరించారు. అలాగే స్ర్తినిధి బ్యాంకు ద్వారా జిల్లాలో 42 కోట్ల రూపాయల రుణ లక్ష్యం కాగా ఇప్పటివరకు 18 కోట్ల రూపాయల రుణాలను అందించామని వెల్లడించారు. ఎటువంటి హామీలు లేకుండా కేవలం మహిళా సంఘాలను గుర్తించి ఆయా సంఘ సభ్యుల జీవనోపాధికి అవకాశం కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. జిల్లాలో మహిళా సంఘాలు దాచుకున్న మొత్తం వంద కోట్లకు పైగా డిపోజిట్‌గా ఉందని, ఇది హర్షణీయమైన విషయమన్నారు. సంఘాలు భవిష్యత్‌లో మరింత బలోపేతం అయ్యేలా కృషి చేయడమే కాకుండా వడ్డీలేని రుణాలను సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. అనంతరం ఆంధ్రాబ్యాంకు మంజూరు చేసిన రుణాలను స్వయంశక్తి మహిళా సంఘాలకు చెక్కుల ద్వారా ఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎల్.అండ్.డి బ్యాంకు మేనేజర్ శ్రీనివాసశాస్ర్తీ, ఆంధ్రాబ్యాంకు రీజనల్ మేనేజర్ రాజారామ్మోహన్‌రాయ్, బ్యాంకు మేనేజర్ కామేశ్వరరావు, ఎంపిడిఒ పోలినాయుడు, తహశీల్దార్ ఎం.వి.రమణ తదితరులు పాల్గొన్నారు.
తుపాను పరిహార జాబితాలో అవకతవకలు
రేగిడి, డిసెంబర్ 18: నీలం, పైలిన్ తుఫాను పరిహారం లెక్కింపులో అవకతవకలు జరిగాయని ఖండ్యాం గ్రామానికి చెందిన రైతులు గొల్వె జగ్గునాయుడు, మొయిల జగ్గారావు, పెంకు ప్రసాదరావుతో పాటు పలువురు రైతులు వాపోయారు. అర్హులను విస్మరించి అనర్హులు లబ్ధి పొందేలా జాబితా తయారు చేసారని ఆరోపించారు. అధికారులు ఒక పాసుపుస్తకానికి ముగ్గురు నుండి నలుగురు పేర్లను నమోదు చేసి జాబితా తయారు చేసారని ఆరోపించారు. మరికొంతమందికి జాబితాలో పేర్లను అడ్డుగోలుగా చేర్చారని వెల్లడించారు. భూములు లేని వారికి కూడా పరిహారం రాసారన్నారు. గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకులు ప్రోద్బలంతోనే నివేదికలు జాబితా రెవెన్యూ అధికారులు తయారు చేసినట్లు వివరించారు. క్షేత్రస్థాయిలో పర్యటనలు జరుపకుండానే రాజకీయ ఒత్తిళ్లతో జాబితా తయారుచేసినట్లు తెలిపారు. పంట నష్టపోయిన రైతులు బూసి అప్పలనాయుడు, భైరి శంకరరావు, పొదిలాపు మోహనరావు, కంచు జయమ్మలతో పాటు మరో 38 మంది నిజమైన రైతులకు జాబితాలో పేర్లు లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించాయని పేర్కొన్నారు ఈ ఆరోపణలపై జిల్లా అధికార యంత్రాంగం విచారణ చేపట్టి నిజమైన రైతులకు పరిహారం అందేలా చర్యలు చేపట్టాలని కోరారు.
