న్యూఢిల్లీ, డిసెంబర్ 22: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పారిశ్రామికాధిపతులు, వ్యాపారవేత్తలనుద్దేశించి చేసిన ప్రసంగాన్ని దేశీయ పారిశ్రామిక రంగం స్వాగతించింది. పారదర్శకత, వృద్ధిరేటుపై దృష్టి పెట్టాల్సిన అవశ్యకతపై రాహుల్ చేసిన ప్రసంగం వాస్తవికతకు అద్దం పడుతోందని, పరిశ్రమ, పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని కూడా పెంచిందని సిఐఐ (పారిశ్రామిక సమాఖ్య) పేర్కొంది.
ఈ మేరకు సిఐఐ ప్రెసిడెంట్ క్రిస్ గోపాలకృష్ణన్ ఆదివారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. ‘పారిశ్రామిక రంగం ఎదుర్కొంటున్న నిజమైన సమస్యలను రాహుల్ తన ప్రసంగంలో లేవనెత్తారు’ అని గోపాలకృష్ణన్ తెలిపారు. శనివారం, రాహుల్ గాంధీ వ్యాపార వేత్తలతో మాట్లాడుతూ వారి సమస్యల పట్ల స్పందించారు. ఈ సందర్భంగా ద్రవ్యోల్బణం, చెల్లింపులు, జవాబుదారీతనం, పారదర్శకత వంటి సమస్యలపై మాట్లాడారు. అభివృద్ధి, సంస్కరణలపై రాహుల్ చేసిన వ్యాఖ్యలు స్వాగతించదగ్గవని గోపాలకృష్ణన్ అన్నారు. అభివృద్ధి సాగాలంటే పేదరికాన్ని తగ్గించాల్సి ఉంటుందని, దేశానికి వందేళ్లు వయసు( స్వాతంత్య్రానంతరం) పూర్తయ్యేనాటికి అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను నిలపాలన్న రాహుల్ వ్యాఖ్యలను కృష్ణన్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. అంతేగాక, కార్మిక చట్టాలు, విద్యుత్ సౌకర్యాలు, భూమి, తదితర సహజ వనరులను పొందటంలో సంస్కరణలు చేయాల్సిన అవసరముందన్న రాహుల్ చేసిన వ్యాఖ్యలు పారిశ్రామిక వర్గాల్లో ఉత్సాహాన్ని నింపాయని చెప్పుకొచ్చారు.
రాహుల్ గాంధీ ప్రతిపాధించిన సంస్కరణలు అమలైతే వచ్చే దశాబ్దంతో జిడిపిలో 25 శాతం వృద్ధి, 10కోట్ల మందికి ఉద్యోగాలు వస్తాయని ఈ సందర్భంగా కృష్ణన్ తెలిపారు.
* రాహుల్ ప్రసంగాన్ని స్వాగతించిన భారతీయ పారిశ్రామిక రంగం
english title:
v
Date:
Monday, December 23, 2013