ఒంగోలు, డిసెంబర్ 24: అంతర్జాతీయ మార్కెట్‌లో వెనామిరొయ్యల ధర ఆకాశాన్ని అంటుతున్నప్పటికీ ఆ సాగును రోగాలు ముంచేత్తుతున్నాయి. దీంతో జిల్లాలోని ఆక్వారైతన్నలు ఆర్థికంగా విలవిలలాడిపోతున్నారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా తెల్లమచ్చవ్యాధి సోకటంతో రొయ్యలు మృత్యువాతపడుతున్నాయి. అదేవిధంగా వాతావరణంలో నెలకొన్న మార్పుల కారణంగా రొయ్యల చెరువుల్లోని నీటిలో సెలనీటిలు తగ్గటంతో కూడా రోగాలు వ్యాప్తిచెందుతున్నాయి. ప్రస్తుతం మంచుఎక్కువుగా కురుస్తుండటంతో ఆక్సిజన్ అందక రొయ్యలు చెరువుల్లోనే దెబ్బతింటున్నాయి. దీంతో రైతులు చేసేదిలేక చెరువుల్లోని పంటను నడిమధ్యనే తీసివేసి అయినకాడికి రొయ్యలను విక్రయించి సొమ్ముచేసుకునే పనిలోనిమగ్నమవుతున్నారు.
కాగా జిల్లాలోని చీరాల, వేటపాలెం, చినగంజాం, నాగుల్పులపాడు, ఒంగోలు, కొత్తపట్నం, టంగుటూరు, శింగరాయకొండ, ఉలవపాడు మండలాల్లో ఆక్వాసాగును విస్తారంగా చేపట్టారు. కోస్టల్ ఆక్వాకల్చర్ అధారిటి లైసెన్స్‌లు లేకపోయినప్పటికీ జిల్లావ్యాప్తంగా ఆక్వాసాగు చేస్తున్నప్పటికీ మత్స్యశాఖాధికారులు నిమ్మకునిరేత్తినట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లావ్యాప్తంగా సుమారు పదివేల ఎకరాలకు పైగానే ఆక్వాసాగును వర్షకాలంలో సాగుచేపట్టారు. ఈ సాగులో ఎన్నో ఒడిదుడుగులను రైతులు ఎదుర్కొన్నారు. మళ్ళీ వేసవికాలంలో ఆక్వాసాగునుచేపట్టేందుకు రొయ్యల చెరువులనుచదునుచేసే పనిలో నిమగ్నమయ్యారు. జనవరి రెండవవారంలో రొయ్యల చెరువుల్లోకి రొయ్యపిల్లను వదిలే విధంగా రైతులు సమయాత్తవౌతున్నారు. కాగా గతంలో రొయ్యల ధరలు కేజి రెండువందలరూపాయలనుండి 230రూపాయల వరకు మాత్రమే పలకటంతో ఉన్న చెరువులను సైతం తీసివేసి ఉప్పు్భములుగా చదునుచేశారు. ప్రస్తుతం వెనామి రొయ్యలు కేజి ఆరువందల రూపాయలకు పైగానే అమ్ముతుండటంతో మళ్ళీ ఉప్పు్భములను రొయ్యల చెరువులుగా సాగుచేసేందుకు రైతులు సిద్దమయ్యారు. బీడుభూముల్లోసైతం ఆక్వాసాగును చేపట్టేందుకు కౌలుదారులు ముందుకువస్తున్నారు.ప్రస్తుతం హెక్టారు చెరువును సంవత్సరానికి లక్షరూపాయల వరకు కౌలుదారులు వెచ్చించి తీసుకునే పరిస్ధితి నెలకొంది. హెక్టారుకు సక్రమంగా రొయ్యల పంట వస్తే సుమారు పదిలక్షలరూపాయలకు పైగానే లాభం వచ్చేఅవకాశాలుండటంతో రైతులనుండి వ్యాపారుల వరకు తమ అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో నిమగ్నమయ్యారు. మొత్తంమీద వాతావరణంలో నెలకొన్నమార్పులు కారణంగా వెనామి రొయ్యలకు తెల్లమచ్చవ్యాధి సోకటంతో కొంతమంది రైతులు ఆర్ధికంగా చితికిపోయారు. అయినప్పటికి మళ్ళీ వేసవికాలం పంటను సాగుచేసేందుకు మాత్రంరైతులు ఊవిళ్ళూరుతున్నారు.
