
అచ్చమైన తెలుగుదనంతో నిండిన సన్నివేశాలు, అందమైన లోగిళ్లు చూడాలంటే ‘ఉయ్యాల జంపాల’ చిత్రం చూడాల్సిందేనని నాగార్జున తెలిపారు. సన్‌షైన్ సినిమాస్, అన్నపూర్ణా స్టూడియోస్ పతాకాలపై నాగార్జున, రామ్మోహన్.పి, విరించి వర్మ దర్శకత్వంలో నిర్మించిన ‘ఉయ్యాల జంపాల’ చిత్రానికి సంబంధించిన పాత్రికేయుల సమావేశంలో నాగార్జున పైవిధంగా తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ- 1980 ప్రాంతాలలో తెలుగుదనం ఉన్న చిత్రాలు వచ్చేవని, ఆ తరువాత ఫైట్లు, డాన్స్‌లతో సినిమా వేగం పెరిగిపోయిందని అన్నారు. దర్శకుడు ఈ కథ చెప్పినప్పుడు బాగా అనిపించి సినిమా నిర్మించామని, ఇప్పుడు సినిమా చూశాక అద్భుతంగా ఉందని, దర్శకుడు సినిమాను తెరకెక్కించిన తీరు అందరికీ నచ్చుతుందన్నారు. అమలాపురం అమ్మాయిగా అవిక ప్రేక్షకుల మెప్పును పొందుతుందని, ఇళయారాజా పాటలా పాత రోజులను గుర్తుచేసే ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని ఆయన వివరించారు. మంచి కథతో తెరకెక్కించిన ఈ సినిమాకు నాగార్జున సురేష్‌బాబు అండదండలు మర్చిపోలేనివని నిర్మాత రామ్మోహన్‌రావు తెలిపారు. తన బాల్యంలో జరిగిన అనేక అనుభవాలను ఈ చిత్రంలో పొందుపర్చానని దర్శకుడు విరించి వర్మ తెలిపారు. రైటర్‌గావచ్చిన తనను హీరో చేశారని, అభినయాని అవకాశం వున్న పాత్రలో నటించిన తనకు తెలుగు నేటివిటీకి సరిపోయే వోణి చాలా నచ్చిందని హీరో హీరోయిన్లు రాజ్‌తరుణ్, అవిక తెలిపారు.