గుంటూరు, డిసెంబర్ 18: దేశం ఆర్థికంగా బలోపేతం కావాలంటే వ్యవసాయ ఉత్పత్తులకు లాభసాటి ధర కల్పించాలని, అన్నదాతలు సంక్షేమంగా ఉన్నప్పుడే దేశం సుభిక్షంగా ఉంటుందని అఖిల భారత కిసాన్ సభ జాతీయ ప్రధాన కార్యదర్శి అతుల్‌కుమార్ అంజన్ స్పష్టం చేశారు. రైతుకు లాభసాటి సేద్యం కోసం ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానంపై మూడు రోజుల పాటు జరిగే జాతీయ రైతు సమ్మేళనం సదస్సు బుధవారం గుంటూరు నగరంలోని ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం గౌరవాధ్యక్షుడు కె రామకృష్ణ అధ్యక్షతన సభ జరిగింది. ముఖ్య అతిథి అతుల్‌కుమార్ అంజన్ ఎఐకెఎస్ కార్యవర్గ సభ్యులు, రైతులనుద్దేశించి మాట్లాడుతూ రైతులు పండించే పంటకు కనీస మద్దతు ధర లేకపోవడంతో రైతులు అధిక దిగుబడులు సాధించినప్పటికీ గిట్టుబాటు ధర లేక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారన్నారు. వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్‌ను ఏర్పాటు చేసి రాయితీలు కేటాయించి ప్రోత్సహించినప్పుడే ఆహార భద్రత, రైతు సంక్షేమం సాధ్యపడుతుందన్నారు. వ్యవసాయ ధరల కమిషన్ మాజీ చైర్మన్ టిజె హక్ మాట్లాడుతూ రైతులకు లాభసాటిగా ఉండే విధంగా మద్దతు ధరలు ఉండాలని, వ్యవసాయానికి చేస్తున్న వ్యయానికి, రైతులకు లభిస్తున్న గిట్టుబాటు ధరకు పొంతన లేకుండా పోతుండటంతో రైతులు పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారన్నారు. వ్యవసాయ ఖర్చులు నానాటికీ విపరీతంగా పెరిగిపోతున్నాయని, విత్తనాలు నాటే దగ్గర నుండి పంట విక్రయించే వరకూ రైతులు అడుగడుగునా సమస్యలను ఎదుర్కొంటున్నారని, రాజకీయ పార్టీలన్నీ రైతు సమస్యలను ఎజెండాగా చేసుకున్నప్పుడే వారి సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. జాతీయ రైతు సమ్మేళన సన్నాహక కమిటీ గౌరవాధ్యక్షుడు ఆచార్య కె వియన్నారావు మాట్లాడుతూ మన దేశంలో వ్యవసాయమే జీవనాధారంగా వున్నవారి సంఖ్య అధికమని, అయినా దశాబ్దాలు గడుస్తున్నా వ్యవసాయం లాభసాటిగా మారలేదన్నారు. రైతుల బాగోగులు చూసే ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానం రూపొందాలన్నారు. జిల్లా కలెక్టర్ ఎస్ సురేష్‌కుమార్ మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి వ్యవసాయరంగం కొంతమేర ప్రగతి సాధించినప్పటికీ, రైతులకు ఆ మేర గిట్టుబాటు ధర లభించడం లేదన్నారు. ప్రపంచీకరణ ఫలితాలను వ్యవసాయరంగంలో వినియోగించుకోవాలని పాలకులు భావించారు గానీ ఆచరణలో అమలు కాలేదన్నారు. రైతుల సంక్షేమంపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందన్నారు. మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ మాట్లాడుతూ దేశ వ్యవసాయరంగం సంక్షోభంలోకి నెట్టబడిందని, ప్రస్తుతం రాష్ట్రంలో బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వల్ల కనీస అవసరాలు తీర్చుకునేందుకు కూడా నీరందని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించి రైతులను ఆదుకోవాలని కోరారు. జాతీయ రైతు సమ్మేళనంలో రైతు అవసరాలను తీర్చేవిధంగా విధి విధానాలను రూపొందించాలన్నారు. రైతు సంఘ ప్రధాన కార్యదర్శి రావుల వెంకయ్య మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం ఐక్యంగా పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ ఆర్థికవేత్త కెఆర్ చౌదరి మాట్లాడుతూ వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తే