30న ఒంగోలుకు
చంద్రబాబు రాక
ప్రజాగర్జన సదస్సుకు భారీగా కార్యకర్తల
తరలింపునకు సన్నహాలు
ఆంధ్రభూమి బ్యూరో
ఒంగోలు, డిసెంబర్ 24: తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈనెల 30న జిల్లాకేంద్రమైన ఒంగోలుకు రానున్నారు. ఆ మేరకు జిల్లాపార్టీ కార్యాలయానికి సమాచారం అందింది. 30న ఒంగోలులోని మినిస్టేడియంలో నిర్వహించే ప్రజాగర్జన సదస్సులో చంద్రబాబు పాల్గొని ప్రసంగించనున్నారు. చంద్రబాబు పర్యటనను విజయవంతం చేసే పనిలో పార్టీశ్రేణులు నిమగ్నమయ్యాయి. ఆ మేరకు ఈనెల 26న జిల్లాతెలుగుదేశంపార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జుల సమావేశాన్ని జిల్లాపార్టీ కార్యాలయ ఆవరణలో పార్టీ అధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌రావు ఏర్పాటుచేశారు. ఈ సమావేశానికి రాష్టప్రార్టీ పరిశీలకుడిగా రాష్ట్ర తెలుగుదేశంపార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి గోరంట్ల బుచ్చయ్యచౌదరి విచ్చేస్తారని జనార్దన్ తెలిపారు. ఈ సమావేశానికి నియోజకవర్గ ఇన్‌చార్జులు, ముఖ్యనాయకులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆయన కోరారు. ఇదిఇలాఉండగా చంద్రబాబునాయుడు జిల్లాపర్యటన ఇప్పటికే రెండుసార్లు వాయిదాపడింది.
సాయం చేసేందుకు రోడ్డుపైకి వెళ్ళి
తిరిగిరాని లోకాలకు!
రామాంజనేయపురం వద్ద లారీ ఢీకొని ఇద్దరు మృతి
సంతమాగులూరు, డిసెంబర్ 24: పురిటి నొప్పులు పడుతున్న మహిళలకు సహాయం చేసేందుకు 108 వాహనానికి ఫోన్ చేస్తూ రోడ్డు పైకి వెళ్ళిన ఇరువురు వ్యక్తులను గుర్తు తెలియని లారీ ఢీకొనడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. అద్దంకి - నార్కెట్ పల్లి రహదారిలో బల్లికురవ మండలం రామాంజనేయ పురం వద్ద మంగళవారం వేకువజామున ఈ ప్రమాదం జరిగింది. ఈప్రమాదంలో రామాంజనేయపురం గ్రామానికి చెందిన మందా పెద నాగేశ్వరరావు(55), గర్నెపూడి నాగేశ్వరరావు (35) కన్నుమూశారు. వివరాల్లోకి వెళితే రామాంజనేయపురం గ్రామానికి చెందిన ధనలక్ష్మి అనే నిండు గర్భిణి ప్రసవ వేదనతో నొప్పులు పడుతుండగా ఆమెను ఆసుపత్రికి తరలించేందుకు 108 వాహనానికి ఫోన్ చేశారు. 108 వాహనం వారు రామాంజనేయపురాన్ని గమనించకుండా రామాంజనేయపురం దాటి సుజాతనగర్ వద్దకు వెళ్ళారు. అక్కడి నుండి 108 వాహనంలోని సిబ్బంది ఫోన్ చేయడంతో ఇద్దరు వ్యక్తులు వాహనాన్ని వెనక్కి రావాలని ఫోన్ మాట్లాడుతూ రోడ్డు పైకి వెళ్ళారు. అదే సమయంలో హైదరాబాద్ నుండి ఒంగోలు వైపు వెళుతున్న గుర్తు తెలియని లారీ వీరి పైకి దూసుకొచ్చి ఢీకొనడంతో ఇరువురు అక్కడికక్కడే మృతి చెందారు. మందా పెద నాగేశ్వరరావు తల వాహనం టైర్ క్రింద పడడంతో తల విడిపోయి మొండెం మాత్రమే మిగిలింది. మృతులిరువురికి భార్యలు, పిల్లలు కలరు. మందా పెద నాగేశ్వరరావు కుమారుడు అనీల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్శి డిఎస్‌పి లక్ష్మీ నారాయణ ఆధ్వర్యంలో బల్లికురవ ఎస్‌ఐ వెంకటేశ్వరరావు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు.
ఆర్థిక సహాయం చేసిన గొట్టిపాటి, కరణం
రామాంజనేయ పురం వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఇరువురి కుటుంబాలను వైకాపా అద్దంకి నియోజక వర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షులు కరణం బలరాం కృష్ణమూర్తి కుమారుడు కరణం వెంకటేష్ బాధితుల కుటుంబ సభ్యులను పరామర్శించి ఇరువురి చెరి పదివేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేశారు.