పంట నష్టపరిహారం అందేదెప్పుడు:
నీలం, పైలిన్ తుఫానుకు పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందేదెప్పుడని రైతులు ఎదురు చూస్తున్నారు. పంట నష్టపరిహారం జాబితాలో పేర్లకు బ్యాంక్ ఖాతాలకు పొంతన కుదరక రేగిడి మండలంలోని పలు గ్రామాల్లో 680 మంది రైతుల పేర్లతో కూడిన జాబితాను మండల వ్యవసాయ శాఖకు బ్యాంక్‌లు తిరిగి పంపించారు. నీలం తుఫానుకు 1,888 రైతులు పంట నష్టపోయినట్లు జాబితా రూపొందించడంతో పాటు, వీఆర్వోలు ఆయా రైతుల బ్యాంక్ ఖాతాలు సేకరించారు. ఆ సమయంలో ఖాతా నెంబర్లు సరిగ్గా పొందుపరచకపోవడంతో బ్యాంక్ అధికారులు తిరస్కరించారు. దీంతో జాబితా వ్యవసాయ కార్యాలయానికి చేరింది. జాబితాలో ఉన్న వారు అసలైన రైతులేనా? ఖాతా నెంబర్లు ఎందుకు తప్పుగా నమోదు చేసారు, దీని వెనుక కారణాలపై వ్యవసాయాధికారులు ఆరా తీస్తున్నారు. తప్పుగా నమోదు చేసినా, లేదా ఆయా ఖాతా నెంబర్లు ప్రస్తుతం మనుగడలో లేకపోయినా సరిదిద్దే అవకాశం ఉంది. ఒకవేళ జాబితాలో బోగస్ పేర్లుంటే వాటిని గుర్తించాల్సి ఉంది. క్షేత్రస్థాయిలో పంట నష్టం గుర్తించాల్సిన అధికారులు ఆ విధంగా గుర్తించగా మధ్యవర్తులపై ఆధారపడటమే ఈ దుస్థితికి కారణమని వాదన వినిపిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వాధికారులు దృష్టి సారించి పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందేలా చర్యలు చేపట్టాలని మండల రైతులు కోరుతున్నారు. ఈ విషయంపై వ్యవసాయాధికారి మధుసూదనరావును వివరణ కోరగా పంట నష్ట జాబితాలు వి ఆర్వోలు ఇచ్చిన నివేదికలతో బ్యాంక్ ఖాతాలు తెరవాలని సూచించామన్నారు. రైతులు ఇచ్చిన ఖాతా నెంబర్లు తప్పుగా ఉన్నట్లు పేర్కొన్నారు. తప్పులు సరిచేసే పనిలో ఉన్నామని తెలిపారు.
మార్గదర్శకంగా యునిసెఫ్ సర్వే
ఎచ్చెర్ల, డిసెంబర్ 18: విపత్తులు వల్ల ప్రతీ ఏటా నష్టం వాటిల్లుతోన్న తీరగ్రామాల్లో వాస్తవ పరిస్థితులపై యునిసెఫ్ సర్వే సమర్ధవంతంగా నిర్వహించి అంబేద్కర్ వర్శిటీని మార్గదర్శకంగా నిలపాలని వైస్ ఛాన్సలర్ హెచ్.లజపతిరాయ్ సూచించారు. బుధవారం సెమినార్ హాల్‌లో ఈ నెల 23 నుంచి నిర్వహించబోయే యునిసెఫ్ సర్వేకు సంబంధించిన వర్క్‌షాపులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 11 మండలాలు, 245 గ్రామాల్లో సర్వే నిర్వహించాల్సిన మార్గదర్శకాలపై విపులంగా వివరించారు. అంబేద్కర్ విశ్వవిద్యాలయం పర్యవేక్షణలో యునిసెఫ్ సౌజన్యంతో జిల్లా స్థాయిలో నిర్వహించే ఈ సర్వే మున్ముందు మరెన్ని ప్రాజెక్టులు అందిపుచ్చుకునేలా దోహదపడాలన్నారు. 11 మండలాలకు చెందిన ఎంపిడిఒలు, జిల్లా స్థాయి అధికారులు, వర్శిటీ అధ్యాపకులు, రూరల్‌డెవలప్‌మెంట్, బయోటెక్నాలజీ, జియోసైన్స్, సోషియాలజీ, మేనేజ్‌మెంట్ కోర్సులకు చెందిన 120 మంది విద్యార్థులను కూడా సర్వేలో భాగస్వాములను చేస్తున్నట్లు వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో వాస్తవ పరిస్థితులపై అధ్యయనం జరుపడమే కాకుండా జీవన స్థితిగతులపై మరింత అవగాహన పెంచుకుని సర్వేను విజయవంతంగా నిర్వహించాలన్నారు. గ్రామాల్లో నీరు, పారిశుద్ధ్యం, ఆహారపు అలవాట్లు, ఆరోగ్యం, విద్యాపరమైన అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. 