ఊహాచిత్రం
- అరిపిరాల సత్యప్రసాద్
పుటలు: 132,
వెల: రు.120
అన్ని పుస్తక కేంద్రాలు.
కార్పొరేట్ ఉద్యోగాల
వేటలో, ఆంగ్లమాధ్యమాల
చదువులలో లీనమైన
నవతరం తెలుగు భాషని
మరుగుపరుస్తున్నారన్న
భావన సమాజంలో
ఉంది. సాహితీ ఆసక్తిని,
తెలుగు
భాషాభిమానాన్ని
సజీవంగా
ఉంచుకోవచ్చునని
చెప్పడానికి చేసిన చిన్న
ప్రయత్నమే అరిపిరాల
సత్యప్రసాద్ రాసిన
‘ఊహాచిత్రం’ కథల
సంపుటి. ఈ పుస్తకంలో
పద్దెనిమిది
కథలున్నాయి. వాటిలో
కొన్నింటిని పరిచయం
చేసుకుందాం.
ఆగస్టుపదిహేనుని జెండా
పండుగగా పాఠశాలల్లో
జరపడం, పిల్లలకు
చాక్లెట్లు పంచడం మనకు
తెలిసినదే. ప్రభుత్వ
కార్యాలయాలలో కూడా
పతాక వందన
కార్యక్రమం తప్పనిసరి.
అన్ని రాష్ట్రాలవాళ్లు ఉన్న
ఒక కార్యాలయంలో
ఉద్యోగులంతా ఆ రోజున
స్వతంత్ర సమరయోధుల
వేషధారణ చేసిన
నేపథ్యంతో రాసిన కథ
‘మేరాభారత్ మహాన్’
కార్యాలయ అధినేత
వేషధారణే కథలోని
కొసమెరుపు.
ప్రేయసీప్రియుల మధ్య
ప్రేమలేఖలు రాసుకొనే
రోజులలో చిలక
రాయబారాలు నడిచేవి.
ప్రియ, శరత్‌ల మధ్య
జరిగిన లేఖాయణం
ఇతివృత్తంగా ఉన్న కథ
‘చిలకరాయబారం’.
భార్యాభర్తలు ఉత్తరాలు
రాసుకోవాల్సిన అవసరం
ఎందుకొచ్చిందో
తెలుసుకోడానికి కథ
ఆసాంతం చదవాలి.
కళాకారులు వారు చేసే
పనిలో నిమగ్నమయి
ఉంటారు. చిత్రకారులు
చిత్రలేఖనం చేయనపుడు
కూడా చిత్రాల గురించి
ఆలోచిస్తూ ఉంటారు.
బయట ప్రపంచంలోకన్నా
ఊహలలో
విహరిస్తూంటారు.
ఊహాచిత్రం కథ బొమ్మని
చూడకలిగిన నేత్రాలు
పరిసరాలని
గమనించకపోడంవల్ల
జరిగే అనర్థాలని
చూడలేకపోడం అన్న
కథావస్తువుతో
రాయబడింది.
అంకెలు లెక్కపెడుతూ,
ఒకటి రెండు మూడు
నాలుగు ఐదు ఆరు ఏడు
అన్న తర్వాత ఏం
వస్తుంది అని
ఆలోచనలోపడ్డ
కథానాయకుడి కథ ‘ఏడు
తరువాత..’ భార్యని
అడిగితే ‘‘ఏడు తర్వాత
ఏముంది..’ ‘జీడిపాకం
జీవితాలు’ సీరియల్
వస్తుంది’’అన్న
సమాధానం చదువరిని
నవ్విస్తుంది. ఇరుగు
పొరుగుల సమాధానం,
మేధావి ఇచ్చిన
సమాధానం, లెక్కల
మాస్టర్ సమాధానం,
క్రికెట్ ఆడే కుర్రాడి
సమాధానం ఏవీ
సంతృప్తినివ్వవు. చివరగా
ఫకీరు ఏడు తర్వాత
వచ్చేదేమిటో చెప్పడమే
కాకుండా అది ‘దేవుడి
గారడీ’అన్న జ్ఞానం
ప్రసాదించడంతో కథ
ముగుస్తుంది.
కాలుష్యం జీవితాలని
అతలాకుతలం చేస్తోంది.
కాలుష్యం
దుష్ప్రభావాలని వివరించే
ప్రయత్నం ‘చినుకులా
రాలి...’ కథలో జరిగింది.
మేఘం, ధరిత్రి, చినుకు
పాత్రలతో అందించిన
సందేశం, దేశ విధాన
నిర్ణేతలకి చేరితే
బావుండును.
రచయిత వ్యాఖ్యల శైలి
గురించి ప్రత్యేకంగా
ప్రస్తావించాలనిపిస్తుంది.
‘మనం మేధావి అయితే,
నాకు తెలియదని
చెప్పాల్సిన అవసరమే
ఉండదు’ అన్న చురక,
‘తోటి సైనికుడు చనిపోతే
కనీసం అటువైపు
చూడనైనా చూడకుండా
పరుగెత్తే కోలీగ్స్’, భారత
స్వాతంత్య్ర దినోత్సవం -
అంటే అదేరా,
ఇండిపెండెన్స్‌డే’ అన్న
తెలుగువాడి తెలుగు ప్రజ్ఞ
కొన్ని ఉదాహరణలు
మాత్రమే!