అన్ని రంగాలు కుదేలై ఆహార భద్రత లోపిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎఐకెఎస్ ఉపాధ్యక్షులు అజయ్ ముఖర్జీ, కొల్లి నాగేశ్వరరావు, రైతు సంఘ జాతీయ నాయకులు సత్యం ముఖేలి, ఇంతియాజ్‌బేగ్, కెడిసింగ్, నూరల్‌పాండా, కెఎన్ అధికారి, రాంప్రతాప్ త్రిపాఠి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ అధ్యక్షుడు పశ్య పద్మ, కృష్ణ, గుంటూరు జిల్లాల కార్యదర్శులు అక్కినేని వనజ, ముప్పాళ్ల నాగేశ్వరరావు, కౌలు రైతు సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెవిపి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
లారీ ఢీకొని ఇంటర్ విద్యార్థి మృతి
తెనాలి, డిసెంబర్ 18: సెమిక్రిస్మస్ వేడుకల్లో పాల్గొనేందుకు వేగంగా ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఇంటర్ విద్యార్థి ప్రమాదవశాత్తు లారీ చక్రాల క్రింద పడి మృతి చెందిన సంఘటన పట్టణంలో చోటు చేసుకుంది. త్రీ టౌన్ పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న అంగలకుదురు నాగబాబు ( 17) లారీ ఢీకొన్న ప్రమాదంలో సంఘటనా స్థలంలోనే మృత్యువాత పడ్డాడు. కళాశాలలో బుధవారం సెమిక్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్న క్రమంలో అమృతలూరు మండలం గోవాడ గ్రామానికి చెందిన నాగబాబు, తెనాలి మండలం అంగలకుదురు గ్రామానికి చెందిన బూజూరి రాజాలు ఇద్దరు స్నేహితులు కావడంతో, రాజ ఇంటికి వెళ్ళి డ్రస్ మార్చుకునేందుకు వెళ్ళిన స్నేహితులు తిరిగి కళాశాలకు మోటార్ బైక్‌పై వస్తున్న క్రమంలో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌కు సమీపంలో యడ్లలింగయ్య పెట్రోల్ బంక్ రోడ్‌లో ఎదురుగా వెళుతున్న లారీని అధిగమించి ముందుకు వెళ్ళే ప్రయత్నంలో వాహనం అదుపు తప్పడంతో, వాహానాన్ని నడుపుతున్న నాగబాబు లారీ చక్రాల క్రింద పడి పోగా, రాజ లారీ మధ్యలో పడి పొయాడు. ఈ ప్రమాదంలో నాగబాబు మృతి చెందగా, రాజాకు స్వల్పగాయాలయ్యాయి. త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
‘పరలోక దర్శనం’ పేరుతో చుక్కలు చూపించిన పాస్టర్
* పాటిబండ్లలో పక్కా ఇళ్లపేరుతో ఘరానా మోసం * ఉన్న ఇళ్లు కూలగొట్టుకుని ఊసురోమంటున్న దళితులు
పెదకూరపాడు, డిసెంబర్ 18: పరలోక దర్శనం అను సంస్థకు చెందిన పాస్టర్ గొళ్లపల్లి ఇస్సాక్ మోసపూరిత వాగ్దానాలతో మండలంలోని పాటిబండ్లకు చెందిన పేద దళితులు 21 మంది మోసపోయిన సంఘటన వెలుగులోకి వచ్చింది. పెదకూరపాడు పోలీసుల కథనం ప్రకారం... ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం ఈతముక్కల గ్రామానికి చెందిన గొళ్లపల్లి ఇస్సాక్ పాస్టర్‌గా పనిచేస్తున్నాడు. ప్రకాశం జిల్లా మాజీ పార్లమెంటు సభ్యుడు దివంగత మాగంటి సుబ్బారామిరెడ్డితో సంబంధాలున్నాయని ప్రచారం చేసుకుంటూ పాటిబండ్ల గ్రామానికి చెందిన ఎద్దల బాల నరసింహారావుతో జతకట్టాడు. మతం తరఫున పేదలకు పక్కా ఇళ్లు నిర్మిస్తానని బాల నరసింహారావుతో కుమ్మక్కై పాటిబండ్లకు చెందిన కడియం లాజర్‌బాబు, ముసుగు చిన్నమ్మ, మన్నవ మరియమ్మ మరో 18 మందిని నమ్మించి ఒక్కొక్కరి వద్ద నుండి 25 వేల రూపాయల వంతున వసూలు చేశాడు. డబ్బులు చెల్లించిన వారికి లక్ష విలువగల పక్కా ఇల్లును నిర్మించి ఇస్తామని బైబిల్‌పై ప్రమాణం చేసి చెప్పి నమ్మించాడు. 15 గృహాలకు అర ట్రక్కు ఉచిత కంకర అందించారు. 