2011 జనగణన ప్రాప్తికి గ్రామీణ ప్రాంతాల్లో కేవలం తొమ్మిది శాతం మందే వ్యక్తిగత మరుగుదొడ్లు వినియోగించుకుంటున్నారని, 91 శాతమంది బహిరంగ మలమూత్ర విసర్జన చేస్తున్నట్లు సర్వేలు వెల్లడించాయన్నారు. ఈరకమైన దురాచారాన్ని అరికట్టేలా సామాజిక బాధ్యతతో సర్వేను పారదర్శకంగా నిర్వహించాలన్నారు. గ్రామాల్లో రాజకీయాలకతీతంగా ప్రజాప్రతినిధులను గౌరవించే విధంగా వ్యవహరించాలన్నారు. సర్వే నిర్వహించే సమయంలో సున్నితంగా వ్యవహరించడమే కాకుండా సమయస్పూర్తిగా ముందుకు సాగాలన్నారు.అంబేద్కర్ వర్సిటీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న 20 సూత్రాల అనుసంధాన కార్యక్రమంపై కూడా మరింత ప్రచారం నిర్వహించాలని సూచించారు. ఇందులో భాగంగా కార్యాచరణతో కూడిన బ్రోచర్‌ను కూడా వీసీ లజపతిరాయ్ విడుదల చేశారు. ఈ వర్క్‌షాపులో యునిసెఫ్ రూత్‌నిరూన్, ఎస్.నల్లి, జెడ్పీ సిఇఒ కైలాసగిరీశ్వర్, ఎంపిడిఒలు బొడ్డేపల్లి శైలజ, కొత్తకోట హేమసుందరరావు, పి.వాసుదేవరావు, ఎం,కిరణ్, రిజిస్ట్రార్ కృష్ణమోహన్, ప్రిన్సిపాల్ ఎం.చంద్రయ్య, డా.సంజీవయ్య, ఆచార్యులు కామరాజు, అడ్డయ్య, చిరంజీవులు, యునిసెఫ్ జిల్లా కోఆర్డినేటర్ సి.హెచ్.రామ్మోహనరావు, ఆర్‌డబ్ల్యూఎస్ డిఇ ఆశాలత, బెజ్జిపురం యూత్‌క్లబ్ వ్యవస్థాపకులు ప్రసాదరావు తదితరులుఉన్నారు.
రాష్టస్థ్రాయి పోటీలకు హ్యాండ్‌బాల్ జట్టు ఇదే..
బలగ, డిసెంబర్ 18: రాష్టస్థ్రాయి హ్యాండ్‌బాల్ పోటీలకు జిల్లా జట్టు ఈ నెల 19వ తేదీన పయనవౌతున్నట్లు స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ అధ్యక్షులు, డి. ఇ.వో ఎస్.అరుణకుమారి, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎం.వి.రమణలు తెలియజేశారు. ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు చిత్తూరు జిల్లా వాయల్పాడులో పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అండర్-14 బాలికల విభాగంలో పి.సుమలత, పి.హేమలత, జి.గాయత్రి, జి. ఇందు, వి.రాజ్యలక్ష్మి, జి.వౌనిక, వి.హేమలత, కె.యమున, పి.తేజేశ్వరి (పాతటెక్కలి), బి.జాన్సీ, ఎస్.హేమలత (రాగోలు), కె.పావని (అదపాక), ఎల్.ప్రసన్న, వి.రేష్మ ( ఒప్పంగి), ఎం.గౌరి ( శ్రీకూర్మం), జి.బంగారి (అంబటివానిపేట)లు జట్టులు ఉన్నారన్నారు. అండర్-14 బాలుర విభాగంలో కె.సాయకుమార్, పి.గణేష్, బి.నవీన్ (పాతటెక్కలి), ఎం.సాయికుమార్, ఎల్.సుదీర్, ఎల్.్భస్కరరావు, పి.సంతోష్, ఎం.బలరామ్, ఆర్.రాజు (అదపాక), జి.్భలోకరాజు, టి.రఘు, ఎన్.శంకరరావు (వెదుళ్లవలస) వి.రాజశేఖర్ (గొల్లవలస), ఎం.కృష్ణసాయి (బలగ), ఎం.దిలీప్ (రాగోలు), ఇ.పవన్‌కుమార్ (బుడుమూరు)లు జట్టులో ఉన్నట్లు పేర్కొన్నారు. పై జట్టు సభ్యులు ఈ నెల 19వ తేదీ మధ్యాహ్నాం నాలుగు ఎలిజిబిలిటీ ఫారాలతో స్కూల్‌గేమ్స్ కార్యాలయానికి హాజరు కావాలని వారు కోరారు. ఈ జట్టుకు కోచ్ కమ్ మేనేజర్లుగా ఆర్.సతీష్‌రాయుడు, డి. ఈశ్వరరావు, జి.రాజశేఖర్‌లు ఉంటారని తెలియజేశారు.