నేడు క్రిస్మస్
* ముస్తాబైన చర్చీలు
ఒంగోలు అర్బన్, డిసెంబర్ 24 : క్రిస్మస్ పండుగను ఘనంగా నిర్వహించుకునేందుకు క్రైస్తవ సోదరులు సన్నద్ధం అయ్యారు. ఈనెల 25వ తేది బుధవారం క్రిస్మస్ పండగ సందర్భంగా చర్చీలను జిల్లా వ్యాప్తంగా విద్యుదీపాలంకరణలతో ముచ్చటగా అలంకరించారు. ప్రార్థనా మందిరాలను సర్వం సిద్ధం చేశారు. మానవాళికి ప్రేమ, శాంతి, సౌభాగ్యాలను అందజేసి వారి తప్పులను, పాపాలను పోగొట్టేందుకు సుమారు రెండు వేల సంవత్సరాల క్రితం జన్మించిన మహనీయుడు ఏసుక్రీస్తు, ఆ మహానుభావుని జన్మదినం ప్రజలందరికీ పండుగ వాతావరణం. జిల్లా వ్యాప్తంగా గత నెల రోజుల నుండి జరుగుతున్న క్రిస్మస్ సంబరాల్లో క్రైస్తవ సోదరులందరూ ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా పాల్గొని ఆధ్యాత్మిక ఉత్తేజాన్ని పొందుతున్నారు.
‘సమైక్యాంధ్రా ఉద్యమాన్ని నీరుగార్చిన అశోక్‌బాబు’
ఆంధ్రభూమి బ్యూరో,
ఒంగోలు, డిసెంబర్ 24 : సమైక్యాంధ్రా ఉద్యమాన్ని అశోక్‌బాబు నీరు గార్చారని ఎపి ఎన్జీవో సంఘం అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న షేక్ అబ్దుల్ బషీర్ ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన ఒంగోలుకు వచ్చిన సందర్భంగా ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడారు. సమైక్యాంధ్రా ఉద్యమాన్ని తారా స్థాయికి తీసుకెళ్లడానికి నాయకత్వ మార్పు రావాలని ఆయన పేర్కొన్నారు. ఎన్జీవోలకు సంబంధించి ప్రభుత్వ డిమాండ్లు ఒక్కటీ కూడా పరిష్కారం కాలేదని ఆయన తెలిపారు. నాయకత్వ మార్పు కోసమే తాను పోటీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎన్నికల్లో పోటీలో నిలబడిన వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అశోక్‌బాబు పై ఆయన ధ్వజమెత్తారు. అశోక్‌బాబు స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తాను ఎన్నికల్లో స్నేహ పూర్వకమైన వాతావరణంలోనే పోటీ చేస్తున్నానని ఆయన తెలిపారు.
నీటిగుంటలో పడి విద్యార్థి మృతి
కందుకూరు, డిసెంబర్ 24: మండల పరిధిలోని మాల్యాద్రి కాలనీ సమీపంలోగల నీటిగుంటలో పడి చందలూరి సిద్ధూ (11) అనే విద్యార్థి దుర్మరణం పాలైన సంఘటన మంగళవారం మధ్యాహ్నం జరిగింది. పోలీసులు, బాలుడి తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం మృతి చెందిన సిద్ధూ మాల్యాద్రి కాలనీలో నివాసం ఉంటున్న చందలూరి రాము, శ్రీదేవి దంపతుల కుమారుడు. సిద్ధు అదే కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. ఈక్రమంలో మంగళవారం స్నేహితులతో కలిసి రావిగుంట వద్దకు చేరుకుని నీటిలో ఈతకొట్టేందుకు దిగారు. ఈక్రమంలో గుంటలోని ఊబిలో చిక్కుకుని సిద్ధూ మృతి చెందాడు. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు సంఘనా ప్రదేశానికి చేరుకుని విచారణ చేపట్టారు.
