అడిలైడ్, మార్చి 7: కామనె్వల్త్ బ్యాంక్ (సిబి) ట్రై సిరీస్ వనే్డ క్రికెట్ టోర్నమెంట్‌లో టైటిల్ కోసం ఆతిథ్య ఆస్ట్రేలియా-శ్రీలంక జట్లు అడిలైడ్ ఓవల్ మైదానంలో గురువారం అమీతుమీ తేల్చుకోనున్నాయి. భారత కాలమానం ప్రకారం ఉదయం 8 గంటల 50 నిముషాలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ‘బెస్ట్ఫా త్రీ’ ఫైనల్స్‌లో భాగంగా బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో జరిగిన తొలి ఫైనల్‌లో ఆస్ట్రేలియా జట్టు 15 పరుగుల తేడాతో విజయం సాధించగా, అడిలైడ్ ఓవల్ మైదానంలో మంగళవారం జరిగిన రెండో ఫైనల్‌లో శ్రీలంక జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన విషయం విదితమే. దీంతో ఫైనల్స్‌లో చెరొక మ్యాచ్‌లో విజయం సాధించి సమవుజ్జీలుగా నిలిచిన ఆస్ట్రేలియా, శ్రీలంక జట్లు గురువారం జరిగే నిర్ణాయక మ్యాచ్‌లో విజయం కోసం వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ సిరీస్ ఆరంభంలో వరుస ఓటములు ఎదురైనప్పటికీ ఆ తర్వాత అనూహ్య రీతిలో పుంజుకుని మెరుగైన ప్రదర్శనతో రాణిస్తున్న శ్రీలంక జట్టు గురువారం జరిగే ‘అంతిమ సమరం’లోనూ అదే జోరును కొనసాగించి టైటిల్‌ను కైవసం చేసుకోవాలని ఎదురుచూస్తోంది. ఒకవైపు ఆటగాళ్ల గాయాలు, మరోవైపు బౌలింగ్ సమస్యలతో సతమతమవుతున్న ఆస్ట్రేలియా జట్టు బలహీనతలను సొమ్ము చేసుకునేందుకు లంకేయలు కాచుకుని కూర్చున్నారు. ముఖ్యంగా గాయాల సమస్య కంగారూలను తీవ్రంగా వేధిస్తోంది. తొడ కండరాల నొప్పితో బాధపడుతున్న కెప్టెన్ మైఖేల్ క్లార్క్ ఆసీస్ జట్టుకు దూరమయ్యాడు. దీంతో గురువారం జరిగే నిర్ణాయక మ్యాచ్‌లో ఆసీస్ జట్టుకు ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ సారథ్యం వహించనున్నాడు. అలాగే పిరుదు కండరాల నొప్పితో ఇబ్బందిపడుతున్న ఫాస్ట్ బౌలర్ జేమ్స్ పాటిన్సన్ కూడా జట్టుకు దూరమవడంతో అంతిమ సమరానికి ముందే ఆసీస్‌కు రెండు పెద్ద ఎదురుదెబ్బలు తగిలాయి. ఈ కష్టాలు చాలవన్నట్టు గత రెండు మ్యాచ్‌లలో సెంచరీలతో రాణించి ఓపెనర్ డేవిడ్ వార్నర్, స్పీడ్‌స్టర్ బ్రెట్ లీ కూడా గాయాలతో బాధపడుతుండటం ఆసీస్ శిబిరాన్ని తీవ్రంగా వేధిస్తోంది. ఈ సమస్యలను అధిగమించి శ్రీలంక దూకుడుకు కళ్లెం వేయడం ఆస్ట్రేలియా తాత్కాలిక కెప్టెన్ షేన్ వాట్సన్‌కు ఖచ్చితంగా ‘కత్తి మీద సాము’ లాంటిదే అని చెప్పవచ్చు.
వనే్డల్లో ప్రపంచంలోనే నెంబర్ వన్‌గా కొనసాగుతున్న ఆస్ట్రేలియా జట్టు బౌలింగ్ విభాగం ప్రస్తుతం పేలవమైన ప్రదర్శనతో ఇబ్బందులు పడుతుండటం కంగారూలను మరింత కలవరపెడుతోంది. ఈ ఇబ్బందులను ఆసరాగా చేసుకుని ఈ సిరీస్‌లో ప్రత్యర్థి జట్లు మూడుసార్లు (ఒకసారి భారత్, మరో రెండుసార్లు శ్రీలంక) 270 పరుగులు పైబడిన లక్ష్యాలను సునాయాసంగా అధిగమించగలిగాయి. పవర్ ప్లే ఓవర్లతో పాటు చివరి ఓవర్లలో పొదుపుగా బౌలింగ్ చేయడంలో తమ బౌలర్లు విఫలమవుతున్నారని, దీంతో ప్రత్యర్థి జట్టుకు తాము భారీగా పరుగులు సమర్పించుకోవాల్సి వస్తోందని ఆసీస్ సారథి మైఖేల్ క్లార్కే ఇంతకుముందు స్వయంగా అంగీకరించాడు. అయితే గబ్బాలో జరిగిన తొలి ఫైనల్‌లో 321 పరుగుల భారీ స్కోరు సాధించి 15 పరుగుల తేడాతో విజయం సాధించిన కంగారూలు బ్యాటింగ్‌లో లంకేయుల కంటే కొంచెం మెరుగైన స్థితిలో ఉన్నారు. ఇంతకుముందు ఒడిదుడుకులతో సతమతమైన ఆసీస్ టాప్ ఆర్డర్ ఇప్పుడు నిలకడగా రాణిస్తోంది. కానీ, లోయర్ ఆర్డర్‌లోని బ్యాట్స్‌మన్లు మాత్రం చివరి ఓవర్లలో మెరుగైన స్కోర్లు సాధించడంలో ఇప్పటికీ విఫలమవుతూనే ఉండటం ఆసీస్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. అందుకే టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ల వికెట్లను సాధ్యమైనంత ఎక్కువసేపు కాపాడుకోవాలని ఆస్ట్రేలియా జట్టు భావిస్తోంది. అయితే యార్కర్ల వీరుడు లసిత్ మలింగ నేతృత్వంలోని లంక బౌలింగ్ విభాగం కంగారూల ఆటలు సాగనివ్వడం లేదు.
ఇక శ్రీలంక విషయానికి వస్తే, ఈ సిరీస్‌లో 500 పైగా పరుగులు సాధించి టాప్ స్కోరర్‌గా నిలిచిన తిలకరత్నె దిల్షాన్, కెప్టెన్ మహేల జయవర్ధనే టాప్ ఆర్డర్‌లో అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతున్న వీరు క్రీజ్‌లో ఉన్నంతసేపు అదే జోరును కొనసాగించి శుభారంభాలను ఇస్తున్నారు. గబ్బాలో జరిగిన తొలి ఫైనల్‌లో మాదిరిగా అప్పుడప్పుడు వీరు విఫలమైనప్పటికీ లోయర్ హాఫ్‌లో ఆల్‌రౌండర్లకు తోడు నువాన్ కులశేఖర, ధమ్మిక ప్రసాద్ వంటి బౌలర్లు కూడా బ్యాట్‌తో రాణించి ఆ లోటును చక్కగా భర్తీ చేస్తున్నారు.
ట్రై సిరీస్ టైటిల్ కోసం నేడు ఆసీస్-లంక అమీతుమీ
english title:
antima samaram
Date:
Thursday, March 8, 2012