2011 అక్టోబర్‌లో బాధితుల వద్ద నగదు వసూలు చేసి 2011 డిసెంబర్ 25లోపు ఇళ్ల నిర్మాణాలు పూర్తవుతాయని నమ్మించాడు. పాస్టర్, బాల నరసింహారావుల మాటలు నమ్మి ఇంటి నిర్మాణం జరుగుతుందన్న ఆశలతో నివాసముంటున్న ఇళ్లను క్రేన్‌తో నేలమట్టం చేసుకున్నారు. రెండు సంవత్సరాల వ్యవధిలో ఎలాంటి నిర్మాణాలు జరగకపోవడంతో బాధితులు బాల నరసింహారావును తోడ్కొని ప్రకాశం జిల్లాకు వెళ్లి పాస్టర్ ఇస్సాక్‌ను సంప్రదించారు. ఇస్సాక్ నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో మోసపోయామని గ్రహించి బాధితులు కలెక్టర్ ఎస్ సురేష్‌కుమార్‌కు ప్రజావాణి ద్వారా అర్జీ సమర్పించారు. కలెక్టర్ ఉత్తర్వులతో జిల్లా రూరల్ ఎస్‌పి సత్యనారాయణ సమస్యను పరిష్కరించాలని పెదకూరపాడు పోలీసులను ఆదేశించారు. పెదకూరపాడు పోలీసులు ప్రకాశం జిల్లా వెళ్లి పాస్టర్‌ను అరెస్ట్ చేశారు. పాస్టర్ ఇస్సాక్‌పై అద్దంకి, సంతమాగులూరు, నరసరావుపేట తదితర పోలీసుస్టేషన్లలో కూడా కేసులు నమోదై ఉన్నాయని పోలీసులు తెలిపారు. మొత్తం 5.25 లక్షల రూపాయలు తమ వద్ద నుండి వసూలు చేసినట్లు బాధితులు తెలిపారు.
వెల్లటూరులో నాగేంద్రుడి దర్శనం
భట్టిప్రోలు, డిసెంబర్ 18: నాగేంద్రస్వామి ప్రతిష్ఠ విగ్రహం వద్ద ఒక నాగుపాము భక్తులకు పడగవిప్పి కనువిందు చేసింది. సేకరించిన వివరాల ప్రకారం గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం వెల్లటూరులో వేంచేసియున్న శ్రీబాలాత్రిపుర సుందరి సమేత అగస్త్యేశ్వరస్వామివారి ఆలయంలో బుధవారం తెల్లవారుజామున ఆరుద్రోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరుగుతున్న సమయంలో కొందరు భక్తులు ఆలయ ప్రదక్షిణ చేస్తుండగా వెనుకవైపు ఉన్న నాగేంద్రస్వామి ప్రతిష్ఠా విగ్రహం వద్ద నాగుపాము పగడవిప్పి ఉండటాన్ని గమనించి పూజారికి తెలియజేశారు. ఇంకేముంది విషయం ఆ నోట... ఈ నోట అందరికీ చేరడంతో ఆలయానికి జనప్రవాహమైంది. పాలు పోసి అరటి పళ్లు పెట్టి పూజలు ప్రారంభించారు. ఇంత చేస్తున్నా ఆ పాము పడగవిప్పి మిన్నకుందే తప్ప బుస కొట్టలేదు. ఇలా సుమారు నాలుగు గంటల పాటు జనారణ్యంలో ఉంది. ఇంతలో కొందరు వెళ్లి పాములు పట్టేవారిని తీసుకొచ్చేసరికి అది కాస్తా నాగేంద్రస్వామి విగ్రహం కిందకు వెళ్లి మాయమైంది. దీనిపై గ్రామస్థులు రకరకాలుగా వ్యాఖ్యానించడం కనిపించింది.
లోక్‌పాల్ బిల్లు ఆమోదాన్ని హర్షిస్తూ
విజయోత్సవ ర్యాలీ
గుంటూరు , డిసెంబర్ 18: లోక్‌పాల్ బిల్లు రాజ్యసభ, లోక్‌సభలలో ఆమోదం పొందడాన్ని హర్షిస్తూ అవగాహన సంస్థ సభ్యులు బుధవారం రాత్రి విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అరండల్‌పేటలోని అవగాహన సంస్థ కార్యాలయం నుండి శంకర్‌విలాస్ సెంటర్ వరకు సభ్యులు జాతీయ జెండాలు చేభూని ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ కార్యదర్శి కొండా శివరామిరెడ్డి మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న లోక్‌పాల్ బిల్లు ఎట్టకేలకు ఆమోదం పొందడం హర్షణీయమన్నారు. సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే పట్టుదల వల్ల ఒక మంచి అవినీతి నిరోధక చట్టం ప్రజలకు అందుబాటులోకి వచ్చిందన్నారు. ప్రముఖ నాటక రచయిత కావూరి సత్యనారాయణ మాట్లాడుతూ లోక్‌పాల్ బిల్లు ఆమోదం చారిత్రాత్మక పరిణామమన్నారు. ఈ ర్యాలీలో సంస్థ ఉపాధ్యక్షుడు పిఎస్ మూర్తి, ఇ చంద్రయ్య, నరసింహులు, రమణారావు, ఉదయకుమారి, పాశం రవీంద్రయాదవ్ పాల్గొన్నారు.
