
సునీల్, ఎస్తేర్ జంటగా సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై ఉదయ్‌శంకర్ దర్శకత్వంలో రూపొందించిన ‘భీమవరం బుల్లోడు’ చిత్రానికి సంబంధించిన పాటలు ఆదిత్య మ్యూజిక్స్ ద్వారా విడుదలయ్యాయి. సునీల్ స్వస్థలం భీమవరంలో జరిగిన ఆడియో విడుదల కార్యక్రమంలో ఆడియో సీడీని నిర్మాత డి.సురేష్‌బాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అంబికా కృష్ణ మాట్లాడుతూ 50 సంవత్సరాల చరిత్రగల సురేష్ సంస్థలో సునీల్ పనిచేయడం లక్కీ అని, కష్టపడిన వాళ్లందరూ విజయం సాధిస్తారనడానికి సునీల్ ఓ నిదర్శనమని, చిత్రం తప్పక విజయవంతమవ్వాలని కోరుకున్నారు. 134 సినిమాలు 50 ఏళ్లలో నిర్మించిన ఘనత సురేష్ వారిదని, భీమవరం గూర్చి సినిమా తీసి, అందులో భీమవరం కుర్రాడినే హీరోగా పెట్టడం విశేషమని, జయప్రకాష్‌రెడ్డి తెలిపారు. ఈ సినిమా బాగా రావడానికి కారణం హీరో, నిర్మాత అని దర్శకుడు ఉదయ్‌శంకర్ తెలిపారు. కథానాయకుడు సునీల్ మాట్లాడుతూ ఒకప్పుడు ఇదే వేదికపై మాస్టర్లు ఇచ్చిన ప్రోత్సాహంతో నృత్యం చేశానని, తనకు కావలసిన వాళ్లందరూ ఈ ఆడియో వేడుకకు వచ్చి ఆశీర్వదించడం ఆనందంగా ఉందని తెలిపారు. ఇంతమంది నాకోసం వస్తారని ఊహించలేదని, పది సినిమాల్లో చేసే హాస్యాన్ని ఈ ఒక్క చిత్రంలో చేశానని, ఈ చిత్రానికి సంబంధించిన వంద రోజుల వేడకకు కూడా ఇక్కడికి వస్తానని ఆయన తెలిపారు. సినిమాలో కొన్ని డైలాగులను ప్రేక్షకులకోసం వినిపించారు. కార్యక్రమంలో రాజారవీంద్ర, గౌతంరాజు, శివపార్వతి, బెంగుళూరు పద్మ, గోకరాజు నరసింహరాజు, నాగేశ్వరరావు, ఎ.ఎస్.రాజు, రఘురామరాజు, అశోక్‌కుమార్, పృథ్వి, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ తదితరులు పాల్గొన్నారు.