మిని లారీ బోల్తా : మహిళ మృతి
కొండపి, డిసెంబర్ 24: మండలంలోని పెట్లూరు-తాటాకులపాలెం గ్రామాల మధ్య మంగళవారం మినిలారీ బోల్తాపడి ఓ మహిళ అక్కడిక్కడే మృతి చెందింది. వివరాల మేరకు యర్రగొండపాలెం మండలంలోని బోయినపల్లి గ్రామానికి చెందిన 10మంది కూలీలు కొండపి మండలంలోని నేతివారిపాలెం గ్రామంలో బొప్పాయికాయలు కోసేందుకు వస్తున్నారు. ఈనేపథ్యంలో మంగళవారం ఉదయం పెట్లూరు దాటిన తరవాత మలుపువద్ద మినీలారీ బోల్తాపడింది. లారీలో ప్రయాణిస్తున్న పి రాములమ్మ (30) అక్కడికక్కడే మృతి చెందింది. కాగా మిగిలిన వారికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 ద్వారా వైద్యంకోసం ఒంగోలు తరలించారు. డ్రైవర్ పరారీలో ఉన్నాడు. దీనిపై కొండపి ఎస్సై జి సోమశేఖర్ ఆధ్వర్యంలో ఎఎస్సై సుబ్బారావు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108ద్వారా తరలించారు. పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రైలు ప్రమాదాల్లో ముగ్గురికి గాయాలు
చీరాలరూరల్, డిసెంబర్ 24: వేర్వేరు రైలు ప్రమాదాలలో ముగ్గురికి తీవ్ర గాయాలైన సంఘటన చీరాల రైల్వేస్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నాయి. నెల్లూరుకు చెందిన టి రఘునాథ్ తినుబండారాలు రైలులో అమ్ముతూ జీవనం సాగిస్తుంటాడు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి చీరాల సమీపంలో రైలునుంచి ప్రమాదవశాత్తు కడవకుదురు సమీపంలో కిందపడటంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ మేరకు 108 అంబులెన్స్ ద్వారా చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అదే విధంగా పాట్నాకు చెందిన దేవానంద్ పాట్నానుంచి గూడూరువైపుకు వెళుతున్న రైలునుంచి ప్రమాదవశాత్తు రైల్వే స్టేషన్ సమీపంలో ప్రమాదవశాత్తు కాలి జారి పడిపోవటంతో తీవ్ర గాయాలయ్యాయి. అదే విధంగా గుర్తు తెలియని మరో యువకుడు కారంచేడు గేటు సెంటర్ వద్ద ప్రమాదవశాత్తు కాలిజారి పడిపోవటంతో తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులు చీరాల ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు.
ప్రైవేట్ చిట్‌ఫండ్ నిర్వాహకుల ఐపి
రూ కోటి 50 లక్షల రూపాయలు మోసపోయామంటూ బాధితులు ధర్నా
ఒంగోలు అర్బన్, డిసెంబర్ 24 : ప్రైవేట్ చిట్‌ఫండ్స్ నిర్వాహకులు కోటి 50 లక్షల రూపాయలకు ఐపి పెట్టి అందరిని మోసం చేశారని బాధితులు మంగళవారం రాత్రి కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఒంగోలు నగరంలోని కమ్మపాలెంలో గత 30 సంవత్సరాల నుండి గోవిందు శేషమ్మ, ఆమె భర్త చెన్నకేశవులు, రామిశెట్టి సుబ్బారావు, భార్య మాధవి ప్రైవేట్‌గా చీటిపాటలు వేస్తుంటారని మోసపోయిన బాధితులు కొల్లి పద్మ , కె నాగేశ్వరమ్మ, జి శ్రీలక్ష్మీ, యు రమాదేవితోపాటు మరో వందమంది మహిళలు ఆరోపించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుండి నమ్మకంగా చిటీపాటల వ్యాపారం చేస్తున్నారన్నారు. 63 బినామీ పేర్లతో నిర్వాహకులే చీటిపాటలు పాడుకుని హైదరాబాద్ అమీర్‌పేటలో హోటల్, గోవిందు శేషమ్మ తమ్ముడు సుబ్బారావు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారన్నారు. వ్యాపారంలో నష్టాలు వచ్చాయని శేషమ్మ ఐపి పెట్టిందని బాధితులు వివరించారు. కూలి పని చేసుకుంటూ జీవించే తాము చీటిపాటలు వేశామని, ఇంత దారుణంగా మోసం చేస్తారని కలలో కూడా ఊహించలేదన్నారు. ఈ విషయంపై జిల్లా ఎస్‌పి ప్రమోద్‌కుమార్‌కు విజ్ఞప్తి చేస్తే రెండో పట్టణ పోలీస్‌స్టేషన్ సిఐకు చెప్పారన్నారు. రెండో పట్టణ పోలీసులు గత పది రోజుల క్రితం ఆమె, ఆమె కుటుంబ సభ్యులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి సోమవారం రాత్రి కోర్టుకు పెట్టడంతో గోవిందు శేషమ్మకు మాత్రమే రిమాండ్ విధించారన్నారు. ఈ విషయంపై బాధితులు ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డిని కలిసి మాట్లాడారు. జిల్లా ఎస్‌పితో మాట్లాడి బాధితులకు న్యాయం చేస్తానని ఎంపి మాగుంట హామీ ఇచ్చారు.