అమ్మవారి పాదపూజకు తాడేపల్లి పూలు
తాడేపల్లి, డిసెంబర్ 18: విజయవాడలో వెలసిన శ్రీ దుర్గామల్లేశ్వర అమ్మవారి పాదపూజకు తాడేపల్లి పట్టణం నుండి నిత్యం పూలు తరలివెళుతున్నాయి. దుర్గగుడి దత్తతలో వున్న సీతానగరం దేవస్థానానికి చెందిన సదరు భూమి క్రిస్టియన్‌పేటలో వుంది. ప్రతినిత్యం దేవస్థానం సిబ్బంది తాజా పూలను కోసి అమ్మవారి పాదపూజ గులాబీ, బంతి, చామంతి, మందార తదితర 8 జాతుల పూలు కోసి తరలిస్తున్నారు.
ఉత్సాహంగా జరుగుతున్న జోన్ ఆటల పోటీలు
మంగళగిరి, డిసెంబర్ 18: జిల్లా సెకండరీ స్కూల్స్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యాన పట్టణంలోని సికె విద్యాసంస్థల క్రీడా ప్రాంగణంలో మంగళగిరి జోన్ ఆటల పోటీలు బుధవారం ఉత్సాహపూరిత వాతావరణంలో జరుగుతున్నాయి. వాలీబాల్, బాడ్మింటన్, ఖోఖో, కబడ్డీ మొదలైన ఆటల పోటీలు జరిగాయి. మంగళగిరి, తాడేపల్లి పురపాలక సంఘాలు ఆయా మండలాలతో పాటు తుళ్లూరు, పెదకాకాని, తాడికొండ మండలాలకు చెందిన జిల్లా పరిషత్, ప్రభుత్వ, ఎయిడెడ్ ప్రభుత్వ గుర్తింపు పొందిన సుమారు 40కి పైగా పాఠశాలలకు చెందిన 107 జట్లు వివిధ పోటీల్లో పాల్గొంటున్నాయి. కుప్పురావూరు వద్దగల కేశవరెడ్డి పాఠశాల విద్యార్థులు బాల్‌బాడ్మింటన్ జూనియర్ విభాగంలో ఫైనల్‌కు చేరారు. తాటికొండ ఎఇఆర్‌ఎస్ జట్టు సెమీఫైనల్‌కు చేరింది. వాలీబాల్ సీనియర్స్ విభాగంలో పెదవడ్లపూడి విజేత హైస్కూల్‌పై తుళ్లూరు జట్టు గెలిచింది. మంగళగిరి జట్టుపై మందడం జట్టు, ఉప్పలపాడు జట్టుపై పెనుమాక జట్టు గెలిచాయి. బాల్‌మాడ్మింటన్ సీనియర్స్ విభాగంలో వెనిగండ్ల జట్టుపై నూతక్కి, వడ్డేశ్వరంపై కేశవరెడ్డి జట్టు గెలిచాయి. ఖోఖోలో పెదవడ్లపూడి నాగార్జున జట్టుపై నూతక్కి విజ్ఞాన విహారజట్టు, రాయపూడి జట్టుపై నిడమర్రు జడ్‌పిహెచ్‌ఎస్ జట్టు, కబడ్డీలో నంబూరుపై రాయపూడి జట్టు, తక్కెళ్లపాడుపై మందడం జట్టు గెలుపొందాయి. శుక్రవారం వరకు పోటీలు జరుగుతాయి. అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు విజేతలకు బహుమతి ప్రదానోత్సవ సభ జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.
పనులు వేగవంతం చేయండి: జేసీ
యడ్లపాడు, డిసెంబర్ 18: యడ్లపాడు మండలం మైదవోలు, బోయపాలెం గ్రామాల్లో నిర్మిస్తున్న స్పైసెస్ పార్కు, టెక్స్‌టైల్ పార్కు పనులు వేగవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ వివేక్‌యాదవ్ అధికారులను ఆదేశించారు. మైదవోలు పరిధిలో నిర్మిస్తున్న స్పైసెస్ పార్కులో పనులను ఆయన బుధవారం పరిశీలించారు. ఈ పార్కులో నిర్మించిన డ్రైనేజీ వ్యవస్థను వాగు మార్గంలో నిలబడే నీటిని బయటకు పంపేందుకు తీసుకున్న చర్యలపై ఆరా తీశారు. బోయపాలెం గ్రామంలో నిర్మించతలపెట్టిన టెక్స్‌టైల్ పార్కు గుంతలమయంగా ఉండటంతో ఇదేమిటని ప్రశ్నించారు. ఈ పార్కు అభివృద్ధికి సంబంధించి 124 ఎకరాల భూమిని ఎపిఐఐసికి అప్పగించినట్లు తెలిపారు. మరికొంత భూమి కోర్టు వివాదంలో ఉందన్నారు. టెక్స్‌టైల్ పార్కులో జెసి రికార్డులను పరిశీలించి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా టెక్స్‌టైల్ పార్కుకు అప్పటి ముఖ్యమంత్రి కె రోశయ్య శంకుస్థాపన చేసినప్పటి నుంచి ఏ మాత్రం పురోగతిలేని స్థితిలో ఉన్న ఈ పార్కును జెసి బుధవారం పరిశీలించడం ప్రాధాన్యత సంతరించుకుంది. శంకుస్థాపన చేసిన శిలాఫలకాన్ని ఇటీవల కొందరు ధ్వంసం చేయడంతో అధికారులు మళ్లీ దిమ్మె కట్టించినా అందులో ఫలకం బిగించే సాహసం చేయలేకపోయారు. ఈ పరిస్థితిలో బుధవారం ఈ పార్క్‌ను తనిఖీ చేసిన జెసి వివేక్‌యాదవ్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. జెసి వెంట నరసరావుపేట ఆర్‌డిఒ శ్రీనివాసరావు, యడ్లపాడు తహశీల్దార్ సుధారాణి, సర్వేయర్ సురేంద్ర తదితరులున్నారు.
మల్లేశ్వరుని సన్నిధిలో ఆరుద్రోత్సవం
గుంటూరు , డిసెంబర్ 18: మహాపర్వదినమైన శివముక్కోటిని పురస్కరించుకుని బుధవారం నగరంలోని రామచంద్రపుర అగ్రహారంలోని శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామివారి దేవస్థానంలో ఆరుద్రోత్సవాన్ని శైవాగమ సంప్రదాయంలో వేడుకగా నిర్వహించారు. ప్రతిఏటా మార్గశిర, ధనుర్మాసంలో ఈ దేవస్థానంలో శివముక్కోటిని, ఆరుద్రోత్సవాన్ని వైభవంగా నిర్వహించడం సత్సంప్రదాయంగా వస్తోంది. బుధవారం తెల్లవారు ఝామున మల్లేశ్వరస్వామికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకాలను నిర్వహించి, ఉత్తర ద్వారం గుండా మంగళవాద్య ఘోషల నడుమ, వేద పండితులు ఘనస్వస్తి చేస్తుండగా భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్గజేశారు. శివముక్కోటి, ఆరుద్రోత్సవంలో పాల్గొన్న భక్తులు కల్యాణోత్సవాన్ని ఆనంద పారవశ్యంతో తిలకించారు. ఈనెల 21వ తేదీన సంకట చతుర్ధి సందర్భంగా శ్రీ వినాయకస్వామికి అభిషేకాలు, అదేరోజు సాయంత్రం వ్రతకధ, 25వ తేదీ బుధవారం శ్రీ కాలభైరవునికి ప్రదోషకాలను విశేష పూజలు నిర్వహిస్తున్నట్లు దేవాదాయశాఖ అధికారులు ఈ విలేఖరికి తెలిపారు.
విద్యార్థులు ఇంధన పొదుపుపై
అవగాహన కలిగి ఉండాలి
గుంటూరు (పట్నంబజారు), డిసెంబర్ 18: భవిష్యత్తు తరాలకు సహజ వనరులతో పాటు, ఇంధన వనరులను కూడా అందజేయాలంటే విద్యార్థులు ఇంధన పొదుపు అవగాహన కలిగి ఉండాలని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ పి శ్రీనివాసులు పేర్కొన్నారు. బుధవారం స్థానిక నగరంపాలెంలోని ప్రజ్ఞ కానె్వంట్‌లో జాతీయ ఇంధన వనరుల పొదుపు వారోత్సవాల్లో భాగంగా జిల్లా కాలుష్య నియంత్రణ మండలి, ఇంధన వనరుల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభకు పాఠశాల కరస్పాండెంట్ ఎన్ చక్రనాధ్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ పర్యావరణ ఇంజనీర్ ఉదయ్‌సింగ్, పర్యావరణ విద్య రిసోర్స్ పర్సన్ డి తిరుపతిరెడ్డి, ప్రిన్సిపాల్ నాయుడు కోటేశ్వరరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
విభజన బిల్లును తిప్పికొడితేనే సీమాంధ్రుల భవిష్యత్‌కు భరోసా
* జిల్లా టిడిపి కార్యదర్శి వీరవల్లి మురళి
తెనాలి, డిసెంబర్ 18: రాష్ట్ర విభజన బిల్లు శాసన సభలో ప్రవేశపెట్టి దాగుడు మూతలు ఆడుతున్న నాయకుల తీరును ప్రజలు గమనిస్తున్నారని సీమాంధ్రుల సమైక్యవాదాన్ని ఈప్రాంత పాలకులు ప్రతిపక్ష నాయకులు సమిష్టిగా బలపరచ కుంటే చరిత్ర హీనులుగా మిగిలిపోతారని జిల్లా టిడిపి కార్యదర్శి వీరవల్లి మురళి అన్నారు. బుధవారం రాత్రి తెనాలి - గుంటూరు రహదారిపై అంగలకుదురు సమీపంలో గ్రామంలోని వివేక విద్యాసంస్థలోని విద్యార్థులు గణేష్ యూత్ ఆధ్వర్యంలో సమైక్యవాదాన్ని చాటుతు వినూత్నంగా లాంతర్లతో రాస్తారోకో చేశారు. రాష్ట్రాన్ని విభజించి మా భవిష్యత్ అంధకారం చేయద్దటు నినాదాలు చేశారు. విభజన బిల్లును వెనక్కి పంపాలంటూ నినాదాలు చేశారు. టి బిల్లు అని వ్రాసిన ప్రతులను తగుల బెట్టారు. ఈక్రమంలో జిల్లా టిడిపి కార్యదర్శి వీరవల్లి మురళి మాట్లాడుతూ సమైక్యవాదాన్ని బలంగా చాటిన నాయకులు బిల్లు శాసన సభలోకి వచ్చిన సమయంలో దాగుడు మూతల ధోరణి అవలభించడం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వానికి తొత్తులుగా మారిన ఈప్రాంత నాయకులు బిల్లుకు సహకరిస్తే చరిత్ర హీనులవుతారని, బిల్లును సమిష్టిగా వెనక్కి పంపితే చరిత్ర పురుషులుగా మిగిలిపోతారని పాలకులు ఇప్పటికైనా కళ్ళు తెరచి టి బిల్లు వీగిపోయేలా సమిష్టిగా ముందుకు సాగాలన్నారు. రాస్తారోకోతు ఇరు వైపుల భారీగా వాహనాలు నిలిచిపోయి తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాస్తారోకోలో విద్యార్థులతో పాటు గణేష్ యూత్ సభ్యులు కరణం వెంకటేశ్వర్రావు, బొద్దులూరి వేణు, గొల్లపూడి సాయిగిరి, అశోక్‌రెడ్డి, కిషోర్, నవీన్, అల్లం బాబు, సురేష్ కల్లూరి శ్రీను, పిచ్చేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.
ఫిరంగిపురంలో రాష్టస్థ్రాయి ఆహ్వాన నాటికల పోటీలు
ఫిరంగిపురం, డిసెంబర్ 18: రోమన్ క్యాథలిక్ గుంటూరు పీఠాధిపతి, రైట్ రెవరెండ్ డాక్టర్ గాలిబాలి ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర టెలివిజన్, నాటక రంగాభివృద్ధి సంస్థ హైదరాబాద్ వారి సౌజన్యంతో డిక్మన్ కళా పరిషత్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో ఈనెల 21,22,23 తేదీల్లో రాష్టస్థ్రాయి ఆహ్వాన నాటికల పోటీలు నిర్వహిస్తున్నట్లు పరిషత్ కార్యవర్గం బుధవారం తెలిపింది. వివరాలిలా ఉన్నాయి... 21వ తేదీ సాయంత్రం 7 గంటలకు కృష్ణా ఆర్ట్స్ కల్చరల్ అసోసియేషన్ గుడివాడ వారిచే మృత్యుజీవనం, రాత్రి 8.30లకు గురుమిత్ర కళాసమితి రేపల్లె వారిచే అమ్మపాల రుచులు, 22వ తేదీ రాత్రి 7 గంటలకు శ్రీ సాయి ఆర్ట్స్ కొలకలూరి వారిచే ఒక్కమాటే చాలు, 8.30లకు సిరిమువ్వ కల్చరల్ అసోసియేషన్ హైదరాబాద్ వారిచే లైఫ్ లైన్, రాత్రి 9.30లకు అభ్యుదయ ఆర్ట్స్ విజయవాడ వారిచే ఆంతర్యం, 23వ తేదీ రాత్రి 7.30లకు అభినయ ఆర్ట్స్ ఒంగోలు వారిచే జనని జయహే నాటికలు ప్రదర్శించనున్నట్లు కోశాధికారి బందనాధం జోసఫ్ థామస్ తెలిపారు. అదేరోజు సాయంత్రం 5 నుండి 7 గంటల వరకు సినిమా పాటల పోటీలు జరుగుతాయని, ఎంట్రీఫీజు చెల్లించాలని, ఇతర వివరాలకు బందనాధం జోసఫ్ థామస్, డిక్మన్ కళాపరిషత్ కోశాధికారి, మెయిన్ రోడ్డు ఫిరంగిపురం అనే చిరునామాలో సంప్రదించాలన్నారు.
వేతనాల కోసం మున్సిపల్ ఆఫీసు ముట్టడి
మంగళగిరి, డిసెంబర్ 18: తమకు వేతనాలు చెల్లించాలని కోరుతూ మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో బుధవారం రెండోరుజు కూడా మున్సిపల్ ఆఫీసును ముట్టడించారు. సిఐటియు డివిజన్ నాయకులు ఎం భాగ్యరాజు మాట్లాడుతూ కాంట్రాక్ట్ కార్మికులకు సకాలంలో జీతాలు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేయడం తగదని, ప్రతి నెలా 7వ తేదీలోపు వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నాయకులు ఎస్‌ఎస్ చెంగయ్య, షంషేర్‌ఖాన్, రామచంద్రరావు, ఏసు, దుర్గారావు, ఎం శ్రీను తదితరులు కార్యక్రమానికి నాయకత్వం వహించారు.
తాగునీటిని పొలాలకు వాడుకుంటే కఠిన చర్యలు
తాడికొండ, డిసెంబర్ 18: తాగునీటి సరఫరా పథకం నీటిని అక్రమంగా పంట పొలాలకు వాడుకునే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ముక్తామల గ్రామ పంచాయతీ కార్యదర్శి వెంకట శివరావు హెచ్చరించారు. బుధవారం తాడికొండలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పంచాయతీ వాటర్ స్కీంకు చెందిన చెరువుల నుండి కొంతమంది గ్రామస్థులు అక్రమంగా వ్యవసాయ భూములకు ఆయిల్ ఇంజన్ల ద్వారా నీటిని తోడుకుని వాడుకుంటున్నారని, అంతేకాక రైతుల వద్ద నుండి ఎకరాకు 1000 రూపాయల చొప్పున ఓ ప్రజాప్రతినిధి వసూలు చేస్తున్న విషయం ప్రజల ద్వారా తన దృష్టికి వచ్చిందని చెప్పారు. గత సంవత్సరంలో ఇలాగే పంచాయతీ చెరువులో నీరు వాడుకుంటే ఆ చెరువు నింపడానికి రెండు నెలల సమయం పట్టిందని, అర్ధరాత్రులు కూడా కాపలా ఉండి రైతులతో గొడవ పడి చెరువు నింపినప్పటికీ ప్రజలకు తాగునీరు అందించ లేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్‌సిఎల్‌పి పాఠశాల ప్రారంభం
రాజుపాలెం, డిసెంబర్ 18: బాల కార్మికులు బడిబయట ఉన్న పిల్లలను ఎన్‌సిఎల్‌పి పాఠశాలను సద్వినియోగం చేసుకోవాలని ఎన్‌సిఎల్‌పి పిడి ఐ వెంకటేశ్వర్లు కోరారు. బుధవారం మండలంలోని కొండమోడులో ఎన్‌సిఎల్‌పి పాఠశాల ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్రప్రభుత్వ సహకారంతో దీనమ్మ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ సొసైటి ఆధ్వర్యంలో బాల కార్మికుల కోసం పాఠశాలను ఏర్పాటు చేసినట్లు, ఈ పాఠశాలకు ప్రభుత్వం మధ్యాహ్న భోజనం, నెలకు 150 రూపాయలు పిల్లల ఎకౌంట్‌లో జమ చేయడం జరుగుతుందన్నారు. ఆర్‌విఎం ఎఎల్‌సి సుభాని మాట్లాడుతూ ప్రభుత్వం బడి మానేసిన విద్యార్థుల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఇఒ బలరాం నాయక్, సంస్థ ఛైర్మన్ జి శంకరరావు తదితరులు పాల్గొన్నారు.
ఎర్రచందనం తరలివెళ్తుందన్న సమాచారంతో లారీ సీజ్
ప్రత్తిపాడు, డిసెంబర్ 18: ఎర్రచందనం అక్రమంగా వెళ్తుందన్న సమాచారంతో జిల్లా అటవీశాఖ అధికారులు వెంబడించి కలప లారీని బుధవారం సీజ్ చేశారు. వివరాల్లోకి వెళితే.. గుంటూరు నుండి చిలకలూరిపేట వైపు వెళ్తున్న కలపలోడ్ లారీని మండలంలోని తుమ్మలపాలెం వద్దగల ఐదవ నెంబర్ జాతీయ రహదారిపై అధికారులు లారీని ఆపి పరిశీలించారు. అయితే పైన ముగ్గు బస్తాలు, కింద కలప ఉండటాన్ని గమనించిన అటవీశాఖ అధికారులు లారీని సీజ్ చేసి ఆ లారీని జిల్లా అటవీశాఖ కార్యాలయానికి తరలించారు. జిల్లా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రమణారెడ్డి, బీట్ ఆఫీసర్ అమీర్‌ఖాన్ బాషా, ప్రత్యేక అధికారి వి వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ ఫారెస్ట్ ఆఫీసర్ ఎం సతీష్‌ల ఆధ్వర్యంలో లారీలో ఉన్న ప్రతి దుంగను కట్ చేసి పరీక్షించగా ఎర్రచందనం కాదని తెలియడంతో కలపను జిల్లా అటవీశాఖ కార్యాలయంలోనే ఉంచారు. డ్రైవర్‌ని కూడా అదుపులోనే ఉంచారు.
రైల్వే ట్రాక్‌కు మరమ్మతులు
తాడేపల్లి, డిసెంబర్ 18: తాడేపల్లి మండల పరిధిలోని కొలనుకొండ గ్రామంలో గంగానమ్మగుడి సమీపంలో విరిగిపోయిన రైల్వేట్రాక్‌ని బుధవారం మరమ్మతులు చేశారు. చెన్నై, కలకత్తా మార్గంలోని ఈ ప్రాంతంలో ప్రతి రోజు 200 రైళ్ళు, గూడ్స్ రైళ్లు ప్రయాణిస్తుంటాయి.
అంధులకు సత్యసాయి విద్యార్థుల చేయూత
గుంటూరు (పట్నంబజారు), డిసెంబర్ 18: విధివశాత్తు సంభవించిన అంగవైకల్యంతో బాధపడుతున్నప్పటికీ సమస్యలను అధిగమించి తమలో ఉన్న నైపుణ్యాలతో సమాజాన్ని ప్రభావితం చేస్తున్న ఐవిడ స్వచ్చంద సంస్థ సేవలు ప్రశంసనీయమని శ్రీ సత్యసాయి విద్యానికేతన్ ప్రిన్సిపాల్ ఎస్ కృష్ణకుమారి పేర్కొన్నారు. ఐవిడ సంస్థ సభ్యులు వాయిద్యాలతో నిర్వహించిన సంగీత విభావరికి స్పందించిన విద్యానికేతన్ విద్యార్థులు తల్లిదండ్రుల సహకారంతో రూ. 26 వేల విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అధిక విరాళం అందజేసిన మేళ్లచెరువు యజ్ఞప్రియ, ఎవి మానస, రిజ్వానాబేగం, సిరిచందనలను ప్రిన్సిపాల్ కృష్ణకుమారి అభినందించారు. ఎస్ భావన, పివి సుజాత, టి శోభ, ఐవిడ సంస్థ ప్రోగ్రాం కోఆర్డినేటర్ సుమారెడ్డి పాల్గొన్నారు.
విత్తనశుద్ధిపై రైతుకులకు రెండ్రోజుల శిక్షణ
అచ్చంపేట, డిసెంబర్ 18: మండలంలోని ఓర్వకల్లు గ్రామంలో వరిలో గ్రామీణ విత్తన ఉత్పత్తి పథకం ద్వారా ఎంపికైన 25 మంది రైతులకు రెండవ దశ శిక్షణా కార్యక్రమాలు మండల వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. బాపట్ల వ్యవసాయ శాఖ సహాయ సంచాలకురాలు బి సీతాదేవి ముఖ్య అతిథిగా హాజరై రైతులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ఎరువుల దుకాణాల తనిఖీ
అమరావతి, డిసెంబర్ 18: మండల కేంద్రమైన అమరావతిలో జిల్లా వ్యవసాయశాఖ డిప్యూటీ డైరెక్టర్ జ్ఞానేశ్వరరావు ఆధ్వర్యంలో బుధవారం నలుగురు సభ్యులు గల బృందం స్థానిక శ్రీ లక్ష్మి గణేష్ ట్రేడర్స్, శివసాయి ఫర్టిలైజర్స్ షాపులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వ్యవసాయశాఖ అనుమతి లేకుండా విక్రయిస్తున్న పలు ఎరువులను వారు సీజ్ చేశారు. సెక్షన్ 1968 ప్రకారం ఆయా షాపుల యజమానులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ తనిఖీలో జెడి కార్యాలయ ఎఒ అమ్మిరెడ్డి, అమరావతి ఎఒ నరేంద్రబాబు, తాడికొండ ఎఒ యలమందారెడ్డి తదితరులు పాల్గొన్నారు.